రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, నవంబర్ 2019, సోమవారం

889 : మూవీ నోట్స్


(ఆదివారం వెలువడాల్సిన  “మూవీ నోట్స్”  మన పనికి మాలిన కొన్ని ఎంజాయ్ మెంటు కార్యక్రమాల వలన సోమవారం)
          ర్ధిక మాంద్యం ప్రభావంతో ఇతర రంగాలు ఛిన్నా భిన్న మవుతున్నా, సినిమా రంగం ఫుల్ జోష్ తో ముందుకు సాగడం ఒక ప్రత్యేకత. మూడు సినిమాలు మొదటి రోజు 120 కోట్లు వసూళ్లు రాబట్టాయంటే, ఆర్ధిక మాంద్యం ఇంకెక్కడుందని ఆ మధ్య కేంద్ర మంత్రి రవి శంకర ప్రసాద్ వ్రాక్రుచ్చి వెనక్కి తగ్గితే, పివిఆర్ గ్రూప్ మల్టీ ప్లెక్సుల సీఈఓ కమల్ జ్ఞాన్ చందానీ  ఆర్ధిక మాంద్యం వుంది కాబట్టే సినిమాలు జోరుగా ఆడుతున్నాయని అభిభాషణ చేశారు. ఆర్ధిక మాంద్యం విసురుతున్న సవాళ్ళ నుంచి తప్పించుకోవడానికే ప్రజలు సినిమా లెక్కువగా చూసేస్తున్నారని అంకెలు చూపించారు. ఈయనే కాదు, సినీ పొలీస్ గ్రూప్ మల్టీ ప్లెక్సుల డిప్యూటీ సీఈవో దేవంగ్ సంపత్ కూడా ఇదే వివరణ ఇచ్చారు. పెద్ద స్టార్ల సినిమాలే కాదు, చిన్న చిన్న సినిమాలు అవెలా వున్నా కూడా ఇప్పుడు బాగా ఆడుతున్నాయన్నారు. బిస్కెట్ల నుంచీ కార్ల పరిశ్రమల వరకూ వివిధ రంగాల్ని మాంద్యం తినేస్తూంటే, దీన్నుంచి తప్పించుకోవడానికి ప్రేక్షకులు పాప్ కార్న్ తినేస్తూ సినిమాలు చూసేస్తున్నారన్న మాట. ఆర్ధిక మాంద్యం = మనో మాంద్యం. ఆర్ధిక మాంద్యం + మనో మాంద్యం = సినీ వినోదం అన్నమాట. గతంలోనూ ఆర్ధిక మాంద్యం పంజా విసిరినప్పుడు అది సినిమా రంగాన్ని తాకకుండా చూసుకున్నారు ప్రేక్షకులు. కానీ 2008 నాటి ఆర్ధిక మాంద్యం దెబ్బకి హాలీవుడ్ విలవిల్లాడింది. నెట్ ఫ్లిక్స్ కూడా కుదేలయింది. 

         
ర్ధిక మాంద్యం మాటేమో గానీ తెలుగులో చిన్న సినిమాల పట్ల నిర్మాతల్ల ఆసక్తి క్షీణిస్తోందా? కోటిన్నర రెండు కోట్లు పెట్టి తీస్తే రిటర్న్స్ వచ్చే నమ్మకమలా వుంచి, అసలు విడుదలవుతాయో లేదో కూడా తెలీనప్పుడు, వెబ్ సీరీస్ వైపు వెళ్తే మంచిదేమో నని ఆలోచనలు చేస్తున్నట్టు, వెబ్ సిరీస్ ప్రయత్నాల్లో వున్న ఒక దర్శకుడి వివరణ. 40, 50 లక్షల్లో వెబ్ సిరీస్ లాభసాటి వ్యాపారం. ఇదే జరిగితే చిన్న సినిమాలకి చెడు రోజులే. చిన్ననిర్మాతలు విజయవంతమైన ప్రత్యామ్నాయంగా డిజిటల్ ప్లాట్ ఫాం వెతుక్కుంటే దెబ్బ పడేది థియేటర్ల ఫీడింగ్ కే. ఇక విడుదలయ్యే ఒకటీ అరా పెద్ద సినిమాలు తప్ప ప్రదర్శించుకోవడానికి థియేటర్లకి సినిమాల కొరత ఏర్పడవచ్చు. చివరికి ఈ పరిస్థితి తెచ్చి పెట్టారు అర్ధం పర్ధం లేని లపాకీ సినిమాలు తీసే, వ్యాపార దృక్పథం లేని నయా మేకర్లు.

           
క ట్రీట్మెంట్ నేరేషన్ తో సమస్య! పది నిముషాలు, అరగంట, గంట కథ ఎలా చెప్పాలో ఆ మధ్య ఒక వ్యాసం రాస్తే చాలా మందికి ఉపయోగపడింది. బాగానే వుందనుకున్నాం. ఉన్నట్టుండి బాంబు పేలింది. శాస్త్రీయంగా రాసుకున్న సినాప్సిస్ తో పది నిమిషాలు, అరగంట, గంట ఏదైతే అది -  కథ ఎలా చెప్పాలో ప్రాక్టీసు చేసి కథ చెప్పేసి ఓకే చేయించుకున్నాక – నెక్స్ట్ ఏంటి? ఆ సినాప్సిస్ ని విస్తరించి, సీన్ల వారీగా ట్రీట్ మెంట్ రాసుకుని (దీన్నే గొప్పగా స్క్రీన్ ప్లే అంటారు) ఓ రెండు గంటలు మళ్ళీ విన్పించడమే. ఇప్పుడొచ్చింది సమస్య. ఈ సమస్య వస్తుందని వూహించలేదు. వూహించి వుంటే  రాసిన సినాప్సిస్ నేరేషన్ వ్యాసాన్నేఇంకా పొడిగించి, ట్రీట్మెంట్ నేరేషన్ ఏలా అని కూడా రాసేసి బ్లాగుకి అంకితమిచ్చేవాళ్ళం. సమస్య ఎలా వచ్చిందంటే, సినాప్సిస్ ని ఎలా విన్పిస్తారో ట్రీట్మెంట్ నీ అలాగే విన్పించడంతో. సినాప్సిస్ సంక్షిప్త కథ. అందులో కీలకమైనవి తప్ప అన్ని సీన్లూ వుండవు, సీన్ల వారీగా చెప్పడం వుండదు. ట్రీట్మెంట్ ని సీన్ల వారీగా చెప్పాలి. చెప్పినప్పుడు ఏ సీను ఏ ఉద్దేశంతో వుందో, దాని పాత్రానుగత, లేదా కథానుగత ప్రాముఖ్యమేమిటో, ఏ ఫీల్ తో ఎందుకుందో తెలుసుకోకుండా, అలా చెప్పకుండా, ఫ్లాట్ గా చెప్పేస్తే ఎలా?  వినేవాళ్ళకి సీన్ల విలువ తెలిసే అవకాశం లేక, కత్తిరింపుకి గురైతే ఏమిటి పరిస్థితి? కనుక ఇక ట్రీట్మెంట్ నేరేషన్ గురించి కూడా రాయాల్సి వచ్చేట్టుంది. హాలీవుడ్ లో చాలా హాయైన పరిస్థితి. అక్కడ స్క్రిప్టు బట్టీ పట్టి విన్పించే బాధ వుండదు. స్క్రిప్టు పంపిస్తే చదువుకుంటారు. వినడం కంటే చదివినప్పుడే మంచి చెడ్డలు బాగా తెలుస్తాయి. 

సికిందర్