రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, సెప్టెంబర్ 2020, ఆదివారం

981 : సందేహాలు - సమాధానాలు


 

Q : నమస్తే, తెలుగులో నాయకుడు లాంటి గ్యాంగ్ స్టర్ మూవీస్ ఇప్పుడు వర్కౌట్ అవుతాయా? గ్యాంగ్ స్టర్ స్టోరీస్ రాసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పగలరు.
జయసింహా, రైటర్
A : తమిళంలో కమలహాసన్ తో మణిరత్నం 1987 లో తీసిన నాయకన్ (నాయకుడు) ముంబాయి డాన్ వరదరాజన్ ముదలియార్ జీవిత కథ. వరదరాజన్ 1960-80 ల మధ్య డాన్ గా ఏలాడు. అదే కాలంలో హాజీ మస్తాన్ డాన్ గా వున్నాడు. హాజీ మస్తాన్ కథతో అమితాబ్ బచ్చన్ తో 1975 లో దీవార్ తీశారు, దీవార్’, నాయకన్ ఈ రెండూ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. వరదరాజన్ కథతో నాయకన్ తర్వాత ఇంకెన్నో హిందీ తమిళం మలయాళం సినిమాలు తీశారు. ఏవీ నిలబడలేదు. హాజీ మస్తాన్ తర్వాత ముంబాయిలో దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ ల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సత్య’, కంపెనీ లు తీసినప్పుడు హిట్టయ్యాయి. ఇక హాలీవుడ్ గాడ్ ఫాదర్ ననుసరించి ఇంకెన్నో ఫిక్షన్ డాన్ల సినిమాలొచ్చాయి. ఇవన్నీ గ్యాంగ్ స్టర్ జానర్ కిందికే వస్తాయి. అలాగే 1970 ల నాటి విజయవాడ గ్యాంగ్ స్టర్స్ రంగా, రాధాల ఆధారంగా వర్మ తీస్తే అవి కూడా సంచలనం సృష్టించాయి. చెప్పొచ్చేదేమిటంటే, పేరుండి వార్తల కెక్కిన నిజ డాన్లు, గ్యాంగ్ స్టర్లు, లేదా వీరప్పన్ లాంటి బందిపోట్లతో తీసే సినిమాలకి మంచి మార్కెట్ యాస్పెక్ట్ వుంటోంది. 


        విజయవాడ సీన్ ని ఇటు హైదారాబాద్ వైపు చూస్తే 1970 లలో జార్జి రెడ్డి (విద్యార్థి నాయకుడు)
, 2000 లలో నయీమ్ (గ్యాంగ్ స్టర్) వున్నారు. జార్జి రెడ్డితో ఈ మధ్య తీసిన జార్జిరెడ్డి ఆడలేదు. ఇక నయీమ్ మీద తీయలేదు. మార్కెట్ యాస్పెక్ట్ వున్నప్పటికీ జార్జి రెడ్డి ఆడకపోవడానికి తీసిన విధానం, అంటే జానర్ మర్యాదలతో క్రియేటివ్ యాస్పెక్ట్ బాగా లేకపోవడం కారణం. 


        ఇప్పుడు డాన్లు. గ్యాంగ్ స్టర్లు ముంబాయిలోనే లేరు. కాబట్టి ఆ జానర్ సినిమాలు హిందీలో తీయడం లేదు. నిజ డాన్లు
, గ్యాంగ్ స్టర్లు కాకుండా ఫిక్షన్ చేసి తీస్తే ఆడినవి కూడా ముంబాయిలో డాన్ల, గ్యాంగ్ స్టర్ల ప్రభావమున్న కాలంలోనే. 1978 లో అమితాబ్ తో తీసిన హిట్ డాన్ ఫిక్షన్. మరి 1989 లో డాన్లు ఏపీ లోనే లేనప్పుడు, శివ అనే ఫిక్షన్ డాన్ హిట్టయ్యింది కదా అంటే, దానికి విజయవాడ కాలేజీ రాజకీయాల, రౌడీయిజాల నిజ వ్యక్తులతో నిజ నేపథ్యముంది. ఆ తర్వాత కాలేజీ ఎన్నికల్లేవు, రౌడీ రాజకీయాల్లేవు. కేవలం ఎన్టీఆర్ కాలంలో మద్య నిషేధమనే నిజ నేపథ్యంతో, ఫిక్షన్ క్యారక్టర్ తో శర్వానంద్ తో 2019 లో రణరంగం తీస్తే ఆడలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు గ్యాంగ్ స్టర్ సినిమాలు తీయడమన్నది జూదమనుకోవాలి.

        ఇందుకు బదులుగా ఇటీవలి కన్నడ
ఫ్రెంచి బిర్యానీ లాంటి కామెడీ ప్రధానమైన ఫిక్షన్ డాన్ తీస్తే వర్కౌట్ అవచ్చు. ఒకసారి  ఫ్రెంచి బిర్యానీ చూడండి. దాని ఇన్నోవేట్ చేసిన మార్కెట్ యాస్పెక్ట్ పరిశీలించండి. ఈ లింక్ క్లిక్ చేసి రివ్యూ చూడండి.

        సీరియస్ గ్యాంగ్ స్టర్ కథలు హీరోల మీద వుంటేనే ఆడాయి. ఎందుకంటే హీరోల్లో మంచి గుణాలు చూపించే వీలవుతుంది. వరదరాజన్
, హాజీ మస్తాన్లలో ప్రజల్లో మమేకం చేసే మంచి గుణాలు కూడా వున్నాయి. కనుక ఫిక్షన్ కథగా తీయాలనుకున్నప్పుడు హీరో పాత్ర ఈ తీరులో వుండాల్సి వుంటుంది. మిగతా స్ట్రక్చర్  అంతా మూడంకాల త్రీయాక్ట్ స్ట్రక్చరే. త్రీ యాక్ట్ స్ట్రక్చర్ గురించి ఈ బ్లాగులోనే చాలా ఆర్టికల్స్ వున్నాయి. మీరు చాలా కాలంగా బ్లాగుని ఫాలో అవుతున్నారు కాబట్టి అన్ని జానర్లకూ ఒకే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వుంటుందని తెలిసే వుంటుంది. కాకపోతే గ్యాంగ్ స్టర్ జానర్ మర్యాదలు తెలుసుకుని ఈ స్ట్రక్చర్ లో కూర్చాలి. జానర్ జానర్ కీ జనర్ మర్యాదలు వేర్వేరుగా వుంటాయి. ఇది క్రియేటివ్ యాస్పెక్ట్ లో చూసుకోవాల్సిన విషయం.

        ఇంకా క్రియేటివ్ యాస్పెక్ట్ లో
, సంపన్నంగా ఎదగాలన్న బలమైన కోరిక గ్యాంగ్ స్టర్స్ ని నేరాల వైపు తీసికెళ్ళడమన్నదే కాన్సెప్ట్ గా వుంటుంది. అంటే ఎకనమిక్స్ ప్రధానంగా ఈ కథలుంటాయి. రెండోది, ప్రత్యర్ధి గ్యాంగ్ స్టర్ తో ఘర్షణ చుట్టూ వుంటాయి. సంపన్నంగా ఎదగడానికి చేసే నేరాలు ఆత్మవినాశానికి దారి తీసేవిగా వుంటాయి. చట్టానికీ నీతికీ వ్యతిరేకంగా పాత్ర చిత్రణలుంటాయి. ఈ చట్టానికీ నీతికీ ఎలా దొరికిపోతాడన్న ప్రశ్న రేకెత్తిస్తూ వుంటాయి. సంపన్నంగా ఎదగడానికి అడ్డమైన మార్గాలు ఎందుకు ఎంచుకుంటాడు? ఎందుకంటే, సన్మార్గంలో పొందే అర్హతలు గానీ, అవకాశాలు గానీ లేకపోవడం వల్ల. ఇలా జానర్ మర్యాదలు చాలా వుంటాయి. సీరియస్ గ్యాంగ్ స్టర్ మూవీయే చేయాలనుకుంటే జానర్ రీసెర్చి బాగా చేసుకోవాల్సి వుంటుంది.

Q : కథలు విన్పించడానికి వచ్చే కొత్త వాళ్ళకి మ్యానర్స్ గురించి మీరు రాయండి, తెలుసుకుని మారతారు. డిస్కస్ చేస్తున్నప్పుడు మధ్యలో వాడి సెల్ మోగుతుంది. నాకు మండిపోతుంది.
నిర్మాత
       
మీరే మొట్టి కాయేస్తే సరి. ఇలాటివి ఏం రాస్తాం. ఇంటి దగ్గర్నుంచి కూడా కాల్స్ వస్తాయి. ఎప్పుడొస్తారనో; మీ తమ్ముడొచ్చాడు, వచ్చేటప్పుడు చికెన్ తెమ్మనో అవతలి నుంచి తియ్యటి గొంతు. కామన్ సెన్స్ వుండదు. నిర్మాత తనకి కేటాయించిన టైముని నిర్మాతకే పరిమితం చేయాలి. ఇంకే విషయాలు మనసులోకి రానీయకూడదు. సెల్ ఫోన్ ఆఫ్ చేసేయాలి. నిర్మాత దగ్గరే కాదు, ఇంకే రంగంలో అప్పాయింట్ మెంట్ కెళ్లినా ఇదే చేయాలి. ఇక ఆఫీసుల్లో స్టోరీ వర్క్ చేస్తున్నప్పుడు కూడా సెల్ ఆఫ్ చేసేయాలి. బ్రేక్ తీసుకున్నప్పుడే అవతలి కెళ్ళి మాట్లాడుకోవాలి. స్టోరీ వర్క్ జరుగుతున్నప్పుడు రైటర్ మానసిక లోకమెలా వుంటుందంటే,  బ్రేక్ తీసుకున్నా స్టోరీ గురించే ఆలోచిస్తూంటాడు. టీ సిగరెట్లు, ఇతర్లతో కబుర్లు యాంత్రికంగా జరిగిపోతాయి. నిజమైన క్రియేటివ్ మైండ్ కి వెకేషన్ వెళ్ళినా బ్రేక్ వుండదు. రాయడం గురించే ఆలోచనలుంటాయి. రైటర్ కి భౌతికంగా బ్రేక్ వుండొచ్చు నేమో గానీ, మానసికంగా వుండదు. నిర్మాత ఇచ్చిన టైము మీద గౌరవంతో వుండాలి. సెల్ మర్యాద పాటించాలి.  

సికిందర్