రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, October 9, 2016

రివ్యూ!

రచన-  దర్శకత్వం: వీరూ పోట్ల
తారాగణం: సునీల్‌, సుష్మా రాజ్‌, రిచా పనాయ్‌, పునీత్‌ ఇస్సార్‌, జయసుధ, అరవింద్‌కృష్ణ, నరేష్‌, శత్రు, షకలక శంకర్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, పృధ్వీ 
సంగీతం: సాగర్‌ ఎం.శర్మ, ఛాయాగ్రహణం: దేవరాజ్‌
బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
విడుదల: అక్టోబరు 7, 2016
***
యాక్షన్ హీరో- కమెడియన్ సునీల్ మరో దండయాత్ర చేస్తూ విజయదశమికి వచ్చేశాడు. కాస్త పంథా మార్చి ఈసారి కామిక్ థ్రిల్లర్ తో అదృష్ట పరీక్షకి నిలబడ్డాడు. అదృష్టం దక్కని గత కొన్ని మూస ఫార్ములా యాక్షన్ కామెడీలకి దూరంగా కొంచెం తేడా గల ప్రయత్నం చేద్దామనుకున్నట్టుంది- తేడా రాకుండా చూసుకునే బాధ్యత మాస్  సినిమాల దర్శకుడు వీరూ పోట్ల భుజానేసుకున్నాడు. అప్పుడేం జరిగింది? తేడా వచ్చిందా, తేడాగల ప్రయత్నంగా నిలబడిందా తెలుసుకోవాలంటే బంగార్రాజు కథలోకి వెళ్ళాలి...

కథ 
     అతను బంగార్రాజు (సునీల్). బెజవాడ వస్తాడు పని వెతుక్కుంటూ.  నారదరావు (పృథ్వీ) కొరియర్ కంపెనీలో చేరతాడు. తను ఎవరి దగ్గర పనిలో చేరినా  ఆ యజమాని తన్నులు తిని వ్యాపారం కోల్పోవడమే జరుగుతుంది. అలా తన్నులు తిని వ్యాపారం కోల్పోయిన నారదరావు, బంగార్రాజుని వదిలించుకుంటూ హైదరాబాద్ పంపించేస్తాడు.  అక్కడ బంగార్రాజుకి రోడ్ల మీద తిరిగే గీత (సుష్మా రాజ్) పరిచయమవుతుంది. ఓ స్కూల్ టీచర్ (జయసుధ) ని ఓ అవమానం నుంచి కాపాడడంతో ఆమెకి అతడిలో ఇప్పుడు లేని తన పెద్ద కొడుకు కన్పిస్తాడు. దాంతో  ఇంట్లో ఆశ్రయమిస్తుంది. ఇంట్లో చేరిన బంగార్రాజు ‘తమ్ముడు’ శ్రీనివాస్ (అరవింద్ కృష్ణ) పని చేసే కంపెనీలోనే చేరతాడు. 

        ఉన్నట్టుండి బంగార్రాజు చిక్కుల్లోపడతాడు. ఒక గ్యాంగ్ సునీల్ వర్మ అనే వాడికోసం వెతుకుతూంటారు. వాడు ఓ విగ్రహం కొట్టేసుకు పోయాడు. ఆ విగ్రహంలో 900 కోట్ల రూపాయల విలువైన వజ్రాలున్నాయి. ఆ వజ్రాలు బెట్టింగ్ మాఫియా మహదేవ్ (పునీత్ ఇస్సార్) కి చెందినవి. మహదేవ్ కొడుకు సహదేవ్ తన గ్యాంగ్ తో సునీల్ వర్మ కోసం వెతుకుతూంటే బంగార్రాజు దొరికిపోతాడు. బంగార్రాజు సునీల్ వర్మ పోలికలతోనే వుం టాడు. తను సునీల్ వర్మ కాదని ఎంత మొత్తుకున్నా, అతడి తమ్ముణ్ణి కిడ్నాప్ చేసి  వజ్రాలు పట్రమ్మంటారు. బంగార్రాజు సునీల్ వర్మని పట్టుకుని తమ్ముణ్ణి విడిపించుకునేం దుకు  అన్వేషణ మొదలెడతాడు. ఈ అన్వేణలో ఏమేం జరిగాయి, ఏఏ కుట్రలు బయట పడ్డాయి,ఎవరెవరు కుట్ర దారులుగా బయట పడ్డారు, అసలు సునీల్ వర్మ ఎవరు, అతణ్ణి  ఎలా పట్టుకున్నాడు బంగార్రాజు - అన్నవి మిగతా కథలో తెలిసే అంశాలు.

ఎలా వుంది కథ 
      కామిక్ థ్రిల్లర్ జానర్ లో సస్పన్స్ ని జోడించుకున్న కథే. కానీ దర్శకుడు గతంలో మూస ఫార్ములా మాస్ సినిమాల దర్శకుడవడం చేత ఆ వాసనలన్నీ ఇందులోకి జొరబడి పోయి జానర్ మర్యాదని దెబ్బ తీశాయి. ప్రేక్షకులు తమిళ డబ్బింగ్ సినిమాల్లో తమిళ వాసనలు  పసిగట్టినట్టు, జానర్ కాని జానర్ వాసనలు కూడా ఇప్పుడు పసిగట్టి ఫ్లాప్ చేయగలరని గత సంవత్సరం తెలుగులో విడుదలైన ఫ్లాప్ సినిమాలన్నీ నిరూపించాయి. అవన్నీ జానర్ మర్యాదని మంటగలిపినవే. జానర్ మర్యాదని కచ్చితంగా పాటించిన కేవలం అయిదారు చిన్నా పెద్దా తెలుగు సినిమాలు మాత్రమే గత సంవత్సరం హిట్టయ్యాయి. కామిక్ థ్రిల్లర్ అంటేనే ట్రెండీగా, న్యూవేవ్ మూవీలా వుండాలి. వుంది కాబట్టే ‘స్వామిరారా’ అనే కామిక్ థ్రిల్లర్ అంత  హిట్టయింది. మూస ఫార్ములాతో ఆ నిగ్రహం చూపించలేదు కాబట్టే అదే దర్శకుడు తీసిన ‘దోచేయ్’ అంత ఫ్లాపయ్యింది. కామిక్ థ్రిల్లర్ ‘దోచేయ్’ ని దెబ్బ తీసిన పాత మూసఫార్ములా పైత్యాలే ‘ఈడు గోల్డ్ ఎహె’ జానర్ మర్యాదని కూడా చెరిచాయి. ఏ పాత మూస వాసనలతో గత కొన్ని సినిమాల కథలతో సునీల్ కి శృంగభంగమవుతూ వచ్చిందో, అవే వాసనలు పుష్కలంగా ఈ జానర్ కథకీ పూశారు. మదర్ సెంటిమెంటు, బ్రదర్ సెంటిమెంటు, బరువైన సెంటిమెంటల్ డైలాగులూ, అనాధ హీరో పాత్ర, హీరో మూస ఎంట్రీ, హీరో ఎక్కడ పనిలో చేరితే  అక్కడ నష్టం అనే క్యారక్టరైజేషన్- ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఇద్దరు హీరోయిన్లు, రొటీన్ స్లాట్స్ లో వాళ్ళతో రోమాన్సులూ పాటలు, బంగార్రాజు అనే పేరు, ఈడు గోల్డ్ ఎహె అనే టైటిల్ కూడా సంకల్పించిన జానర్ కి రసభంగమే. ఇవి అసలు కథని చాలా దెబ్బ తీశాయి. కామిక్ థ్రిల్లర్స్ తో అంత అలరించిన, నవ్వించిన జాకీ చాన్ సినిమాల్లో ఇలాటివి వుంటాయా? ప్రతీ జానర్ కథలోనూ జానర్ స్పృహ లేకుండా నవరసాలన్నీ నింపాలన్నచాపల్యం వుంటే, దీన్ని ఓరకంట గమనిస్తున్నారిప్పుడు ప్రేక్షకులు.

ఎవరెలా చేశారు 
        సహజంగానే సునీల్ నటన లక్ష్యిత జానర్ కి న్యాయం చేయడం కష్టమైపోయింది. ఈ కామిక్ థ్రిల్లర్ లక్ష్యిత జానర్ పట్ల స్పష్టత వుంటే,  ఆ ప్రకారం సీన్లు మార్పించి ఆ జానర్ కి తగ్గ ఆటాడుకునే వాడు. ‘ముత్యాల ముగ్గు’ లో తల్లి కున్న విషాదం పిల్లలు అనుభవించరు. పిల్లలు బాధ పడే సీను ఒక్కటి కూడా వుండదు. వాళ్ళ హాస్య ధోరణిలో వాళ్ళు విలన్లతో ఆటాడుకుని తల్లికి న్యాయం చేస్తారు. ఆ విషాద కథని అద్భుత రసంతో నడిపారు. అయోధ్య కొచ్చిన లవకుశలు కూడా అడవి పాలైన  తల్లి సీత గురించి బాధ పడుతూ కూర్చోరు. యాక్టివ్ క్యారక్టర్స్ ఎప్పుడూ బాధ పడుతూ కూర్చోవు. సునీల్ కి ఈ వెసులుబాటు లేకుండా పోయింది. పైన చెప్పుకున్న మూసఫార్ములా ధోరణుల వల్ల బాధ,  ఏడ్పు, రోషాలు, అక్రందనలూ, సెంటిమెంట్- మెలోడ్రామాలూ కూడా నటించడంతో జానర్ ప్రధాన రసమైన అద్భుత రసం, దీని బై ప్రోడక్టు అయిన హస్యరసమూ దెబ్బతినిపోయాయి. కథలో రెండే కీలక పరిణామాలని గుర్తించినప్పుడు (తమ్ముడు అనేవాడి కిడ్నాప్, సునీల్ వర్మ పేరుతో తనలాగే మరొకడు- అనే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడిన సమస్య- గోల్) వీటి ఆధారంగానే ముత్యాల ముగ్గు పిల్లల్లాగా నవ్విస్తూ, జాకీచాన్ లా నరుక్కుంటూ పోవాలే తప్ప- వీటి తాలూకు విషాదం, బాధ ఏదైనావుంటే వాటిని ప్రేక్షకులు ఫీలవడానికి ముత్యాల ముగ్గులో లాగా, బ్యాక్ డ్రాప్ లో సబ్ టెక్స్ట్ లా వదిలెయ్యాలే తప్ప- అన్నీ విప్పి అవన్నీ నటన ద్వారా ప్రదర్శిస్తే  చాలా దెబ్బతినిపోతుంది వ్యవహారం. 

        హీరోయిన్ల పాత్రలూ మూస ఫార్ములా హీరోయిన్లలాగే వున్నాయి ఎక్స్ పోజింగ్స్ తో. పునీత్ ఇస్సార్ విలన్ పాత్రకి బాగా సరిపోయాడు భీకరంగా. మిగిలినవి కామెడీ పాత్రలు. రెండో హీరోయిన్ తండ్రిగా నరేష్, కిడ్నాపర్ గా పోసాని, ఫాం హౌస్ ఓనర్ గా పృథ్వీ, రైల్వే టీసీగా వెన్నెల కిషోర్, దొంగోడిగా షకలక శంకర్, నరేష్ ఇంట్లో పనివాడుగా భరత్ - వీళ్ళందరికీ సునీల్ పాత్రకి లాగా ఏ బాధల బ్యాగేజీ, సెంటిమెంట్ల బస్తాలూ లేకపోవడం వల్ల హేపీ - గో- లక్కీగా నవ్వించుకుంటూ పోయారు. ముఖ్యంగా పృథ్వీ, వెన్నెల, షకలక కామెడీ చివరంటా నవ్వించేదే. ఇందులో పృథ్వీ మళ్ళీ వేరే సినిమాల పేరడీ లేవీ చేయకుండా ఫ్రెష్  కలర్ఫుల్ క్యారక్టర్ లో నటించాడు.  
    
        సంగీతం, కెమెరా వర్క్ ఓ మాదిరిగా వున్నాయి. కొన్ని సీన్లలో డీఐ శృతిమించింది. యాక్షన్ దృశ్యాలు క్లయిమాక్స్ లో జానర్ కి విరుద్దంగా హింసాత్మకంగా వున్నాయి. కారణం, వెనకటి దృశ్యాల్లో హీరో తల్లిని విలన్ కొట్టి వుండడం. కాబట్టి హీరో విలన్ల మధ్య హీరో మదర్ సెంటిమెంట్లూ ఎమోషన్స్ తో ఈ హింస. ఈ కథలో అనవసరమైన తల్లి పాత్ర వల్ల, తల్లిని విలన్ కొట్టే అనవసరమైన దృశ్యం వల్ల,  క్లయిమాక్స్ ఫైట్ హీరో విలన్ల మధ్య జానర్ ప్రకారం హిలేరియస్ గా వుండక, యమ సీరియస్ అయిపోయింది వ్రతం చెడగొడుతూ. 

చివరికేమిటి 
        ఓ మంచి ఐడియాతో ఈ ‘కామిక్ థ్రిల్లర్’ కి పూనుకున్నాడు వీరూపోట్ల. ఇందులో అంచెలంచెలుగా వీడే సస్పెన్స్ వుంది. ఎండ్ సస్పెన్స్ అన్పించని ఎండ్ సస్పెన్ కథనం ప్రాణంగా వుంది- ఎండ్ సస్పెన్స్ గండాన్ని దాటే విధం చూపిన ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ – బ్రిటిష్ సస్పెన్స్, 1958 (హిందీలో ‘ధువాఁ’ - 1981, బెంగాలీలో ‘శేషాంక’ - 1963, తమిళంలో ‘పుథియ పరవాయి’ - 1964) తరహాలో అప్రయత్నంగానో,  ప్రయత్న పూర్వకంగానో కథనం చేశాడు. కథలో సస్పెన్స్ వుందని చివరి వరకూ తెలియ జేయకపోవడం ఈ తరహా కమర్షియల్ సినిమాలకి పనికొచ్చే ఎండ్ సస్పెన్స్ బాపతు కథనం. క్లయిమాక్స్ లో ఫైనల్ షోడౌన్ ఇస్తూ పాత్రలన్నీ ఓపెన్ కావడం ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ లాంటి మాస్టర్ స్ట్రోకే. ఇంతమంచి జానర్ ఫ్రెండ్లీ తురుపు ముక్క చేతిలో పెట్టుకుని దర్శకుడు విజాతి మూస ఫార్ములా ధోరణులతో ఎవరినో సంతృప్తి పరుస్తూ కూర్చున్నాడు. గంటంపావు సేపు ఫస్టాఫ్ అంతా అసలు కథేమిటో తెలియకుండా పోయే గజిబిజి మూస మాస్ దృశ్యాలతో పాత సినిమాలాగా నడుస్తుంది. ఇంటర్వెల్లో తమ్ముడి కిడ్నాప్, సునీవర్మ యాంగిల్,  ఓపెన్ కావడంతో అసలు కథ మొదలైనా- దీనికీ మళ్ళీ సెకండాఫ్ లో హీరోకి కొనసాగించిన సెంటిమెంటు సిమెంటు బస్తాలతో హమాలీ కథైపోయింది క్లైమాక్స్ వరకూ. అసలు స్క్రీన్ ప్లే అంటే ఏమిటో తెలిసి ఈ సినిమా తీసినట్టు కన్పించదు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రేక్షకులు ఎలర్ట్ అయ్యేట్టు చేసిన - బంగార్రాజులా వున్నాడంటున్న సునీల్ వర్మ అసలెవరన్న  పాయింటు ప్రధానంగా హీరో పాత్ర ప్రయాణం కొనసాగించకుండా- అంత ముఖ్యమైన పాయింటూ, అసలు కిడ్నాపైన తమ్ముడి విషయమూ మరుగున పడేలా వేరేవేరే కథనాలు చేసుకుంటూ పోయారు. 

        రచయితగా దర్శకుడు సఫలమయ్యింది కామెడీ దృశ్యాల్లోనే. సునీల్- నరేష్- భరత్ ల మధ్య అదొక ఫన్నీ దృశ్యం. రైల్లో వెన్నెల కామెడీ ఎపిసోడ్ మరో ఎంటర్ టైనర్, ఫాం హౌస్ లో కోళ్ళ గురించి పృథ్వీ వెర్బల్ కామెడీ మరో వినోదం. అయితే ఎడాపెడా ప్రతీ చోటా ప్రాస డైలాగులు వాడేశారు. సీన్లు ఫన్నీగా వుండడంతో ఈ ప్రాస డైలాగులు చెల్లిపోయాయి. విలన్ ‘బ్లడీ ఫూల్’  అంటే కమెడియన్ ‘లకడీకా పూల్’  అనడం, వెన్నెల డౌట్ కి పృథ్వీ ‘బ్లెండర్ పడితే పడితే జెండర్ తెలీదు’ అనడం ...లాంటివి బహుశా హిందీలో వచ్చే మైండ్ లెస్ కామెడీల కిందికొస్తుంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కామెడీ నాటికల్లో కన్పించే ఇలాటి మాటకి మాట ఏదో మాట అనెయ్యడమనే డైలాగ్ స్కీమ్ రచయిత- దర్శకుడు అయిన వీరూపోట్ల చివరంటా దారం తెగకుండా చక్కగా పోషించాడు- ఈ బిజీలో తెగిన గాలిపటం అయింది అసలు కథే!


-సికిందర్
http://www.cinemabazaar.in







.