రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, మార్చి 2021, గురువారం

1022 : దర్శకుడి స్టోరీ


   ‘ర్జున్ రెడ్డి లాంటి సూపర్ డూపర్ హిట్ అందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి టాలీవుడ్ లో రెండో సినిమా దొరకడం లేదు. విజయ్ దేవరకొండ స్టార్ డమ్ ని ఏక్ దమ్మున పెంచేసిన అర్జున్ రెడ్డి తర్వాత నుంచి  వంగా టాలీవుడ్ లో  ఖాళీగానే వున్నాడు. 2017 లో అర్జున్ రెడ్డి విడుదలైంది. అప్పట్నుంచీ ఈ నాల్గేళ్ళూ చెయ్యని ప్రయత్నమంటూ లేదు. తెలుగు స్టార్స్ కి అతడి కథలు నచ్చలేదని అప్పట్లో చెప్పుకున్నారు. ఇక లాభం లేదని బాలీవుడ్ వైపు దృష్టి సారించాడు. అక్కడ అదృష్టం పలకరించింది. అర్జున్ రెడ్డి రీమేక్ కి షాహిద్ కపూర్ అంగీకరించాడు. దీంతో అక్కడి నిర్మాణ సంస్థతో కబీర్ సింగ్ తీస్తే అది అతి పెద్ద హిట్టయ్యింది. 60 కోట్ల బడ్జెట్ తో తీస్తే 370 కోట్లు వసూలు చేసింది. ఇది వంగా సాధించిన పెద్ద రికార్డు. ఇది 2019 లో జరిగింది. తిరిగి టాలీవుడ్ మీద దృష్టి పెట్టి  మళ్ళీ ప్రయత్నాలు చేసీనా, నో అనే చెప్పింది టాలీవుడ్.

నిజానికి అర్జున్ రెడ్డి కి కూడా నిర్మాతలు దొరకలేదు. నాల్గేళ్ళూ తిరిగి తిరిగి విసిగి, తానే స్వయంగా నిర్మించేందుకు పూనుకున్నాడు. తండ్రి, సోదరుడు నిర్మాతలుగా ముందుకొచ్చారు. అలా 5 కోట్ల బడ్జెట్ తో అర్జున్ రెడ్డి నిర్మించారు. అది 50 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయినా తెలుగు స్టార్లు ఆసక్తి చూపలేదు.

        కబీర్ సింగ్ హిట్ ని చూసి కూడా తెలుగు స్టార్లు అవకాశమివ్వక పోవడంతో మళ్ళీ బాలీవుడ్ కెళ్ళిపోయాడు. వెంటనే అక్కడ రణబీర్ కపూర్ తో ఓకే అయ్యింది. సందీప్ చెప్పిన యానిమల్ స్టోరీకి కబీర్ సింగ్ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ కూడా వెంటనే ఓకే చెప్పి ఎననౌన్స్ కూడా చేసేశారు. ఇక చక చకా పరిణితి చోప్రా, అనిల్ కపూర్, బాబీ డియోల్ వంటి స్టార్లు కూడా ఇందులో నటించేందుకు బుక్కైపోయారు.

        ఇదీ సందీప్ రెడ్డి లక్ బ్యాడ్ లక్ ల దొబూచులాట. బాలీవుడ్ లోనే లక్ వున్నట్టు అనుకోవాలి. అక్కడే సెటిలైతే తెలుగు నుంచి రెండో రామ్ గోపాల్ వర్మ అవుతాడు. ఇక టాలీవుడ్ కి రాంరాం, బాలీవుడ్ గయా రామ్ అనుకుని సెకండ్ వర్మ అయిపోతే సరి!
***

1