రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, ఏప్రిల్ 2019, గురువారం

805 : ఆధునిక స్క్రీన్ ప్లే సంగతులు


         స్క్రీన్ ప్లేల్లో మిడిల్ వన్, మిడిల్ టూలు ఒకే ఉష్ణోగ్రతతో వుండవు. మిడిల్ వన్ వేసవి ఎండ అయితే మిడిల్ టూ రోహిణీ కార్తె ప్రచండం. ఈ ఫీల్ చూపించకపోతే మొత్తం మిడిల్ అంతా చప్పగా వుంటుంది. ‘చిత్ర లహరి’లో ఇదే మర్చిపోయారు. చలికాలం తర్వాత ఎండా కాలం వస్తుంది, ఆ తర్వాత వర్షాకాలం. స్క్రీన్ ప్లేల్లో చలికాలం బిగినింగ్ అనుకుంటే, ఎండాకాలం మిడిల్. ఈ మిడిల్ ఎండాకాలంలో  మళ్ళీ మిడిల్ వన్ ఎండ ఒక ఉష్ణోగ్రతతో వుంటే, మిడిల్ టూ ప్రజ్వరిల్లిన ఉష్ణోగ్రతతో వడగాల్పులు వీచే రోహిణీ కార్తెగా వుంటుంది. ఇక ఎండ్ ఈ వేడినంతా చల్లబర్చే వర్షాకాలం. సినిమా చూసే ప్రేక్షకులకి అదొక జర్నీఅనుకుంటే, ఈ రుతువులు ఫీలయ్యేట్టు ఆ జర్నీని లేదా టూర్ ని రూపకల్పన చేసినప్పుడు ఆ అనుభవం వేరే వుంటుంది. ఈ రుతువులే కథనంలో మార్పులు. వీటివల్లే టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ఏర్పడుతుంది. దీనికి మూలం క్యారెక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం). క్యారెక్టర్ లేకుండా ఏదీ ఏర్పడదు. క్యారెక్టరే బ్రహ్మ. ఇదే కథని పుట్టిస్తుంది, పాలిస్తుంది. దీనికో గోల్ వుంటుంది. ఆ గోల్ తో కథని పాలించే (కథనం నడిపే) క్రమంలో అది లోనయ్యే ఒడిడుకులే క్యారెక్టర్ ఆర్క్ ని ఏర్పరుస్తాయి. దాంతో కథనంలో  టైం అండ్ టెన్షన్ గ్రాఫ్, దీంతో రుతువుల అనుభవం.  

          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మొదలయ్యే మిడిల్ వన్ ఎలాగైతే ఇంటర్వెల్ కి దారి తీసే కథనంతో వుంటుందో, అలా ఇంటర్వెల్ నుంచి మొదలయ్యే మిడిల్ టూ, ప్లాట్ పాయింట్ టూకి దారి తీసే కథనంతో వుంటుందని తెలిసిందే. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రధాన పాత్ర సమస్యలో పడితే, ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఆ సమస్యలోంచి బయటపడుతుందన్న మాట. ఇది అన్ని స్క్రీన్ ప్లేలకి వాడుతున్న సాంప్రదాయ పధ్ధతి. ‘బేబీ డ్రైవర్’ లో ఇది తిరగబడిందని గత రెండు వ్యాసాల్లో గమనించాం. ఇక్కడ బేబీకి ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్య పుట్టలేదు, తన బాస్ డాక్ ని పడ్డ బాకీ తీర్చే సమస్యని పూర్తి చేసుకుని స్వేచ్ఛా జీవి అయిపోయాడు. డెబొరాతో జీవితాన్ని వూహించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా ప్లాట్ పాయింట్ వన్ నుంచి వుండే ప్రత్యర్ధితో ఏర్పడే సమస్యా, దాన్ని సాధించే గోల్ కోసం మిడిల్ విభాగపు సంఘర్షణా అనే సాంప్రదాయ రొటీన్ కథనాన్ని బ్రేక్ చేసినట్టయ్యిందని చెప్పుకున్నాం. అంటే ఎక్కడో సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ దగ్గర పరిష్కారమవ్వాల్సిన సమస్యా, పూర్తవ్వాల్సిన గోల్,  ఫస్టాఫ్ లోనే ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే పూర్తయి పోయాయన్న మాట. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్య పుడితేనే కథ పుడుతుంది, సమస్య తీరిపోతే ఇక మిడిల్ లో కథేముంటుంది? మిడిల్ ఎలా కొనసాగుతుంది? 

        ఇదికూడా గత వ్యాసంలో గమనించాం. మిడిల్ వన్ లో బేబీ,  ఫ్రీ బర్డ్ లా డెబొరాతో ఎంజాయ్ చేస్తున్నపుడు చూసిన డాక్ ని దుర్బుద్ధి పుట్టడం. డెబొరాని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి తిరిగి దోపిడీ జాబ్స్ కి రమ్మని బేబీని బెదిరించడం. ఇలా ఫ్రెష్ గా కథ పుట్టింది. ఎప్పుడూ ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే సమస్యా దాంతో కథా పుట్టాలని స్ట్రక్చర్ నేర్పింది. ఇలాగే సినిమాలూ వస్తున్నాయి. స్ట్రక్చర్ తో క్రియేటివిటీకి పాల్పడితే ఆ కృత్రిమత్వం తొలగిపోతుంది. ఒకే పోతలో పోసినట్టు కథా నిర్మాణాలూ, దాంతో సినిమాలూ వుండవు. అలా డాక్ బ్లాక్ మెయిల్ కి లొంగిన బేబీ తిరిగి దోపిడీ జాబ్స్ మొదలెట్టాడు. 

          బీబీ డాక్ ఋణం తీర్చుకుని వెళ్ళిపోయాక, ఇది కావాలని మళ్ళీ డాక్ చేత కథని పుట్టించడం కాదా అన్పించవచ్చు. బేబీ డాక్ ఋణం తీర్చుకుని స్వేచ్ఛాజీవి అయ్యాడు సరే, మరి చట్టం బాకీ సంగతి? డాక్ కి పడ్డ బాకీ అతడికి దోపిడీలు చేసి పెట్టి తీర్చేశాడు బాగానే వుంది, మరి  దోపిడీల ఫలితంగా చట్టం దృష్టిలో తను నేరస్థుడైన సంగతి? ఇది మర్చిపోయి స్వేచ్ఛాజీవి ఎలా అయిపోతాడు? ముందు చేసిన నేరాలకి పరిహారం చెల్లించుకున్నాకే, చట్టం బాకీ తీర్చుకున్నాకే స్వేచ్ఛాజీవి అయి డెబొరాతో ఎంజాయ్ చేయగలడు. గత వ్యాసంలో ఇదంతా విశ్లేషించుకున్నాం. కాబట్టి ఇప్పుడు పుట్టిన కథ కథకోసం కావాలని పుట్టించిన కథ కాదు. చట్టం బాకీ అనే బ్యాలెన్సున్న పాయింటుతో, డాక్ నే ఉపయోగించి కొనసాగించిన కథ. బిగినింగ్ విభాగంలో బేబీ ఎప్పుడైతే నేరాలు చేశాడో, అప్పుడే మిడిల్ లో పుట్టాల్సిన కథ పుట్టి నిగూఢంగా వుండి పోయింది, అదిప్పుడు బయటపడింది. 

      ఇలా డాక్ తో సంఘర్షణ పుట్టి, డెబొరాని కాపాడుకునే గోల్ కూడా ఏర్పడింది బేబీకి. ఇలా కథా లక్షణాలు వాటికవే మొలకెత్తాయి. అయితే ఇప్పుడు ఇలా డాక్ తో కథ పుట్టినప్పుడు ఇతను ప్రత్యర్ధికాదు. కాబట్టి బేబీ ఇతడితో అమీతుమీ తేల్చుకునే కథనం వుండదు. ఈ మిడిల్లో పుట్టింది చట్టం బాకీ కథ. కాబట్టి పోలీసులే ప్రత్యర్ధులుగా వుంటారు. ఇంటర్వెల్ కల్లా బేబీ వెళ్లి వెళ్లి పోలీసులతోనే డైరెక్టుగా  పెట్టుకున్నాడు. ఆయుధాల కోసం బుచర్ గ్యాంగ్ దగ్గరి కెళ్ళినప్పుడు,  ఆ బుచర్ గ్యాంగ్ పోలీసులే నని తెలీక వాళ్ళని చంపేసి ఇక చట్టం ఉచ్చులో దారుణంగా ఇరుక్కున్నాడు బేబీ. ఇక చట్టం బాకీ తీర్చుకోక తప్పించుకోలేడు. ఇదీ ఇంటర్వెల్ వరకూ నడిచిన మిడిల్ వన్ కథనం, దాని తాలూకు వేసవి ఉష్ణోగ్రత. ఇక మిడిల్ టూ కథనంలో రోహిణీ కార్తె ఎలావుందో చూద్దాం...

          మిడిల్ టూ కథనం : రోహిణీ ఎండకి రోళ్ళు పగులుతాయట, రోళ్ళలో పాయసం ఉడుకుతుందట. బేబీగాడు ఎలా ఉడుకుతున్నాడో చూద్దాం. ఇంటర్వెల్లో వీడు పోలీసులుగా బయటపడ్డ బుచర్ గ్యాంగ్ ని చంపేసి కారులో పారిపోయాడు బ్యాట్స్, బడ్డీ, డార్లింగ్ లతో కలిసి. అలా పారిపోతున్నప్పుడు ఒక రెస్టారెంట్ ని చూసి ఏదైనా తిందాం కారాపమంటాడు బ్యాట్స్. బేబీ విన్పించుకోడు. రెస్టారెంట్ లో డెబొరా ముందుకు వీళ్ళని తీసికెళ్ళడం ఇష్టం లేదు. ఈ రెస్టారెంట్ బావుండదంటాడు. బ్యాట్స్ నసపెడుతూంటే భరించలేక ఆపుతాడు. రెస్టారెంట్ లో డెబొరాని చూసి ఆమె తెలియనట్టే వుంటాడు బేబీ. ఈ గ్యాంగ్ తో బీబీని చూసిన డెబొరా కూడా జాగ్రత్త పడుతుంది. కానీ వీళ్ళిద్దరూ లవర్స్ అని పసి గట్టేస్తారు గ్యాంగ్ ముగ్గురూ. న్యూసెన్స్ చేయవద్దని బ్యాట్స్ ని వారిస్తాడు బడ్డీ. బేబీ వీళ్ళతో ఇబ్బందికరంగా గడిపి వెళ్ళిపోతూ బిల్లు తనే పే చేస్తూ, ఒక నోట్ అందిస్తాడు డెబొరాకి. అందులో రాత్రి రెండు గంటలకి లాంగ్ డ్రైవ్ వెళ్దామని వుంటుంది. 

   నల్గురూ డాక్ దగ్గరికి తిరిగొస్తారు. అప్సెట్ అయిందంటాడు బ్యాట్స్. బుచర్ గ్యాంగ్ దగ్గర ఆయుధాలు తీసుకోమని డాక్ పంపిస్తే తాము వెళ్లారు. ఆ బుచర్ గ్యాంగ్ పోలీసులని తెలియడంతో చంపి రాక తప్పలేదు...బ్యాట్స్ అంటూంటే, డాక్ సీరియస్ అవుతాడు. వాళ్ళు పోలీస్ డిపార్ట్ మెంట్లో తన మనుషులేననీ, వాళ్లకి మామూళ్ళు ఇస్తున్నాననీ, వాళ్ళని చంపడమేమిటని నిలదీస్తాడు. ఈ సంగతి ముందే చెప్పొచ్చుకదా అంటాడు బ్యాట్స్. 

          డాక్ దగ్గర్నుంచి వచ్చేసి, డెబొరాకి కాల్ చేస్తాడు బేబీ. రెస్పాన్స్ రాదు. అసహనంగా గడుపుతాడు. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో ఒక దృశ్యం అతడికి మెదుల్తుంది. ఆ బ్లాక్ అండ్ వైట్ దృశ్యంలో బేబీ, డెబొరాలు పురాతనంగా వుంటారు. ఏంతో పాత సన్నివేశం లాగా వుంటుంది. ఓ కారు వుంటుంది. లాంగ్ డ్రైవ్ కి ఆమెనాహ్వానిస్తూంటాడు. కట్ అవుతుంది. తేరుకుని డెబొరాదగ్గరికి బయల్దేరబోతాడు. ఫాలో అవుతున్న బడ్డీ ఆపేస్తాడు. బ్యాట్స్ కూడా వచ్చేస్తాడు. బేబీ ఇయర్ ఫోన్స్ లాగేస్తారు, ఐ - ఫోన్ తీసేసుకుంటారు. తీసికెళ్ళి డాక్ ఎదుట హాజరుపరుస్తారు. 

          డాక్ ఎదుట టేబుల్ మీద చాలా టేప్స్ పడుంటాయి. అవి డాక్ తో మీటింగ్స్ ని బేబీ రహస్యంగా రికార్డు చేసిన టేప్స్. బేబీ ఫ్లాట్ ని సోదాచేస్తున్నప్పుడు బ్యాట్స్, బడ్డీలకి దొరికాయి. అవి సరదాకి మ్యూజిక్ మిక్స్ చేసి ఎంజాయ్ చేస్తున్నానంటాడు బేబీ. వీడు పోలీస్ ఏజెంటని ఆరోపిస్తాడు బ్యాట్స్. పోలీస్ ఏజెంటైతే తమ  సంభాషణలు రికార్డ్ చేసిన టేప్స్ ని మ్యూజిక్ మిక్స్ చేసి చెడగొట్టడని అంటాడు డాక్. బేబీ మీద అనుమానాలు తొలగిపోతాయి. మరి రేపు పోస్టాఫీస్ జాబ్ ఓకేనా అని డాక్ అడిగితే, అది పూర్తి చేద్దామంటాడు బేబీ. 

      మార్నింగ్ పోస్టాఫీసు దోపిడీ కెళ్ళి డబ్బుతో పారిపోయి వస్తున్నప్పుడు బ్యాట్స్ గార్డుని చంపేస్తాడు. పోలీసులు వెంటబడతారు. బ్యాట్స్ కారెక్కేసి త్వరగా పోనిమ్మంటాడు.  బేబీ మొండి కేస్తాడు. రివాల్వర్ తో బెదిరించే సరికి కారుని పోనిస్తాడు బేబీ.  ఎదురుగా ఒక పికప్ వ్యాను ఆగి వుంటుంది. దాంట్లోంచి ఇనపరాడ్లు పొడుచుకుని వచ్చి కన్పిస్తూంటాయి. ఆ రాడ్లు బ్యాట్స్ ఛాతీలోకి దిగబడేలా పికప్ వ్యాన్ని గుద్దేస్తాడు బేబీ. రాడ్లు దిగబడి చచ్చిపోతాడు బ్యాట్స్. 

          పోలీసులు చుట్టుముట్టేస్తారు. డబ్బు తీసుకుని కారుదిగి పారిపోబోతారు బడ్డీ,  డార్లింగ్ లు.  బేబీ ఎప్పుడో జంపై పోతాడు. అతన్ని పోలీసులు ఛేజ్ చేస్తారు. ఇటు బడ్డీ,  డార్లింగ్ ల  మీద ఫైరింగ్ చేస్తారు. డార్లింగ్ చనిపోతుంది. దీంతో పోలీసుల మీద కాల్పులు జరుపుతూ విజృంభిస్తాడు బడ్డీ. 

          పోలీసుల్ని తప్పించుకుంటూ పరిగెడుతున్న బేబీ, షాపింగ్ మాల్ లో డ్రెస్ మార్చుకుని,  బయట కార్లూ మార్చేస్తూ ఎస్కేప్ అవుతూంటాడు. తన ఫ్లాట్ కి తిరిగొచ్చేస్తాడు. అక్కడ పెంపుడు తండ్రి జోసెఫ్ కింద పడి వుంటాడు. ఫ్లాట్ అంతా చిందర వందరై వుంటుంది. దాచుకున్న డబ్బు తీసి జోసెఫ్ కిచ్చేసి, ఎత్తుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించి, డెబొరా దగ్గరికి వెళ్ళిపోతాడు. 

       రెస్టారెంట్ లో డెబొరా ఎదురుగా రివాల్వర్ పెట్టుకుని కూర్చుని వుంటాడు బడ్డీ. అప్పుడు కారుని  వెంటనే పోనివ్వక డార్లింగ్ చావుకి బేబీ కారకుడయ్యాడని అతడి కసి. ఇంతలో ఒక పోలీసు అధికారి లోపలి కొస్తాడు టాయిలెట్స్ కెళ్ళడానికి. బడ్డీ రివాల్వర్ దాచేస్తాడు. ఒక వెయిటర్ ఇటుగా రావడంతో అటు తిరిగి చూస్తాడు బడ్డీ. దీంతో తన రివాల్వర్ తీసి బడ్డీని కాల్చేసి డెబొరాతో పారిపోతాడు బేబీ. టాయిలెట్స్ లోంచి వచ్చి కిందపడ్డ బడ్డీని చూస్తాడు పోలీసు అధికారి. బతికున్న బడ్డీ అతణ్ణి కాల్చేస్తాడు. 

          దొరికిన ఒక డబ్బు బ్యాగుతో, డెబొరాని తీసుకుని డాక్ దగ్గరి కొస్తాడు బేబీ. ఈ డబ్బు వరకూ కాపాడానని బ్యాగు అందిస్తాడు. ఇప్పుడెక్కడికి పోతావ్ ఇంత జరిగాక, పైగా పోలీసుల్ని చంపిన వాళ్ళాల్లో నువ్వొకడివి – అని డాక్ హెచ్చరిస్తాడు. ఇంతలో బుచర్ అనుచరులు  వచ్చేసి డాక్ మీద దాడి  చేస్తారు. రెండు బుల్లెట్లు తగిలినన డాక్ తేరుకుని,  వాళ్ళని షూట్ చేసి చంపేస్తాడు. బడ్డీ వూడిపడి  డాక్ ని కాల్చేస్తాడు (ప్లాట్ పాయింట్ -2)
***
       పై మిడిల్ టూ కథనం 34 సీన్లతో, 33 నిమిషాల నిడివుంది. మిడిల్ వన్ కథనాన్ని బేబీని తిరిగి ట్రాప్ చేస్తూ డాక్ ప్రారంభించడంగా వుంటే, ఈ మిడిల్ టూ కథనం బేబీకి విముక్తి కల్గిస్తూ డాక్ మరణంతో ముగింపుగా వుంది. ఇక బేబీకి పోలీసులతో, బడ్డీతో సమస్య మిగిలే వుంది. ఈ మధ్యలో అంతా అతను డెబొరాకిచ్చిన మాట ప్రకారం లాంగ్ డ్రైవ్ వెళ్లేందుకు చేసిన విఫల యత్నాలున్నాయి. 

          మిడిల్ వన్ డెబొరాతో బేబీ రోమాన్సుగా ప్రారంభమై, డాక్ బెదిరింపుతో బేబీ తిరిగి గ్యాంగ్ లో చేరిన సంఘర్షణాత్మక వాతావరణంతో వేడిని పుట్టిస్తూ సాగింది. ఆ వేడి ఇంటర్వెల్లో పోలీసులైన బుచర్ గ్యాంగ్ ని చంపడంతో పెచ్చరిల్లిపోయింది. ఇప్పుడు మిడిల్ టూలో పోస్టాఫీస్ జాబ్ లో గార్డుని చంపడంతో పోలీసులతో ముఖాముఖీ ఘర్షణ ప్రా రంభమైపోయింది. మరోవైపు బడ్డీ కక్ష గట్టాడు. వాడినుంచి డెబొరాని కాపాడుకొస్తే డాక్ కూడా చనిపోవడంతో - ఇప్పుడు బేబీ ఒంటరిగా మిగిలాడు- బడ్డీనీ పోలీసుల్నీ ఎదుర్కోవడానికి. ఇలా ఉష్ణోగ్రత తారాస్థాయికి చేరింది.

          వీటన్నిటి మధ్యా అతడికి డెబొరాతో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్న కోరిక. దీని తాలూకు ఒక మాంటేజి బ్లాక్ అండ్ వైట్ లో ఫ్లాష్ బ్యాకుగా పడుతుంది. లాంగ్ డ్రైవ్ అన్నది అతడి ఇప్పటి కల. ఆ కల గతంలో తీరిపోయినట్టు ఫ్లాష్ బ్యాక్ ఎందుకొచ్చింది? ఇది ఫ్లాష్ బ్యాక్ కాదు, ఫ్లాష్ ఫార్వర్డ్. భవిష్యత్తులో ఇది తీరని కోరికగా మిగల వచ్చన్న సంకేతం. అసలు డెబొరా తో రిలేషన్ షిప్పే అసాధ్యమయ్యే సూచన. కేవలం ఈ ఒక్క మాంటేజితో రొమాంటిక్ యాంగిల్ పట్ల సందేశాలు రేకెత్తించాడు దర్శకుడు. 

        ఈ మొత్తం కథలో ఇంకో అందం ఏమిటంటే, ఎక్కడా విలన్ అనే వాడు లేకపోవడం. బేబీ పరిస్థితులే, అతడి చేతలే అతడి పాలిట విలన్స్ అయ్యాయి. చట్టం బాకీ కథ అయినప్పటికీ ప్రత్యర్ధిగా ఏ పోలీసు అధికారినీ దింప లేదు కథలోకి. బేబీని పట్టుకోవడానికి ప్రయత్నించే కొందరు పోలీసు సిబ్బందినే చూపించారు. ఈ సిబ్బందికూడా మారిపోతూంటారు. ఇలా హీరోకి / యాంటీ హీరోకి ఒక ఎదుటి పాత్ర లేకుండా ఈ యాక్షన్ కథని లాగించేశారు. హీరోకి / యాంటీ హీరోకి ఒక ప్రత్యర్ది పాత్ర వుండడం రొటీన్, మూస. దీన్ని బ్రేక్ చేసేసి – విధియే బేబీ పాలిట విలన్ గా అదృశ్యం చేసి చూపించడంతో ఫ్రెష్ గా కన్పిస్తుందీ యాక్షన్. 

          ఎండ్ కథనం : డాక్ ని చంపిన బడ్డీని నానా తంటాలు పడి చంపేస్తాడు బేబీ. చచ్చే ముందు పాయింట్ బ్లాంక్ గా బడ్డీ పేల్చిన బులెట్ కి బేబీ చెవులు దిబ్బడ వేస్తాయి. ఏమీ విన్పించదు. చిన్నప్పుడు పేరెంట్స్ కారు యాక్సిడెంట్ అప్పటి అనుభవమే. ఏమీ విన్పించదు. ఎలాగో తేరుకుని బడ్డీని చంపేస్తాడు. ఇప్పుడు అతడికి ఇయర్ ఫోన్స్ లో మ్యూజిక్ వినే అవస్థ తప్పుతుంది. చెవుల్లో వెంటాడే శూన్యం - నిశ్శబ్దం ఇక లేదు. 

       తెల్లవారుతుంది. డెబొరా కారు డ్రైవ్ చేస్తూంటుంది. పక్కన బేబీ వుంటాడు. పచ్చటి ప్రకృతిమధ్య లాంగ్ డ్రైవ్ వెళ్తూంటారు. టేప్ లో బేబీ మదర్ పాడిన పాట వస్తూంటుంది. దూరంగా పోలీసులుంటారు రోడ్డు బ్లాక్ చేసి.  ఇది చూసి డెబ్బీ కారాపెస్తుంది ఆందోళనగా.  ఎస్కేప్ అవ్వాలని కారు రివర్స్ చేయబోతుంది. బేబీ ఆమెకి సారీ చెప్పి పోలీసులకి లొంగిపోతాడు.
          బేబీ జైలుకి పోతాడు. కోర్టులో కేసు నడుస్తుంది. డెబొరా, జోసెఫ్, ఇంకొందరు సాక్ష్యం చెప్తారు. బేబీ మంచోడే, చెడు నిర్ణయాలు తీసుకుని దారి తప్పాడనీ, ఎవరికీ హని చేయలేదనీ చెప్తారు. బేబీకి పాతికేళ్ళు జైలు శిక్ష విధిస్తాడు జడ్జి. ఐదేళ్ళ తర్వాతే పెరోల్ అప్లయి చేసుకోవాలని తీర్పు చెప్తాడు. 

          బేబీ జైలు జీవితం గడుపుతూంటాడు. డెబొరా పోస్ట్ కార్డులు పంపుతూంటుంది. ఆ పోస్ట్ కార్డులు తామిద్దరూ వెళ్ళాలని ఆమె ప్లాన్ చేస్తున్న లొకేషన్స్. బేబీ కి మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ మాంటేజీతో అదే ఫ్లాష్ బ్యాక్ పడుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కలర్ లోకి మారుతుంది. బేబీ పెరోల్ మీద విడుదలై బయట వెయిట్ చేస్తున్న డెబొరాని కలుసుకుంటాడు. కిస్ చేస్తాడు...

***
        ఈ ఎండ్ కథనం, అంటే క్లయిమాక్స్ యాక్షన్, పోరాటాలూ లేకుండా ప్రశాంతంగా వుంటుంది. ఒక్క ప్రారంభంలో బడ్డీని చంపే యాక్షన్ తప్ప. పోలీసులతో యాక్షన్ వుండదు. మనోడికి పోలీసు ధ్యాసే వుండదు. తను నేరాలు చేశాడన్న ఫీలింగే వుండదు. ఎప్పుడు చూసినా అమాయకుడిలా ప్రశాంతంగా వుంటాడు. ప్లాట్ పాయింట్ వన్ లో కూడా డాక్ బాకీ తీరిపోయి డెబొరాతోతను ఫ్రీ బర్డ్ అయ్యాననుకున్నాడే తప్ప, చేసిన నేరాలకి చట్టపరంగా శిక్ష అనుభవించాలన్న స్పృహే లేదు. ఇప్పుడు కూడా బడ్డీ ని చంపితే సుఖాంతమయిందనునుకుని డెబొరాతో లాంగ్ డ్రైవ్ వెళ్లి పోయాడు. మిడిల్ టూ  అంతా తనని పట్టుకోవడానికి వెంటాడిన పోలీసుల విషయమే మర్చిపోయాడు. పాత్ర తత్వాన్ని బట్టే, ఫీలయ్యే దాన్ని బట్టే కథా కథానాలుంటాయి. అందుకని ఈ ఎండ్ విభాగంలో పోలీసులతో యాక్షన్ సీన్స్ లేవు. డెబొరాతో లాంగ్ డ్రైవ్ వెళ్తూ సింపుల్ గా పోలీసులకి దొరికిపోయాడు. ఎదురుతిరగకుండా లొంగిపోయాడు.

          ఇక ఇప్పుడు పెరోల్ మీద విడుదలవడం కూడా ఒకటో రెండో నేలలవరకే. ఆ తర్వాత మళ్ళీ జైలుకెళ్ళి శిక్షా కాలం పూర్తి చేయాల్సిందే. పాతికేళ్ళు జైలు శిక్ష అంటే ముసలోడు అయిపోవడమే. పచ్చని జీవితాన్ని నాశనం చేసుకోవడమంటే ఇదే. ఇందులో నీతీ, మెసేజ్ ఏదైనా వుంటే అది ఫీలవ్వచ్చు ప్రేక్షకులు.

***

      బేబీ డ్రైవర్’ థీమాటిక్ స్టడీస్ కి అర్హమైనదని తేల్చారు విమర్శకులు. ఇదే ఈ వ్యాసాల్లో గమనిస్తూ వచ్చాం. ఒక రొటీన్ ఫార్ములా యాక్షన్ కథని ఫార్ములాకి భిన్నంగా, ఎక్కడికక్కడ స్ట్రక్చర్ తో క్రియేటివిటీకి పాల్పడుతూ, ఎలా తీయవచ్చో ఈ స్క్రీన్ ప్లే నిరూపించింది. తెలుగు మేకర్స్ దీన్ని ఎంతవరకు అర్ధం జేసుకుని తమ పాత మూస పంథా మార్చుకుంటారో చూడాల్సి వుంది. మేకర్స్ మేకింగ్ చేయకుండా ప్యాకింగ్ కే అలవాటు పడి నంత కాలం ఇలాటి సినిమాలని ఎంత విశ్లేషించుకోవడమూ, ఇవెంత చదవడమూ వృధా.


                                   అమెరికా లోని నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ 2017 టాప్ మూవీస్ లో ఒకటిగా బేబీ డ్రైవర్ ని చేర్చింది. ఇంకా అనేక అవార్డులు రావడం ఒక ఎత్తైతే,  మూడు ఆస్కార్లకి నామినేట్ అవడం ఇంకొకెత్తు. ఎడిటింగ్, సౌండ్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో నామినేట్ అయింది. ఇందులో యాక్షన్ సీన్స్ కి  రీ- రికార్డింగ్ షూట్ చేశాక ఆ యాక్షన్స్ కనుగుణంగా చేయలేదు. బేబీ ఇయర్ ఫోన్స్ లో వినే రకరకాల సాంగ్స్ ని ముందు రికార్డింగ్ చేసి, వాటికనుగుణంగా యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశారు. సాంగ్స్ ని బట్టి డాన్స్ మూమెంట్స్ ఎలా చిత్రీకరిస్తారో, అలా బేబీ వినే సాంగ్స్ ని బట్టి యాక్షన్ మూవ్ మెంట్స్ చిత్రీకరించారు. ఇదీ బేబీ డ్రైవర్ టెక్నికల్ స్పెషాలిటీ. బేబీ డ్రైవర్ స్క్రీన్ ప్లే నిండా సాంగ్స్ తో సవివరమైన యాక్షన్ సీన్స్ వర్ణనే వుంటుంది. 

         ఇంతేకాదు, ఇది కథానాయకుడు బేబీ కథ కాబట్టి అతడి మానసిక ప్రపంచాన్ని ప్రతిబింబించే  నేపధ్య వాతావరణాన్ని ఆవిష్కరిస్తూ పోయారు. అతను లేత కుర్రాడు, ప్రపంచాన్ని లైట్ గా తీసుకుంటాడు, ఎప్పుడూ మ్యూజిక్ లో మునిగి వుంటాడు. అందుకని విజువల్స్ అలాటి  లైట్ కలర్స్ తోనే కూల్ గా వుంటాయి. ఈ లైట్ కలర్స్ విజువల్స్ లో ప్రధానంగా పింక్ కలర్ వుంటుంది. పింక్  రోమాంటిక్ కలర్. ఈ యాక్షన్ మూవీకి పోస్టర్స్ మీద కూడా పింక్ కలరే డామినేటింగ్ గా వుంటుంది. రోమాంటిక్ కథ నేపథ్యంగా నడుస్తున్న యాక్షన్ కథ ఇది! బీబీ మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా డార్క్ షేడ్స్ రానివ్వలేదు. మూవీ మొత్తం కలర్ఫుల్ గా నయనానందకరంగా వుంటుంది. ఇదీ ప్రధాన పాత్రని దాని తాలూకు కథతో ఎటాచ్ చేయడమంటే. పాత్ర మనసే కథాలోకం మనసవుతుంది. ఈ సృష్టి ఎలాగైతే ఆ దేవుడి మనసైందో, అలాగే ఈ కథాలోకం బేబీగాడి మనసు. వాడు ఏ మనసుతో చూస్తున్నాడో అలాగే మనకు అన్నీ కన్పిస్తున్నాయి.         

              కాస్ట్యూమ్స్ కూడా కూల్ గా వుంటాయి. ఇతర పాత్రల కాస్ట్యూమ్స్ కూడా వాటి మనస్తత్వాల్ని బట్టే వుంటాయి – ఆ రకమైన కలర్స్ తో, స్టయిల్స్ తో. ‘బేబీ డ్రైవర్’ అనేది  ఏ దో రాశాం తీశాం చూస్కోండి మీ ఖర్మ టైపు తెలుగు మార్కు ప్యాకింగ్ కాదు. ఏం రాశావ్, ఏ పర్సెప్షన్ తో ఎందుకు రాశావ్; ఏం తీశావ్, ఏ కళాత్మకతతో ఎందుకు తీశావ్ ముందు చెప్పు – అని దబాయించే న్యూజనరేషన్ మేకింగ్.

సికిందర్