రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, జనవరి 2023, బుధవారం

1290 : రివ్యూ!

రచన- దర్శకత్వం : హెచ్. వినోద్
తారాగణం : అజిత్ కుమార్, మంజూ వారియర్, సముద్రకని, పావనీ రెడ్డి, అజయ్, జాన్ కొక్కేన్ తదితరులు
సంగీతం : జిబ్రాన్, ఛాయాగ్రహణం : నీరవ్ షా
బ్యానర్స్ :  బేవ్యూ ప్రాజెక్ట్స్ LLP, జీ స్టూడియోస్
నిర్మాత : బోనీ కపూర్
విడుదల : జనవరి 11, 2023
***

మిళ స్టార్ అజిత్ కుమార్- దర్శకుడు హెచ్. వినోద్- బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కాంబినేషన్లో వరుసగా మూడో సినిమా ఇది. 2019 లో నేర్కొండ పర్వై (హిందీ పింక్ రీమేక్), 2022 లో వాలిమై (తెలుగులో వాలిమై’) తర్వాత వెంటనే సంక్రాంతి కానుకగా ఇప్పుడు తునీవు (తెలుగులో తెగింపు) విడుదలైంది. మొదటిది అమితాబ్ బచ్చన్ తో హిట్టయిన హిందీ రీమేక్ కాబట్టి ఫర్వాలేదన్పించుకుంది. రెండోది దర్శకుడు వినోద్ టాలెంట్ కి పరీక్ష పెట్టింది. ఈ హై రేంజి యాక్షన్ పరీక్షలో నెగ్గి 80 కోట్లు లాభాలార్జించి పెట్టాడు. 

దే ఊపులో ఈ ముగ్గురి కాంబినేషన్లో తెగింపు  ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే తెల్ల జుట్టు, తెల్లగడ్డంతో ఏకైక స్టార్ గా వయసు దాచుకోకుండా ఫ్యాన్స్ కి అంతే జోష్ పెంచుతున్న అజిత్, మునుపటి హిట్స్ రేంజిలోనే తెగింపు నిచ్చాడా, ట్రైలర్స్ లో తెలిసిపోయిన పాత్రకి, కథకి మించి సినిమాలో ఇంకేమైనా ఎలివేషన్స్ ఛూపించాడా తెలుసుకుందాం...

కథ  

డార్క్ డెవిల్ అలియాస్ చీఫ్ అలియాస్ మైకేల్ జాక్సన్ (అజిత్) ఒక కాంట్రాక్టు దొంగ. అతడి టీములో రమణి (మంజు వారియర్) తో బాటు మరో ముగ్గురు సభ్యులు (అమీర్, పావనీ రెడ్డి, సిబి) వుంటారు. వీళ్ళు అత్యుత్తమ టెక్నాలజీనీ, ఆయుధాలనీ ఉపయోగించి హైటెక్ దోపిడీలు చేస్తారని పేరుంటుంది. ఇలా వుండగా, వేరే దొంగలు పట్టపగలు యువర్ బ్యాంక్ మీద దాడి చేసి దోచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అక్కడే వున్న డేర్ డెవిల్ ని చూసి షాక్ అవుతారు. ఈ కౌంటర్ దోపిడీలో డేర్ డెవిల్ ఆ గ్యాంగ్ ని చంపేసి, 500 కోట్లు దక్కించుకుని పారిపోవడానికి పోలీసులకి కొన్ని డిమాండ్లు  లు పెడతాడు. కమీషనర్ దయా (సముద్ర కని), ఏసీపీ రామచంద్ర (అజయ్) రంగంలోకి దిగి డేర్ డెవిల్ ఆపరేషన్ ని విఫలం చేయడానికి పూనుకుంటారు. బ్యాంక్ ఛైర్మన్ క్రిష్ (జాన్ కొక్కేన్) కూడా వచ్చేస్తాడు.

ఇప్పుడు మారు పేర్లతో వున్న అజిత్ ఎవరు? బ్యాంకు దోపిడీకి ఎందుకు పాల్పడ్డాడు? అతడికీ బ్యాంకు ఛైర్మన్ కీ వున్న సంబంధమేమిటి? దోచుకోవాలనుకున్నది 500 కోట్లేనా, ఇంకా ఎక్కువా? అసలు ఈ ఉదంతం ఏ ఉన్నతాశయం కోసం జరిగింది? ఇవి తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాలి.

ఎలా వుంది కథ

హాస్టేజ్ డ్రామా జానర్ కి చెందిన కథ. ఇదే జానర్ లో గత సంవత్సరం విజయ్ (14 న వారసుడు గా రాబోతున్నాడు) నటించిన బీస్ట్ విడుదలైంది. కాకపోతే ఇది టెర్రరిజం కథ. అయితే తెగింపు’, బీస్ట్ రెండూ పూర్తిగా ఒకే భవనంలో జరిగే హాస్టేజ్ డ్రామాలు. పూర్తిగా ఇండోర్స్ లోనే జరిగే కథ వల్ల ఈ స్టార్స్ ఇద్దరూ ఒకే కాస్ట్యూమ్ లో కట్టేసినట్టయి, రీలీఫ్ లేని ఇండోర్ యాక్షన్లు చేశారు. బీస్ట్ ఫ్లాపయ్యింది. ఇప్పుడు తెగింపు దీ ఇదే పరిస్థితి.
        
బ్యాంకులు చేసే మోసాల గురించి చెప్పాలనుకున్నారు. అయితే ఇది మూసలో పాత కథే అయింది. ఫైనాన్స్, చిట్ ఫండ్స్, ప్రైవేట్ బ్యాంకులు సామాన్య ప్రజల డిపాజిట్లతో చేసే మోసాల గురించి, సామాన్యుల దీనాలాపాల గురించీ ఎన్నో సినిమాలొచ్చాయి. ఇదే అరిగిపోయిన పాత కథ తెగింపు లో చూపించారు తప్పితే, కాస్త తెగించి సమకాలీన కథ చెప్పలేకపోయారు.
        
వ్యాపారాల కోసం, పరిశ్రమల కోసం, వందలు, వేల కోట్లలో తీసుకుంటున్న రుణాలని కట్టలేమని చేతులెత్తేస్తే బ్యాంకులు మాఫీ చేస్తున్నాయి. ఎగవేతదార్లు భవనాలు కట్టుకుని, ఖరీదైన కార్లలో దర్జాగా తిరుగుతున్నారు. ఈ విధంగా గత ఆరేళ్ళల్లో 11 లక్షల కోట్లు రైటాఫ్ చేశాయి బ్యాంకులు. ఇది ప్రజల సొమ్మే. దీన్ని ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఇది అందరికీ తెలిసిన నడుస్తున్న చరిత్రే. ఈ బిగ్గెస్ట్ ఫ్రాడ్ వదిలేసి ఏ నాటిదో పాత కురచ కథ అజిత్ లాంటి బిగ్ స్టార్ ని అంటగట్టి, భారీ బడ్జెట్లు వెచ్చించి, పిట్ట కొంచెం కూత ఘనం చేశారు. దీనికి తెగింపు అవసరం లేదు.
        
ఫస్టాఫ్ బ్యాంకు లోపలే దోపిడీ, కాల్పులు, రెండు ముఠాల పోరాటాలూ ఇవే జరుగుతాయి. ఇంటర్వెల్లో ఇంకో విలన్ వచ్చి అజిత్ ని లొంగదీసుకుంటాడు. ఫస్టాఫ్ మొత్తం బ్యాంకులో కోట్ల రూపాయల ఖర్చుతో, నిమిషం వదలకుండా కాల్పులూ పేలుళ్ళతో కూడిన యాక్షన్ సీన్స్ రిలీఫ్ లేకుండా సాగుతాయి. సెట్స్ ని పేల్చి దగ్ధం చేయడానికి కోట్లాది రూపాయలు మంచినీళ్ళలా ఖర్చుచేశారు.
        
సెకండాఫ్ లో అజిత్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఇది ఏ మాత్రం అర్ధం గాదు, కాల్పులు మాత్రం మోత మోగుతాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ లో అజిత్ ఎవరనేది కూడా చెప్పలేదు. ఫ్లాష్ బ్యాక్ తర్వాత బ్యాంక్ ఛైర్మన్ ని అదుపులోకి తీసుకుని అసలు డ్రామా నడుపుతాడు. ఇక్కడే కారణం తెలుస్తుంది. అయితే సామాన్యులకి న్యాయం చేయడం కోసం తీసుకున్న నిర్ణయానికి కూడా ఎలాటి ఎమోషనల్ కనెక్ట్ వుండదు. పాత్రలో జీవం లేక కథలో జీవం లేదు. దీనికి ఉన్నతాశయమనే ఇంకో నిర్జీవ అలంకారం. అజిత్ లాంటి హైపర్ యాక్షన్ హీరోకి చాలని కాలగర్భంలో కలిసిన కథతో తీసిన అట్టహాసపు సినిమా ఇది.

నటనలు –సాంకేతికాలు

పేరు లేని, బ్యాక్ గ్రౌండ్ లేని పాత్రలో అజిత్ నటన- ప్రారంభం నుంచీ ముగింపు వరకూ ఒకే బ్యాంకు సెట్ లో- బోనులో వున్న పులి చందాన వుంటుంది. బోనులోంచి బయటపడి ఔట్ డోర్స్ లో హాయిగా హీరోయిన్ తో కాస్త సరసం, ఫారిన్ లొకేషన్స్ లో పాటలు, నేస్తాలతో నవ్విస్తూ అల్లరి కామెడీలూ, రిచ్ కాస్ట్యూమ్స్, కార్లు, బంగళాలూ, ఫైఫ్ స్టార్ పార్టీలూ చేసుకుని, విలన్స్ తో కనీసం వాలిమై లోలాగా హై ఒల్టేజీ ఔట్ డోర్ అడ్వెంచర్స్ చూసి కరువుదీరా ఎంజాయ్ చేయాలకునే ఫ్యాన్స్ పరిస్థితి వర్ణనాతీతంగా వుంటుంది. పొంగల్ నాడు దంగల్ లేని సినిమా దేనికని జుట్లు పీక్కుంటారు.
        
హీరోయిన్ మంజు వారియర్ డ్రై పాత్రకూడా అంతంత మాత్రం. ఇక సముద్రకని, అజయ్ లు రొటీనే. జాన్ కొక్కేన్ అజిత్ తగ్గ విలన్ గా ఫర్వాలేదు. జీబ్రాన్ సంగీతం చాలా లౌడ్ గా వుంటుంది. ఒక బ్యాక్ గ్రౌండ్ పాట, అజిత్ ఫ్లాష్ బ్యాక్ లో ఒక మాస్ పాటా వున్నాయి. కెమెరా వర్క్, ఇతర ప్రొడక్షన్ విలువలు టాప్ రేంజిలో వున్నాయి. ఇది ప్రధానంగా యాక్షన్ డైరెక్టర్ల సినిమా. వాళ్ళకి పది సినిమాల పని ఒకే సినిమాలో లభించింది.
        
అసలు విషయమేమిటంటే, దర్శకుడు వినోద్ లోబడ్జెట్ సినిమా కోసం తయారు చేసుకున్న కథ అజిత్ కి ఒక సీను చెప్పాడు. అజిత్ కి ఆ సీను నచ్చి ఓకే చెప్పాడు. దాంతో ఆ కథని అజిత్ రేంజికి పెంచాడు. ఇది దర్శకుడు వినోద్ స్వయంగా చెప్పిన విషయం. అయితే ఏం పెంచాడు? యాక్షన్ తో హంగామా చేస్తే లో బడ్జెట్ కథ హై బడ్జెట్ కథ అయిపోతుందా? అడుగు బొడుగు జీవుల్ని మోసం చేసే బ్యాంకు కథ కాబట్టే లోబడ్జెట్ కి తయారు చేసుకున్నాడు. ఇంతవరకైతే ఇది న్యాయమే,  మిగతా చేసుకున్నదంతా బరితెగింపు.  

—సికిందర్