రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, November 2, 2020

993 : సందేహాలు -సమాధానాలు

 

Q : మొదటగా నా విన్నపం ఏంటంటే వారంలో కనీసం నాలుగు ఆర్టికల్స్ ఉండేలా చూడండి. ఇక నా ప్రశ్న- కామెడీ ప్రధానంగా తక్కువ బడ్జెట్లో కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ (హీరోకి చిన్న ఆరోగ్య సమస్య ఏదో ఉండడం, బట్టతల లాంటివి) కు స్క్రీన్ ప్లే ఎలా రాసుకోవాలో, ఏమేమి ఉండేలా చూసుకోవాలో, ప్రధాన పాత్రను ఎలా నిర్వహించాలో కొంచెం విపులంగా వివరిస్తారా.
అశోక్ పి, అసోసియేట్ 
A : చాలా మందిది ఇదే ఫిర్యాదు. నిజమే, వ్యాపకాలు పెరిగి వ్యాసాలు తగ్గాయి. ఎన్నో పెండింగులో వున్నాయి. వారానికి మూడు తెల్లారి ఆరుగంటలకల్లా పోస్టయ్యేలా గత రెండు వారాలుగా ప్రయత్నిస్తూనే వున్నాం. చాలా కొత్త సినిమాల రివ్యూలు కూడా మిస్సవుతున్నాయి. ఒక సినిమా చూడడం ప్లస్ రివ్యూ రాయడం ఆరేడు గంటల సమయం తీసుకుంటుంది. ఇంకాస్త వ్యాపకాలు కొలిక్కి రావాలి. వ్యాపకాలంటే షికార్లు కావు, సినిమా కథల రాతలే. వీటిలో ఒక పెద్ద బడ్జెట్ పాత మూసని కొత్త సీసాలో పోసేసరికి సరికి తలప్రాణం తోకకొచ్చింది. ఇంతా చేసి అదేమవుతుందో తెలీదు. వ్యాసాలు తప్పకుండా ఈ వారం నుంచి ప్రయత్నిద్దాం. రెండోదేంటంటే, పవర్ ప్రాబ్లం చాలా వుంది ఈ మధ్య వర్షాల వల్ల.   

రెండో ప్రశ్నకి - ముందుగా అర్ధం చేసుకోవాల్సిందేమిటంటే, కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ అనే మాట తప్పు. ఏ సినిమా అయినా కాన్సెప్ట్ తోనే వుంటుంది. కాన్సెప్ట్ లేకుండా సినిమా ఎలా వుంటుంది. కాబట్టి వున్నవి లో- కాన్సెప్ట్ సినిమాలు, హై కాన్సెప్ట్ సినిమాలనేవే. హై కాన్సెప్ట్ సినిమాలంటే భారీ సినిమాలు : బాహుబలి, రోబో, ఇన్సెప్షన్, గాడ్ ఫాదర్, మ్యాట్రిక్స్, జూరాసిక్ పార్క్ లాంటివి. ఇలాటివి కానివన్నీ లో- కాన్సెప్ట్ సినిమాలే. 

హీరోకి చిన్న ఆరోగ్యసమస్యలతో, వ్యక్తిత్వ లోపాలతో వుండేవన్నీ సాధారణ లో- కాన్సెప్ట్ సినిమాలే. కాకపోతే ఇవి కామెడీలుగా ఎక్కువుంటాయి. మతిమరుపుతో భలే భలే మగాడివోయ్ లాగా. అధిక బరువుతో  సైజ్ జీరో లా. బట్టతలతో హిందీ బాలా లాగా. ఇలాటి సమస్యల్ని డీల్ చేసేప్పుడు జాగ్రత్తగా వుండాలి. రీసెర్చి బాగా చేసుకోవాలి. లేకపోతే ఓసిడి (అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్) అని ప్రచారం చేసి, సాధారణ ఎలర్జీ గురించి చూపించినట్టవుతుంది. ప్రేక్షకులు ఇదే ఓసిడి అనుకునే తప్పుడు సమాచారం వెళుతుంది. అలాగే సైజ్ జీరోలో అధిక బరువు గురించి చెప్తూ, దాన్నొదిలేసి క్లినిక్కులు చేసే మోసాల కథగా మారిపోయి- సెకండాఫ్ సిండ్రోమ్ లో పడి ఫ్లాపయ్యే ప్రమాదముంటుంది. 

ఫలానా ఈ విధమైన కథకి స్క్రీన్ ప్లే ఎలా రాసుకోవాలని పదేపదే అడుగుతూంటారు. పదేపదే చెప్తూనే వున్నాం. పాత్ర- సమస్య- సంఘర్షణ- పరిష్కారమూ అనే చట్రమే వుంటుంది ఎంత చిన్న లో- కాన్సెప్ట్ కైనా, ఎంత పెద్ద హై కాన్సెప్ట్ కైనా. మనిషి బ్రెయిన్ కి ప్రతి రూపమే స్క్రీన్ ప్లే అనీ, ఈ స్ట్రక్చర్ మారేది కాదనీ ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఈ బేసిక్ పాయింటుని ముందు  బాగా గుర్తుంచుకుంటే బావుంటుంది.

ఇక తక్కువబడ్జెట్, లేదా జీరో బడ్జెట్ స్క్రిప్టు ఎలా చేసుకోవాలో మూడు వ్యాసాలిచ్చాం. ఇక్కడక్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి. ఇలాటి వ్యాసాల్ని డౌన్ లోడ్ చేసుకుని వుంచుకుంటే రిఫరెన్సులుగా మీకుపయోగపడతాయి.

సికిందర్