తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్- అనే ఈ శీర్షిక అంటేనే సింహస్వప్నంలా వుండేది ఈ వ్యాసకర్తకి. ఈ శీర్షిక నిర్ణయించి దీనికింద తెలుగు సినిమా స్క్రీన్ ప్లే లు ఎలా రాసుకోవాలో తెలియజెప్పడం చాలా సాహసం కిందే లెక్క. 1998 లో సినిమా రివ్యూలు రాయడానికే తగిన అర్హత వుండాలని స్వీయ నిబంధన విధించుకుని, స్క్రీన్ ప్లే సబ్జెక్టు మీద పుస్తకాలూ అవీ చదువుకుని – అర్హతల సంగతెలా వున్నా- కాస్త జ్ఞానం మాత్రం సంపాదించుకున్నాక, రివ్యూలు రాయడం కొనసాగిస్తూంటే వచ్చిన ధైర్యంతో, ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ అంటూ ఇంకో పతాకం ఎగరేయడమన్నది తొందరపాటుతనమే అవుతుందని చాలా కాలం దీని జోలికే పోలేదు. అయినా చేతులు వూరుకోక 2003 లో సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్ నమూనాతో పోలుస్తూ తెలుగు సినిమాల స్క్రీన్ ప్లేలు ఎన్నిరకాలుగా ఇష్టానుసారంగా వుండి విఫలమవుతున్నాయో ఒక పెద్దవ్యాసం ‘ఆంధ్రభూమి’ లో రాసినప్పుడు భారీ స్పందన వచ్చింది. అలా స్పందించిన ముఖ్యుల్లో దర్శకుడు కె. దశరథ్ - ‘స్క్రీన్ ప్లే మీద పుస్తకం రాయండి, నిధులు నేను సమకూరుస్తా’ నన్నారు. రిఫరెన్స్ పుస్తకాలు కూడా ఇచ్చారు. అవన్నీ చదివి రాయడం మొదలుపెట్టి మొదటి అధ్యాయాన్ని అన్నపూర్ణా స్టూడియోలో వున్న ఆయనకి చూపిస్తే, మొదటి పేజీ చదువుతూనే విసిరికొట్టారు. ఆ కాగితాలు ఏరుకుని సారీ చెప్పి వచ్చేశాడీ వ్యాసకర్త. అక్కడితో ఆ ప్రయత్నం ఆగిపోయింది.
తర్వాత 2005 లో సినిమాల ఆసక్తి వున్న రాజేంద్ర
అనే ఎన్నారై ఈ వ్యాసకర్తని వెతుక్కుంటూ
వచ్చి, స్క్రీన్ ప్లే పుస్తకం రాసే ఆఫరిచ్చి, కొన్ని ఇంగ్లీషు పుస్తకాలిచ్చారు. మళ్ళీ
కొత్త ప్రయత్నం మొదలు. అది రాస్తూ కొన్ని పేజీలు చూపిస్తే, ఆయన ఇంకెవరికో
చూపించి, భాష అకడెమిక్ గా లేదన్నారు. అది కూడా అలా ఆగిపోయింది. ఈ రెండు అనుభవాలతో
తేలిందేమిటంటే, సినిమాలు చూసిన అనుభవంతో, రివ్యూలు రాస్తున్నామన్న ధైర్యంతో, స్క్రీన్ ప్లే మీద పుస్తకాలు చూసి రాయలేమనీ,
చేసి రాయాలనీ!
ఇంగ్లీషులో నాలుగు స్క్రీన్ ప్లే పుస్తకాలు ముందేసుకుని అందులోంచి కొంతా ఇందులోంచి కొంతా మిశ్రమం చేసి తెలుగులో ఓ స్క్రీన్ ప్లే పుస్తకం అచ్చేస్తే బ్రహ్మాండంగా అమ్ముడుబోతుందని తెలుసు. తెలుగులో స్క్రీన్ ప్లే పుస్తకాల కొరత చాలా వుంది. పైగా ఇంగ్లీషు పుస్తకాల్లో లభించే పరిపూర్ణ జ్ఞానాన్ని భాషా సమస్య వల్ల చాలా మంది నోచుకోలేకపోతున్నారు. టాలీవుడ్ రచనా పరంగా ఎదగకపోవడానికి ఇదొక కారణం. ఓ నాలుగు ఇంగ్లీషు పుస్తకాల్ని తెలుగులో కాపీ కొట్టి అచ్చేసినా భారీగా అమ్ముడుపోతాయి. కానీ ఇది మోసం చేయడమే అవుతుంది. అలా రాసిన పుస్తకాలు ఎవరికీ ప్రాక్టికల్ గానూ ఉపయోగపడవు. వాటిని చదివి ఎవరైనా తెలుగులో స్క్రీన్ ప్లేలు రాసే ప్రయత్నం చేస్తే, అవి అస్థిపంజరాల్లా తయారవుతాయే తప్ప, రక్త మాంసాలేర్పడవు. ఎవరికైనా రక్తమాంసాల్లాగా తెలుగులో ఈ పుస్తకాలు ఉపయోగపడాలంటే, ప్రాక్టికల్ అనుభవం సంపాదించుకున్న తర్వాతే అలాటి పుస్తకాలు రాయాలని అర్ధమయ్యింది. ఈ రక్తమాంసాల అన్వేణషకే ప్రాక్టికల్ అనుభవం అనే కూడలికి చేరాల్సి వచ్చింది....కూలివాని చెమటలోనే ధనమున్నదిరా అన్నట్టు.
రివ్యూలు రాయడానికి ఎంత స్క్రీన్ ప్లే జ్ఞానం సంపాదించుకున్నా, ఆ జ్ఞానం స్క్రీన్ ప్లే మీద క్షుణ్ణంగా పుస్తకాలు రాయడానికి చాలదు. 2003 లో సుభాష్ రెడ్డి అనే ఎన్నారై ఓ జర్నలిస్టు మిత్రుడి ద్వారా ఈ వ్యాసకర్తని సోలో రైటర్ గా పెట్టుకుని సినిమా తీయడం ప్రారంభించారు. ప్రారంభంలో సోలో రైటర్ గా వున్న ఈ వ్యాసకర్త కాస్తా, ఆయనే రాసేస్తూంటే ఫేర్ చేసేసే బంటులా మారిపోయాడు. ఆ సినిమా పేరు ‘సిటీ’.
తర్వాత 2005 లో చల్లా శ్రీనివాస్ తో కలిసి ఈ వ్యాసకర్త ‘భూకైలాస్’ అనే కథని, స్క్రీన్ ప్లేని శివ నాగేశ్వర రావు గారికిచ్చి, మంచి బలమైన ఆత్మవిశ్వాసంతో వుంటే, తీరా డైలాగ్ వెర్షన్ వచ్చేసరికి సమూలంగా రూపు రేఖలే మారిపోయి- ఆ దశలో వెనక్కి తీసుకునే అవకాశం కూడా లేక- పేర్లు వేయవద్దని బతిమాలుకుని, ఆయన బాధ పడ్డా తప్పుకోవాల్సి వచ్చింది.
2008 లో టి. ప్రభాకర్ గారితో ‘బతుకమ్మ’ చేసినప్పుడు మధుఫిలిం ఇనిస్టిట్యూట్ నటరాజ్ గారు, ఆయన మిత్రుడు రచయిత దేవరాజ్ కలిసి ఈ వ్యాసకర్తని ప్రభాకర్ గారి ఎదుట హాజరుపర్చారు. ఆ కథంతా విని- ‘ఇందులో మీరు భావకవిత్వం చెబుతున్నారా, విప్లవ కవిత్వమా? ఈ కథ విప్లవ కవిత్వంలో భావకవిత్వం చెప్తున్నట్టుంది’ అన్నాడీ వ్యాసకర్త (అప్పటికి జానర్ మర్యాద గురించి ఏమాత్రం జ్ఞానం లేదు ఈ వ్యాసకర్తకి. ఇప్పుడు సింహావలోకనం చేసుకుంటే జానర్ మర్యాద గురించిన మాటలే ఆనాడు వచ్చేశాయని అర్ధమవుతోంది).
ఆ మాటతో ఈ వ్యాసకర్తని పట్టేసుకుని వదల్లేదు ప్రభాకర్ గారు. ‘బతుకమ్మ’ డైలాగ్ వెర్షన్ కూడా పూర్తి చేసేదాకా ఆయనతో వుండాల్సివచ్చింది. సినిమాకి స్ట్రక్చర్ అనేది ఒకటుంటుందని తెలుసుకుని, ఇది తెలీకుండానే పది సినిమాలు తీసినందుకు పశ్చాత్తాపపడ్డారు. స్ట్రక్చర్ ని గుర్తించి గౌరవించినందుకు ఈ వ్యాసకర్త గర్వపడ్డాడు. ఆయనే కాదు, ఇంకా నటరాజ్, దేవరాజ్ లతో బాటు కో- డైరెక్టర్ త్రినాథ్, అసోసియేట్ శ్రీనివాస్ కూడా స్ట్రక్చర్ రుచి తెలుసుకుని దానికే సలాం చేశారు. మూలాలు ఆంధ్రాలో వున్నా, తెలంగాణలో పుట్టిపెరిగి తిరుగుతున్న ఈ వ్యాసకర్తకి తెలంగాణా జీవితం, చరిత్ర బాగానే తెలుసు. ‘బతుకమ్మ’ లాంటి తెలంగాణా సినిమాకి రాయడం ఓ అదృష్టంగానే ఫీలయ్యాడు. కానీ తీరా సినిమా పూర్తయ్యాక చూస్తే అదే స్ట్రక్చర్ అనే పదార్థాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది.
తిరిగి 2010 లో ప్రభాకర్ గారే మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ గురించి పరిశోధనాత్మక కథ మొదలెట్టారు. ఇది రెండేళ్ళూ సాగింది. వరంగల్ మెడికల్ కాలేజీకి బృందంగా వెళ్లి, హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి ఈ వ్యాసకర్త ఒక్కడే వెళ్లి మెడికల్ కాలేజీల, హాస్టల్స్ ల, లాబ్స్ ల పనితీరు, ర్యాగింగ్ సమస్యా పరిశీలించి వచ్చి రెండేళ్ళూ రాశారు. స్క్రిప్టుని లాక్ చేసి వెళ్ళిపోయాక, కథంటే ఏమిటో ఏమీ తెలీని ఒక కొత్త రచయిత ఎంటరై మార్చేశాడు. దాని స్క్రీన్ ప్లే కి ఈ వ్యాసకర్త పేరు వేయవద్దని చెప్పినా వేసేశారు. ఆ సినిమా ఒక్క రోజు ఆడింది. విజయవాడలో ఒక్క ఆట ఆడింది. అందులో వుండాల్సిన స్ట్రక్చర్, కంటెంట్, పాయింట్ ఏవీ లేవు. ఆ సినిమా పేరు ‘కాలేజీ స్టోరీ’ గా ఆ రచయిత వచ్చాకే మారిపోయింది.
ఈ అనుభవాలన్నీ మంచివే, ఈ దర్శకులందరూ మంచి వాళ్ళే. ఎన్నారై రాజేంద్ర కి ఈ వ్యాసకర్త వర్క్ నచ్చకపోయినా ఆయన ఇచ్చిన జేమ్స్ బానెట్ పుస్తకం కొత్తలోకాలకి కళ్ళు తెరిపించింది. తెలుగు సినిమాల కథల్లో ఇంకేం కీలకాంశం లోపిస్తోందో, ఆ పుస్తకంవల్ల తెలిసి వచ్చింది. దశరథ్ కాగితాలు విసిరికొట్టే పూర్తి హక్కు ఆయనకుంది. దీంతో ఆయనకేదో నిరూపించి చూపించాలని ఈనాటి వరకూ అనుకోలేదు. అది నెగెటివిజం అవుతుంది. ఆయన వల్ల స్క్రీన్ ప్లే పుస్తకాన్ని కేవలం పుస్తకాలు చదివి రాయలేమన్న గొప్ప జ్ఞానోదయమైంది, ఇంతకంటే ఏం కావాలి? అసలు స్క్రీన్ ప్లే మీద పుస్తకం ఎందుకు రాయాలి, రాయకపోతే ఎవరైనా కొడతారా, సినిమా ఫీల్డు మునిగిపోతుందా, ఏం ఘోరం జరుగుతుందని? ఏదో రివ్యూలు రాసుకోవడానికి స్క్రీన్ ప్లే జ్ఞానాన్ని సముపార్జించుకుని, ఈ అనుభవంతో స్క్రీన్ ప్లే మీద రక్తమాంసాల్లేని పుస్తకం రాయకూడదని దూరంగా వుంటూంటే, ఎవరో ఒకళ్ళు ముందుకు తోయడం ఎందుకు జరుగుతోందో తెలీదు. దశరథ్ అయినా, రాజేంద్ర అయినా ఇంకో పబ్లిషర్ అయినా, మరో పత్రికా యజమాని అయినా సికిందర్ అనే వాడు స్క్రీన్ ప్లే బుక్ రాయగలడు, రాస్తాడు, రాయించాలి వీడి చేత - అని ఎలా అంచనా కొచ్చేవారో అర్ధంగాదు. ఈ అంచనాలని అందుకోలేకపోయాక- రక్తమాంసాల కోసం ప్రాక్టికల్ అనుభవం అనీ ఒకటి పెట్టుకున్నాక, ఒక సమస్య వుంది. స్వభావరీత్యా ఈ వ్యాసకర్త దేనికీ ఎవర్నీ అప్రోచ్ కాడు. ఎవరైనా వచ్చి అడగాల్సిందే. అడిగితేనే చేసి పెడతాడు. అడగక పోతే తన మానాన తాను రివ్యూలు రాసుకుంటూ కన్పించకుండా వుంటాడు. అప్పుడప్పుడు అలా అడిగిన వాళ్ళతోనే ప్రాక్టికల్ అనుభవాన్ని గడించాల్సి వస్తోంది. ఎప్పుడో దశరథ్ అడిగితే ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకుని ఒక కథ- స్క్రీన్ ప్లే ఇచ్చినా, ఇంకో అసోసియేట్ కి రవితేజ కోసం స్క్రీన్ ప్లే చేసినా, మరో పెద్ద సినిమాల కో- డైరెక్టర్ కి రవితేజ కోసమే ఒకటి, జగపతి బాబుకోసం మరొకటీ రాసిపెట్టినా, ఇంకో దర్శకుడు కల్యాణ్ రామ్ కి చెప్పడానికి ఫ్యామిలీ కథ అడిగి రాయించుకున్నా- ఇలా ఇలాటివన్నీ ‘అడిగితేనే ఇచ్చివేయు’ పథకం కింద కొనసాగినవే- సాగుతున్నవే. అయితే ఇవేవీ తెరరూపం దాల్చ లేదు, దాలుస్తాయన్న నమ్మకమూ లేదు- ఏదో అద్భుతం జరిగితే తప్ప!
ఇలా
అడిగే వాళ్ళల్లో అదేం విచిత్రమో గానీ, అసోషియేట్లు పెరిగిపోయారు, ఇంకా
పెరుగుతున్నారు. కో డైరెక్టర్లు, డైరెక్టర్లూ తక్కువే. గత ఎనిమిదేళ్ళుగా మొత్తం
కలిపి 23 మందికి 48 స్క్రీన్ ప్లేలు రాశాడీ వ్యాసకర్త. ఇవన్నీ చిన్న, మధ్యతరహా సినిమాలే.
అయినా రకరకాల కారణాలవల్ల (కంటెంట్ కారణంగా కాదు) పట్టాలెక్కించలేక స్ట్రగుల్ చేస్తున్నారు.
వీళ్ళల్లో ఓ ముగ్గురు మాత్రం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్నారు.
(ఇంకా వుంది)
-సికిందర్