రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, June 2, 2016

షార్ట్ రివ్యూ!






రచన –దర్శకత్వం : త్రివిక్రం 

తారాగణం :   నితిన్‌, సమంత, అనుపమా పరమేశ్వరన్‌,  నరేష్‌, నదియా, ఈశ్వరీరావు, అనన్య, శ్రీనివాస్‌ అవసరాల,  రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి తదితరులు 
సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: నటరాజన్‌ సుబ్రమణ్యం 
బ్యానర్ :  హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌,నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ 
రచన : దర్శకత్వం: త్రివిక్రమ్‌ 
విడుదల: 02-06-2016
        ***

       ఒకే ఫార్ములాతో వరసగా రెండు ఫ్యామిలీ సినిమాలు తీసిన త్రివిక్రం నుంచి మళ్ళీ  అదే ఫార్ములా రిపీట యింది.  విడిపోయిన కుటుంబాలు కలుసుకునే ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ల తర్వాత  ‘అ ఆ’ సైతం  అదేబాటలో   ‘విడిపోయిన అత్త గారు ఎలా కలిశారు’  ఫార్ములాని రిపీట్ చేసింది. అయితే  ఈసారి హుషారైన రోమాంటిక్ సినిమాలతో క్రేజ్ పెంచుకున్న హీరో  నితిన్ ఇమేజిని కావలసినంత కుదించి,  సమంతాతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా తీయడం ప్రత్యకత. కానీ  సమంతా కైనా ఆ హీరోయినిజం సరీగ్గా లేకపోవడంతో, రెండు కుటుంబాలు వాళ్ళు వాళ్ళు ముచ్చట్లాడుకునే సోప్ ఒపేరాలా కొత్త రూపం ధరించింది. వివరాల్లోకి వెళ్దాం...


 కథ :
        బిజినెస్ వుమన్ మహాలక్ష్మి (నదియా) అంటే భర్తకీ కూతురికీ హడల్. భర్త రామలింగం ( నరేష్), కూతురు అనసూయ ( సమంతా) ఒక జట్టుగా మహాలక్ష్మికి వ్యతిరేకంగా పథకాలేస్తూంటారు.  బెనర్జీ (గిరిబాబు) మనవడు శేఖర్ ( అవసరాల శ్రీనివాస్) తో మహాలక్ష్మి అనసూయకి సంబంధం చూస్తే  నచ్చక ఆత్మహత్యా యత్నం చేస్తుంది అనసూయ. ఆమెని మందలించి, ఈ సంబంధం చేసుకోవాల్సిందేనని,  పది రోజులు పని మీద చెన్నై వెళ్తుంది మహాలక్ష్మి. ఇక్కడ బోరు కొట్టి ఎక్కడికైనా వెళ్తానని మహాలక్ష్మి అంటుంది. ఆమెని ఏనాడో దూరమైన తన బావగారి వూరు కల్వపూడికి రహస్యంగా పంపించేస్తాడు రామలింగం- వెంట హైదరాబాద్ లోనే పనిచేస్తున్న మేనల్లుడు ఆనంద విహరి( నితిన్) నిచ్చి. ఆనంద్ తో వెళ్లి అనసూయ వాళ్ళింట్లో దిగుతుంది. ఆమె ఎవరో తల్లి కామేశ్వరి ( ఈశ్వరీ రావు)కీ, చెల్లెలు భాను (అనన్య) కీ పరిచయం చేస్తాడు ఆనంద్. అక్కడ తన డిమాండ్లతో, చిలిపి పన్లతో సరదాగా కాలం గడుపుతున్న అనసూయకి- ఆనంద్ ఏనాడో వూరిపెద్ద పల్లం వెంకన్న  ( రావురమేష్) కూతురు వల్లి ( పరమేశ్వరన్)తో సంబంధం కుదిరిందని తెలిసి జెలసీ ఫీలవుతుంది. ఇంతలో తను హైదరాబాద్ లో ఇంట్లో లేదన్న సంగతి తల్లికి తెలిసిపోయి వచ్చేస్తూంటే, ఆనంద్ ఆమెని తీసుకుని ఆమె తల్లి చేరుకునే లోగా ఇంటిదగ్గర దిగ బెట్టేస్తాడు. 

        ఇప్పుడేం జరిగింది? ఆనంద్ లేకుండా అనసూయ ఇంటిదగ్గర వుండగల్గిందా? ఆనంద్ నాగవల్లిని చేసుకోవడానికి ఒప్పుకోవడానికి కారణమేమిటి? మహాలక్షికి అనసూయ కల్వ పూడికి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందా? తెలిస్తే ఏం జరిగింది? మహా లక్ష్మికి  ఆనాడు తన అన్నతో జరిగిన గొడవేంటి? ఎందుకు విడిపోయారు? ఇప్పుడెలా కలిశారు?...ఇవీ మిగతా కథలో తీర్చుకోవాల్సిన సందేహాలు. 

 ఎలావుంది కథ
        ముందుగానే చెప్పుకున్నట్టు మేనరికాల పాత కథే. విడిపోయిన కుటుంబాల రొటీన్ కథే. చూసి చూసి చూసి వున్న రీసైక్లింగ్ కథే. ఇన్నేసి సార్లు తీస్తున్న వాళ్లకే  విసుగులేనప్పుడు, కొందరు చూసే వాళ్ళకి ఎందుకుండాలి? మళ్ళీ మళ్ళీ చూసేయాలి. తప్పకుండా చూడాలి.

 ఎవరెలా చేశారు 
         ఓపెనింగ్ సీనుతో మొదలెడితే,  తన వాయిసోవర్ తో అక్కడక్కడా కథా గమనాన్ని చెప్తూ సాగే సమంతాకి కేవలం గ్లామరస్ పాత్రే ఇది. ఈ విషయంలో ఈ సినిమాకి హైలైట్ గా కనిపిస్తుంది, పాత్రపరంగా చెప్పుకోవాలంటే హీరోయిన్ ఓరియెంటెడ్ అయిన ఈ కథలో తనకి కథ నడిపే పనికూడా లేదు, కేవలం దర్శకుడు ఏర్పాటు చేసే ఆయా సీన్లలో చిలిపిగా నటించుకుపోవడమే. 

        ఇది నితిన్ కథతో సినిమా కాదు కాబట్టి పాసివ్ పాత్ర అని కూడా అనలేకుండా సహాయ పాత్రగా కన్పిస్తాడు. సహాయ పాత్ర కాబట్టి ఒక హీరో కుండే గోల్, సంఘర్షణ వగైరా లేక- చూస్తే  చూడండి, పోతే పోండి - అన్నట్టు వుంటాడు. ఈ సినిమా కథ విషయంలో, ప్రధాన పాత్ర విషయంలో ఇక నిర్వచనాలు మార్చుకోవాలన్న ధోరణిలో వుంటుంది. 

        ఇతర పాత్రల్లో నదియా, నరేష్ లు ఆకట్టుకుంటారు. అయితే రావురమేష్ ఉన్న కొన్ని సీన్లలో ఎక్కువ ప్రభావం చూపిస్తాడు- ఫన్నీ డైలాగులతో. సినిమా ముగింపు షాట్ అతడిమీదే వుంటుంది- అప్పుడు పలికే చిన్న డైలాగుతో బాగా హోరెత్తించేస్తాడు. హిందీ విలన్లు రాజ్యమేలుతున్న కాలంలో రావు రమేష్ ఒక్కడే విలనీకి తెలుగుదనాన్ని నూరిపోస్తున్నాడు. 

        మిక్కీ జె మేయర్ పాటలు తెర మీద చూస్తున్నంత సేపే- బయటికొస్తే ఒక్కటీ గుర్తుండవు. ఈ పాటలకీ,  మిగతా అన్ని దృశ్యాలకీ నటరాజన్ సుబ్రహ్మణ్యం కెమెరా పనితనం క్లాస్ లుక్ ని తీసుకొచ్చింది. నితిన్ కి తొలిసారిగా చాలా పెద్ద బడ్జెట్ తో ఎక్కువ సాంకేతిక ప్రమాణాలున్న సినిమా దక్కింది.

చివరికేమిటి!
        చూసిందే చూడాలనుకుంటే చూడొచ్చు. షరతులు వర్తిస్తాయి : ఏ హీరోయినిజమూ, హీరోయిజమూ ఆశించకూడదు. త్రివిక్రమ్ సినిమాల్లో ఏ స్క్రీన్ ప్లే స్ట్రక్చరూ, క్యారక్ట రైజేషన్  లూ వుండవన్న నిర్ధారిత సత్యానికి ఈ సారి మాటల బలం కూడా లేకుండా పోయింది. ఇదలా ఉంచితే, చాలా తక్కువ చోట్ల మాత్రమే సీన్లలో పెప్, హుషారు కన్పిస్తాయి. అలాగే  పాత్రలకి గోల్ లేకపోవడంతో సెకండాఫ్ లో కూడా ఎంత సేపూ కథ ప్రారంభంకాక, చాలా సేపూ డల్  అయిపోతుంది. క్లయిమాక్స్ కొచ్చేసరికి, అది  నితిన్ పాత్ర మీద బలవంతంగా రుద్దిన ముగింపులా  కన్పిస్తుంది. సమంతాని అతను  వాళ్ళింట్లో అప్పజెప్పేసి వెళ్తున్నప్పుడు నితిన్ చెల్లెలి పాత్ర అనే ఒక మాటతో- “నా ఆనందం  నా గెలుపులో చూసుకోవాలి, ఎదుటి వాడి ఆనందంలో  ఎందుకు చూడాలి” - అని వెనక్కి వెళ్లి తండ్రి దగ్గర్నుంచి సమంతాని లాక్కుంటాడు.  నితిన్ పాత్ర  పాజిటివ్ అయివుంటే ఇలా చేయదు- త్యాగం చేసి వెళ్లి పోవాల్సిందే. అసలు ఎదుటి వాళ్ళ విజయాల్ని మనం ఎంజాయ్  చేస్తేనే  అలాటి విజయాలు మనకొస్తాయ్ - ఇది పాజిటివ్ అవుట్ లుక్!


-సికిందర్
cinemabazaar.in