రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, డిసెంబర్ 2021, శుక్రవారం

1110 : రివ్యూ!


 రచన- దర్శకత్వం : తేజ మార్ని

తారాగణం : శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, మహేశ్ ఆచంట, గౌరవ్ పరీక్, రాజ్ కుమార్ కసి రెడ్డి, దేవీ ప్రసాద్, నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు తదితరులు
సంగీ
తం : ప్రియదర్శన్ బాల సుబ్రహ్మణ్యన్, ఛాయాగ్రహణం : చీకటి జగదీష్
బ్యానర్ : మ్యాట్నీ ఎంటర్టయిన్మెంట్స్
నిర్మాతలు :, అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి
విడుదల : డిసెంబర్ 31
, 2021
***

        2021 కి వీడ్కోలు చెబుతూ శ్రీవిష్ణు ఈ ఏడాది ముచ్చటగా మూడో సినిమా నటించాడు. గాలి సంపత్’, రాజరాజ చోర ల తర్వాత అర్జున ఫల్గుణ అనే ఇంకో దొంగోడి పాత్రని రిపీట్ చేస్తూ పల్లెటూరి నేపథ్యానికి తెర తీశాడు. ఇది వరకు జోహార్ తీసిన తేజ మార్ని దర్శకత్వంలో, అమృతా అయ్యర్ ని హీరోయిన్ గా తీసుకుని, ఇంకో ముగ్గురు సహ నటులతో కలిసి ఈ తాజా నజరానా ప్రేక్షక లోకానికి సమర్పించాడు. హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ టికెట్ రేట్లు నూట యాభై నుంచి ఏకంగా 295/- కి పెంచేసిన ముహూర్తానే రిలీజు పెట్టుకున్న తను, ప్రమోషన్స్ లో ప్రామీజ్ చేసినట్టు ఈ సినిమా వుందో లేదో ఓసారి చూద్దాం...

కథ

గోదావరి జిల్లా గ్రామంలో అర్జున్ (శ్రీవిష్ణు) రాంబాబు, తాడోడు, ఆస్కార్, శ్రావణి అనే  నల్గురు ఫ్రెండ్స్ తో అల్లరి చేసుకుంటూ వుంటాడు. ఫ్రెండ్స్ కి ఏ సమస్య వచ్చినా ఆదు కోవడంలో ముందుంటాడు. ప్రయోజకుడివి కమ్మని ఇంటి దగ్గర పోరే తండ్రి (శివాజీ రాజా), గారం చేసే తల్లీ వుంటారు. తాడోడు (మహేష్ ఆచంట) కి తండ్రి (దేవీ ప్రసాద్) నుంచి వొత్తిడి పెరగడంతో జాబ్ సాంపాదించుకోవడానికి హైదరాబాద్ బయల్దేరుతూంటే, వూరు కాని  వూళ్ళో పాతిక వేలు సంపాదించి ఒంటరిగా అవస్థలు పడేకన్నా,ఇక్కడే వుండి పదివేలు సంపాదించుకుంటూ తల్లిదండ్రుల్ని చూసుకోవడం మేలని అర్జున్ ఆపేస్తాడు.   

ఇటు శ్రావణికి వూళ్ళోనే గ్రామ వలంటీరుగా ఉద్యోగం వస్తుంది. ఇక అర్జున్ మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి సోడా ప్లాంటు పెడదామని బ్యాంకు లోను కోసం ప్రయత్నిస్తాడు. లోన్లు ఇప్పించే కరణం (నరేష్) సహాయం చేస్తాడు. లోను శాంక్షన్ అవ్వాలంటే యాభై వేలు లంచం కట్టాల్సి రావడంతో ఆ డబ్బుల కోసం ప్రయత్నిస్తూంటారు. ఇంతలో తాడోడి తండ్రి తీసుకున్న వ్యవసాయ రుణం తీర్చక పోవడంతో ఇల్లు జప్తు చేయడానికి బ్యాంకు వాళ్ళు వస్తారు. అర్జున్ వాళ్ళని ఆపి కొంత గడువు తీసుకుంటాడు. ఇక డబ్బు సంపాదించడానికి గంజాయి స్మగ్లింగ్ ఒక్కటే మార్గమని అరకు వెళ్ళి గంజాయి తీసుకొస్తూ, సీఐ (సుబ్బరాజు) కి దొరికిపోతారు. సీఐ దగ్గర్నుంచి పారిపోయి వూళ్ళోకొచ్చేస్తారు మూటతో. మూట కోసం ఆ సీఐ వెంటపడి వూళ్ళో కొచ్చేస్తాడు. ఇప్పుడేం జరిగిందన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ

క్రైమ్ కామెడీ జానర్లో చేద్దామనుకున్న కథ. చేజారి గోదార్లో పడింది. భారతంలో అర్జునుడు లాంటి వాణ్ణి చూపించాలనుకున్నారు. అర్జునుడు తనకున్న పది పేర్లు పలికితే భయం పోతుందని బోధించినట్టు -పిడుగు పడితే అర్జునా ఫల్గుణా అని  తల్చుకోవడం వాడకంలో కొచ్చినట్టు- ఆపదల్లో అలాంటి అర్జునుడులాంటి వాడు మన శ్రీవిష్ణు పోషించిన అర్జున్ హీరో పాత్ర. ఛేజింగ్ లో ప్రయాణిస్తున్న గుర్రపు బండి అర్జునుడి రధమై, యుద్ధంలో రధ చక్రం శూల విరిగి పడడమనే భారతంలోంచి సింబాలిజంగా కూడా వాడేశారు. పురాణంలో ఆ శూలే పిడుగు అయినట్టు, శ్రీవిష్ణు పిడుగుని పట్టుకుని లొంగదీసు కోవడాన్ని కూడా గ్రాఫిక్స్ లో చూపించేశారు సినిమా ప్రారంభంలోనే. ఐతే పిడుగునే పిడికిట బంధించగల్గిన శక్తిగల హీరో శ్రీ విష్ణు అర్జున్ పాత్ర - ఒక విధంగా చెప్పాలంటే, పురాణ సంబంధంతో ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని  తీర్చగలిగే మిథికల్ క్యారక్టర్- పొలో మని విలన్లకి భయపడి పారిపోవడమే తప్ప పోరాటం చేయని బాక్సాఫీసు సూపర్ హిట్ కథగా మాత్రం తీర్చిదిద్దారు.

        చేసేదే గంజాయి స్మగ్లింగ్ అనే అధర్మ - నీచ  కార్యం చేస్తున్న పాత్రయినప్పుడు, దానికి అర్జునుడితో పోలిక పెట్టి అర్జునా ఫల్గుణా అని చూపించడం. చివరికి దోచుకొచ్చిన మూట కాస్తా గడ్డి మేటులో తగలబడి బూడిదై పోవడం. పిడుగునే పట్టుకో గల్గే వాడికి గడ్డిమేటు మంట భయానకంగా కనిపించింది! మూట దాచింది కుడివైపు ఐనప్పుడు, గడ్డి ఎడమ వైపు నుంచి అంటుకుంటూ వస్తూంటే, మూట లాగెయ్యకుండా, మంటమీద నీళ్ళు పోస్తూ వీర ఎమోషన్స్ పలికించడం. క్రైమ్ కామెడీ అంటే ఇలాటి కామెడీలన్న మాట.  

        ఇలా కాన్సెప్ట్ పరంగా పురాణంతో మిథికల్ జర్నీకి విఘ్నాలేర్పడగా, దీనాధారంగా కథా కథనాలు కూడా పిడుగు పాటుకి గురయ్యాయి థియేటర్ ఏసీ చలిలో చలిమంట పెడుతూ. నిరుద్యోగులు డబ్బు సంపాదించడానికి నేరం చేసే ఈ కథకి కారణం కూడా రెండుగా  చీలిపోయింది. సోడా ప్లాంటు పెడదామని ప్రారంభమయిన కథ, ఆ లక్ష్యం వెనక్కి వెళ్ళిపోయి, స్నేహితుడి ఇల్లు జప్తుని ఆపే కథగా మారిపోయింది. రెండూ బ్యాంకులతో ముడిపడి వున్న సమస్యలే. చిన్న గ్రామంలో ఒక బ్యాంకులో మొండి బకాయి వుండగా, ఇంకో బ్యాంకు ఆ సంబంధీకులకే ఇంకో లోను ఎలా ఇస్తుందో తెలీదు. కథలో సమస్యా స్థాపనలో ఏకత్వం లేని ఈ గజిబిజి వల్ల కథనమూ గజిబిజిగా, దారీ తెన్నూ తెలీని ప్రయాణమై, గలగల పారే గోదాట్లో గోల గోలగా సంగమించింది. పాపం గోదావరి జిల్లా కథ!

నటనలు - సాంకేతికాలు

ఇది కాస్త  అతిశయోక్తి అనిపించొచ్చు గానీ, పుష్ప లో అల్లు అర్జున్ని కాకుండా పదహారణాల కూలీ వాణ్ణే చూసినట్టు,ఇప్పుడు శ్రీవిష్ణులో గోదావరి జిల్లా వాణ్ణి చూస్తాం. ముత్యాల ముగ్గు లో రావు గోపాల రావుకి పోటీ తను. ఈ టాలెంట్ ని ఒప్పుకు తీరాలి. పాత్ర చిత్రణ, కథా కథనాలెలా వున్నా; నటన, గోదావరి భాష, పల్లె కల్చర్ అద్భుతంగా నటించాడు తెరమీద. దర్శకుడు తను చేయాల్సింది పేపర్ మీద సరిగా చేసివుంటే విష్ణు పడిన కష్టానికి ఫలితముండేది.

        రూరల్ లుక్స్ తో హీరోయిన్ అమృత తెర మీద గ్లామర్ కోసమే వుంది తప్ప నటించడానికి పాత్రేమీ లేదు. తనకి ప్రభుత్వ ఉద్యోగం వుంటే క్రిమినల్ లా స్మగ్లింగ్ కి వెళ్ళడ మేమిటో అర్ధంగాదు. శ్రీవిష్ణు కూడా ఎందుకు తీసికెళ్తాడో దర్శకుడికే తెలియాలి. సెకండాఫ్ సీన్లలో హీరోయిన్ కనిపించకపోతే బావుండదని తీసికెళ్ళి నట్టుంది. ఫ్రెండ్స్ పాత్రల్లో ఇల్లు జప్తు సమస్యలో వున్న తాడోడి పాత్రలో మహేష్ ఆచంటకి నటన చూపించుకోవడానికి తగిన భావోద్వేగాలున్న పాత్ర. తండ్రి పాత్రలో అప్పుల్లో పడ్డ పేద రైతుగా దేవీ ప్రసాద్ ఫర్వాలేదు. నెగెటివ్ పాత్రలో నరేష్, విష్ణు తండ్రిగా వ్యంగ్య పాత్రలో శివాజీ రాజా, మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ పాత్రల్లో నటనతో మార్కులు కొట్టేసే రాజ్ కుమార్ కసిరెడ్డి కన్పిస్తారు. కసిరెడ్డి మళ్ళీ రాజావారు రాణీ గారు తర్వాత గోదావరి పాత్రతో ముద్రేస్తాడు నవ్విస్తూ. రైల్వే స్టేషన్లో కళ్ళు లేని కబోదిగా, అరకులో గంజాయి మత్తులో వున్న నేరస్థుడిగా గుర్తుండే సీన్లు చేశాడు నవ్విస్తూనే.

        సాంకేతిక విలువల విషయానికొస్తే కెమెరా మాన్ జగదీష్ పల్లెటూరు, అరకు విజువల్స్ బావున్నాయి. కొన్ని ఔట్ డోర్ సీన్స్ కి డీఐ గాఢత యూనిఫాంగా లేదు. కానీ గాఢత ఎక్కువున్న ఈ సీన్సే బావున్నాయి. ఈ కలర్ మేనేజి మెంట్ తోనే పూర్తి మూవీ వుండాల్సింది. ఇక ప్రియదర్శన్ బాణీల్లో పాటలు, నేపథ్య సంగీతం కూడా బావున్నాయి. రామ్ సుంకర అరకు యాక్షన్ సీన్స్ కూడా బావున్నాయి. రెండు గంటల 5 నిమిషాలకి కుదిస్తూ విప్లవ్ ఎడిటింగ్ కూడా బావుంది. దర్శకుడి స్క్రిప్టులో నేటివిటీ తెలిసినట్టుగా రాసిన గోదావరి డైలాగులు మాత్రమే బావున్నాయి.

చివరికేమిటి

అన్నీ బావున్న ఈ క్రైమ్ కామెడీలో చాలా బాధాకరంగా వున్నవి కథా కథనాలే. ఇవే మొత్తం వ్రతాన్ని చెడగొట్టాయి. ప్రధాన పాత్రకి కనీసం సరైన లక్ష్యం, ప్రత్యర్ది పాత్ర లేకపోవడం ఎలా కథవుతుందని భావించారో తెలీదు. ఇలా సినిమాలు తీస్తే థియేటర్ రిలీజుకి ఎవరూ రారు. ఓటీటీలో వీలుంటే చూద్దాం లే అనుకుంటారు, మర్చిపోతారు. ప్రధాన మల్టీ ప్లెక్సులో ఈ సినిమాకి పట్టుమని పదిమంది లేరు. పది మంది మౌత్ టాక్ తోనైనా పుంజుకోవాలంటే ముందు సినిమాలో విషయమంటూ వుండాలి.

        ఇంటర్వెల్ ముందు అరకు స్మగ్లింగ్ కెళ్ళేవరకూ పల్లెటూళ్ళో కామెడీలే వుంటాయి. పైగా ఫ్రెండ్స్ గురించి వాళ్ళ చిన్నప్పటి దగ్గర్నుంచీ కథెత్తు కున్నారు అవసరం లేకపోయినా. పల్లెటూరి కామెడీ సీన్లు ఒక్కటీ నవ్వించే స్థితిలో లేవు, డైలాగులు చమత్కారంగా వుండడం తప్ప. కాసేపు సోడా ప్లాంటు అని, మరి కాసేపు ఇల్లు జప్తు అనీ సరైన పాయింటుకి కూడా రాకుండా, ఇంటర్వెల్లో పోలీస్ ఛేజింగ్స్ ప్రారంభించేశారు.

        ఇక సెకాండఫ్ ఛేజింగ్స్ సాగిసాగి తిరిగి పల్లెటూరుకి వస్తుంది కథ. ఈ ఛేజింగ్స్ లో సంఘటనలు లాజిక్ లేకుండా, లాజిక్ లేని సీన్స్ లో ఎమోషన్లు వర్కౌట్ కాకుండా, రోమాన్సులు పని చేయకుండా ఇష్టారాజ్యంగా సాగిపోతూంటుంది. చాలా పాత కాలంలో ఇలాటి బి గ్రేడ్ సినిమాలు చూశాం. మధ్య మధ్యలో - తనది కాని పోరాటంలో, తనది కాని కురుక్షేత్రంలో హీరో వున్నట్టూ, కానీ అభిమన్యుడిలా బలి కాదల్చు కోనట్టూ- వాయిసోవర్ వస్తూంటుంది. తనది కాని పోరాటమనీ, కురుక్షేత్రమనీ హీరో ఇప్పుడెలా అనుకుంటాడు? ఫ్రెండ్స్ ని ఆదుకోవడమే కదా హీరో ఇంట్రడక్షన్? ఇలా వుంటే ఎమోషన్లు, ఫీలింగులు, థ్రిల్లింగులు ఎలా పలుకుతాయి?

        చివరికి పల్లెటూరికి తిరిగొస్తుంది కథ. ఇక్కడ ఇంకో విలన్ తో ఇంకో రకంగా ముగుస్తుంది. స్ట్రక్చర్ లేదు, సరైన గోల్ లేదు, గోల్ కి తగ్గ స్ట్రగుల్ లేదు, ఒక ప్రత్యర్ధి లేడు. దీంతో కథే లేదు, సినిమా లేదు. 2021 కి వీడ్కోలూ అందంగా లేదు. 

సికిందర్