రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, ఆగస్టు 2019, శుక్రవారం

857 : సందేహాలు - సమాధానాలు


Q:  నేను మీకే కథ విన్పించాలనుకున్నాను. అయితే ఇప్పటికే ఇద్దరు ముగ్గురికి వినిపిస్తే భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఆలోచనలో పడ్డాను. నా పాయింటు ఏమిటంటే, సిద్ధంగా వున్న కథమీద తలా ఒక రకంగా మాట్లాడతారు. ఎప్పుడూ కథ రాయని వాళ్ళ జడ్జిమెంట్ ని తీసుకోవచ్చా?
టివిపి, సహకార దర్శకుడు  
A:  కథలు ఎంతమందికి విన్పించి తీసినా అవే తొంభై శాతం ఫ్లాపులు వస్తాయి. యాక్టివ్- పాసివ్ క్యారక్టర్లు, కథ-గాథ తేడాలు, ఎండ్ సస్పెన్సులు,  మిడిల్ మటాషులు, సెకండాఫ్ సిండ్రోములు మొదలైన సినిమా కథల చుట్టూ పొంచి వుండే సవాలక్ష మొసళ్ళ జాతి తెలియకుండా కథలు రాసేవాళ్ళు రాయడం, వినే వాళ్ళు వినడం. ఇది మారదు. ఇక మార్కెట్ యాస్పెక్ట్ నాలెడ్జి సరే.

          నాలెడ్జి వున్న వాడు విన్నాడే అనుకుందాం, వాడు చెప్పిందానికి తలూపి, అవతలికెళ్ళి శుభ్రంగా కడిగేసుకుని రాసుకున్నదే భేషుగ్గా తీసుకోవడం. కథలు చెప్పే వాళ్ళ సైకాలజీ చాలా వరకూ ఎలా వుంటుందంటే, తమ కథని ఇతరులు మెచ్చుకోవాలని ముందే ఫిక్స్ అయిపోయి వుంటారు. నా కథని నల్గురు మెచ్చుకున్నారోచ్, నా కథని ఐదుగురు మెచ్చుకున్నారోచ్ అని సంతోష పడేందుకే విన్పిస్తారు. సంతోషం సూచీ ఎంత పెరిగితే అంత ఆత్మసంతృప్తి.

          కాబట్టి పై రెండు వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుని జల్లెడ పట్టుకోండి. జడ్జిమెంటు మీరే తీసుకోండి. సినిమా రాసుకుని తీసుకునేది మీరే కాబట్టి మధ్యంతర జడ్జి మెంటు మీదే అవుతుంది. అంతిమ తీర్పు ఎలాగూ స్టార్లు లేదా హీరోలు చెప్తారు. అక్కడే మీ భవిష్యత్తు వుంటుంది.

Q: మీరేమనుకోకుంటే ఒక ప్రశ్న. సినిమా రివ్యూలు రాయాలంటే అర్హతలేం వుండాలంటారు? రివ్యూ రైటర్ల మీద ఎందుకంత వ్యతిరేకత వుంటుందంటారు?
ఒక దర్శకుడు

A:  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ రైటింగ్ ని గుర్తించి అవార్డులతో సత్కరిస్తున్నాయి సినిమా కళా కారులతో బాటు. ఎందుకు వీళ్ళని గుర్తించకుండా వ్యతిరేకిస్తారో మనకి తెలీదు. మనం అవార్డుల జోలికి పోలేదనుకోండి. సకల దోషాలతో తొంబై శాతం సినిమాలు ఫ్లాప్స్ - అట్టర్ ఫ్లాప్స్ అవుతున్నప్పుడు ఇంకా రివ్యూ రైటర్ల అర్హతలు, ప్రమాణాలు చర్చనీయాంశాలవుతాయా? ఫేస్బుక్ లో ట్విట్టర్ లో  ప్రేక్షకులే రివ్యూలు రాసేస్తున్నప్పుడు వృత్తి రివ్యూ రైటర్ల రివ్యూలకి విలువేముంది?  రివ్యూలు రాసుకునే ప్రేక్షకులు ఇంకొకరి రివ్యూలు చదువుతారా? అందుకని ఇంకా రివ్యూ రైటర్లని అనడం మాని, ఫ్లాపుల శాతం తగ్గించడానికి ఇప్పటికైనా ఏం చేయాలో దాని మీద దృష్టి పెడితే మంచిది.
సికిందర్