రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, October 28, 2016

రివ్యూ!

రచన- దర్శకత్వం : గోకుల్
తారాగణం : కార్తీ, శ్రీ దివ్య, నయనతార, వివేక్, శరత్ లోహితశ్వా, మధుసూదన రావు, సిద్ధార్థ్ విపిన్ తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణ్, ఛాయాగ్రహణం : ఓం ప్రకాష్
బ్యానర్ : పివిపి సినిమా- డ్రీమ్  వారియర్ పిక్చర్స్
నిర్మాతలు
: పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ ఏన్, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు,
ఎస్‌.ఆర్‌.ప్రభు
        తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ స్టార్ కార్తీ మొన్నా మధ్య ‘ఊపిరి’ లో కన్పించి ఎంటర్ టైన్ చేశాడు. తిరిగి ఇప్పుడు ‘కాష్మోరా’ అనే మరో ఎంటర్ టైనర్ తో భారీ రేంజిలో దిగుమతయ్యాడు ద్విపాత్రాభినయం చేస్తూ. మంత్ర తంత్ర మాయాజాలాల డార్క్ ఫాంటసీలు అప్పుడప్పుడు వస్తున్నవే కానీ, కార్తీ నటించిన ఈ డార్క్ ఫాంటసీ అనేక విషయాల్లో వేరు. రొడ్ద కొట్టుడుగా వస్తున్న హార్రర్ కామెడీలకి దూరంగా దర్శకుడు గోకుల్ దీన్నో సాటరికల్ ఫాంటసీగా తీశాడు. దేవుణ్ణి నమ్మే వాళ్ళ మీద అమీర్ ఖాన్ తో ‘పీకే’ తీసినట్టు, దెయ్యాల్ని నమ్మే వాళ్ళ మీద గోకుల్ ‘కాష్మోరా’ తో వ్యంగ్య బాణా లేశాడు. ఐతే ఇది కేవలం సెటైరేనా ఇంకేదైనా విషయముందా ఇందులో, ఒకసారి ఈ కింద పరిశీలిద్దాం....


కథ : 
     కాష్మోరా (కార్తీ) అనే భూత వైద్యుడు ‘దెయ్యాల్ని వదిలిస్తూ’ డబ్బులు  సంపాదిస్తూంటాడు. ఇతడి ఖాతాదార్లుగా మూఢ నమ్మకాల సామాన్యుల నుంచీ, అడ్డ మార్గాల  రాజకీయ నాయకుల వరకూ చాలామంది వుంటారు. భక్తులుగా మారిపోయిన ఇలాంటి వాళ్ళ కోసం కాష్మోరా తల్లి దండ్రులు, బామ్మ, చెల్లెలూ ఆశ్రమం కూడా నడుపుతూ,  పాలూ గుడ్ల దగ్గర్నుంచీ డబ్బులూ నగలూ నైవేద్యాల రూపంలో స్వాహా చేస్తూంటారు. కాష్మోరా టీవీ స్టార్ కూడా అయిపోతాడు. దెయ్యాలున్నాయంటూ అతను ఇచ్చే టీవీ కార్యక్రమాలకి విపరీతమైన టీఆర్పీ వుంటుంది. తమ కుటుంబ సభ్యులం ఐదుగురం రోహిణీ నక్షత్రంలో పుట్టామనీ, ఇలా అలెగ్జాండర్ కుటుంబంలో, ఆతర్వాత శ్రీకృష్ణ దేవరాయాలి కుటుంబంలో మాత్రమే ఐదుగురు సభ్యులు రోహిణీ నక్షత్రంలో పుట్టారనీ  పోల్చుకుని  గొప్పలు చెప్పుకుంటాడు. 

        దెయ్యాల మీద రీసెర్చి చేస్తున్న యామిని (శ్రీ దివ్య) కాష్మోరా దగ్గర చేరుతుంది. క్యాష్ అనే ముద్దు పేరుగల కాష్మోరా జనాల మూఢ నమ్మకాల్ని క్యాష్ చేసుకుంటున్నాడనీ, అతడికే విద్యా రాదనీ ఆమెకి అనుమానం. ఇంకో ధనకోటి (శరత్ లోహితశ్వా) అనే మంత్రి ఓ హత్య చేయించి అందులోంచి బయట పడేందుకు కాష్మోరాని ఆశ్రయిస్తాడు. కాష్మోరా తన చేతబడి గిమ్మిక్కులతో ధనకోటి సమస్య పరిష్కరిస్తాడు. కోర్టులో కేసు కొట్టేసే సరికి అది కాష్మోరా ఎఫెక్టే నని నమ్మకం పెరుగుతుంది ధనకోటికి.  ఓ రోజు ఐటీ వాళ్ళు దాడులు చేయబోతున్నారని తెలిసి బ్లాక్ మనీ, భూముల పత్రాలూ మూటలు కట్టి కాష్మోరా ఆశ్రమంలో కాష్మోరా తండ్రి దగ్గర దాస్తాడు. కాష్మోరా తండ్రి పెళ్ళాం, తల్లీ, కూతురూ సహా ఆ 500 కోట్ల సొత్తుతో ఉడాయిస్తాడు. ఈ ఘనకార్యం తెలిసి కాష్మోరా కూడా హేపీగా వాళ్లతో జాయినవుతాడు. అంతా కలిసి పారిపోతూ బెంగుళూరు మార్గంలో ఓ పురాతన కోటలో పడతారు. 

        ఆ కోటే కాష్మోరా పాలిట యమలోకం అవుతుంది. దెయ్యాల పేరు చెప్పుకుని వ్యాపారం చేసుకున్న అతడికి ఇప్పుడు నిజ దెయ్యాలతో పీకులాట మొదలవుతుంది. ఇక్కడి పదమూడు దెయ్యాల్లో  రాజానాయాక్ (కార్తీ) అనే హెడ్ దెయ్యం కాష్మోరాకి కండిషన్ పెడుతుంది. ఓ శాపం వల్ల తను భూమ్మీదే ఏడు శతాబ్దాలుగా ప్రేతాత్మలా వుండిపోయాననీ, రోహిణీ నక్షత్రంలో పుట్టిన ఐదుగురు కుటుంబ సభ్యులే తనకి శాప విముక్తి కలిగించగలరని తాళపత్రాల్లో రాసి ఉందనీ, కాష్మోరా టీవీ ప్రోగ్రాంలో ఇచ్చిన స్టేట్ మెంట్ చూశాక- తన శాప విముక్తికి ఇతనే తగిన వాడని తెలిసి ఇక్కడికి రప్పించుకున్నాననీ అంటుంది. తనకి శాప విముక్తి కల్గిస్తేనే ఇక్కడ్నించీ బయటపడతారనీ భయపెడుతుంది. టీవీ ప్రోగ్రాంలో వాగిన వాగుడు ఇలా కొంపలు ముంచుతుందని తెలీని, మంత్ర తంత్రాలు రాని కాష్మోరా ఇప్పుడేం చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 
      డార్క్ ఫాంటసీ జానర్లో క్షుద్ర విద్యలతో మూఢనమ్మకాల మీద సెటైర్ గా ఉంటూ వినోద ప్రధానంగా వుంది. ప్రథమార్ధమంతా ‘పీకే’ నీ, ‘ఓ మై గాడ్’ నీ గుర్తుకు తెచ్చే సోషల్ కామెంట్ లా వుంది- కాకపోతే ఈ రెండు సినిమాలూ దైవ భక్తి  మీద వ్యంగ్యాస్త్రాలు. భూతవైద్యాల పేరుతో జరుగుతున్న మోసాలకి, మధ్య యుగాలనాటి ఓ శాపాన్ని సవాలుగా పెట్టి- జయించేది సహజ బుద్ధి వికాసాలే తప్ప, వక్రబుద్ధులతో ఏదీ సాధించలేరనీ చెబుతున్నట్టూ వుంది.  బీభత్స భయానకాలకంటే కూడా హస్యరస- అద్భుత రసాల సమ్మేళనంగా అర్ధవంతంగానూ వుంది. 


ఎవరెలా చేశారు 
        ద్విపాత్రాభినయంతో కార్తీ ఈ ఫాంటసీకి చాలా హైలైట్ అనే చెప్పాలి. మొదటి బోగస్ మంత్ర గాడి పాత్రని అతను రొటీన్ ఆవారా తాగుబోతు మాస్ పాత్రలా చేయకుండా రక్షించాడు. బయట బ్లాక్ మ్యాజిక్ లు చేస్తూ, కాలేజీలో చేరి హీరోయిన్ వెంటపడే, పాటలు పాడే, రొష్టు ఫార్ములా పాత్రగా కూడా కన్పించకపోవడం చాలాచాలా రిలీఫ్. ఇలా జరిగి వుంటే ఆద్యంతం అతడి పాత్ర  ఉత్థాన పతనాల క్యారక్టర్ ఆర్క్ ఏర్పడి తేజోవంతంగా కన్పించేది కాదు. చిన్న పిల్లల్ని కూడా అలరించే విధంగా వుండేది కూడా కాదు.  చేతబడులంటూ చేసే మోసాల్ని బాగా నవ్వొచ్చే విధంగా నటించి చూపే ఏకైక ఎజెండా ముందు, ఎలాటి ప్రేమ ట్రాకులూ డ్యూయెట్లూ అవసరపడలేదు. ముందు బోగస్ మంత్ర గాడిగా  తనలోకంలో తను ఎదురు లేని కింగ్, తర్వాత దెయ్యాల కోటలో పడ్డాక పడే తిప్పలతో తానొక జోకర్, చివరికి  తంటాలు పడి తనలోని – మరుగున పడిపోయిన అసలు మానవ బుద్ధికి పని చెప్పాకే తానొక మొనార్క్! మోస బుద్ధుల కొద్దీ నరకంలో పడితే, ఆ మోస బుద్ధులే కాపాడలేవు, మంచి బుద్ధులు  ఉపయోగిస్తే వాటికి బయటి నుంచి పాజిటివ్ శక్తులు తోడ్పడతాయి- ఇలా పాజిటివ్ శక్తుల్ని ఆకర్షించే మంచి బుద్ధులతోనే బ్రతికి పైకెదగాలే తప్ప మరో షార్ట్ కట్ లేదనే- ఈ కొట్టొచ్చి నట్టుండే ‘క్యారక్టర్ నోట్’ తో ఇంత కలర్ఫుల్ గా ముగిసే పాత్ర - చాలా కాలం తర్వాత దక్షిణ భారత వెండి తెర మీద ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనొచ్చు. ఐతే సమస్య ఎక్కడొచ్చిందంటే,  ఈ కాలంలో మనం ఇన్వాల్వ్ మెంట్ లేకుండా సినిమాల్ని పైపైన చూసేసి వదిలేస్తున్నాం. ఇన్వాల్వ్ మెంట్ తో అంతగా పనుండదు కాబట్టే ఆవారా టపోరీ పాత్రలకి అంత బాగా ఎడిక్ట్ ఐపోయాం. 

        దుష్టపాత్రగా రెండో పాత్ర కార్తీక్ లాంటి ఇంకా జ్యూనియర్ స్టార్ కి పెద్ద పరీక్షే అయినా, ఇదేం  లెక్క కాదన్నట్టు అవలీలగా నటించేశాడు. దురదృష్టమేమిటంటే, ఇలా రెండో పాత్రగా దుష్ట పాత్ర పోషించే స్టార్స్ కి ఎంతబాగా నటించినా ఉత్తమ విలన్ అవార్డు లివ్వరు! మొండెం నుంచి తల వేర్పడి మాట్లాడే, పోరాడే రాజానాయక్ దుష్ట పాత్రలో కార్తీక్ ని పోల్చుకోలేం, అది కార్తీక్ అని చెప్తే తప్ప. 

        నయనతార మధ్యయుగాలనాటి వీరత్వమున్న, దగాపడిన యువరాణి రత్నమహాదేవిగా తన అనుభవంతో పాత్రని నిలబెట్టింది. ఆమెతో సీన్స్ అన్నీ ఉద్విగ్నభరితంగా వున్నాయి. ఇక మిగతా పాత్రల్లో కార్తీ తండ్రిగా నటించిన కమెడియన్ వివేక్ (వివేకానందన్) ఇంకో ఎట్రాక్షన్. మంత్రి పాత్రలో విలన్ గా శరత్ లోహితశ్వావి అచ్చం విలన్ కుండే విగ్రహం, కళ్ళూ. 

        టెక్నికల్ గా క్వాలిటీ వుంది. సీజీ చేసిన దృశ్యాలు వున్నతంగా వున్నాయి. భారతీయ సినిమాల్లో మొదటి సారిగా వాడామని చెప్తున్న 360- డిగ్రీల ఆమ్ని డైరెక్షనల్ కెమెరా, దక్షిణ భారత సినిమాల్లో తొలిసారిగా ఉపయోగించామంటున్న త్రీడీ ఫేస్ స్కాన్ టెక్నాలజీలతో కెమెరామాన్ ఓం ప్రకాష్ ఎక్కడా కృత్రిమత్వం లేకుండా, ఎగుడుదిగుళ్ళు కన్పించకుండా చిత్రీకరణ జరపడం మంచి పనితనం. అయితే సంతోష్ నారాయణ్ సంగీతం పాటలకి తప్ప, బిజిఎం కి ఘోరంగా వుంది. 

చివరికేమిటి 
      దర్శకుడు గోకుల్ కథ చెప్పాడు, టెక్నాలజీ చూపించుకోలేదు. టెక్నాలజీని డామినేట్ చేయకుండా కథలో కలిపేసుకున్నాడు. ఇలాటి చాలా భారీ సినిమాల్లో టెక్నాలజీ ముందడుగు వేస్తూ, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ కనిపిస్తూ వుంటుంది. కానీ కథా కథనాలు, విషయమూ యోజనాల వెనకబడిపోయి అనాగరికంగా మనమీద స్వారీ చేస్తూంటాయి. ఇలాటిది జరగ లేదిక్కడ. దీని కథా కథనాలు స్ట్రక్చరల్ ఫ్రేమ్ వర్క్ లో టెక్నాలజీనే మరిపించేస్తాయి. ఒక అనుభూతికి లోను జేస్తాయి. అయితే రెండు లోపాలు కూడా లేకపోలేదు- ప్రధాన కథలో నేటివిటీకి, ఎమోషనల్ కనెక్ట్ కీ సంబంధించి. కార్తీ పాత్ర పోరాటం ఎమోషనల్ గా మనల్ని కూడా తీసుకుపోవాలంటే,  ఈ పాత్ర విలువైనదేదో  కోల్పోయే, అయ్యో పాపం అన్పించే,  పరిస్థితిని ఎదుర్కోవాలి. ఇది జరగలేదు. అలాగే మధ్య యుగాలనాటి పాజిటివ్ శక్తికి ప్రతీకగా నయనతార పాత్ర,   నేటివిటీకి కనెక్ట్ అయ్యే సెంటిమెంట్లతో- ఒక స్పిరిచ్యువల్ అనుభవాన్నివ్వాలి. ఇలాటివి కోడి రామకృష్ణ బాగా ఆలోచిస్తారు. గోకుల్ కూడా ఆలోచించి వుంటే మరింత సమగ్రంగా వుండేది ఈ ఫాంటసీ.


-సికిందర్
http://www.cinemabazaar.in