CLICK THE VIDEO
పాఠక మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ సందర్భంగా టాపిక్ ఏమిటంటే, తెల్లారి లేస్తే జనాలు సోషల్ మీడియాలో వుంటున్నారు. సినిమాలెందుకు వుండకూడదు. సోషల్ మీడియాలో సినిమా యాడ్స్, ప్ర మోషన్స్, సాంగ్స్ వంటి పబ్లిసిటీ మెటీరీయల్ సమస్తం వుంటోంది. సినిమాలెందుకు వుండకూడదు? సోషల్ మీడియాలో వుంటున్న జనాలు తెలుసుకుంటున్న సమాచారం సినిమాలో వుంటోందా? వుండకపోతే సినిమాలెలా కనెక్ట్ అవుతాయి? సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న జనాలు సృష్టిస్తున్న ట్రెండ్స్ సినిమాలు పట్టుకోగలుగుతున్నాయా? ఒక కాలంలో రోమాంటిక్ కామెడీల ట్రెండ్ అని, ఇంకో కాలం లో సస్పెన్స్ థ్రిల్లర్ల ట్రెండ్ అనీ సినిమాలకి ట్రెండ్స్ అనేవి కొత్తేం కాదు. కానీ ప్రేక్షకులే ట్రెండ్స్ ని సృష్టించడం ఇప్పుడు కొత్త. ప్రేక్షకులు సృష్టిస్తున్న ఈ ట్రెండ్స్ నుపయోగించుకుని సినిమాలు కొత్త రూపురేఖలు సంతరించుకునే అవకాశమున్నా ఇంకా అవే రీసైక్లింగ్, కాపీ, టెంప్లెట్ సీన్లతో కాలం వెళ్ళబుచ్చుతున్నాయి. సోషల్ మీడియాలోంచి ప్రేక్షకులు సినిమా హాల్లోకి వచ్చి కూర్చుంటే సినిమాల్లో తమ ప్రపంచం, తమ జీవితం, తమ ఇష్టాయిష్టాలు కనిపించడమే లేదు.
అనునిత్యం లక్షలాది ప్రజలు ఇంటర్నెట్ లో తమక్కావాల్సిన సమాచారం కోసం సెర్చి చేస్తూంటారు. లక్షల మంది ఒక సమాచారం కోసం సెర్చి చేస్తూంటారు. ఏ సమాచారం గురించి ఎక్కువ సెర్చిలు చేస్తున్నారో అదే ఆ రోజుకి ట్రెండ్ అవుతుంది. ఉదాహరణకి 'హేపీ న్యూ ఇయర్ ఈవెంట్ 2025' గురించి ఇప్పుడు రాత్రి 8. 40 గం. వరకూ ఇండియాలో ఇరవై లక్షల మందికి పైగా సెర్చి చేశారు. లక్ష సెర్చి లతో 'మాన్ వర్సెస్ న్యూ కాజిల్' వుంది, అలాగే 50 వేల సెర్చి లతో 'సంబద్ లాటరీ' వుంది. ఇలా ర్యాంకింగ్ ఏర్పడుతుంది. ఈ ట్రెండ్స్ 'గూగుల్ ట్రెండ్స్' వెబ్సైట్ లోకి వెళ్తే తెలుస్తాయి. ఎంతమంది ఏ విషయం మీద సెర్చి చేస్తున్నారో గూగుల్ ట్రెండ్స్ ద్వారా తెలుసుకుని యూట్యూబ్ లో ఆ విషయం తాలూకు వీడియోలు సృష్టించి వ్యూస్ పెంచుకుంటారు. వెబ్సైట్స్ లో ఆ విషయం తాలూకు కంటెంట్ ని పోస్ట్ చేసి రీడర్స్ ని పెంచుకుంటారు. యూట్యూబర్ లు, వెబ్ కంటెంట్ క్రియేటర్లు ఇలా గూగుల్ ట్రెండ్స్ నుపయోగించుకుని ఆదాయం పెంచుకుంటున్నారు. ట్రెండింగ్ టాపిక్స్ ని సెర్చి చేస్తున్న ప్రజలకి ఆ సమాచారాన్ని ఈ రెండు మీడియాలు అందుబాటులో వుంచే మార్కెటింగ్ వ్యూహానికి సినిమాలు దూరంగా వుండిపోవడం చూస్తున్నాం. అంటే సినిమాలు ప్రజలతో బాటు సోషల్ మీడియాలో వుండడం లేదు. సోషల్ మీడియాలో ప్రజలు వెతుక్కుంటున్న సమాచారమమమేంటో, ఆసక్తులేమిటో, మొత్తానికి ప్రేక్షకుల టేస్ట్ అసలేమిటో తెలుసుకోకుండా, చూసి చూసి వున్న అవే పాత రొటీన్ సీన్లు సృష్టించి చేతులు దులుపుకుంటున్నారు.
నెట్ లో ప్రజలు సెర్చి చేసే అంశాల్లో దేశం లో జరిగిన ఏదైనా సంఘటన, రాజకీయ పరిణామాలు, ప్రముఖుల ఈవెంట్లు, కొత్త ఫ్యాషన్లు, హాబీలు, ఫుడ్స్, డ్రింక్స్, ఇలా ఒకటేమిటి ఎన్నో వుంటాయి. ఒక ట్రెండింగ్ అవుతున్న ఫుడ్ తీసుకుని సినిమా సీన్లో పార్టీ సీను క్రియేట్ చేశామనుకోండి- వెంటనే ఆడియెన్స్ ఆ సీనుతో కనెక్ట్ అయిపోయి ఎంజాయ్ చేస్తారు. ఒక ట్రెండింగ్ అవుతున్న హాబీనో, ఫ్యాషన్ నో కూడా సీన్స్ లో చూపిస్తే ఆడియెన్స్ కి అది తమ జీవితమే అన్పించి లీనమైపోతారు. ఏదైనా సమస్య మీద అభిప్రాయాలూ కూడా ట్రెండ్ అవుతూంటాయి. ఇవి కూడా పాత్రలు చర్చిస్తే సీన్లు వైరల్ అవుతాయి.
ప్రపంచవ్యాప్తంగా దేశాల వారీగా ఈ ట్రెండ్స్ వుంటాయి. మనకి ఇండియా సరిపోతుంది. దీన్ని 'గూగుల్ ట్రెండ్స్ ఇండియా' అందిస్తుంది. అయితే ఇవాళ ట్రెండ్ అయ్యే టాపిక్ సినిమా రిలీజయ్యేనాటికి పాతబడి పోతుంది కదా అన్పించవచ్చు. సినిమా సీన్స్ లో ట్రెండ్స్ ని అప్పుడే స్క్రిప్టులో చేర్చ కూడదు. షూటింగ్ కేళ్ళేముందు అప్పడు ట్రెండ్ అవుతున్న టాపిక్స్ ని సీన్స్ లో కలుపుకుంటే సరిపోతుంది. అప్పటికి రాసుకున్న డైలాగ్ వెర్షన్లో ఎక్కడెక్కడ బావుంటుందన్పిస్తే అక్కడ యాడ్ చేయవచ్చు. అలాగని అన్ని సీన్స్ లో ట్రెండ్స్ ని చూపిస్తే ఎబ్బెట్టుగా వుంటుంది. అప్పటికి కూడా షూటింగ్ మొదలెట్టి రిలీజయ్యే నాటికి నాల్గైదు నెలలు పడుతుంది కదా అన్పించవచ్చు. జ్ఞాపకాలు ఎక్కడికీ పోవు. నాల్గైదు నెలల క్రితం ప్రేక్షకులు తాము సెర్చి చేసిన టాపిక్ లేదా ఐటెమ్ ఇప్పుడు సినిమాలో కన్పిస్తే ఆ జ్ఞాపకాలు గిలిగింతలు పెట్టకమానవు. సినిమా సీన్లు ఎలా వుంటున్నాయంటే అవి ప్రేక్షకులు పాసివ్ గా చూసే చప్పిడి సీన్లు. సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న ప్రేక్షకులకి యాక్టివ్ గా చూసే సీన్లు కావాలి. అవి సోషల్ మీడియాలోంచే వస్తాయి.
స్క్రిప్టు రచయితల పని దీంతో అయిపోలేదు. వైరల్ వీడియోలు కూడా వున్నాయి. కొన్ని వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి? వాటివెనుకున్న నిజమేంటి? ఇది కూడా స్టడీ చేస్తేనే నిజమైన స్క్రిప్టు రచయితలవుతారు. కాలంతో పాటు మారకపోతే కనుమరుగై పోతారు. వైరల్ వీడియోల్ని స్టడీ చేస్తే అప్పుడు సీన్లు మామూలుగా వుండవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లాగే ఒక్కో సినిమా సీన్ని వైరల్ చేసి ప్రేక్షకులకి పిచ్చెక్కించవచ్చు. దీని గురించి ఇంకోసారి తెలుసుకుందాం. సినిమాల నుంచి ఇతర మీడియాలు చాలా తీసుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలోంచి సినిమాలు తీసుకోకపోతే ఇప్పుడున్న ఎనిమిది శాతం విజయాలు నాలుగు శాతానికి, ఇంకొన్నాళ్ళకి రెండు శాతానికి, మరికొన్నాళ్ళకి సున్నా శాతానికీ పడిపోయి అదృశ్యమైపోతాయి. సోషల్ మీడియా కింద తవ్వకాలు జరిపితే అక్కడ కనపడతాయి.
—సికిందర్