రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, నవంబర్ 2015, సోమవారం

కాపీ తయారీ కుమారి!



‘మా కాలేజీలో  ఒకమ్మాయి కొందరు అబ్బాయిలతో కలిసి పిక్నిక్ కి వెళ్ళింది. ఒకమ్మాయి అబ్బాయిలతో గడపడ మంటే ఆ రోజుల్లో ఊహించలేనిది. అలాటిది ఆ పిక్నిక్ లో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కానీ ఆమె ‘లూజ్’ అంటూ పుకార్లు బయల్దేరాయి. ఇది నా జ్ఞాపకాల్లో బలంగా ఉండిపోయింది..’   ఆదివారం ‘టైమ్స్ ఆఫ్ ఇండియాకి’ దర్శకుడు, నిర్మాత, ‘కుమారి 21 ఎఫ్’ కథారచయిత సుకుమార్  చెప్పిన మాట ఇది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే  ఆన్ లైన్ లో  మీడియా, సోషల్ మీడియా అంతటా గగ్గోలు పుట్టింది. సుమార్ ని బాగా ఇబ్బందిలో పడేసే కామెంట్స్ తో హల్ చల్ చేశాయి. తను తీసిన ‘కుమారి 21 ఎఫ్’  కి ఇన్స్ పిరేషన్  పైన పేర్కొన్న సంఘటన అని చెప్పుకున్న సుకుమార్ మాటలు ఒట్టి అబద్ధాలని తేలిపోయింది. ఆన్ లైన్ మీడియా, సోషల్ మీడియాల సాక్షిగా ఆయన విశ్వసనీయత దెబ్బతినే పరిస్థితి. సుకుమార్ కి ఏ ఇన్స్ పిరేషనూ లేదని, ఆయన నేరుగా రెండు ఫారిన్  సినిమాలని కాపీ కొట్టాడనీ  నెటిజన్ లైన తెలుగు ప్రేక్షకులు గగ్గోలు పుట్టించారు!

        నెట్ యుగం లో ఎవరు ఎక్కడినుంచి కాపీ కొడుతున్నారో తెలియడం  దాదాపు అసాధ్యమే కావచ్చు. ఈ ధైర్యమే సినిమాల్ని కాపీ చేయడానికి పురిగొల్పు తూండవచ్చు. ‘కుమారి 21 ఎఫ్’  కాపీ అని వందలాది మంది ప్రింట్, ఆన్ లైన్ మీడియా రివ్యూ కర్త లెవరూ పసిగట్ట లేకపోవడాన్ని బట్టి ఇది స్పష్ట మవుతోంది.  అయినా ఇదే నెట్ యుగంలో  ఎక్కడో ఎవరో ఒక్క ప్రేక్షకుడికి ఆ కాపీని  పట్టించేసే సంభావ్యత కూడా అంతే వుంటుంది. ఇదివరకు  హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొట్టే వాళ్ళు. అది ఈజీగా తెలిసిపోయేది. విరివిగా కొరియన్ సినిమాల్నీ కాపీ కొడతారు. అది కూడా తెలిసిపోతోంది. అయినా  వాటిని కాపీ కొట్టడం మానుకోలేదు. హాలీవుడ్ సినిమాలని కాపీ కొట్టడం మానెయ్యడ మంటూ జరిగితే అది మెడకి చుట్టుకునే పరిస్థితి వచ్చినందు వల్లే. సాక్షాత్తూ కొన్ని హాలీవుడ్ కంపెనీలు  ఇండియాలో మకాం పెట్టి సినిమాలు తీస్తూ ఇక్కడి మార్కెట్ ని సొమ్ము చేసుకుంటున్న తరుణంలో- వాళ్ళు కాపీ మాస్టర్ల మీద కూడా కన్నేసి ఉంచారు. ముంబాయి కేంద్రం గా ఆ కంపెనీలకి ఏ  భారతీయ సినిమా ఏ హాలీవుడ్ లోంచి కాపీ కొట్టారో సులభంగా తెలిసిపోవడమే గాక, కోట్లాది రూపాయల నష్ట పరిహారాలకి కేసులూ  వేసే తతంగం కూడా మొదలయ్యింది. దీంతో  బాలీవుడ్ సహా టాలీవుడ్, కోలీవుడ్ అన్ని భాషా చిత్రాల ఫీల్డులూ  హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొట్టే పుణ్య కార్యానికి కాస్తా ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నాయి. అలా అప్పనంగా కాపీ కొట్టి  తీరా కోట్లాది రూపాయలు నష్ట పరిహారం చెల్లించుకునే బదులు,  ఆ రైట్స్ ఏవో మర్యాదగా కొనుక్కుని తీయడం బెటర్ అన్న మంచి నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే  మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ హాలీవుడ్ మూవీ ‘వారియర్’  రైట్స్ కొనుక్కుని ‘బదర్స్’ గా ఇటీవలే  హిందీ లో రీమేక్ చేశారు. అలాగే తాజాగా కమల్ హాసన్ తీసిన ‘చీకటి రాజ్యం’ అనే థ్రిల్లర్ ‘స్లీప్ లెస్ నైట్’ అనే ఫ్రెంచి సినిమాకి  అధికారిక రీమేక్ అని ప్రకటించుకున్నారు. ఈ రీమేక్ లకి కథా రచయితలుగా వాళ్ళ పేర్లే వేయడం గమనార్హం.

     కమల్ హాసన్ ఎక్కడిదో ఎవరూ చూడని ఫ్రెంచి సినిమాకే హక్కులు కొని తీశారు. కొనక పోయినా పోయేదేమీ వుండదు. ఫ్రెంచి జర్మన్, అర్జెంటీనా, స్కాండేనేవియా మొదలైన  యూరప్ దేశాల సినిమాల్ని  వరల్డ్ మూవీస్ అంటారు. ఇవి హాలీ వుడ్ అంత  అట్టహాసంగా వుండవు. చిన్న బడ్జెట్ లో బాలీవుడ్ తీసే క్రాసోవర్ సినిమా ల్లాంటివి. ఇవి హాలీవుడ్ సినిమాల్లాగా ప్రపంచమంతా కూడా ఆడవు. కాబట్టి చాలా మంది ప్రేక్షకుల దృష్టిలో పడవు. అందుకని హాలీవుడ్ తో ఏర్పడ్డ  ఇబ్బంది దృష్ట్యా ఇక వరల్డ్ మూవీస్ ని కాపీ కొట్టుకుంటే ఈ ఇబ్బందీ ఉండదని వాటి మీద పడుతున్నారు. ‘బ్రూస్ లీ’ లో    విలన్ ట్రాక్ కి ఫ్రెంచి హిట్ కామెడీ ది వాలెట్ని కాపీ కొట్టి పెట్టేశారు. అలాగే అంతకి ముందు దూకుడులో జర్మన్ సినిమా గుడ్ బై లెనిన్ని తెచ్చి ప్రకాష్ రాజ్ కోమా కథకి పెట్టేసుకున్నారు. ఫ్రెంచి, జర్మన్, సినిమాల్లోంచి కథల్ని ఎత్తేస్తే ఎవరికీ తెలీదనుకోవడం కూడా అవివేకమే. ఎక్కడో ఎవరో ఒక్కరికి తెలుస్తుంది. అలా తెలిసిందే ‘కుమారి 21 ఎఫ్’ కాపీ వ్యవహారం. ఒకటి కాదు, రెండు విదేశీ సినిమాల్ని కాపీ కొట్టి ఈ సినిమా తీశారని  ఆదివారమంతా సంచలనం.

      ఒకటి - 2004 లో విడుదలైన ఫ్రెంచి మూవీ ‘లైలా సేస్’, రెండు- 2015 లోనే విడుదలైన స్పానిష్ మూవీ ‘ సీక్రేట్ ఇన్ దెయిర్ ఐస్’ -ఈ రెండూ సుకుమార్ కథరాయడానికి ఆధారంయ్యాయి.

        ‘లైలా సేస్’  లో హీరో 19 ఏళ్లబస్తీ కుర్రాడు. తల్లితో ఉంటాడు. పనీ పాట్లుండవు. కథలు రాసే ఆసక్తి వుంటుంది. పారిస్ లో రచయితగా శిక్షణ పొందేందుకు అవకాశం వచ్చినా  డబ్బు లేక వెళ్ళడు. బస్తీలోనే ఫ్రెండ్స్ వుంటారు. వీళ్ళు షాపుల్లో దొంగతనాలు చేసే క్రిమినల్స్. వీళ్ళతో తిరుగు తూంటాడు. అప్పుడు బస్తీలోకి ఓ పదహారేళ్ళ హీరోయిన్  ఆంటీ తో వచ్చి సెటిలవుతుంది. ఈ ఆంటీతో  సెక్సువల్ హెరాస్ మెంట్ ని ఎదుర్కొంటూ వుంటుంది. ఈమె హీరోని చూసీ చూడగానే ప్రేమలో పడుతుంది. చాలా కేర్ ఫ్రీగా, ఫాస్ట్ గా వుండే ఈమె సెక్సీ టాక్ హీరోని కంగారు పెట్టేస్తుంటుంది. ఈమె మీద ఫ్రెండ్స్ లో ఒకడు కన్నేసి హెరాస్ చేస్తూంటాడు. హీరోయిన్ ప్రవర్తనకి ఈమె అసలు కన్నె పిల్లనా కాదా అని అనుమానిస్తాడు హీరో. హీరో ఫ్రెండ్ ఆమెని రేప్  చేసేసరికి- అదే ఆమెకి తొలి అనుభవమని తెలుసుకున్న  హీరో గిల్టీ ఫీలవుతాడు. అంతలో ఆమె ఆంటీ ఆమెని తీసుకుని పోలాండ్ వెళ్ళిపోతుంది. ఆమె సెక్స్ ఫాంటసీలకి  ఆధారంగా ఒక బుక్ దొరుకుతుంది హీరోకి. ఆమె క్యారక్టర్ పూర్తిగా అర్ధమవుతుంది. ఫోన్ చేసి ఐ లవ్యూ చెప్తాడు. ఆ సంగతి తనకి తెలుసనీ ఆమే  అంటుంది. హీరో ఆమె జ్ఞాపకాల్ని అక్షర రూపంలో పెడతాడు. ఆ కథ అతణ్ణి  పారిస్ లో అదే రైటింగ్ శిక్షణా  కేంద్రంలో స్కాలర్ షిప్ ని సంపాదించి  పెడుతుంది. దాంతో ఇక్కడి పేదరికం నుంచి బయట పడి  పారిస్  వెళ్ళిపోయి అక్కడ మంచి సర్కిల్ లో రచయితగా శిక్షణ పొందుతూంటాడు. అలా అతడి జీవితాన్ని హీరోయిన్ మార్చేసింది...

      ఈ కథకి రెండో సినిమా ‘సీక్రెట్ ఇన్ దెయిర్ ఐస్’  లోని క్రైం ఎలిమెంట్ ని తీసుకుని సినిమా ప్రారంభంలో, ముగింపులో అతికించారు  సుకుమార్. హీరోయిన్ ని గ్యాంగ్ రేప్  చేసిన ముగ్గురు ఫ్రెండ్స్ నీ మూడేళ్ళుగా బంధించి వుంచి వాళ్లకి ఇంత బిర్యాని పడేసి చావబాదుతూ వుండే ముగింపు అది. హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు, పెద్ద ఫుడ్ సెంటర్ నడుపుతూంటాడు..

        ఇదీ విషయం. ఒరిజినల్ మూవీలో మెచ్యూరిటీ అనే కథకి అవసరం లేని సిల్లీ పాయింట్ లేదు. సుకుమార్ తను  ఇంటలెక్చువల్ కాబట్టి  కథనంలో  కావాలని హీరోయిన్ హీరోకి మెచ్యూరిటీ లేదని దూరం పెడుతున్నట్టు 'రైటింగ్స్' రాసుకున్నారు. చివర్లో రేప్ కి గురవుతుంది. అయినా అప్పుడామెని హీరో  పెళ్లి చేసుకోవడం మెచ్యూరిటీ  అవుతుందా? అవకాశ వాదం అవుతుందా? ఆమె మీద జాలి అవుతుందా? ఆమె నిస్సహాయతని సొమ్ము చేసుకోవడం అవుతుందా? మొదట్నించీ అంత స్ట్రాంగ్ పర్సనాలిటీతో వుండే హీరోయిన్  ఆ పరిస్థితుల్లో తనని స్వీకరించడం హీరో మెచ్యూరిటీ అని ఎలా భావిస్తుంది? వెంటనే తిప్పి కొట్టి తన బ్రతుకు తను బ్రతకాలి. ఒరిజినల్ మూవీలో హీరోయిన్ ప్రవర్తనకి ఆమె ఆంటీ సెక్సువల్ హెరాస్ మెంటో, ఆమె చదివే సెక్స్ ఫాంటసీ లో కారణమని ఒక జస్టిఫికేషన్ లాంటిది వుంది. సుకుమార్ ఈ జస్టిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో హీరోయిన్ క్యారక్టర్ హిస్ట్రీయానిక్స్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడుతున్న అమ్మాయిగా మాత్రమే ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇందుకే ఈమె మెచ్యూరిటీ గురించి మాట్లాడ్డం ఏమిటని అన్పిస్తుంది- తన ప్రవర్తనతో తనే ఇమ్మెచ్యూర్డ్ గా కన్పిస్తూంటే! 

       ఏదేమైనా ప్రేక్షకుల నుంచి  ఈ సినిమా పై మిశ్రమ స్పందనే వస్తోంది. నచ్చే వాళ్లకి నచ్చు తోంది- నచ్చని వాళ్ళు సుకుమార్ మీద తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ఇలాటి బి గ్రేడ్ సెక్స్  కథ తను రాయడమేమిటని విమర్శిస్తున్నారు. చాలామంది కాపీ కొడితే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. కాపీ కొడితే తప్పే నని హాలీవుడ్ నోటీసు లందుకుని అనుభవపూర్వకంగా తెలుసుకుంది బాలీవుడ్. సుకుమార్ చేసింది తప్పో ఒప్పో తేల్చాల్సింది ఆ రెండు విదేశీ సినిమాల దర్శకులే!  

        (దీనికి స్క్రీన్ ప్లే సంగతులు అవసరం లేదని భావించడంతో రాయడం లేదు)

-సికిందర్