రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

6, నవంబర్ 2016, ఆదివారం

రచన- ద‌ర్శ‌క‌త్వం: ఆర్పీ ప‌ట్నాయ‌క్‌
తారాగణం:  ఆర్పీ ప‌ట్నాయ‌క్‌, అనిత, సాయికుమార్‌, తనికెళ్ళ భరణి, నాజర్, గొల్లపూడి మారుతీరావు, జయప్రకాష్ రెడ్డి, రాజారవీంద్ర, సందేశ్, బెనర్జీ, రఘుబాబు, శ్రీముఖి, దువ్వాసి మోహన్ తదితరులు. 
మాటలు : తిరుమల్ నాగ
, సంగీతం: ఆర్పీ ప‌ట్నాయ‌క్‌ఛాయాగ్రహణం : సిద్ధార్థ్
బ్యానర్ :
  యూనిక్రాఫ్ట్ మూవీ
స‌హ నిర్మాత‌లు
: ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం
నిర్మాత‌
: జ‌గ‌న్ మోహ‌న్‌
విడుదల : 4 నవంబర్
, 2016
***
        ర్శకుడుగా నటుడుగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వాస్తవిక కథా చిత్రాల పంథా నెంచుకున్నారు. ఈ కోవలో శీను వాసంతి లక్ష్మి’, ‘బ్రోకర్అనే రెండు ప్రయోగాలు చేశారు. ఆర్ధిక ఫలితాలెలా వుంటున్నా పంథా వీడకుండా తిరిగి ఇప్పుడు మనలో ఒకడుతో వచ్చారు. ఈసారి మీడియాని ప్రశ్నించదల్చుకున్నారు- ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాని. మొన్నే పూరీ జగన్నాథ్ ఇజంతో మీడియాని ఆకాశానికెత్తేస్తే, పట్నాయక్ నేలకు దించి వాస్తవాలెలా   చెప్పారో ఈ కింద చూద్దాం...
కథ 

     కృష్ణమూర్తి ( పట్నాయక్) ఓ కాలేజీ లెక్చరర్. విద్యార్ధుల్లో మంచిగౌరవం సంపాదించుకుంటాడు. భార్య శ్రావణి (అనిత) పిల్లలకి సంగీతం నేర్పుతూంటుంది. ఇద్దరూ హాయిగా వుంటారు. ఓ రోజు ఓ స్టూడెంట్ మూడోకన్నుఅనే ఛానెల్ కి ఫోన్ చేసి తనమీద కృష్ణమూర్తి  లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేస్తుంది. ఆ ఛానెల్ కృష్ణ మూర్తి ఫోటోతో ఈ వార్తని ప్రసారం చేస్తుంది. దీంతో కలకలం రేగి ఇంటాబయటా కృష్ణమూర్తి పరువు పోగొట్టుకుంటాడు. హాస్టల్లో ఆ అమ్మాయిని పట్టుకుని అడిగితే ఛానల్ వాళ్ళు తప్పుగా వేశారని, తన ఉద్దేశం లాబ్ టెక్నీషియన్ కృష్ణమూర్తి అనీ చెప్పి మాయమై పోతుంది. అయినా కాలేజీ యాజమాన్యం కృష్ణమూర్తిని సస్పెండ్ చేస్తుంది.  ప్రిన్సిపాల్ మాత్రం కృష్ణమూర్తి పట్ల సానుభూతిగా వుంటూ దీన్నెలా ఎదుర్కోవాలో సలహాలిస్తూంటాడు. శ్రీ (సందేశ్) అనే ఇంకో లెక్చరర్ కృష్ణమూర్తికి వచ్చిన ఈ కష్టంలో తోడుగా ఉంటాడు. కృష్ణ మూర్తి ఇంటిదగ్గర పరిస్థితి చెడిపోతుంది. భార్య అతణ్ణి  అసహ్యించుకుంటూ మాట్లాడ్డం మానేస్తుంది. ఇరుగు పొరుగూ కృష్ణమూర్తిని వెలివేస్తారు. ఒంటరివాడై పోయిన కృష్ణమూర్తి ఇక తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆ ఛానెల్ కి వెళ్లి అసలు విషయం చెప్తాడు. ఛానెల్ వాళ్ళు చేసిన పొరపాటు గ్రహించినా సవరణ వేయడానికి ఒప్పుకోరు. ప్రసారం చేసిన వార్త తప్పని సవరణ వేస్తే  తమ ఛానెల్ ప్రతిష్ట దెబ్బ తింటుందని ఛానెల్ అధినేత ప్రతాప్ (సాయికుమార్) తిరస్కరిస్తాడు. కృష్ణమూర్తి అక్కడ ఘర్షణపడి లాభంలేక కోర్టు కెక్కుతాడు. కోర్టులో తాను పెట్టుకున్న లాయర్ (తనికెళ్ళ భరణి) ఛానెల్ వైపు ప్లేటు ఫిరాయిస్తాడు. 
        ఇలా దారులు మూసుకుపోతూంటే కృష్ణమూర్తి ఛానెల్ మీద ఎలా పోరాడి గెలిచాడనేది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      ఓ శక్తివంతమైన ఛానెల్ మీద సామాన్యుడి పోరాటమనే, వినోదానికి ఆస్కారం లేని,  ఆసక్తికర కథకి అవకాశమున్న కాన్సెప్ట్ ఇది. స్కూళ్ళలో కాలేజీల్లో కామవికారాల ఉపాధ్యాయులకి బడితె పూజ, కటకటాల్లో లాఠీ సేవ - అనే బ్రేకింగ్ న్యూసులు రొటీన్ అయిపోయాయి. విద్యాలయ్యాల్లో గురువుల ఈ కామవికారాలు ఎప్పుడు అంతమవుతాయా అని జనం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.  దీన్నలా వుంచి, పట్నాయక్  రివర్స్ లోవచ్చి,  ఉపాధ్యాయుడినే  లైంగిక వేధింపుల తప్పుడు ఆరోపణల బాధితుడిగా నడుస్తున్న చరిత్రకి తద్విరుద్ధ దృశ్యం చూపెట్టారు. ఇక్కడ ఉద్దేశం విద్యార్ధినులతో కూడా ఉపాధ్యాయులు జాగ్రత్తగా వుండాలని హెచ్చరించడం కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా అత్యుత్సాహంతో వార్తలు ప్రసారం చేసే  మూడోకన్నుఅనే కల్పిత ఛానెల్ ని ఎండగట్టడం మాత్రమే. పట్నాయక్  వాస్తవాలు తెలుసుకుని మరీ వార్తలు ప్రసారం చేయాలని చెప్పుకొచ్చారు. అయితే ఛానెల్ ని అవతలి పక్షం చేసి నిందించినప్పుడు, ఇవతలి తన స్వపక్షంలో వాదం నిర్దుష్టంగా నిర్మించుకోవాలని  చూసుకోలేదు. భూస్వామి వుంటాడు, అతను తనకి అన్యాయం చేశాడని కూలీ ఆరోపించినప్పుడు, ఆ అన్యాయానికి తోటి కూలీ బాధ్యత కూడా వుందని తెలుస్తూంటే  ఆ కథ కళారూపంగా రక్తికట్టడం కష్టం.  ఇదే జరిగింది పట్నాయక్ కథలో. ఛానెల్ మీద పోరాటానికి వెళ్ళే ముందు సంఘటన పూర్వాపరాలు నిర్దుష్టంగా వుండాలని చూసుకోలేదు- ఎందుకంటే నిజాయితీగా రియలిస్టిక్ జానర్ ని నమ్ముకోలేదు- మళ్ళీ ఇందులో లాజిక్ ని వదిలేసిన ఫార్ములా కథనాన్ని  జొప్పించడం వల్ల బలహీనపడి- మీడియా వాళ్లకి ఆయన ఇచ్చిన సందేశంతో  మీడియా వాళ్ళే ముక్కున వేలేసుకునేలా చేశారు- మా తప్పేంటో మాకర్ధమయ్యేలా చెప్పండి బాబూ ఆ తర్వాత మేం మారే సంగతి ఆలోచించుకుంటాం అనుకునేట్టు చేశారు. నిజమే, ‘మూడోకన్నుఛానెల్ చేసిన తప్పేంటి? చేశారంటున్న తప్పుని సవరించుకోక పోవడమేనా? ఐతే ఆ తప్పుఛానెల్ దాకా వెళ్ళకుండా నివారించగల అవకాశం వుండీ, ఫార్ములా కథనంతో సరిపెట్టేద్దాం అనుకోవడం వల్ల  ఛానెల్ చేసిన తప్పేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. 

ఎవరెలా చేశారు 
      పట్నాయక్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ఒక సభకి వస్తూ పోతూ వున్నట్టు కన్పిస్తారే  తప్ప, సన్నివేశాల్లో నటిస్తున్నట్టు కన్పించరు. ఐతే నాకేంటీ?’ అని ఒకచోట ఎఫెక్టివ్ గా ఎదురు తిరిగినట్టు,  మిగతా చోట్ల కూడా తనకి జరిగిన న్యాయానికి జ్వలిత హృదయుడై  అగ్నిజ్వాలలు రేగ్గొట్టాల్సింది! ఒక అద్దంలో చూసుకుని ఏడ్చినప్పుడే పాత్ర కుదేలైపోయే క్రమం ఏర్పడింది. ఏడిస్తే ఏడ్చారుగాని, ఆ ఏడ్పు చివర అగ్నిపర్వతం బద్దలై –‘చూస్తా వాడి సంగతి!’  అని కనీసం ఆ అద్దాన్ని పగలగొట్టేసి పారేసి వున్నా పరిస్థితి డిమాండ్ చేస్తున్న యాక్టివ్ నెస్ అక్కడ ఇగ్నైట్ అయ్యేది. కోర్టులో లాయర్ చేసే మోసం దగ్గర, వివిధ ఛానెళ్ళ వాళ్ళు  సహకరించనప్పుడూ, వాళ్ళు చెప్పేది విని వెళ్ళిపోయే పద్ధతిలో లేదా ఈ కథకోసం సమాచారాన్ని సేకరిస్తున్న విధానంలో- చేసిన పాత్రచిత్రణ, దానికి తగ్గ నటనా  ఒకసారి రివ్యూ చేసుకోవాల్సింది.  ‘మనవూరి రామాయణంలో ప్రకాష్ రాజ్ కూడా దర్శకత్వం వహిస్తూ నటించారు- వేశ్యతో ఇరుక్కున్న ఒకానొక సందర్భంలో క్షణం క్షణం మారిపోయే పరిస్థితులమధ్య ఆయన నటన, కథా నిర్వహణ ఎంత టెన్షన్ పుట్టిస్తాయో చూసిందే. అలాటిది ఒక క్రైం ఎలిమెంట్ తో కూడిన కథతో, పాత్రతో పట్నాయక్ ఇంకెంత చేసివుండాలి.

        భార్య పాత్రవేసిన అనితది రొటీన్ మూసపాత్ర. దీంతో ఈ రియలిస్టిక్ కథలో అంతా పాత డ్రామా చొరబడింది. భర్త గురించి ఛానెల్లో చూసిందే తడవు నమ్మేసి కర్కశంగా మారిపోవడం, సూటిపోటి మాటలతో సాధించడం, పురుగుని చూసినట్టు చూడ్డం  అతిగా వుంటుంది. పిల్లలకి సంగీతం నేర్పే ఓ కళాకారిణికి ఈ రకం పాత్రచిత్రణ, మళ్ళీ భర్త అమాయకుడని తెలియగానే ఎక్కడాలేని ప్రేమానురాగాలూ, అంతలోనే మురిసిపోతూ నాల్గోనెల అని చెప్పడాలూ- ఇవన్నీ ఈ పాత్రని అవకాశవాదిగా నిలబెట్టాయి.  అన్నేళ్ళు కలిసి కాపురం చేసిన భర్త ఎలాటివాడో ఆమెకి తెలియలేదంటే ఆమె భర్తతో చేసింది కాపురంలా  అన్పించదు, విడిది చేసినట్టు వుంది.
 

        కనీసం జరిగిందేమిటో అతను  చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వదు. మరి తను అంత ద్వేషించేబయట అమ్మాయిల్ని పాడు చేస్తున్నాడని నమ్మే,  ఆ భర్త బిడ్డనే కడుపులోఎలా భరించింది? పైగా తన అపార్ధాలు తొలిగాక తనేదో భర్తకిస్తున్న కానుక అన్నట్టు నాల్గో నెల అని చెప్పుకోవడం. భర్త మంచి వాడని తెలిశాకఓ ఆవిడ ఏదో వాగితే లెంపకాయ కొట్టడంలో కూడా అర్ధం లేదు. అదే ఆవిడ ముందు చెప్పిన ఇవే మాటల్ని నమ్మి భర్తని ద్వేషించిన తను కూడా లెంపకాయ తినాలిగా అప్పుడు? 

        ఆ ఆవిడ భర్తే తనని లైంగికంగా వేధిస్తూంటాడు. ఇతణ్ణి కేవలం పోరాఅంటుందే తప్ప లాగి కొట్టాలనుకోదు. తనకీ పరిస్థితి ఏర్పడడానికి భర్తే కారణమని కుమిలిపోతూ అతడి మీద కసి ఇంకా పెంచుకుంటుంది. బయట తను సంగీతం నేర్పే అవకాశాలు కోల్పోవడానికీ భర్తే కారణమని గొడవపడుతుంది. భర్తని శత్రువుగా భావిస్తే  లోకం తనతో ఆడుకుంటుందని మాత్రం గ్రహించదు.
  
        ఇలాటిదే అసంబద్ధ భార్య పాత్ర చిత్రణ ఈ సినిమాతోపాటే విడుదలైన నరుడా డోనరుడాలోనూ  చూశాం. ఆడదాన్ని తక్కువ జ్ఞానం గలదానిగా చూపించడం ఇంకా ఒక ఫార్ములాగా వాడేస్తున్నారు. ముందు ఎంతో పాజిటివ్ గా వుండే భార్య పాత్ర నెగెటివ్ గా మారిపోవడం, చివరికి మళ్ళీ పాజిటివ్ గా మారడం ఈ అరిగిపోయిన  పాత గిమ్మిక్కులే మళ్ళీ చూడాల్సిన పరిస్థితి.  రియలిస్టిక్ కథలో సినిమాటిక్ సంగతులు. 

        ఒక భర్తని సాధించే గయ్యాళి వుంటుంది. భర్త మీద ఇలాటి ఆరోపణలు రాగానే లోకం మీద కయ్యిన లేస్తుంది నా మొగుడు బంగారమని! ఇలాగే వుంటాయి రియలిస్టిక్   జీవితాలు. సినిమాటిక్ చేసుకునే ఇంటరెస్టు వుండదు. భార్య పాత్రని మొదట ఎడమొహం పెడమొహంగా చూపిస్తూ, భర్తకి సమస్య తలెత్తగానే అతడి  పక్షం వహించే మెచ్యూరిటీతో  చిత్రించి  వుంటే ఏంతో ఉన్నతంగా వుండేది. ఇలా చేయకపోగా, ఇంకా బయటి చెప్పుడు మాటలు కూడా విని భర్తమీద కక్ష పెంచుకునే మూర్ఖురాలిగా తయారు చేశారు. బయట భర్త  గురించి వంద అనుకోనీ, అవి నమ్మి భర్తకి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తానన్నా  క్రిమినల్ లా కూడా ఒప్పుకోదు. దేశంలో రాజకీయ పార్టీలు ఎంతైనా కీచులాడుకోనీ, దేశం మీదకి ఒకడు దండెత్తి వస్తున్నాడంటే అన్నీ ఒకటై  తిప్పికొడతాయి!  

        తనికెళ్ళ భరణి లాయర్ పాత్ర కూడా అసంబద్ధమైనదే. దీని గురించి స్క్రీన్ ప్లే సంగతుల్లో చెప్పుకుందాం. ఛానెల్ యజమాని పాత్రలో సాయికుమార్ అత్యంత ప్రతిభావంతమైన నటనని కనబర్చారు. హీరో ఆరోపించే ఇగోని ప్రదర్శిస్తూ కుహనా ప్రతిష్ఠ కోసం పాకులాడే పాత్రలో సాయికుమార్ కథకి వన్నె తెచ్చారు. తనూ- కేంద్రమంత్రి పాత్రలో నాజర్ తమతమ వాదనలతో పాల్గొనే ఒక లైవ్ షో హైలైట్ గా నిలుస్తుంది. దీని పకడ్బందీ చిత్రీకరణ క్రెడిట్ పట్నాయక్ కి దక్కుతుంది. 

        ఇక సహాయపాత్రలు చాలా వున్నాయి- కానీ మూడోకన్నుఛానెల్ ఎడిటర్ గా రఘుబాబు ప్రారంభంలో కన్పించి- మళ్ళీ కంటికి కన్పించకుండా  మాయమైపోయి- చివర్లో కళ్ళు తెరచుకుని రావడం కాల్షీట్లు కుదరక జరిగిందేమో. ఛానెల్ లో వచ్చిన తప్పుడు వార్త ప్రహసనమంతా  ఒక మూడోకన్నుఎడిటర్ గా తను ఎక్కడుంటాడో తెలీదు. ఇకపోతే సామాజిక కథ అనగానే కామెంట్లు చేస్తూ తిరిగే ఓ పిచ్చివాడి పాత్ర తప్పని సరేమో. అలా దువ్వాసి మోహన్ ఆకలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు’  అన్న టైపులో 1973 నాటి  ‘దేశోద్ధారకులులోలాగా  ఇంకా పద్మనాభంలా తిరుగుతూంటాడు.

        సాంకేతికంగా కెమెరా వర్క్ బాగానే వుంది గానీ కలర్స్ లో బ్లూ టింట్ డామినేషన్ ఎక్కువయ్యింది. పాటలు ఫర్వాలేదు, జేసుదాస్ చేత ఓ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ పాడించారు.

   - సికిందర్