రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, November 13, 2024

1356: డైరెక్టర్స్ కార్నర్

 

    బేబీ డ్రైవర్, షాన్ ఆఫ్ ది డెడ్, హాట్ ఫజ్ మొదలైన 10 సినిమాలు తీసిన ఎడ్గార్ రైట్ హాలీవుడ్‌లో పనిచేస్తున్న బ్రిటన్ దర్శకుడు. 11 వ సినిమా ది రన్నింగ్ మ్యాన్ నిర్మాణంలో  వుంది. ఈయనది చాలా ప్రత్యేకమైన, ఉత్తేజపర్చే విజువల్ స్టయిల్. ఈయన సృష్టించే కథలు ఎల్లప్పుడూ హృదయాల్ని తాకుతాయి. వేగంగా సాగిపోయే వ్యంగ్య శైలి యాక్షన్ సినిమాలకి ప్రసిద్ధుడు. సంగీతానికి పెద్ద పీట వేస్తాడు. స్టడీ కామ్ ట్రాకింగ్ షాట్లు, డాలీ జూమ్ లు, ట్రాన్సిషన్లు, విప్ ప్యాన్లూ, వైప్లూ విస్తృతంగా వాడుతాడు. ఈయన ఇటీవల యూట్యూబ్ లో వర్ధమాన దర్శకులకి కొన్ని టిప్స్ చెప్పాడు. ఈ టిప్స్ టాలీవుడ్ కికూడా వర్తించవచ్చని ఇక్కడ ఇస్తున్నాం. పనిలో పనిగా బేబీ డ్రైవర్ స్క్రీన్ ప్లే సంగతులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టిప్ 1: ఇంపోస్టర్ సిండ్రోమ్‌ ని మీ ప్రేరణగా ఉపయోగించండి
        ఇంపోస్టర్ సిండ్రోమ్ దర్శకుల్లో సర్వసాధారణం. అయితే దీన్ని మోటివేషన్ గా తీసుకోవాలి. ఎల్లప్పుడూ సర్వసన్నద్ధంగా, కాన్ఫిడెంట్ గా వుండాలి. ఈ సిండ్రోమ్ ని వదిలించుకోలేక పోతే దీన్నే మిమ్మల్ని మీరు మెరుగుపరచడానికి, మిమ్మల్ని  ప్రేరేపించడానికి ఉపయోగించుకోవాలి. మీరు మీరుగా వుండాలని కోరుకోవాలి. ఇక్కడ మీ స్థానం మీకు రాసిపెట్టి వుందని నమ్మాలి.
        (ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటే... ఏదైనా పనిలో తమకు తామే అనర్హత ఫీలై దాన్ని కప్పి పుచ్చడానికి డాంబికంగా ప్రవర్తించడం. విజయం సాధించినప్పుడు కూడా ఈ ఫీలింగ్ వదలక పోవడం. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తుల్ని ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో తీవ్ర స్థాయిలో వుంది)

టిప్ 2: అసమంజలక్ష్యాలు  పెట్టుకోవద్దు

    మీ కోసం అసమంజస లక్ష్యాల్ని పెట్టుకోవద్దు. అమాంతంగా ఎవరూ ఆస్కార్ అవార్డు గెలవరు. సినిమాలు చేయడానికి సమయం, తగిన అభ్యాసం అవసరం. మీరు ఇష్టపడే సినిమాల నుంచి నేర్చుకోండి. ఓల్డ్ మాస్టర్స్ ఎలా చేశారో తెలుసుకోవడానికి పాత సినిమాలు చూడండి. వారి కెరీర్‌లని  అనుసరించండి. వారి మార్గాల నుంచి మనం ఎలాంటి స్ఫూర్తిని పొందగలమో చూడండి.
టిప్ 3: పాత సినిమాలు చూడండి
              చాలా మంది నిర్మాతలకి/దర్శకులకి సినిమాలనేవి ఎక్కడి నుంచి వచ్చాయో అవగాహన వుండదు. కాబట్టి సినిమాలు ఎక్కడికి వెళుతున్నాయో వారికి తెలుసని మనం ఎలా ఊహించగలం? అందుకని పాత సినిమాలు చూడండి. వాటిలో అద్భుతమైన ఫ్లాట్స్ వున్నాయి. మీరు ఇప్పటికీ అర్థం చేసుకోలేని కథనానికి పునాదిని అవి అందించగలవు.

 4: మీ సొంత శైలి ఇతరుల నుంచి  రావచ్చు
        ఇతర దర్శకుల నుంచి  స్ఫూర్తి పొందడం ఫర్వాలేదు, కానీ వారి శైలిని కాపీ చేయవద్దు. మీ సొంత శైలినీ, మీదంటూ ఒక సొంత వాయిస్ నీ కనుగొనడానికి ప్రయత్నించండి. ప్రారంభంలో అనుకరించడం చాలా సులభం, కానీ నిజంగా మిమ్మల్ని మీరు కనుగొనడానికి మీ సొంత ఎంపికలు మీకవసరం. మీలోని ఏ టాలెంట్ ని తెరపైకి తీసుకురాగలరో గుర్తించండి.

టిప్  5: మీ మొదటి సినిమాతో తొందరపడకండి
        చేస్తున్న ప్రయత్నం మీద మీ సమయాన్నంతా వెచ్చించండి. తప్పులు చేయడానికి యపడకండి. మీ తప్పులు మీరు నేర్చుకోవడానికి, ఎదగడానికి సహాయపడతాయి. ఎవరూ వెంటనే ఏదైనా పరిపూర్ణంగా చేయలేరు. మీకు గట్టి పునాది వచ్చే వరకు మీరు విఫలమై మళ్ళీ మళ్ళీ విఫలమవ్వాలి. ఎదగడానికి ఇదే మార్గం.

చిట్కా 6: వాయిదా వేయడాన్ని ఉత్పాదక శక్తిగా మార్చండి
    ప్రతి ఒక్కరూ పనులు వాయిదా వేయడానికి ఇష్టపడతారు. కానీ మీరు స్ఫూర్తిదాయకమైన పనులు చేయడం ద్వారా మీ వాయిదా వేసే అలవాటుని ఉత్పాదక శక్తిగా మార్చవచ్చు. మ్యూజియమ్‌కి వెళ్ళండి, అక్కడ పురాతన విశేషాల్ని స్టడీ చేయండి. జూ కెళ్ళండి, జంతువుల ప్రవర్తనని తెలుసుకోండి. మీ విశ్రాంతి సమయాన్ని ఇంకేదో ఉత్పాదక శక్తిగా మారుస్తూ గడపండి.
టిప్ 7:  స్క్రీన్ ప్లేలో కథని కథలా వుంచండి
        రాయడం అనేది మీరు మీ సొంత సమయాన్ని మెరుగుపరచుకోగల నైపుణ్య వ్యాపకం. స్క్రీన్‌ప్లే రాయడం ప్రారంభించడానికి మీకు పెద్ద బడ్జెట్ అవసరం లేదు. మీకు కేవలం ఒక ఆలోచన అవసరం. కథ, సంభాషణలు, పాత్రలూ, వీటికి సంబంధించిన విజువల్సూ మొదలైన వాటిపై దృష్టి పెట్టండి. చాలా ఎక్కువ కెమెరా యాంగిల్స్ ని చేర్చడాన్ని మానుకోండి. కథని కథలాగా సాగనివ్వండి.

 8: షార్ట్ ఫిల్మ్స్ చేయడం ద్వారా నేర్చుకోండి
        మూవీ మేకింగ్ గురించి తెలుసుకోవడానికి షార్ట్ ఫిలిమ్స్ గొప్ప మార్గం. అవి తయారు చేయడానికి చాలా చౌకగా వుంటాయి. విభిన్న శైలులతో ప్రయోగాలు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. సన్నివేశాల్లోకి వేగంగా ఎలా ప్రవేశించాలో, బయటికి ఎలా వెళ్ళాలో కూడా అవి మీకు బోధిస్తాయి. మీ మార్గంలో ఎంచుకున్న ఇతర రచనా నైపుణ్యాల్ని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మెరుగుపరుచుకోవచ్చు.

చిట్కా 9: మీకు హాలీవుడ్ బడ్జెట్ అవసరం లేదు

    మీకు అందుబాటులో వున్న పెట్టుబడితో  సినిమాలు చేయడం ద్వారా మీ కెరీర్ ని ప్రారంభించండి. మీ ఫోన్‌లో షూట్ చేయండి, ఉచిత వనరుల్ని ఉపయోగించండి. కాలక్రమేణా మీ నైపుణ్య స్థాయితో మీ బడ్జెట్‌ ని  పెంచుకోండి. మీరు చాలా తక్కువ ఖర్చుతో గొప్ప కథలు చెప్పగలరు. మీరు పరిమితులలో పని చేయాలి-ఆ బడ్జెట్ పరిమితులు మీకు స్ఫూర్తినిచ్చేలా చేయండి.
చిట్కా 10: ఫిల్మ్ ఫెస్టివల్  ఎంట్రీల గురించి తెలివిగా వుండండి
                చలనచిత్రోత్సవాలు మీ సినిమాని ఎక్కువ మంది ప్రేక్షకులు చూసేందుకు తోడ్పడే గొప్ప మార్గం, కానీ మీ అంచనాలకి అనుగుణంగా వాస్తవికంగా వుండండి. చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ వుంటాయి. కాబట్టి పూర్తి సమాచారం సేకరించండి. దాంతో మీ సినిమాకి సరిపోయే ఫెస్టివల్స్ కి పంపండి.

        ఎడ్గార్ రైట్స్ ఇస్తున్న పై

టిప్స్ తో బాటు అతడి సినిమాలు కూడా చూస్తే వాటి వెనుక అతడి కళా తృష్ణ నుంచి కూడా కొత్తగా ఎంతో నేర్చుకోవచ్చు. హాట్ ఫజ్ అనే బడ్డీ కాప్ సినిమా తీయడానికి 130 అమెరికన్ బడ్డీ కాప్ సినిమాలు చూశాడతను.

—సికిందర్