రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, December 8, 2017

561 : రివ్యూ!


రచన - దర్శత్వం : గౌతమ్
తారాగణం : సుమంత్, ఆకాంక్షా సింగ్, కిరణ్, కార్తీక్, సాత్విక్, ప్రీతీ తదితరులు
సంగీతం
:  శ్రణ్ రద్వాజ్,   ఛాయాగ్రణం : తీష్ ముత్యాల
బ్యానర్ :   స్వర్మ్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత : రాహుల్ యాదవ్ క్క
విడుదల : డిసెంబర్ 8, 2017
***
కథ 
          కార్తీక్ (సుమంత్), అంజలి (ఆకాంక్ష) లు రాజోలులో తొమ్మిదో తరగతి చదువుతూ ప్రేమలో పడతారు. దీంతో ఇద్దరి ఇళ్ళల్లో పేరెంట్స్  గొడవపడతారు. అంజలి తల్లి కార్తీక్ ని ఫెడీ మని కొడుతుంది. అప్పుడు అంజలి వయసుకి మించిన ఇష్టాలు పెంచుకోకూడదని కార్తీక్ కి బ్రేకప్ చెప్పేసి పేరెంట్స్ తో ముంబాయి వెళ్ళిపోతుంది. పదమూడేళ్ళ తర్వాత హైదరాబాద్ లో మళ్ళీ కార్తీక్ ని చూస్తుంది.  ప్రేమని వ్యక్తం చేస్తుంది. ప్రేమని మనసులో దాచుకున్న కార్తీక్ ఓకే చెప్తాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. సరీగ్గా పెళ్లి సమయానికి అంజలి వచ్చి, ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి వెళ్ళిపోతుంది. అంజలి ఎందుకిలా చేసింది? కార్తీక్ ని చేసుకోవడం ఆమెకి ఎందుకిష్టం లేదు? ఇది తెలుసుకోవాలంటే మిగతా ‘కథ’ వెండి తెర మీద చూడాల్సిందే.

ఎలావుంది కథ
         కథ కాదు, గాథ. అందులోనూ రోమాంటిక్ డ్రామా జానర్. కాబట్టి కథల్లోలాగా సమస్య – సంఘర్షణ – పరిష్కారం అనే కోణంలో దీన్ని చూడకూడదు. ప్రధాన పాత్రలైన ఇద్దరు ప్రేమికుల మధ్య సంఘర్షణ ఆశించకూడదు. కథల్లో లాగా ఆ సంఘర్షణకి ఒక పరిష్కారం కోసం వెతక్కూడదు. కథల్లోలాగా టెన్షన్ టెంపో థ్రిల్ లాంటివి చూడకూడదు. కథల్లోలాగా పాయింటు ఏమిటని అన్వేషించకూడదు. కమర్షియల్ సినిమాల కథల కుండే ఇవేవీ వుండని, పక్కా  గాథ కుండే లక్షణాలతో, పాత్రల దయనీయ స్థితికి జాలి పడుతూ -  ఈ పాసివ్ పాత్రల్ని మనం కూడా పాసివ్ గా చూస్తూ పోవాల్సిన డ్రామా. దీనినే లైటర్ వీ(ణ)న్ స్టోరీ అనీ, ఫీల్ గుడ్ మూవీ అనీ అంటున్నారు. రెండు వారాల క్రితమే  ‘మెంటల్ మదిలో’ అనే ఇలాటిదే ఫీల్ గుడ్ మూవీ వచ్చి వుండకుండా వెళ్ళిపోయింది రివ్యూల్లో ఎంత వూదరగొట్టినా! (ఆ రివ్యూ రాయలేక ఈ వ్యాసకర్త వూరుకున్నాడు). 

     ఐతే ఈ గాథలో సమస్య ప్రేమికురాలిదే  అయినప్పటికీ ఆ సమస్యకి ఓ అర్ధం కన్పించని చిత్రణని చూస్తాం. 14 ఏళ్ల కౌమార్యంలో ఎట్టకేలకు వయసుకి మించిన ఇష్టాలు పెంచుకోకూడదని తెలుసుకోగల్గిన తనే, పెద్దయ్యాక 27 ఏళ్ల వయసులో వయసుకి తగ్గ మెచ్యూరిటీతో ఎందుకుండదో అర్ధం గాదు. నీ తండ్రి ఎలాంటి వాడో నువ్వు చేసుకోబోయే వాడూ అలాటి వాడేనని తల్లి నూరిపోసినంత మాత్రాన,  నమ్మేసి పెళ్లి వద్దనుకుని వెళ్లి పోతుందా? మళ్ళీ,  ఇది నేను –అది వాడూ  అని తండ్రి ఏదో తేడా చెప్పినంత మాత్రాన,  చేసుకుంటున్న వేరే పెళ్లి వదిలేసి వచ్చేసి, ఏడ్చి తనే శుభం కార్డు వేసుకుంటుందా? ఫారిన్లో ఉద్యోగాలు చేసిన, లోకాన్ని చూసిన పాత్రలు ఇంకా 2000 – 2005 మధ్య నాటి లైటర్ వీ(ణ)న్ టీనేజీ ప్రేమ సినిమాలు వదిలి బయటికి రావా? వ్యవహార దక్షత తెలీని,  ఇలాటి అపరిపక్వ పాసివ్ కేండిడేట్స్ కి  కూడా కంపెనీలు ఉద్యోగాలిస్తున్నాయా? 

 ఎవరెలా చేశారు
      అప్పుడప్పుడు వీలు చూసుకుని వచ్చే సుమంత్ కి దేంతోనూ సంబంధం వుండదు. ఇమేజీ, ట్రెండ్, పోటీ, హిట్టు – ఫ్లాపు, డిమాండు  దేంతోనూ సంబంధం లేని  ఏకైక అదృష్ట జాతకుడుగా తను వుంటున్నాడు. ఈసారి ప్రేమ సినిమా నటించాడు. గొప్పతనం ఏమిటంటే-  దర్శకుడూ, కెమెరా మాన్ కలిసి తనని అత్యంత అందగాడుగా అప్డేట్ చేసి చూపించారు. సినిమా ఎవరికెంత గుర్తున్నా గుర్తులేకపోయినా, ఈ గ్లామరస్ ప్రెజెంటేషన్ తో తను గుర్తుండిపోతాడు. పాత్రకూడా జంటిల్ మాన్ లాగా నీటుగా బిహేవ్ చేయడం అదనపు ఆకర్షణ. పాత్రలో తనేం చేశాడనేది, ఔత్సాహిక ప్రేమికులకి ఏం సందేశ మిచ్చాడనేది అనవసరం. పాసివ్ గా బతకాలని చెప్పుండొచ్చు. ఔత్సాహిక లవర్ బాయ్స్ దీన్ని కళ్ళ కద్దుకుని పాటించనూ వచ్చు. 

          అయితే సుమంత్ కన్పించని, సుమంత్ చిన్నప్పటి సీన్లతో చిక్కు రావొచ్చు. మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్  రూపంలో ఫస్టాఫ్ – సెకండాఫ్ అంతా అనంత వాహినిగా వస్తూ వుండే చిన్నప్పటి దృశ్యాల్లో సుమంత్ కాకుండా బాలనటుడు సాత్వికే కన్పిస్తూంటాడు, బాలనటి ప్రీతీయే కన్పిస్తూంటుంది. ఫస్టాఫ్ లోనైతే సుమంత్ – హీరోయిన్ ఆకాంక్షల కంటే ఈ బాలనటుల ఫ్లాష్ కట్సేఎక్కువ సంఖ్యలో డామినేట్ చేస్తూంటాయి. దర్శకుడు వీళ్ళకిచ్చిన స్క్రీన్ స్పేస్ – ముగింపు వరకూ కూడా – అసలు హీరో హీరోయిన్లకి ఇవ్వకపోవడం వెనుక,  పూర్తిగా సుమంత్ భుజాల మీద సినిమా బరువంతా వేస్తే వర్కౌట్ కాదేమోనన్న అనుమానం వుందేమో తెలీదు. 

        హీరోయిన్ ఆకాంక్ష అత్యంత అందగత్తె. ఈ మధ్యవచ్చిన కొత్త హీరోయిన్లందరిలో కంటే  ఏ క్లాస్ బ్యూటీ క్వీన్. క్వీన్ లాంటి గ్రేస్ ఉట్టిపడుతూ వుంటుంది. పాత్రగా ఏం చేసిందనేది తర్వాతి సంగతి. ఔత్సాహిక లవ్ గాళ్స్ ఫాలో అయి దెబ్బతిన్నా నష్టం లేదు. ఆకాంక్ష తీర్చుకున్నట్టు వుంటుంది తృప్తిగా.

          కానీ బాల నటుడు సాత్విక్ పుట్టు నటుడు. సుమంత్ కంటే మాంచి కిక్కిచ్చే నటనతో వుంటాడు. అయితే ఇతడికి బాలనటి ప్రీతి మ్యాచ్ కాదు. ఈమె బలమైన బాడీతో, సాత్విక్ కి అక్కలా వుంటుంది. సాత్విక్ బక్కపలచన, ఎత్తు తక్కువ. 

          టెక్నికల్ గా మంచి విలువలతో వుంది. సతీష్ ముత్యాల కెమెరా వర్క్ సినిమాలో విషయమెలా వున్నా, దృశ్యాల్ని చాలా అందంగా చూపించింది. అలాగే మ్యూజిక్ దీనికింకో హైలైట్. నేపధ్యంలో మాంటేజెస్ కి వచ్చే పాటల్లో, మొత్తం బిజిఎంలో
శ్రణ్ రద్వాజ్ ఇచ్చిన ట్రెండీ బీట్స్ లేకపోతే ఈ గాథ ఒక నిమిషం  కూడా చూడలేని పరిస్థితి వుండేది.

చివరికేమిటి 
       కొత్త దర్శకుడు గౌతంకి యూత్ ఫుల్ ప్రెజెంటేషన్ తెలుసు. మంచి నటనలు రాబట్టుకోవడం, అర్ధవంతమైన దర్శకత్వం వహించడం లాంటి బేసిక్స్ తెలుసు. కాకపోతే తెలిసో తెలీకో కథ కాకుండా గాథ తీయడం,  మళ్ళీ తెలిసో తెలీకో దీన్ని ఎండ్ సస్పెన్స్ చేయడం, ఎండ్ సస్పెన్స్ చేయడంతో మళ్ళీ తెలిసో తెలీకో స్క్రీన్ ప్లేని మిడిల్ మటాష్ చేయడం....చకచకా జరిగిపోయాయి (నూటికి నూరు శాతం ఇవన్నీ తెలియకే చేసుకుపోతారు, ఎలాటి సందేహం అక్కర్లేదు). 

          ఇలా  గాథ, ఎండ్ సస్పెన్స్, మిడిల్ మటాష్ అనే  స్ట్రక్చరేతర క్రియేటివ్ విఫల యత్నాలుండగా, ఇక మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ అనే ఇంకో అపశృతి వీటన్నిటి మీదా స్వారీ చేసింది. మళ్ళీ ఈ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకుల్లో రెండు కథా (కథకాదు, గాథ) కాలాలు. ఒకటి 1999 నాటి బాల ప్రేమికుల గాథ, ఇంకోటి 2012 నాటి పెద్దయ్యాక కలుసుకుని విడిపోయేప్పటి గాథ. 

          ఈ రెండు కాలాల ఫ్లాష్ బ్యాకుల నేపధ్యంలో 2017 లో నడుస్తుంది అసలు వర్తమాన గాథ – ప్రెజెంట్ టైం ‘స్టోరీ’.  ఈ బహువిధ  కమర్షియలేతర విన్యాసాలతో తెరమీద కదిలే దృశ్యాలు చాలా తికమక పెట్టేస్తాయి. 1999 -2012-2017...ఇలా త్రికాల గాథలు ఖండ ఖండాలుగా త్రిశూలాల్లాగా వచ్చి పడుతూండడంతో,  శివశివా అనుకుని ఏదీ పట్టుకోలేని  నిస్సహాయ స్థితిలో శివుడికే వదిలేస్తాం. దర్శకుడు తను కథ చెప్పడంలో గొప్ప నేర్పు గల వాడని టాలెంట్ ప్రదర్శించుకోదలిస్తే అది ఇమ్మెచ్యురిటీ అన్పించుకుంటుంది. అతి టాలెంట్ అన్పించుకుంటుంది. నిలువెల్లా బ్యాడ్ రైటింగ్ అన్పించుకుంటుంది.  చివరి వరకూ ముక్కలుముక్కలుగా వచ్చే బాల్యపు గాథ తాలూకు దృశ్యాల్ని  గుర్తు పట్టి ఫాలో అవచ్చు- ఎందుకంటే వాటిలో వున్నది బాల నటులు కాబట్టి ప్రత్యేకం గా కన్పిస్తాయి. కానీ పెద్దయ్యాక సుమంత్ – ఆకాంక్ష లతో వచ్చే 2012 - 2017 కాలాల సీన్లలో ఏవి ఫ్లాష్ బ్యాకు సీన్లో, ఏవి ప్రెజెంట్ టైం సీన్లో  ‘క్షీర నీర న్యాయం’ చేస్తూ చూడ్డం సినిమా చూడ్డం అన్పించుకోదు. శ్రమకోర్చి కథని వెతుక్కుంటూ జోడించుకుంటూ చూడాల్సిన అగత్యానికి లోనుజేయడం దేనికి? 

          సింపుల్ గా చిన్నప్పటి కథని మొదట్లోనో, ఓ ఫ్లాష్ బ్యాకులోనో పూర్తిగా చూపించేసి, పెద్దయ్యాక మొత్తం ఒకే గాథగా చూపిస్తే వచ్చే నష్టమేమిటి? స్క్రీన్ ప్లే అంటే ఇదే కదా? పై విధంగా చేసుకొచ్చిందంతా  స్క్రీన్ ప్లే ఎందుకవుతుంది? అది స్క్రీన్ ప్లే లేని ఒట్టి వ్యక్తిగత క్రియేటివిటీ కదా? స్క్రీన్ ప్లేలేని వ్యక్తిగత క్రియేటివిటీ ఎలా వుంటుందో చెప్పడానికి ఇది నిదర్శనం కాదా? 

          2017 లో పెళ్లి ఏర్పాటుతో ప్రారంభించారు. హీరోయిన్ వచ్చి ఈ పెళ్లి  ఇష్టం లేదని చెప్పి వెళ్లి పోవడం అనే ముడి వేశారు గాథకి. ఎందుకిష్టం లేదనే ప్రశ్నకి సమాధానం చివరి వరకూ చెప్పకుండా ఆపారు. అంటే ఎండ్ సస్పన్స్ అయింది. దీంతో గాథ మిడిల్ మటాష్ అయింది. మిడిల్ లేకుండా పోయింది. ఎలాగంటే, చివరి దృశ్యాల్లో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేవరకూ కాలక్షేపం చేసింది 1991, 2012 కాలాల మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతోనే. ఏదైనా మిడిల్ మిగిలిందంటే,  ఆపైన ఎండ్ కి దక్కిందంటే, 2017 లో బొటాబొటీ దృశ్యాల్లోనే. అసలు గాథ 2017 నాటి దృశ్యాలే అవుతాయి గానీ, 1991, 2012 లనాటి దృశ్యాలు కావు. ఫ్లాష్ బ్యాకులెప్పుడూ అసలు గాథ – లేదా  కథ కాబోవు. అవెప్పుడూ బిగినింగే, ఉపోద్ఘాతమే. స్క్రీన్ ప్లే రచనలో ఇవి ఎలిమెంటరీ పాఠాలు. ఇది కూడా తెలుసుకోక పోతే ఎలా?

          ఇక విషయపరంగా చిన్ననాటి ప్రేమ ‘కథ’ - తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్ల, పిల్లాడి మధ్య ఆ ప్రేమలు చాలా ‘ఫీల్’ తో ఆకట్టుకుంటాయని కాబోలు దర్శకుడి ఉద్దేశం. ఈ వయసు పిల్లలు ఈ సినిమా చూసి – స్కూల్లో పిల్లకి ఎలా లైనెయ్యాలో, ఎలా లవ్ చెప్పాలో - పిల్ల కూడా ఎలా తపించిపోవాలో – ఇంకో పిల్ల రోమియోగాడు  ఎలా అడ్డుతగలాలో సినిమా సాంతం గుర్తుచేస్తూ వేస్తూ  పోయిన దృశ్య ఖండికలు అపూర్వంగా, అనిర్వచనీయంగా, ‘నా  బూతూ - నో భవిష్యత్’ గా వున్నాయి. బాలవికాసానికి బలవర్ధక ఔషధం అనుకోవచ్చు.


సికిందర్