రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, నవంబర్ 2016, శనివారం

      యూత్ కి వీణ కావాలా, గిటార్ కావాలా....తెలుసుకోలేకపోతున్న యంగ్ బ్రిగేడ్ డైరెక్టర్స్/రైటర్స్ బ్యాచి ఓ నాల్గేళ్ళుగా ఒకటే మాట - రోమాంటిక్ కామెడీ! ఏ కొత్త దర్శకుణ్ణి  కదిపినా  -రోమాంటిక్ కామెడీ! ‘రోమ్ కామ్’  తీస్తున్నామనో  రాస్తున్నామనో   ఫ్యాషనబుల్ గా,  స్టైల్ గా అనడం!  లవ్ స్టోరీ అనడం పాత మాట- రోమాంటిక్ కామెడీ తాజా మాట! విడుదలయ్యే ప్రేమ సినిమాలు రోమాంటిక్ కామెడీలని చెప్పుకునే విడుదల చేస్తున్నారు (విడుదల కానివి రెట్టింపుకంటే రెట్టింపు వుంటాయి). ఏడాదికి ఓ పాతిక రోమాంటిక్ కామెడీల పేరుతో విడుదలైతే, ఒకటో రెండో నిజమైన రోమాంటిక్ కామెడీ లన్పించుకుని హిట్టవవుతున్నాయని తెలుసుకుంటూనే వుంటారు. ఎవరి కోసం రోమాంటిక్ కామెడీలంటూ తీస్తున్నారో ఆ ప్రేక్షకులే వీటిని తిప్పి కొడుతున్నారనీ తెలుసు. పేరున్న హీరో వుంటే తప్ప ఈ ‘రోమాంటిక్ కామెడీ’ లవైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదనీ తెలుసు. అయినా తమదేదో డిఫరెంట్ అనుకుని తీసేస్తున్నారు. ఎదుటి వాడు బాగా తీయలేదు, మేం బాగా తీస్తున్నామనుకుంటూ తీసేస్తున్నారు. అసలు ఎదుటి వాడు తీసింది ఏమిటో తెలుసుకోకుండా, ఎదుటివాడి లాంటిదే బాగా తీస్తున్నామని నమ్మేసి తామూ తీసేస్తున్నారు. ఎదుటి వాడు తీసింది ఏకోశానా రోమాంటిక్ కామెడీయే అన్పించుకోకపోయినా, అదే మాయలో పడిపోయి పోటీ ‘రోమాంటిక్ కామెడీలు’ సృష్టించేస్తున్నారు. ఆ ఎదుటి వాడిలాగే అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు, ఈ వేలంవెర్రిలో బాగా దెబ్బ తినేస్తున్నారు...


          రోమాంటిక్ కామెడీకీ, రోమాంటిక్ డ్రామాకీ తేడా తెలుసుకోకపోవడం వల్లే వచ్చిన పరిస్థితి ఇది. రోమాంటిక్ డ్రామాల సీజన్ కొన్నేళ్ళ క్రితమే అంతరించింది. 2000 ప్రారంభంలో చిత్రం, నువ్వే కావాలి లాంటి యూత్ సినిమాలతో ప్రారంభమైన ట్రెండ్ ఐదారేళ్ళు కొనసాగింది. వందల సంఖ్యలో తీశారు. వాటిలో రోమాంటిక్ కామెడీలు అతి తక్కువ,  రోమాంటిక్ డ్రామాలే ఎక్కువ. హీరో హీరోయిన్లు మొదట అల్లరల్లరి చేసుకుని నవ్వించడం,  తర్వాత ప్రేమలో తేడా వచ్చి విడిపోవడం, అక్కడ్నించీ సెంటి మెంట్లూ ఎమోషన్లూ కొన్ని ఏడ్పులూ ప్రదర్శించుకుని మళ్ళీ కలుసుకుని, ఓ ‘ఫీల్’ తో ముగించడం లాంటి రోమాంటిక్ డ్రామాలే రాజ్యమేలాయి. వీటిని లైటర్ వీన్ లవ్ స్టోరీస్ అని కూడా పేరు పెట్టారు కొత్త ఫ్యాషన్ గా- ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్ గా రోమాంటిక్ కామెడీ లంటున్నట్టు. టీనేజీ హీరో హీరోయిన్లు స్వల్ప కారణానికే విడిపోయి, కలుసుకుంటారు కాబట్టి, ఇవి లైటర్ వీన్ లవ్ స్టోరీలయ్యాయి. వీటిలో స్క్రీన్ ప్లేనే అనేదే వుండేది కాదు. కథ ఎక్కడో క్లయిమాక్స్ దగ్గర ప్రారంభమయ్యేది. ఆ సెంటిమెంట్లూ ఎమోషన్లూ ఫీల్ వగైరా వగైరా ఆ చివర పావుగంట సేపే. దీనికి ముందు గంటన్నర సేపూ  కథలేని ఉత్త కామెడీలే. ఇవి బోరుకొట్టి మూతబడ్డాయి. ఇవన్నీ కొత్త హీరో హీరోయిన్లతో వచ్చి వెళ్ళిపోయిన రోమాంటిక్ డ్రామాలు. 

        ఎప్పుడైతే ప్రేమ కథలో హీరో హీరోయిన్లు విడిపోతారో అది రోమాంటిక్ డ్రామా! 
        ఎప్పుడైతే  ప్రేమ కథలో ఫీల్ కోసం ప్రయత్నిస్తారో అది రోమాంటిక్ డ్రామా!
        ఎప్పుడైతే ప్రేమ కథలో పెద్దల  పాత్రలు జోక్యం చేసుకుంటాయో అది రోమాంటిక్ డ్రామా!

        2000 సంవత్సరం నుంచీ ‘కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసమే సినిమా’  లాగా  మారిపోయిన నిర్వచనానికి ఇవి న్యాయం చేయలేదు. దాంతో అత్యధిక సంఖ్యలో ఫ్లాపయ్యాయి.
        యూత్ సినిమాల పేరుతో  చిన్నాచితకా కొత్త హీరోల రోమాంటిక్ డ్రామాలు (అనేక బూతు కామెడీలు కూడా) వెల్లువెత్తుతున్న కాలంలోనే అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్ హీరోలు రావడం మొదలెట్టారు. వీళ్ళు కూడా పూర్తి స్థాయి రోమాంటిక్ కామెడీల్లో నటించింది లేదు. రోమాంటిక్ డ్రామాలే నటించారు. మరి ‘కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసమే సినిమా’  లాగా మారిపోయిన కొత్త ట్రెండ్ లో ఇవెలా హిట్టయ్యాయంటే, స్టార్ వేల్యూ వల్ల. కొన్నిసార్లు ముసలి కథలతో  స్టార్లే వాళ్ళ చరిష్మాతో వెలిగిపోతారు గానీ, ఆ ముసలి కథలు వెలగవు - స్టార్ నుంచి విడదీసి చూస్తే ముసలి కథలకి వేల్యూ వుండదు, ఇది గుర్తు పెట్టుకోవాలి. కథా కథనాల్ని  మర్చిపోయి తమ అభిమాన స్టార్ నే మైమరచిపోతూ చూసే ప్రేక్షకులున్నారు, ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి. 

      ఇదలా వుంచితే,  2012 లో ‘ఈరోజుల్లో’  హిట్టయ్యాక మళ్ళీ యూత్ సినిమాల ట్రెండ్ మొదలయ్యింది- ప్రతీ పదేళ్ల కోసారి ట్రెండ్స్ రిపీటవుతాయన్న సిద్ధాంతం ప్రకారం. ఇక్కడ్నించీ రోమాంటిక్ కామెడీలనే కొత్త పేరు ప్రచారంలో కొచ్చింది. 2000 లో ప్రారంభమైన కొత్త ట్రెండ్ ని యూత్ సినిమాలనో, లైటర్ వీన్ లవ్ సినిమాలనో అన్నారు. ఇప్పుడు రోమాంటిక్ కామెడీలనడం మొదలెట్టారు- ఎందుకంటే ‘ఈ రోజుల్లో’ అలా అన్పించింది కాబట్టి.  నిజానికి ‘ఈరోజుల్లో’ అడల్ట్ కామెడీ. అడల్ట్ కామెడీ రోమాంటిక్  కామెడీల చుట్టమే. ఎందుకంటే వీటిలో రోమాంటిక్ కామెడీల్లాగే డ్రామా వుండదు. దీన్ని పట్టుకుని రోమాంటిక్ కామెడీలంటూ, మళ్ళీ కొత్త కొత్త వాళ్ళతో, కొత్త కొత్త దర్శకులు వచ్చేసి తీయడం మొదలెట్టారు. అయినా పాత అలవాటు ఎక్కడికి పోతుంది? మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి- అన్నచందాన అవే ముగిసిపోయిన యూత్ సినిమాల నాటి రోమాంటిక్  డ్రామాలే,  వీణ వాయించుకునే లైటర్ వీన్ లవ్ స్టోరీసే తీసి పారెయ్యడం మొదలెట్టేశారు. రోమాంటిక్ డ్రామాలు ఓల్డ్ టైపులో వీణ వాయించుకుంటే, రోమాంటిక్ కామెడీలు న్యూ టైపులో ‘గిటార్’ వాయించుకుంటాయని తెలుసుకోకుండానే! 


        రోమాంటిక్ డ్రామా వీణ!
         
రోమాంటిక్ కామెడీ గిటార్! 

        ఇప్పుడేం వాయించాలి? 

         2015 లోనే చూద్దాం, ఈ సంవత్సరం రోమాంటిక్ కామెడీ లంటూ 19 విడుదలయ్యాయి : భలేభలే మగాడివోయ్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కేరింత, కొలంబస్, కృష్ణమ్మ పిలిచింది ఇద్దరినీ, కుమారి 21ఎఫ్, నాకైతే నచ్చింది, లేడీస్ అండ్ జంటిల్ మన్, పెసరట్టు, పడ్డానండీ ప్రేమలో మరి, నువ్వూ నేనూ ఒకటవుదాం, ఆనందం మళ్ళీ మొదలైంది, ఆంధ్రా పోరి, లవకుశ, వినవయ్యా రామయ్యా, అనగనగా ఒక విచిత్రం, రాంలీల, తప్పటడుగు... వీటిలో ఒక్కటే ‘భలేభలే  మగాడివోయ్’ గిటార్ సినిమా! కుమారి 21 ఎఫ్ అడల్ట్ కామెడీ అయితే, మిగిలిన పదిహేడూ వీణ వాయించుకున్న సినిమాలే!

        స్టార్స్ వల్ల, బ్యానర్ వల్ల మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు,  కేరింత అనే రెండు వీణ సినిమాలు హిట్టయ్యాయేమోగానీ, అదే యంగ్ స్టార్ సుమంత్ అశ్విన్ నటించిన కొలంబస్ అనే వీణ సినిమాని చూడలేదెవరూ. అలాగే ఇంకో యంగ్ స్టార్ సుధీర్ నటించిన కృష్ణమ్మ పిలిచింది ఇద్దరినీ అనే వీణ సినిమా కూడా యూత్ కి నచ్చలేదు. ఇక మిగిలినవన్నీ కొత్త వాళ్లతో రోమాంటిక్ కామెడీ లనుకుంటూ,  యూత్ కి గిటార్ బదులు వీణ వాయించుకుని నిద్ర పుచ్చినవే. ఈ ‘రోమాంటిక్ కామెడీ’ లని ఇక పీక్ ని తీసుకెళ్ళాలంటే, ఏడ్చే  హీరోయిన్ కి వీణ పాట కూడా పెట్టేసి పాతసినిమాల టైపులో చుట్టేయాలేమో.

        ‘నేచురల్ స్టార్’ నాని నటించిన భలేభలే  మగాడివోయ్ ఒక్కటే  పక్కా గిటార్ వాయించిన రోమాంటిక్ కామెడీ. కాబట్టే యూత్ అంత హిట్ చేశారు.


        ఈ సంవత్సరం - 2016 కి వస్తే, ఈ డిసెంబర్ మూడో వారం వరకూ రోమాంటిక్ కామెడీలంటూ 23  విడుదలయ్యాయి : పెళ్లి చూపులు, మజ్నూ, ప్రేమమ్, నరుడా డోనరుడా, నేనూ శైలజ, అ ఆ , సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, కళ్యాణ వైభోగమే, ఒక మనసు, రోజులు మారాయి, శ్రీరస్తు శుభమస్తు, జ్యో అచ్యుతానంద, పడేశావే, నిర్మలా కాన్వెంట్, వెన్నెల్లో హాయ్ హాయ్, అబ్బాయితో అమ్మాయి, నేనూ మా ఆయన, దృశ్య కావ్యం, సావిత్రి, అమ్మాయి ఆరుగురు, కుందనపు బొమ్మ, మోహబ్బత్ మే, రోమాన్స్ విత్ ఫైనాన్స్... వీటిలో పెళ్లి చూపులు, వెన్నెల్లో హాయ్ హాయ్ తప్ప మిగిలిన ఇరవై ఒక్కటీ కూడా రోమాంటిక్ డ్రామాలే! అంటే వీణ సినిమాలే!

        పెళ్లి చూపులు అనే పక్కా రోమాంటిక్ కామెడీ బాగా హిట్టయ్యింది, వెన్నెల్లో హాయ్ హాయ్ విడుదల ఆలస్యం వల్ల కాలేదు. గత సంవత్సరం భలేభలే మగాడివోయ్ అనే పక్కా రోమాంటిక్ కామెడీతో సూపర్ హిట్టయిన నానియే వెళ్లి వెళ్లి ఈ సంవత్సరం మజ్నూ అనే రోమాంటిక్ డ్రామాతో వీణ వాయించి ఫ్లాపయ్యాడు. లక్కీగా మరో యంగ్ స్టార్ రామ్ నటించిన  నేనూ శైలజ అనే రోమాంటిక్ కామెడీ అనే రోమాంటిక్ డ్రామా  హిట్టయ్యింది. అది స్టార్ వేల్యూ మహిమ. నాగచైతన్య నటించిన రోమాంటిక్ కామెడీ అనే రోమాంటిక్ డ్రామా  ప్రేమమ్ అనే సక్సెస్ కూడా స్టార్ వేల్యూ మహిమే. నితిన్ నటించిన మరో రోమాంటిక్ కామెడీ అనే రోమాంటిక్ డ్రామా సక్సెస్ కూడా స్టార్ వేల్యూ మహిమే. అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు అనే ఇంకో రోమాంటిక్ కామెడీ అనే రోమాంటిక్ డ్రామా  సక్సెస్ కూడా స్టార్ వేల్యూ మహిమే. ఈ నాల్గూ కాక, రోమాంటిక్ కామెడీల ముసుగులో వచ్చిన 18 రోమాంటిక్ డ్రామాలన్నీ ఫ్లాపయ్యాయి. వీటిలో నాని దగ్గర్నుంచీ నాగ శౌర్య, నారా రోహిత్, నాగబాబు కుమార్తె నిహారిక, సుమంత్, రాజ్ తరుణ్, శ్రీకాంత్ కుమారుడు రోషన్ లు నటించినవి ఏడు వున్నాయి. నాగ శౌర్య నటించినవే నాల్గుకి నాల్గూ ‘రోమాంటిక్ కామెడీలు’ ఫ్లాపయ్యాయి. 

        ఇలా రోమాంటిక్ కామెడీ లనుకుంటూ తీస్తున్న రోమాంటిక్ డ్రామాలు ఫ్లాపవుతున్నాయి. రోమాంటిక్ కామెడీలుగా తీసిన ఒకటీ అరా రోమాంటిక్ కామెడీలే హిట్టవువుతున్నాయని ఈ రెండేళ్లుగా విడుదలైన పై సినిమాల పెర్ఫార్మెన్స్ చూస్తే తెలిసిపోతోంది.  కాబట్టి ఇంకా వీణ సినిమాలేనా- గిటార్ సినిమాలు ఇప్పటికీ వద్దా? అయితే ఇలాగే ఫ్లాపులు తప్పవు. 4జి ల కాలంలో 2జి లు చూపిస్తామంటే, చూసిన వాళ్ళు ఒక్క మౌత్ టాక్ తో ఇలాగే రిస్కులో పడేస్తూ వుంటారు.


అసలు రోమాంటిక్ కామెడీ అంటే ఏమిటి?
      ఎక్కడా ఏడ్పించనిది, బరువెక్కనిది, సీరియస్ అవనిది; ఎక్కడా ఫీల్ సెంటిమెంటు ఎమోషన్లు అనే నాన్సెన్సుకి చోటివ్వనిది, లవర్స్ ఇద్దరి మధ్యా హాస్యాన్ని తారా స్థాయికి చేర్చేది, డైరెక్టుగా లవ్ ని చూపించనిది, ప్రేమలకోసం ప్రాకులాడనిది, ప్రేమల్ని కప్పిపుచ్చేది, వాళ్ళని ఒకానొక ఇబ్బందికర సంఘటనలో పడేసి హాస్య ప్రహసనాలని సృష్టించేది...

        కామెడీ ఎప్పుడూ సంఘటనలోంచే పుడుతుంది. సిటీ బస్సు ఆగకుండానే దిగే తొందరలో హీరోయిన్ గభాల్న దూకి బైక్ మీద పోతున్న హీరో మీద దభీమని పడితే, కుయ్యోమని హీరో మొత్తుకుంటే చాలు, రోమాంటిక్ కామెడీకి బీజం పడిపోయినట్టే. చెమట కంపు కొడుతున్న హీరోయిన్ చున్నీ గాలి కెగిరివచ్చి హీరో మొహానికి ఠపీమని కొట్టుకుని, యాక్ మని వాంతి చేసుకుంటే చాలు- రోమాంటిక్ కామెడీ మొదలైపోయినట్టే. 

        ఒక్క సంఘటన ఇద్దరిమధ్యా  రకరకాల హాస్య ప్రహసనాలకి దారితీస్తూ, ఇద్దరి మధ్యా పగని రగిలిస్తూ, ఒకర్నొకరు దెబ్బ తీసుకునే ప్రయత్నాలతో, యాక్షన్ రియాక్షన్ల సంఘర్షణకి తెరతీస్తే అది రోమాంటిక్ కామెడీ. ఒకరికొకరు ప్రత్యర్ధులైపోయి ఎవరూ తగ్గకుండా, ఎవరూ విడిపోకుండా, ఎవరూ ఏడుస్తూ కూర్చోకుండా, ఇగోల కోసం ఒకర్నొకరు ఇబ్బంది పెట్టేసుకునే యాక్షన్ లో వుండే కథనమే రోమాంటిక్ కామెడీ. 

        ఇద్దరూ ఒకటై  చేసే రోమాంటిక్ కామెడీలు కూడా వుంటాయి. వెర్రితలలేసే ప్రేమలో ఏవో ప్రయోగాలు చేసుకుని, పీక్కోలేక, ఎవరికీ చెప్పుకోలేకా పడే ఇబ్బందులు- ఈ ఇబ్బందుల్లోంచి పుట్టే కామెడీలు, ఎలా బయటపడతారా అనే సస్పెన్స్. వీళ్ళేదో చేయకూడని పని చేశారని పెద్దలు వచ్చి క్లాసులు పీకి బుద్ధి నేర్పారా ఇక అంతే! అప్పుడది  రోమాంటిక్ కామెడీ అవదు - రోమాంటిక్ కామెడీ జానర్ లోకి అక్రమంగా జొరబడ్డ రోమాంటిక్ డ్రామా అవుతుంది- కళ్యాణ వైభోగమే లోలాగా; మజ్నూలో లాగానూ.    

        రోమాంటిక్ డ్రామాల్లో  హీరో హీరోయిన్లే తమ సమస్యని తామే పరిష్కరించుకోవాలనే రూలుండదు, పెద్దలే జోక్యం చేసుకుని పాసివ్ హీరోహీరోయిన్ల సమస్యని పరిష్కరించే పాత తంతు వుంటుంది. లేదా వాళ్లకి అడ్డున్న పెద్దలే  మనసు మార్చుకుని వాళ్ళని కలిపే వ్యవహారముంటుంది. రోమాంటిక్ కామెడీల్లో హీరో హీరోయిన్లు తాము సృష్టించుకున్న సమస్యల్లోంచి  తామే బయటపడే మార్గాలని కనుగొని,  యువతకి ఇన్స్ పిరేషన్ గా వుండే కథనం వుంటుంది. యూత్ ఎప్పుడూ తమని తామే విజేతలుగా మల్చుకునే శక్తి సంపన్నులు కావాలి గానీ, ఇంకా ఎవరో పెద్దల నుంచి తలలు వంచుకుని నేర్చుకునే పిల్లకాయల్లా వుండకూడదని రోమాంటిక్ కామెడీలు చెప్తాయి.

        రోమాంటిక్ కామెడీల్లో హీరో హీరోయిన్ల పాత్రలు ఎమోషనల్ గా పరిపూర్ణంగా వుండవు. సగం సంగం వాళ్ళిద్దరూ ఒకటైతేనే ఆ పరిపూర్ణతని సాధిస్తారు. ఇంకా ఇద్దర్లో ఒకరు ఏదోవొక అంతర్గత సమస్యతో వుంటారు- భలేభలే మగాడివోయ్ లో మతిమరుపు నాని పాత్రలాగా. వాళ్ళ మధ్య రిలేషన్ షిప్పే వాళ్ళ సమస్యల్ని  తొలగిస్తుంది. ఇంకా రోమాంటిక్ కామెడీల్లో ఒకరికి జీవితంపట్ల హుషారు ఎక్కువైపోతే, మరొకరికి బోరు ఎక్కువైపోవచ్చు. ఈ పరస్పర విరుద్ధ కెమికల్ ఈక్వేషన్స్ పాత్రల్ని ఆసక్తికరంగా తయారు చేస్తాయి.

        సినిమా అంటే చలన చిత్రం, ఫోటోగ్రాఫ్ లా నిశ్చల చిత్రం కాదు. అందులోనూ రోమాంటిక్ కామెడీ ఎప్పుడూ యాక్షన్ లో వుంటుంది. అందుకని వున్నచోటే వుండిపోయి నాటకాల్లోలాగా, సీరియల్స్ లో లాగా పంచ్ డైలాగుల మీద పంచ్ డైలాగులు పేల్చుకుంటూ వుండదు రోమాంటిక్ కామెడీ. రోమాంటిక్ కామెడీ స్క్రిప్ట్ యాక్టివ్ గా వుంటుంది, రోమాంటిక్ కామెడీ కథనం  విజువల్ యాక్షన్ తో వుంటుంది. రోమాంటిక్ కామెడీ ఫార్ములాని విరిచేస్తుంది- హీరో హీరోయిన్ల మధ్య అసలు ప్రేమ కథే వుండకపోవచ్చు - హేపీ భాగ్ జాయేగీ లోలాగా. 

        రోమాంటిక్ కామెడీల్లో హీరోహీరోయిన్లు ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోతే అది లేజీ రైటింగ్ అన్పించుకుంటుంది. ఫార్ములా మోజు అన్పించుకుంటుంది. యాక్షన్, హార్రర్, థ్రిల్లర్, మిస్టరీ, జానపద, పౌరాణిక, ఫాంటసీ ...ఇలా యే జానర్ లోనూ ప్రేక్షకులు ఎక్స్ పర్ట్స్  అయివుండరు. కానీ రెండు జానర్స్ లోమాత్రం మంచి ఎక్స్ పర్ట్స్ అయివుంటారు. వాళ్లకి తెలియనిదంటూ వుండదు. ఆ జానర్స్ లవ్, ఫ్యామిలీ అనేవి. ప్రేక్షకులందరూ నిజజీవితంలో కిల్లర్ ని పట్టుకునే పోలీసు అవరు.  ప్రేక్షకులందరూ నిజజీవితంలో దెయ్యాల్ని ఎదుర్కొని వుండరు, ప్రేక్షకులందరూ నిజజీవితంలో రోడ్ల మీద కారు ఛేజింగ్స్ చేసివుండరు. నడిబజార్లో ఎగిరెగిరి తన్ని వుండరు. కానీ అందరు ప్రేక్షకులూ వాళ్ళ జీవితాల్లో ప్రేమతో, ఫ్యామిలీతో అనుభవించే వుంటారు, రోజూ అనుభవిస్తూనే  వుంటారు- రోమాంటిక్ కామెడీ చూడ్డానికి వెళ్లేముందు కూడా అనుభవించే వెళ్తారు. తీరా వెళ్ళాక తాము అనుభవించే లవ్ ఎమోషన్స్ లాగా, తాము అనుభవించే ఫ్యామిలీ సంబంధాల్లాగా రోమాంటిక్ కామెడీల్లో హీరోహీరోయిన్ల  వరస లేకపోతే, అది ఉత్త ఫేక్ అని తిప్పి కొట్టేస్తారు. కాబట్టి లవ్ లో, ఫ్యామిలీలో లాజిక్ తో ఆడుకోకూడదు. ‘బ్రహ్మోత్సవం’ లో తండ్రి చనిపోతే కూతురు రాకుండా ఫ్రెండ్ (హీరోయిన్) ని పంపిచడం, ఆ ఫ్రెండ్ వచ్చేసి  ఆ చావు జరిగిన ఇంట కామెడీ చేయడం ఎంత అందంగా వుందో తెలిసిందే.  

        రోమాంటిక్ కామెడీల్లో ఓ సంఘటనతో పాయింటు చిన్నదే కావొచ్చు- కానీ పోనుపోను రకరకాల పాత్రలు చేరి అటులాగి ఇటులాగి కాంప్లికేట్ చేస్తాయి -హేపీ భాగ్ జాయేగీ లోలాగా. పాయింటులో లాజిక్ వుంటే ఎంత ఇల్లాజికల్ కామెడీనైనా  సృష్టిస్తుంది రోమాంటిక్ కామెడీ- మిస్టర్ బీన్స్ సిరీస్ ఎపిసోడ్స్ లాగా. 

        ఇవన్నీ రెండే రెండు సూత్రాల ఆధారంగా జరుగుతాయి- హీరోహీరోయిన్లు ఒకరికొకరు విలన్లై పోవడం, ముమ్మాటికీ ఎవరూ తగ్గిగానీ, విడిపోయిగానీ పాసివ్ గా మారకపోవడం- (ఒకవేళ విడిపోయినా పాసివ్ గా వుండకుండా గోతులు తవ్వడం, ప్రతీ చర్యతో నవ్వించడం) -ఈ రెండు ప్రాణప్రదమైన సూత్ర్రాల ఆధారంగానే రోమాంటిక్ కామెడీల్లో పైవన్నీ జరుగుతాయి. కామెడీ అంటేనే హుషారు, హుషారు ఎప్పుడూ పాసివ్ గా వుండదు. ఇది గుర్తుంచుకుంటే రోమాంటిక్ కామెడీల్లో ‘ఫీల్’ అనే చాదస్తాన్ని  చొరబెట్టే అకృత్యాలనుంచి దూరంగా వుండగల్గుతారు. 

        రోమాంటిక్ కామెడీల్లో హీరోహీరోయిన్లు ప్రేమలకోసమే తపించిపోరు. ఈ ప్రేమలు సరే, జీవితం మాటేమిటి? అని చేతకాని వ్యాపకాలు పెట్టుకుని నవ్వుల పాలవుతూంటారు. స్ట్రగుల్ చేసి వాటిలో రాణించి, హమ్మయ్యా అని లైఫ్ లో సెటిలయ్యే ప్రాక్టికాలిటీతో కలర్ఫుల్ గా వుంటారు. 

        రోమాంటిక్ కామెడీ అంటే,  రంగులు మారిపోయే ప్రపంచంలో యూత్ తమ  స్థానాన్ని  దక్కించుకోవడం కోసం, ప్రేమల్ని సపోర్టుగా చేసుకుని ఒక స్టడీ టూర్ చేయడమన్న మాట, ప్రేమే టూర్ అవకుండా. యూత్ కి తమ ఎదర కన్పించే  తమకి తెలీని జీవితాల్ని శోధించి తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువ వుంటుంది- దీన్ని వాళ్ళతో కనెక్ట్ అవుతూ ‘ఆబ్జెక్టివ్’ గా తీర్చేవే రోమాంటిక్ కామెడీలు. 

        రోమాన్స్ అనేది - లేదా లవ్ అనేది - ప్రేమ అనేది ఒక ఉన్నత విలువ, నిజమే. మరి దీన్ని కామెడీ చేస్తూ రోమాంటిక్ కామెడీ అని ఎందుకన్నారు? ఆ తెలివితక్కువ వయసులో తెలిసీ తెలీని ప్రేమలతో కన్ఫ్యూజన్ కామెడీ గానే వుంటుంది కాబట్టి- వాళ్ళ మనస్తత్వాలని అచ్చు గుద్ది రోమాంటిక్ కామెడీలనేశారు. అందుకే ఈ సినిమాల ధోరణి కూడా ఇలాగే వుంటుంది- ప్రేమల్ని వెటకారం చేసి కామెడీగా చూపిస్తూ. ఉదాత్త భావాలకి, విలువలకీ ఇక్కడ చోటుండదు. వాటికోసం రోమాంటిక్ డ్రామాలు చూసుకోవాల్సిందే. రోమాంటిక్ కామెడీల్లో ఉదాత్తత అనేది - ఫీల్ అనేది - కథని బట్టి అవసరమైతే  చివర బయటపడే  విషయాలు. 

        ‘యువర్ బర్డ్ ఈజ్ హియర్, టామ్ థాంప్సన్’ అన్న అద్భుత నవల వుంది. ఇందులో 14-16 ఏళ్ల టీనేజర్స్ మధ్య తమ రిలేషన్ షిప్ స్నేహమో ప్రేమో అర్ధంకాని చిత్రణ వుంటుంది హాస్యభరితంగా. రెండు పక్షుల సాంగత్యం ద్వారా తమ రిలేషన్ షిప్ కి అర్ధం చెప్పుకుని, మళ్ళీ మామూలు  స్టూడెంట్స్ గా కంటిన్యూ అయిపోతూంటారు. రచయిత్రి  ఫిల్లీస్ ఆండర్సన్ వుడ్ తొందరపడి వాళ్ళని ప్రేమికులుగా ఫిక్స్ చేసి ముగించ లేదు. ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నారు, దానికింకా చాలా టైముంది వాళ్లకి, అంతే! ఇది వాస్తవికత. 

        ఎంత నవ్వించినా రోమాంటిక్ కామెడీ చిట్ట చివర జాగ్రత్తగా, కంట్రోల్డుగా, కళ్ళు చెమర్చేలా చేస్తే బాగా గుర్తుండి పోతుంది.
        ప్లస్ రోమాంటిక్ కామెడీ అనేది గాథలా పాసివ్ గా వుండదు, కథా లక్షణాలతో యాక్టివ్ గా, నిత్యనూతనంగా వుంటుంది. రోమాంటిక్ కామెడీ క్రియేటివ్ యాస్పెక్ట్ తోబాటు, మార్కెట్ యాస్పెక్ట్ ని కూడా పట్టించుకుని- టార్గెట్ ప్రేక్షకులైన ఇప్పటి యూత్ ప్రవర్తనలకి, అభిరుచులకి దగ్గరగా, సమకాలీనంగా, వాస్తవికంగా తాజాగా వుంటుంది.  

రోమాంటిక్ డ్రామా అంటే?         
       ఐతే కథగా వుండ వచ్చు, లేకపోతే గాథ గానూ తయారవ్వొచ్చు - దానిష్టం. రోమాంటిక్ డ్రామా కాస్సేపు నవ్వించి ఆ పైన ఏడ్పించేది, ప్రేమో రామచంద్రా అని అల్లాడేది, కాన్వెంట్ పిల్లల్ని కూడా వదలకుండా పట్టి పీడించేది, నువ్వు లేకపోతే నేను బతకలేను ప్రియా అనేవి; నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్యూ అనకుండా ప్రేమని వ్యక్తం చేయలేనివి (నిన్ను ప్రేమిస్తున్నాను అని డైలాగు రాయడమే అసహజ అమెచ్యూరిష్ రైటింగ్),  నాటకీయతని దండిగా వడ్డించేది, చిన్న మాటకే హీరో హీరోయిన్లని విడదీసేది, పెద్దల జోక్యంతోనో విధివిలాసంతోనో మరెలాగో సుఖాంతమో దుఃఖాంతమో అయ్యేది, ఎమోషన్స్ నీ సెంటిమెంట్స్ నీ ఫీల్ నీ ధారాళంగా ప్రవహింపజేసేదీ ...

        రోమాంటిక్ డ్రామా ప్రేమలకి కుటుంబాల అభ్యంతరమో, సామాజిక కట్టుబాట్లో, మానసిక నిషేధాలో అడ్డంకిగా వుంటుంది. హీరో హీరోయిన్లు పాసివ్ గా వుంటారు. చదువూ కెరీర్ పట్టకుండా, ప్రేమా అప్పుడే పెళ్ళీ ఆరాటంతో వుంటారు. హీరోయిన్ పాత్రతో ఆడది అన్న పక్షపాతం వుంటుంది. సొంతవ్యక్తిత్వం వుండదు. రోమాంటిక్ డ్రామాల సెకండాఫ్ బరువుగా, రిలీఫ్ లేకుండా విషాదభరితంగా మారిపోతుంది. 

        రోమాంటిక్ డ్రామా వాస్తవికత కన్నా నాటకీయత మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. పాత్ర చిత్రణల్లో ఒక్కోసారి బోల్తా పడుతుంది, క్రియేటివ్ యాస్పెక్ట్ ని పెద్దగా పట్టించుకోదు,  లాజిక్ కి ఆస్కారం వుండదు. రోమాంటిక్ డ్రామాల మార్కెట్ యాస్పెక్ట్ కూడా మారకుండా ఎప్పుడూ ఒకేలా వుంటుంది- అవే పాత మూస ఫార్ములా ప్రేమలు రిపీట్ అవుతూంటాయి కాలంతో సంబంధంలేకుండా. ఇంకా క్యాన్సర్ ప్రేమ కథలు, పునర్జన్మ ప్రేమ కథలూ చూపించడానికీ మొహమాటం వుండదు. 

        మార్కెట్ యాస్పెక్ట్ పట్టని రోమాంటిక్ డ్రామా,  యువప్రేక్షకుల అభిరుచుల్నీ సమస్యల్నీ జీవితాలనీ పట్టించుకోదు. వాస్తవ దూరమైన కృత్రిమ ప్రేమలతో డ్రామాలతో దూరంగా తనలోకంలో తానుగా - ‘సబ్జెక్టివ్’ గా వుండిపోతుంది. రోమాంటిక్ డ్రామాల్ని  ఎప్పుడో వచ్చిన పాత సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని, పెద్దగా శ్రమ అక్కర్లేకుండా లేజీగా, పాసివ్ గా రాసెయ్యొచ్చు. ఇవి స్టార్ వేల్యూ అనే అదృష్టం మీద ఆధారపడి ఒక్కోసారి ఈ కాలంలో హిట్టవుతూంటాయి.


దమ్ముంటే డ్రామా కూడా  ఓకే!
       ఇదంతా చెప్పడం ఇప్పుడు రోమాంటిక్ డ్రామాలు పూర్తిగా పనికిరావని కాదు. ముందు దీని జానర్ లక్షణాల్ని  గుర్తించి, రోమాంటిక్ డ్రామాని ప్యూర్ రోమాంటిక్ డ్రామాగానే బలంగా తీస్తే కొత్త నటీనటులతో నైనా వర్కౌట్ అవుతుంది. ఇలాకాకుండా,  ఎప్పుడో ఫేక్ డ్రామాలుగా తేలిపోయిన గత దశాబ్దపు లైటర్ వీన్ ప్రేమల  వ్యవహరాల్నే  మళ్ళీ ‘మజ్నూ’ లాగా రీసైక్లింగ్ చేస్తే కాదు. బాలచందర్ ‘మరోచరిత్ర’, దాసరి నారాయణరావు ‘తూర్పు- పడమర’, మణిరత్నం ‘గీతాంజలి’ లాంటి బలమైన కళాత్మక, సంగీతభరిత ప్రేమకథలు తీయగల్గితే అవి తప్పకుండా ఇప్పుడూ ఆడతాయి. కానీ ఇప్పుడెవరు అలా తీయగలరు? అందుకని వీణ సినిమాలు ఇప్పుడు వద్దనేది. 


         సంజయ్ లీలా భన్సాలీ ‘బాజీ రావ్ మస్తానీ’ తీశాడు. దీన్ని తెలుగులో కూడా డబ్ చేశారు. ఇందులో వీరుడిగా బాజీరావ్ యాక్షన్ కన్నా, ఇద్దరు హీరోయిన్లతో ప్రేమ కథే ప్రధానంగా వుంటుంది. ఈ ప్రేమకథా ఇందులో మళ్ళీ సీరియస్ సంఘర్షణా  ఎంత బలంగా ప్రేక్షకుల హృదయాలకి గాలం వేసి లాక్కెళ్తా యంటే, ఈ సినిమా కొచ్చిన తెలుగు మాస్ ప్రేక్షకులు సైతం కట్టేసినట్టు కూర్చుని చూశారు. ప్రొజెక్షన్ బాగాలేక మధ్య మధ్యలో నాల్గు సార్లు సినిమా ఆగితే గోలగోల చేశారు. అంతేగానీ,  అసలే సినిమా బోరుగా వుంటే ఈ ప్రొజెక్షన్ ఏమిట్రా పదండి పోదామని లేచెళ్ళి పోలేదు. కావాల్సింది ప్రేమతో కమిట్ మెంట్. కమిట్ మెంట్ లేకుండా పిచ్చిపిచ్చి ప్రేమ డ్రామాలు చూపిస్తే ప్రొజెక్షన్ ఆపెయ్యమంటారు.


అప్పుడు కామెడీలే!       
రోమాంటిక్ కామెడీ అనే పదాన్ని ఇష్టానుసారం వాడేస్తున్నారు గానీ, దుర్వినియోగం కూడా చేస్తున్నారు గానీ- ఒకప్పుడు ఈ మాట లేదు. కామెడీ సినిమాలే! జంధ్యాల ‘అహ నా పెళ్ళంట’ తీసినా, వంశీ ‘లేడీస్ టైలర్’ తీసినా, ఈవీవీ సత్యనారాయణ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తీసినా అవన్నీ, అలా తీసినవన్నీ, అవెంత రోమాంటిక్ కథలైనా, వాటిని కామెడీ సినిమాలనే అన్నారు తప్ప,  రోమాంటిక్ కామెడీలనలేదు. పిఎన్ రామచంద్రరావు ‘చిత్రం భళారే విచిత్రం’ తీసినా దాన్ని రోమాంటిక్ కామెడీ అనలేదు, కామెడీయే!

        ప్రేమతో వాళ్ళ కామెడీ లెప్పుడూ కూడా ‘రోమాంటిక్ డ్రామా’ ల్లాగా కూడా వుండేవి కావు - ఆసాంతం నవ్వించీ నవ్వించీ వదిలిపెట్టడమే ఎజెండాగా పెట్టుకునే వాళ్ళు. వాళ్ళు నవ్వు దర్శకులే తప్ప,  ఏడ్పు దర్శకులు అన్పించుకోలేదు. ఆ నవ్వు ఏమైపోయిందిప్పుడు? ఎందుకు ప్రేమల్లో పనిమాలా చేతకాని ఏడ్పులు చూపిస్తూ,  పనికిరాని రోమాంటిక్ కామిడేడ్పు  సినిమాలు తీస్తున్నారు పోటీలు పడి?ఈ విషయంగా ఇది ప్రశ్నించుకోవాల్సిన  సమయం...


-సికిందర్


       
       


                  

రైటర్స్ కార్నర్
హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ అంటే బిగ్ కలెక్షన్స్ ని రాబట్టే  స్క్రిప్ట్. ఈ ఆర్టికల్ లో మీకు బిగ్ కలెక్షన్స్ ని  సాధించి పెట్టే  హై కాన్సెప్ట్ స్క్రిప్ట్ కి మిలియన్ డాలర్ అయిడియాలు ఎలా రూపొందుతాయో  అవుట్ లైన్ గురించి చెప్తాను. మీరు డబ్బుకోసమే స్క్రిప్టులు రాయాలని ఈ రంగంలోకి వచ్చి వుండకపోయినా, ఆర్ధిక భద్రత వుండాలని అందరూ కోరుకుంటారు. దురదృష్టవశాత్తూ  సినిమాలు క్యారక్టర్ డెవలప్ మెంట్ తోనే నిండిపోయి, యాక్షన్ కి చాలా తక్కువ చోటు కల్పించడం వల్ల  అనుకున్న బాక్సాఫీసు ఫలితాలు సాధించలేక పోతున్నాయి. రచయితగా మీరు తిరుగులేని సక్సెస్ సాధించేందుకు స్మాష్ హిట్ స్క్రిప్టు రాయాలనుకుంటే,  హై కాన్సెప్ట్ అయిడియాల గురించి ఆలోచించడం మొదలెట్టాల్సిందే.

        చెప్పుకోవాలంటే హై కాన్సెప్ట్ స్క్రిప్టులు సింపుల్ గానే  వుంటాయి. కొన్ని పదాల్లో కుదించి క్లుప్తంగా చెప్పినా చిన్న  పిల్లలు కూడా చక్కగా అర్ధం చేసుకుంటారు. హై కాన్సెప్ట్ స్క్రిప్టుల్లో క్యారక్టర్ డెవలప్ మెంట్ ని కనిష్ట స్థాయిలో వుంచుతూ, ఈ లోటుని భర్తీ చేయడానికి ప్రేక్షకులు అభిమానించే టాప్ స్టార్స్ ని ఎంపిక చేసుకుంటారు. హై కాన్సెప్ట్ మూవీస్ భారీ ఎత్తున స్పెషల్ ఎఫెక్ట్స్ ని కూడా కలిగి వుండి  పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే భారీ ప్రచారాన్ని పొందుతాయి. ప్రేక్షకుల క్యూరియాసిటీని పెంచుతాయి.

       ఓ బిగ్ ఐడియా, ఇంకో ఆకర్షణీయమైన టైటిల్, క్యూరియాసిటీని పెంచే ఓ లాగ్ లైన్ ...ఇవీ చాలు హై కాన్సెప్ట్ మూవీ స్క్రిప్టు ప్లాన్ చేసేందుకు. 

        థింక్ బిగ్!
       మీకో గొప్ప కాన్సెప్ట్ తట్టిందంటే మీరిక హై కాన్సెప్ట్ కి స్థాయికి దగ్గరైనట్టే. మీరు రాసే స్క్రిప్టులో  క్వాలిటీ లేకపోయినా అది అమ్ముడుపోయే అవకాశాలకి ఏమీ నష్టం కల్గించదు.  ప్రొడ్యూసర్లు చాలావరకూ హై కాన్సెప్ట్ స్క్రిప్టుల్ని  చదవకుండానే కొనేస్తూంటారు. కథాసంగ్రహంలో మీరిచ్చే హై కాన్సెప్ట్ అవుట్ లైన్ కి పడిపోతే ఇంకేమీ అడగరు. చాలా సినిమాలు మంచి కథతో, పాత్రలతోనే  వుంటాయి. కానీ వాటి ఇనీషియల్ ఐడియాల పాలనే ఏమంత బావుండదు. అందుకని మీరనుకున్న హై కాన్సెప్ట్ లో ఇనీషియల్ ఐడియా సరీగ్గా ప్రతిఫలించేలా ఎక్కువ సమయం కేటాయించి మీరు కృషి చేయాల్సి వుంటుంది. ముందు నిర్మాణాత్మకంగా ఇనీషియల్ ఐడియా లేకపోయినట్లయితే, మీరేం చేసీ దాన్ని మీ హై కాన్సెప్ట్  స్క్రిప్టులో ప్రతిఫలింపజేయలేరు.

     గుర్తుంచుకోండి! నిజమైన హై కాన్సెప్ట్ మూవీ ఐడియా అంటే....
        తేలికగా అర్ధమయ్యేది
        ఒకటి రెండు వాక్యాల్లో చెప్పగల్గేది

        ప్రేక్షకుల క్యూరియాసిటీని పెంచేది
        అధిక కాన్ ఫ్లిక్ట్ తో నిండి వుండేది.
        ఓ భారీ స్థాయి సంఘటనని చూపించేది
        సీక్వెల్ కి అవకాశమిచ్చేది
        టాప్ స్టార్స్ ని ఎట్రాక్ట్ చేసేది
        ఫ్రెష్ గా, మార్కెటబుల్ గా వుండేది.
        తెలిసిన ఐడియానే, జా=నర్ నే కొత్తగా చూపించేది...  

      మీరొకసారి జాస్, ఇండిపెండెన్స్ డే, స్టార్ వార్స్, జురాసిక్ పార్క్  వంటి హై కాన్సెప్ట్ మూవీస్ ని గమనించినట్లయితే, వీటిలో పై జాబితాలో చెప్పుకున్న ప్రతీ ఒక్క అంశమూ చోటుచేసుకునే వుంటుంది. నేనిది రాస్తూ, ఇప్పుడే ఐఎండిబి (ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్) లో ‘ఇండిపెండెన్స్ డే’ మూవీ  పేజీని క్లిక్ చేశాను. దీని యూజర్ రేటింగ్ ని చూస్తే 10/6.9 మాత్రంగానే వుంది. అయినప్పటికీ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. భారీ వసూళ్లు సాధించే హై కాన్సెప్ట్ మూవీస్ ఉత్తమ చలన చిత్రాలన్పించుకోవాలన్న రూలేమీ లేదు.

       హై కాన్సెప్ట్ స్క్రిప్టు ఐడియాని కనిపెట్టాలంటే మొట్ట మొదట వేసుకోవాల్సింది  ‘అలా జరిగితే?’ అన్న ప్రశ్న ఒక్కటి. గ్రహాంతర జీవులు  భూమి మీద దాడి చేస్తే? - ఇది ‘ఇండిపెండెన్స్ డే’ మూవీ ఐడియా. రాక్షస బల్లులకి తిరిగి ప్రాణం పోస్తే?- ఇది ‘జురాసిక్ పార్క్’ మూవీ ఐడియా. సొరచేప మనుషుల మీద దాడి చేస్తే?- ఇది ‘జాస్’ ఐడియా.

        మొత్తం మీడియానంతా నిరంతరం గమనిస్తూ వుండండి. సినిమాలు చూడండి, నవలలు చదవండి, వార్తలు చూడండి, సోషల్ మీడియాలో నెటిజనుల కథనాలూ పరిశీలించండి...’అలా జరిగితే?’  అన్న ప్రశ్నకి తగ్గ పాయింటు మీకెక్కడో దొరక్కపోదు.

టైటిల్, లాగ్ లైన్!
      కమర్షియల్ విలువలున్న మంచి టైటిల్, లాగ్ లైన్ ఈ రెండూ మూడు  పాజిటివ్ ఎఫెక్ట్స్ ని  క్రియేట్ చేస్తాయి : ఇవి మీరు స్క్రిప్టు రాయడానికి ఇన్స్పైర్ చేస్తాయి, నిర్మాత-దర్శకుడు-స్టార్ ఎవరైనా కళ్ళప్పగించి చూస్తూ మీ స్క్రిప్టుని వినేలా చేస్తాయి, దాన్ని నిర్మిస్తే సులభంగా మార్కెట్ చేసుకునే వీలు కల్పిస్తాయి మీ హై కాన్సెప్ట్ టైటిల్ అండ్ లాగ్ లైన్ లు. 

      టైటిల్ పొట్టిగా వుండాలి. వుంటూ ఆ మూవీ థీమ్ గురించీ, స్వభావం గురించీ ప్రేక్షకులకి సదభిప్రాయం కల్గించాలి. సింపుల్ గా వుంటూనే క్యూరియాసిటీని పెంచే టైటిల్ కీ, లాగ్ లైన్ కీ ‘స్టార్ వార్స్’ ఒక మంచి ఉదాహరణ.
            స్టార్ వార్స్ లాగ్ లైన్ చూడండి - A long time ago in a galaxy far, far away…

           
వెంటనే ఈ మూవీ  మారుమూల అంతరిక్షంలో  మంచికీ చెడుకీ మధ్య జరిగే పోరాటమని తెలిసిపోతుంది. ఒకటి రెండు పంచ్ లతో కూడిన లాగ్ లైన్ లో మీ కాన్సెప్ట్ అంటా తెలిసిపోవాలి. టైటిల్ కీ, లాగ్ లైన్ కీ లోబడి మీరీ కింది మూడు ప్రశ్నలకి జవాబులు చెప్పేట్టుండాలి :


        కథేమిటి?
        హీరో దేన్ని పణంగా పెడుతున్నాడు?
        హీరో కోరికలూ అవసరాలూ ఏమిటి?

         హై కాన్సెప్ట్ మూవీస్ ని విమర్శకులు దుయ్యబడుతూంటారు. ఇది గమనించాల్సిన విషయం. అలాంటప్పుడు మీ గ్రేట్ కాన్సెప్ట్ ని మీరెందుకు ఇంకో అడుగు ముందుకేసి, మాయ చేస్తూనే మనసుకి పట్టే డెప్త్ తో సమ్మోహనాస్త్రంగా సంధించకూడదు?

- ఎడ్వర్డ్  నోమ్స్
http://www.cinemabazaar.in