రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, October 3, 2019

878 : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ సంగతులు -3


        శతాబ్దాల మాట! కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ మూలాలు 18 వ శతాబ్దపు జర్మన్ సాహిత్యంలో వున్నాయి. అప్పట్లో ఈ జానర్ కి ‘బిల్డూక్స్ రోమాన్' (bildungs  roman) అని నామకరణం చేశాడు ఇంపీరియల్ యూనివర్సిటీ లైబ్రేరియన్ కార్ల్ సైమన్ అనే అతను.  బిల్డూక్స్’ అంటే జర్మన్ భాషలో విద్య లేదా జ్ఞానం. ‘రోమాన్’ అంటే నవల. ఈ విద్య లేదా జ్ఞానం మానసికంగానూ నైతికంగానూ టీనేజర్ల ఎదుగుదల గురించి. దీన్ని ‘నావెల్ ఆఫ్ ఫార్మేషన్’ అని కూడా అన్నారు.1796 లో ప్రసిద్ధ జర్మన్ రచయిత జే డబ్ల్యూవ్ గోథె రాసిన ‘విల్ హమ్ మిస్టర్స్ అప్రెంటీస్ షిప్’ అన్న నవల ఈ జానర్ ఎలిమెంట్స్ ని స్థిరీకరించింది. ఈ నవలని అనుసరించి జర్మన్ భాషలో మరెన్నో ‘కమింగ్ ఆఫ్ ఏజ్’ నవలలు వచ్చాయి. ఆ తర్వాత 19, 20, 21 వ శతాబ్దాల్లో ఆంగ్ల భాషలో చార్లెస్ డికెన్స్ రాసిన ‘డేవిడ్ కాపర్ ఫీల్డ్’, ‘గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్’; మార్క్ ట్వైన్ రాసిన ‘అడ్వెంచర్స్ ఆఫ్ హకల్బరీ ఫిన్’, జేమ్స్ జాయిస్ రాసిన ‘ఎ పోట్రెయిట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ఏజ్  ఏ యంగ్ మాన్’, జేడీ శాలింగర్ రాసిన ‘ది క్యాచర్ ఇన్ ది రై’, డరోతీ అలిసన్ రాసిన ‘బాస్టర్డ్ ఔటాఫ్ కరోలినా’, జేకే రౌలింగ్ ‘హేరీ పోటర్’ సీరీస్ నవలలూ ఉదాహరణకి కొన్ని. చేతన్ భగత్ ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్’ కూడా ఒకటి. మొదటి కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమా ‘బాంబీ’ అనే యానిమేషన్ గా 1942 లో హాలీవుడ్ లో నిర్మించారు. 

          కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ స్ట్రక్చర్ రెగ్యులర్ సినిమాలకుండే స్ట్రక్చరే. కాకపోతే మనో వికాసం కేంద్ర బిందువుగా వుంటుంది. అదే రెగ్యులర్ బిగినింగ్, అదే మిడిల్, అదే ఎండ్ విభాగాల కార్యకలాపాలుంటాయి. ఉదాహరణకి ఒక సంపన్నవ్యాపార కుటుంబానికి చెందిన నితిన్ అనే టీనేజర్ వున్నాడనుకుందాం. ఇతను విసుగ్గా, సోమరిగా జీవితం గడుపుతున్నాడనుకుందాం. కుటుంబం అనుభవిస్తున్న సిరిసంపదల మీద ఆసక్తి లేక
స్వతంత్రంగా, 
స్వేచ్ఛగా తనమానాన తానొక కళాకారుడిగా ఎదగాలన్న కోరిక బలంగా అతడికుందనుకుందాం. ఈ కోరిక తన హక్కు అనే కొత్త రెబెల్ ఆలోచనలు రెక్కలు తొడిగాయ  నుకుందాం. అప్పుడు వ్యాపార శాస్త్రం చదువుకుని కుటుంబ వ్యాపారంలోకి రమ్మంటున్నతండ్రి సలహాని తిరస్కరించాడు. రచయితగా, నటుడిగా నిరూపించుకోవాలన్న గట్టి నిర్ణయానికొచ్చేశాడు. కానీ ఇదికూడా జరిగేట్టు లేదు. తను సత్యవతి అనే పాతిక దాటిన నటిని ప్రేమిస్తున్నాడు. సత్యవతి అసిస్టెంట్ మాయలక్ష్మి ఇటు తనని మేనేజి చేస్తూ, ఇంకో పక్క సత్యవతి కోసం తన కంటే సీనియర్ అయిన, రిచ్ అయిన బాయ్ ఫ్రెండ్ ని కూడా మెయింటెయిన్ చేస్తూ తనని మాయ చేయడం బాధాకరంగా వుంది. ఒక సాయంత్రం సత్యవతి గది లోంచి ఆ బాయ్ ఫ్రెండ్ రావడం చూశాక గుండె పగిలి గట్టిగా ఏడ్వాలన్పించింది.


          ఇలా దెబ్బతిన్నాక ఇక తండ్రి చెప్పినట్టే వ్యాపారంలోకి వచ్చేస్తానని, బిజినెస్ టూర్ కి వెళ్తానని తండ్రికి చెప్పేసి బయల్దేరాడు. వెళ్ళే ముందు క్లోజ్ ఫ్రెండ్ షారుఖ్ ఖాన్ ముందు మరోసారి ఏడ్చి, తనలో రచయితయ్యే, నటుడయ్యే టాలెంట్  లేదనేసి, చేసిన రచనల్ని వైరాగ్యంతో మంటల్లో విసిరేశాడు - (ప్లాట్ పాయింట్ -1)
         

 ఇప్పుడు వర్క్ షీట్ చూద్దాం : ఇది బిగినింగ్ విభాగపు కథనం. ఇందులో బిగినింగ్ విభాగపు ప్రత్యేక బిజినెస్ అంతా వుంది నాల్గు టూల్స్ తో. 1. కథానేపథ్యపు ఏర్పాటు : టీనేజర్ నితిన్ తానున్న సంపన్న వ్యాపార కుటుంబంలో ఇమడలేక స్వేచ్ఛ కోరుకుంటున్న వాతావరణం, 2. పాత్రల పరిచయం : సంపన్నుడైన నితిన్ తండ్రి, నటి సత్యవతి, ఆమె అసిస్టంట్ మాయలక్ష్మి, ఫ్రెండ్ షారుఖ్ ఖాన్ ల బిగినింగ్ విభాగాన్ని నడిపేందుకు అ వసరమైన పాత్రల పరిచయం, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన : చదువుకుని కుటుంబ వ్యాపారంలోకి రమ్మని తండ్రి అనడం, కాదని కళల పట్ల మక్కువ పెంచుకున్న నితిన్ నటి సత్యవతిని ప్రేమించడం, ఆమె ఇంకో బాయ్ ఫ్రెండ్ తో గడపడాన్ని చూసి మనసు విరగడం, 4. సమస్య ఏర్పాటు (ప్లాట్ పాయింట్ -1) : ప్రేమలో దెబ్బతిని ఇక కళారంగం  వద్దనుకుని, వ్యాపారంలోకి వెళ్ళాలనుకోవడం, బిజినెస్ టూర్ కి బయల్దేరడం. 

          ఇందులో నితిన్ పాత్ర పరిచయ ప్రక్రియలో, జీవితం పట్ల అతడి అస్థిర టీనేజీ మనస్తత్వ చిత్రణ ముందు జరగాలి. మానసికంగా అస్తిరత్వం లోంచి స్టిరత్వం లోకి టీనేజీ కథా ప్రయాణానికి బీజాలు ఈ బిగినింగ్ విభాగంలోనే పడతాయి. ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? ఉన్నదాన్లోంచి స్వేచ్ఛ కోరుకోవడంతో వస్తుంది. అస్థిరత్వానికి మూలం స్వేచ్ఛా కాంక్ష. స్వేచ్ఛా కాంక్ష ఎందుకు రగుల్కొంటుంది? వయసొచ్చింది కాబట్టి ఉన్నట్టుండి హక్కులు గుర్తుకు రావడం వల్ల. ఇదంతా నితిన్ పాత్ర పరిచయంలో జరిగాయి.

          ఇప్పుడు సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన మొదలు పెడుతున్నప్పుడు, పైన స్థాపించిన మానసిక స్థితితో ముందుకెళ్లాలి. ముందు కెళ్ళి నప్పుడు మానసిక ప్రపంచానికి భౌతిక ప్రపంచం చెక్ పెడుతూండాలి. ఎందుకు చెక్ పెట్టాలి? అజ్ఞానాన్ని, అపరిపక్వతని భౌతిక ప్రపంచం తిరస్కరిస్తుంది కాబట్టి. మానసిక ప్రపంచం స్పిరిచ్యువల్, భౌతిక ప్రపంచం మెటీరియల్. మెటీరియల్ ఉనికిలోకి రావాలంటే ఆలోచన నిర్దుష్టంగా వుండాలి. కట్టే పనిలో అవినీతి జరిగిందంటే కట్టిన డామ్ కూలిపోతుంది. యథా మానసికం, తథా భౌతికం. మొత్తం ప్రపంచం బావున్నా చెడినా కారణం మనసు.

          కనుక నితిన్ తో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన ఈ చట్రంలో జరగాలి. జరిగింది కూడా. అతను లోపల అనుకుంటున్న దానికీ బయట జరుగుతున్న దానికీ పొంతన లేదు. అతను నటనలోనూ, రచనల్లోనూ రాణించాలనుకుంటున్నాడు, కానీ నటితో ప్రేమ వ్యవహారం పెట్టుకున్నాడు. ఇందుకే భౌతిక ప్రపంచం తిరస్కరించడం మొదలెట్టింది మాయలక్ష్మి రూపంలో. అస్థిర మనస్తత్వం. ఉత్తుత్తి జీవిత లక్ష్యం. అసలు నిజంగా తనలో కళాకారుడి అంశే వుంటే, దానికి బద్ధుడై వుంటే ఇలా చెయ్యడు. తనలో వున్నదేమిటో తనకే తెలీని తనంతో శూన్యాన్ని సృష్టించుకున్నాడు. ఇక ప్రేమా లేదు, కళాపోషణా లేదు. ఇలా సత్యవతితో ప్రేమంటూ దెబ్బతిన్నాక, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన కొలిక్కి వచ్చింది.

           ఇక  టూర్ వెళ్ళే ముందు తనలో రచయితయ్యే, నటుడయ్యే టాలెంట్ లేదనేసి, చేసిన రచనల్ని మంటల్లో విసిరేయడం ప్రేమలో విఫలమయ్యాడన్న ఆక్కసుతోనే తప్ప, నిజంగా ఆ టాలెంట్ తనకి లేదని గుర్తించి కాదు. కళాకారుడిగా ఎటువంటి ప్రయత్నాలు చేయనే లేదు, కంపాటిబిలిటీ లేని ప్రేమ కోసం తప్ప.

          ఇలా సమస్య కూడా ఏర్పాటయ్యాక వచ్చే టూల్ గోల్ ఏర్పాటు. ఇప్పుడు నితిన్ గోల్ ఏమిటి? తండ్రి వ్యాపారమే చూసుకోవడం. ఇది మారిన గోల్. వొరిజినల్ గోల్ కళాకారుడు కావడం. దీనికంత సీను లేదని, విధిలేక తండ్రి మాట ప్రకారం వ్యాపారాన్ని గోల్ గా చేసుకున్నాడు. మనస్ఫూర్తిగా స్వీకరించని ఈ గోల్ ని మనం నమ్మనవసరం లేదు. కనుక ఇది బలహీన గోల్.

          మరి ఈ బలహీన గోల్ కాని గోల్ ఎలిమెంట్స్ ఏమిటి? 1. కోరిక : ఇంకా కోరికలేముంటాయి గోల్ కాని గోల్ తో? కానీ వెనుక పోగొట్టుకున్నవాటితో (అందని ప్రేమ, మంటల్లో కళ) తీరని  కోరికలు వెన్నాడుతూనే వుంటాయి తప్పక, 2. పణం : తీరని కోరికలు వెన్నాడుతూంటే తండ్రి నమ్మకాన్నే పణంగా పెట్టినట్టు. ఇప్పుడు వ్యాపారం కాక తనేం చేసినా తండ్రి క్షమించక పోవచ్చు, సహకరించకపోవచ్చు, 3. పరిణామాల హెచ్చరిక : ఒక్కగా నొక్క కొడుకుగా వ్యాపార విషయంలో తండ్రిని నిరాశ పరిస్తే బెంగతో తండ్రి కేమైనా అవచ్చు, 4. ఎమోషన్ : ఒకవైపు తీరని కోరికలతో, మరోవైపు తండ్రి పెట్టుకున్న నమ్మకంతో మిశ్రమ ఎమోషన్స్. ఎలా హేండిల్ చేస్తాడో తెలీదు.
          
         ఇలా బిగినింగ్ బిజినెస్ లో నాల్గు టూల్స్ ని, నాల్గు గోల్ ఎలిమెంట్స్ ని సరిచూసుకున్నాక ముందు కథలో కెళ్దాం...

ఇప్పుడు నితిన్ తండ్రి కంపెనీ బకాయిలు వసూలు చేస్తూ బిజినెస్ టూరు తిరుగుతున్నాడన్న మాటే గానీ మనసు వ్యాపారం మీద లేదు. అశాంతిగా, అలజడిగా, పిచ్చిగా గడుపుతున్నాడు. టూరులో ఇంకో వూరు దాటుతున్నప్పుడు ఒకచోట ఒకతను ఓ చిన్నపిల్లని పట్టుకు కొట్టడం చూసి అడ్డుకున్నాడు. ఈ పిల్లకి డాన్స్ చేయడం రావడం లేదని కొడుతున్నాడా దర్శకుడు. ఆ దర్శకుడు పని చేస్తున్న ఔత్సాహిక నాటక సంస్థలోంచి అతణ్ణి తీసేయించి, దర్శకుడుగా తను బాధ్యతలు చేపట్టాడు నితిన్. ఆ పిల్ల చింకీకి తర్ఫీదు నివ్వసాగాడు. సంస్థలో ఇద్దరు నటులు దగ్గరయ్యారు. నాటకాలేయసాగారు. అడిగినప్పుడల్లా దర్పంగా డబ్బిచ్చేయసాగాడు నితిన్.

          ఒకరోజు చింకీని తీసుకుని నటులతో పిక్నిక్ కి వెళ్తే అక్కడ దొంగలు దాడి చేశారు. ఆ దాడిలో నితిన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్నలాగే వదిలేసి నటులు వెళ్ళిపోతే చింకీ కాపాడింది. వొత్తైన తన పొడవాటి జుట్టుతో వొత్తి అతడి రక్త స్రావాన్నాపింది. అలా చేసి విశ్వేశ్వర్రావు అనే పెద్ద మనిషి ఇంటికి తీసికెళ్ళింది. అక్కడ కోలుకున్నాడు. అక్కడే పెద్దవాళ్ళయిన విశ్వేశ్వర్రావు స్నేహితులతో కళల మీద, కవిత్వం మీద, ముఖ్యంగా షేక్స్ పియర్ మీదా అర్ధమయీ కాని చర్చలు జరుపుతూ, సాహిత్య జ్ఞానం బాగా పెంచుకున్నా ననుకున్నాడు. అప్పుడు విశ్వేశ్వర్రావు ఒక మాటన్నాడు - నీ కూడా వున్న నటులు నటులు కాదని, నీ డబ్బుకోసం వున్నారే తప్ప కళ కోసం లేరని, నిన్ను చావు బతుకుల్లో వదిలేసి వెళ్లి పోయారనీ చెప్పి కళ్ళు తెరిపించాడు... నితిన్ ఆలోచనలో పడ్డాడు. ఛీ, కుళ్ళు కళారంగమని విరక్తి పుట్టేసి, ఇక వ్యాపారమే బెస్ట్ అని మనసు మార్చేసుకున్నాడు.           

          ఇంతలో చింకీ గుండెపోటుతో చనిపోయింది. అంతేకాదు, అటు తన వూళ్ళో నటి సత్యవతి కూడా చనిపోయిందని కబురొచ్చింది. చనిపోతూ తన మీద ప్రేమని వ్యక్తం చేసిందని కూడా తెలిసింది. నితిన్ ఉండబట్టలేక ఏడ్చాడు. ఇక తన వూరుకి బయల్దేరాడు. (ప్లాట్  పాయింట్ – 2)

ఈ మిడిల్ వర్క్ షీట్ చూద్దాం :
 పై కథనం బిగినింగ్ తర్వాత వచ్చే మిడిల్ విభాగంలోది. మిడిల్ విభాగమంటే గోల్ ని సాధించడంకోసం విలన్ తో హీరో చేసే పోరాటం. దీనికుండే టూల్స్,1. గోల్ కోసం విలన్ తో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే, 2. క్యారక్టర్ ఆర్క్, 3. టైం అండ్ టెన్షన్ గ్రాఫ్, 4. సొల్యూషన్ (ప్లాట్ పాయింట్ -2). వీటన్నిటితో పైన చెప్పుకున్న గోల్ ఎలిమెంట్స్ నాల్గింటినీ కలుపుకు వెళ్ళాలి : కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్స్. రాయడానికి లోడ్ పెరుగుతోందా? పకడ్బందీ కథని డెలివరీ చేయడానికి ఈ లోడింగ్ తప్పదు. కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ కే కాదు, దేనికైనా ఇంతే. స్క్రీన్ ప్లే అంటేనే ఒక పెద్ద మాల్గాడీ. పోతూ వుంటే సరుకులు లోడ్ అవుతూ వుంటాయి. సికింద్రాబాద్ - వరంగల్ - ఖమ్మం - బెజవాడ, ది ఎండ్! ఈ ప్రయాణం ఎలాంటిదంటే, లోడింగ్ సరిగా లేకపోతే పట్టాలు సరిగా వుండవు. మాల్గాడీతో ఇదో విచిత్ర సమస్య. 


          ఐతే కొన్ని కథల్లో విజిబుల్ విలన్ వుండడు. ప్రస్తుత కథలో నితిన్ కిలా కనిపించని విలనే  వున్నాడు. అది తను. మనసు వల్ల తనకి తానే విలన్. ఏకకణ జీవి అమీబా లాగా. ఇక తనతో తానే సంపర్కించుకుని ప్రత్యుత్పత్తి చేయాలి. తనకి మెచ్యూరిటీ నిచ్చేలాగా ఒక మానస పుత్రికకి జన్మనివ్వాలి.



        ముందుగా యాక్షన్ రియాక్షన్ ఇంటర్ ప్లే : తన మనసే తన శత్రువుగా వున్న హీరో పాత్రతో ఈ ప్లే ఎలా వుంటుందంటే, హీరోకి ఒక గోల్ వుంటే, మనసు ఆ గోల్ ని డిస్టర్బ్ చేస్తూంటుంది. దీన్ని మిడిల్ విభాగపు బిజినెస్ లో ముందుగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది నితిన్ విషయంలో ఎస్టాబ్లిష్ అయింది. ఈ మిడిల్ విభాగంలో వ్యాపారం చేసుకుందామనే గోల్ తో  మొదట ఎంట్రీ ఇస్తే, మనసు చితికిన కోరికల్ని గోల్ కి ఎదురు విసురుతోంది. సత్యవతితో, కళాభిలాషతో, చితికిపోయిన కోరికలు. దీంతో వ్యాపార పనుల్లో సుఖంలేక అశాంతిగా, అలజడిగా, పిచ్చిగా గడుపుతున్నట్టు గమనించాం. అంటే అతడి గోల్ అనే యాక్షన్ కి, రియాక్షనిచ్చే విలన్ మనసులో రూపు దిద్దుకుంటున్నాడన్న మాట.

          ఇలా మనసులో విలన్ తయారీ పూర్తి చేశాక, దాంతో ఫిజికల్ ప్లే ప్రదర్శించాలి. ఈ ఫిజికల్ ప్లే నితిన్ పోతూ వుంటే, ఒక చిన్నపిల్లని దర్శకుడు కొడుతూ వుండడంతో ఎదురయ్యింది. మనసులో విలన్ ఎలా ప్లే చేస్తున్నాడంటే, నితిన్ వచ్చి ఈ ట్రాప్ లో పడిపోవాలి. ఆ చిన్న పిల్లెవరో, కొడుతున్నది ఎవరో నితిన్ కి ఇప్పుడే తెలీదు. ఆ చిన్నపిల్ల స్థానంలో ఓ యువతి వుండి వుంటే, అతడామెని కొడుతూ వుంటే, నితిన్ ఈ ట్రాప్ లో పడడు. అదేదో లవర్స్ గొడవనుకుని వెళ్లిపోవచ్చు. పైగా ఆ యువతిలో సత్యవతి కన్పించి – బాగైంది, బాగైంది - అని కచ్చతో అనుకోవచ్చు.

          మనసులో విలన్ ఆచితూచి చిన్నపిల్లనే ప్రయోగించాడు. చిన్నపిల్లని కొడుతూంటే నితిన్ తప్పక ఆగుతాడు. కొడుతున్నది తండ్రే అయినా, ఏమయ్యా బుద్ధుందా? అన్నం తింటున్నావా, అమ్మాయిని తింటున్నావా?- అనవచ్చు. టీనేజర్లు ఎలా వుంటారంటే తాము చిన్నపిల్లలకి నెంబర్ వన్ గార్డియన్ లమనుకుంటారు. ఫ్రెష్ గా ఈ గార్డియన్ గిరీ పేరెంట్స్ తమ మీద చెలాయించే పెత్తనం వల్ల వస్తుంది. ఇలా మనసులో విలన్ ఇలా బాగానే ప్లే చేశాడు సైకాలజీ మీద.

          ఇప్పుడా కొడుతున్నది దర్శకుడూ, ఆ చిన్నపిల్ల అప్పుడే డాన్సరూ అని తెలిసి కనెక్ట్ అయిపోయాడు నితిన్. కళా రంగం రెండు చేతులూ చాచి ఆహ్వానిస్తోంది. మంటల్లో పారేసిన తనలోని నటుడూ, రచయితా ఫీనిక్స్ పక్షిలా పైకి లేస్తున్నారు. చితికిన రెండు కోరికల్లోంచి ఒకటి బతికి బట్ట కట్టింది. వ్యాపార గోల్ అటకెక్కింది.

          ఇక్కడ అర్ధం లేకుండా చిన్నపిల్ల పాత్ర సృష్టి జరగలేదు. చాదస్తంగా చైల్డ్ సెంటిమెంటు వుంటుందనో, ఇంకోటనో కథని, పాత్రని విడిచి ఆటవికంగా, వికటంగా  ఆలోచించలేదు. అదే సమయంలో హీరో మానసెలా వుందో పట్టించుకోకుండా, అక్కడ చిన్నపిల్ల స్థానంలో హీరోయిన్ ని పెట్టేసి, చితికిన ప్రేమని కొత్త లవ్ ట్రాకుతో బతికించే చాపల్యానికి కూడా పోలేదు. ఇవన్నీ అర్ధంపర్ధం లేని మర్కట రచనలు.  

          యాక్షన్ - రియక్షన్ల ఇంటర్ ప్లే ఫిజికల్ గా ఇంకా కొనసాగాలి. ఇదే జరిగింది. మనసులోని విలన్ చిన్న పిల్లతో అలా రియాక్షన్ ఇచ్చాక, ఇక నితిన్ ఇంకో యాక్షన్ మొదలై పోయింది. ఆ నాటక సంస్థలోంచి దర్శకుణ్ణి తీసేయించి, తను దర్శకుడై పోయాడు. చిన్నపిల్ల చింకీకి ట్రైనింగు. తను రైటింగు, నాటకాలేయింగు. ఇదంతా ఎలా సాధ్యమైంది? డబ్బు వల్ల. తనదగ్గర డబ్బుంది. కంపెనీ బాకీలు వసూలు చేసిన డబ్బు. ఆ డబ్బుతో కళని కొనేసు కుంటున్నాడు. ఈ కళ ప్రస్తుతానికి చితికిన రెండో కోరికని గుర్తుచేయడం లేదిక.

          ఇప్పుడు రియాక్షన్ కి టైమైంది. మనసులో విలన్ లేచాడు. ఇంకో విజువల్ ప్లేతో జోష్ మీదున్న నితిన్ మీదికి ఇద్దరు నటుల్నిజలగల్లా తోలాడు. దీనికి రియాక్షన్ గా దర్పంగా నితిన్ వాళ్లని జలగల్లా డబ్బు పీల్చెయ్యనియ్య సాగాడు. ఒకప్పుడు డబ్బుని వెతుక్కున్న కళే వహ్వా అంటే డబ్బు వెదజల్లుతుంది. దీవాలా తీసేదాకా దర్బారు నిర్వహిస్తుంది.

          చేసుకున్న కర్మల్ని బట్టే బ్లాక్ బస్టర్ సీన్లుంటాయి. మనసులోని విలన్ ఇంకో రియాక్షన్ గా ఈ సీను చూపించాడు- బిగ్ పిక్చర్ - విజువల్ ట్రీట్. నితిన్ పిక్నిక్ కి వెళ్తే అక్కడ దొంగలు దాడి చేసి దోచుకున్నారు. ఈ దెబ్బకి  డబ్బు దర్పం కూడా తొలగిపోయింది. పైగా తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఇతడి దగ్గర డబ్బేమీ వుండదని నటులు ఉడాయించారు. అప్పుడు చింకీయే నితిన్ ని కాపాడింది. ఆమె టెంప్లెట్ సీనుగా హీరోయిన్ పర్రుమని జాకెట్టు చింపో, చున్నీ చింపో కట్టు కట్టినట్టు గాక, తన పొడవాటి వొత్తయిన ముఖమల్ లాంటి జుట్టుతో, మెత్తగా వొత్తి, అతడి రక్త స్రావాన్ని ఆపింది.

          ఇలా మొత్తం ఈ మిడిల్ కొలిక్కి వచ్చేదాకా ఈ విభాగంలో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే కొనసాగుతూనే వుండాలి. ప్లాట్ పాయింట్ -2 దగ్గర మిడిల్ అంత మవుతుంది. ఈ క్రమంలో మనసులో విలన్ ఇచ్చిన తాజా దొంగల దాడి రియాక్షన్ కి, నితిన్ యాక్షన్ విశ్వేశ్వర్రావు ఇంట్లో సెటిలై  కోలుకోవడంగా, అక్కడ పాసివ్ గా సాహిత్య ఇష్టాగోష్టులు జరపడంగా వుంది. నాటకాలేసే యాక్టివ్ కలాపం నుంచి ఈ పాసివ్ విలాపానికి మారడం. డబ్బుపోయాక నాటక సంస్థ వైపు వెళ్ళే పరిస్థితి లేదు. ఇష్టాగోష్టుల్లో సాహిత్య జ్ఞాన సముపార్జన చేశాడు - పద్దెనిమిది కూడా నిండకుండానే. 

          మళ్ళీ మనసులో విలన్  ఇంకో రియాక్షన్ ఇచ్చాడు. నితిన్ కళా పిపాసని మొత్తంగా పెకిలించి వేసే విజువల్ ప్లే. నీ కూడా వున్న నటులు నటులు కాదని, నీ డబ్బుకోసం వున్నారే తప్ప కళ కోసం లేరని, నిన్ను చావు బతుకుల్లో వదిలేసి వెళ్లి పోయారనీ విశ్వేశ్వర్రావు అనడం మాస్టర్ స్ట్రోక్ లా పనిచేసింది.

          దీంతో మళ్ళీ కళా రంగాన్ని వదిలేసి వ్యాపారంలోకే  వెళ్ళిపోయాడు నితిన్. ఇది ప్లాట్ పాయింట్ - 2 ఘట్టం. అంటే ప్లాట్ పాయింట్ -1 దగ్గర పుట్టిన సమస్యకి ఇది పరిష్కారం. ఇందులో సత్యవతి, చింకీల మరణాలతో అనుబంధ సంఘటనలున్నాయి. సమస్యని పుట్టించే ప్లాట్ పాయింట్ -1, సమస్యకి పరిష్కారాన్నిచ్చే ప్లాట్ పాయింట్ - 2 ఎప్పుడూ కాంట్రాస్ట్ గా వుంటాయి. అది నెగెటివ్ గా వుంటే, ఇది పాజిటివ్ గా; అది పాజిటివ్ గా వుంటే, ఇది నెగెటివ్ గా. అక్కడ నితిన్ కళని వదులుకుని వ్యాపారం చేపట్టాడు, ఇక్కడ మళ్ళీ కళనే వదులుకుని వ్యాపారం చేపట్టాడు. కాంట్రాస్ట్ ఏమిటంటే అక్కడ విధిలేక అయిష్టంగా వ్యాపారం చేపడితే, ఇక్కడ మనస్ఫూర్తిగా వ్యాపారం చేపట్టాడు. మధ్యలో జరిగిందంతా అంతరంగ మథనమే. మిడిల్ అంటేనే  అంతరంగ మథనం. అందులోంచి నేర్చుకోవడం, మారడం, తనని తాను తెలుసుకోవడం, ఎదగడం. ఇవన్నీ జరిగాయి నితిన్ విషయంలో. అయితే ఇది నీతీ నిజాయితీలు ఆలంబనగా జరిగాయా అంటే అలాటిదేమీ లేదు. ఇదే టీనేజీ స్పెషాలిటీ. కళారంగం పట్ల అతడి నిజాయితీ ఎంత?  మొదట్లో ఈ ప్రయత్నాలేవో చెయ్యక ఈ వంకతో సత్యవతిని ప్రేమించి, దెబ్బతిని, కళ లేదు కాకరకాయ లేదని మంటలకి ఆహుతి చేశాడు. తనకి టాలెంటే లేదని ఒప్పుకున్నాడు.

          మళ్ళీ ఇప్పుడు విశ్వేశ్వర్రావొక మాటన గానే, మళ్ళీ  కళలేదు కాకరపువ్వొత్తి లేదని లాంగ్ కిక్ ఇచ్చాడు. అక్కడంటే భగ్న ప్రేమతో అలా చేశాడనుకోవచ్చు, ఇక్కడ?  ఇద్దరు నటులు స్వార్ధపరులనగానే, మొత్తం కళారంగానికే దీన్నాపాదించుకుని ఛీథూ అనుకుని వదిలేశాడు. అతడికి ఇందులోంచి బయట పడే ఏదో వంక కావాలి. ఎందుకు బయట పడాలంటే తన దగ్గర ఇప్పుడు డబ్బులేదు. నాటక సంస్థలో పరపతి వుండదు. అందుకని  విశ్వేశ్వర్రావా మాటనగానే వంక దొరికింది, బయటపడ్డాడు. అప్పుడప్పుడే లక్ష్యాలతో టీనేజర్ల నిజాయితీ ఎలా వుంటుందో తెలపడానికే ఈ చిత్రణలు

         పోతే, రెండు చోట్లా సత్యవతి ప్రభావితం చేసింది : అక్కడ ఆమె ప్రేమని పొందలేక భంగ పడ్డాడు, ఇక్కడ మరణిస్తూ ఆమె వ్యక్తం చేసిన ప్రేమకి వూరట పొందాడు. ఇక ప్రేమ బాధ కూడా తీరిపోయింది. కానీ చింకీ ఎందుకు చనిపోవడం? ఆమె ఎవరో, ఎక్కడ్నించి వచ్చిందో, ఆరోగ్య సమస్య లున్నాయేమో ఎవరికీ తెలీదు. బయటపడకుండా మౌనంగా వెళ్ళిపోయింది. దటీజ్ క్యారక్టర్.
           యాక్షన్ - రియక్షన్ల టూల్ ఇలా పనిచేశాకా, ఇక క్యారక్టర్ ఆర్క్ చూద్దాం. కథ నడిపే క్యారక్టర్ ఆర్క్ అన్నాక పడుతూ లేస్తూ వుండాలి. ప్లాట్ పాయింట్ -2  దగ్గర మిడిల్ కొలిక్కి వచ్చినప్పుడు, కథని బట్టి పూర్తిగా పరాజయంతో పతనమవడమో, విజయంతో పూర్తిగా పైకి లేవడమో జరగాలి. నితిన్ పాత్ర ఈ ఫ్రేమ్ వర్క్ లోనే వుంది : ఈ కథని బట్టి ప్లాట్ పాయింట్ -2 లో విజయంతో ఊర్ధ్వ ముఖంగా వుంది క్యారక్టర్ ఆర్క్. కళ కాదు వ్యాపారమని మనస్సుని గెలవడమిది. దీనికి ముందు ఆర్క్ పడుతూ లేస్తూనే వుంది మనసులో విలన్తో పోరాటంలో. దర్శకుడు చింకీని కొడుతున్నప్పుడు నితిన్ తన గోల్ తప్పి పడిపోయాడు. తనే దర్శకుడై పైకి లేచాడు. నాటకాలేస్తూ మరింత పైకి లేచాడు. డబ్బులు పంచేస్తూ ఇంకింత పైకి లేచాడు. దొంగలు దాడి చేసినప్పుడు మళ్ళీ పడి పోయాడు. విశ్వేశ్వర్రావు దగ్గర కొద్దిగా పైకి లేచాడు. విశ్వేశ్వర్రావు చెప్పిన మాటకి పూర్తిగా కింద పడ్డాడు. అందులోనే తన సమస్యకి పరిష్కారం కన్పించి పైకి లేచాడు. చింకీ మరణంతో పడిపోయి, సత్యవతి మరణంతో ఆమె చెప్పిన మాటలకి పూర్తిగా పైకి లేచాడు.




              టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ : అంటే కాలం గడిచే కొద్దీ కథనంలో టెన్షన్ పెరుగుతూ పోవడం. పాత్ర ఉత్థాన పతనాలతో కూడిన స్ట్రగులే ఈ టెన్షన్ ని పుట్టిస్తుంది. ఈ టెన్షన్ ఆయా  చర్యల ద్వారా ఉత్పన్నమయ్యే ప్రశ్నల వల్ల ఏర్పాటవుతుంది. ఏం ప్రశ్నలు? ఎక్కడ్నించీ ప్రశ్నలు? గోల్ ఎలిమెంట్స్ లోంచి వచ్చే ప్రశ్నలు. ప్లాట్ పాయింట్ -1 లో ఏర్పాటయినట్టుగా మనం చూసిన గోల్ ఎలిమెంట్స్ - కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక , ఎమోషన్స్ -  ఈ టీటీ గ్రాఫ్ లో పాలు పంచుకుంటాయి ప్రశ్నల్ని రేకెత్తిస్తూ. అలా ఈ గ్రాఫ్ ప్రేక్షకులతో ఇంటరాక్టింగ్ వ్యూయింగ్ కి వీలు కల్పిస్తుంది. పాసివ్ గా చూడకుండా, కథలో లీనమై ఆయా భావోద్వేగాల్ని అనుభవిస్తూ, యాక్టివ్ గా చూసేట్టు చేస్తుంది.

          ఈ మేరకు నితిన్ పడడం, మళ్ళీ లేవడం అన్న స్ట్రగులే ప్రశ్నల్ని సంధిస్తూ టీటీ గ్రాఫ్ ని గీస్తోంది. గోల్ మార్చుకుని వ్యాపార టూర్ కి బయల్దేరిన నితిన్ మళ్ళీ అన్యమనస్కంగా, అశాంతిగా ఎందుకు గడుపుతున్నాడు? సత్యవతితో విఫల ప్రేమా, మంటల్లో పరిత్యాగమైన కళా మర్చిపోలేదా ఇంకా?  అంటే ‘కోరిక’ మారిందా? ఈ చావని కోరికలతో తండ్రి నమ్మకాన్నే పణం’ గా పెడుతున్నాడే... ఇప్పుడా తండ్రికేమైనా అయితే (పరిణామాల హెచ్చరిక)... పెట్టుకున్నగోల్ కి మర్చిపోని కోరికలతో మిశ్రమ ‘ఎమోషన్స్’ ఇస్తున్నాడే...ఇలా ప్రతీ ఉత్థాన పతనంలో గోల్ ఎలిమెంట్స్ ఆధారంగా ప్రశ్నల్తో టెన్షన్ నీ, కథనానికి సస్పెన్స్ నీ సృష్టిస్తూ సాగుతోంది పాత్ర.

          ఇక మిడిల్ టూల్స్ లో చివరిది సొల్యూషన్. ఇది ప్లాట్ పాయింట్ -2 లో వస్తుంది మిడిల్ ని ముగిస్తూ. సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తూ. విశ్వేశ్వర్రావ్ చెప్పిన మాటతో ఇదే సందు అనుకుని చేతకాని  తన ‘కలాబిలాసగోస’ కి ఓ లాంగ్ కిక్కిచ్చి వూరెళ్ళిపోయాడు - వ్యాపారమే మన బృందావనమని. దటీజ్ హిజ్  సొల్యూషన్. ఇలా మిడిల్ వర్క్ షీట్ పూర్తయింది.

దీంతో అయిపోయిందా కథ? అయిపోలేదు. ఈ కథకి ప్లాట్ క్లయిమాక్స్, స్టోరీ క్లయిమాక్స్ అని రెండూ వున్నట్టున్నాయి. ప్లాట్ (కథనం) క్లయిమాక్స్ పైన మిడిల్లో చూపిన విధంగా, ఇంకేం మిగల్చకుండా వచ్చింది. ఇది కాన్సెప్ట్ పరంగా లేదు. కాన్సెప్ట్ వచ్చేసి, బిగినింగ్ విభాగంలో కథా నేపథ్యం ఏర్పాటులో చూపిన ‘సిరిసంపదలు వర్సెస్ నితిన్ పాత్ర’ అన్నట్టుగా వుంది. భోగ భాగ్యాల్ని తిరస్కరించిన నితిన్, ఇలా ప్లాట్ క్లయిమాక్స్ లో ఆ భోగాభాగ్యాలకి దాసుడవడమేమిటి? ఇలా ఇదిప్పుడు డెవలప్ అయిన వ్యక్తిత్వానికి ఓటమి కాదా?

          కనుక ఇది ముగింపు కాదు. నితిన్ ఇంకా జ్ఞానం పొందలేదు, మెచ్యూర్ అవలేదు. సిరిసంపదలు తనకి తృప్తి నివ్వవనుకుని ఈ కథా ప్రయాణం మొదలెట్టాడు. ఇప్పుడు వాటినే ఎందుకు ఆశ్రయిస్తున్నాడు?  మధ్యలో వ్యాపారం కాదు, కళే అనుకున్నప్పుడు- నాటకాల్లో తన పరపతికోసం తండ్రి శ్రమించి నిలబెట్టిన వ్యాపారంలోంచి డబ్బు ఎలా వాడుకున్నాడు? నీతి కూడా తప్పాడు. మళ్ళీ ఆ డబ్బు లేకపోయేసరికి కళే వదులుకున్నాడు. తండ్రి నిర్మించిన సర్వసౌఖ్యాల పొదరిల్లోకే వెళ్ళిపోతున్నాడు. కాన్సెప్ట్ కి న్యాయం జరగడం లేదు.

ముగింపు చూద్దాం : నితిన్ తన వూరెళ్ళి పోయాక షారుఖ్ ఖాన్ బాగా రిచ్ గా, స్టయిలిష్ గా  తారసపడ్డాడు. అయితే ఇదివరకంత అందంగా లేడు, పైగా అనారోగ్యంగా వున్నాడు. తను డబ్బు లేనప్పటికీ ఆరోగ్యంగా, అందంగా వున్నాడు. అక్కడింకో ఇద్దరు పాత మిత్రులు ఎదురయ్యారు - మాయాంక్, శశాంక్. మళ్ళీ తన వూరుకొచ్చి ఇలా పాత మిత్రుల్ని చూస్తూంటే ఏదో ఆత్మశాంతి, దేంట్లోంచో తెలీని విముక్తి. ఇంకేం వెతుక్కుంటున్నాడో తెలీదు, కానీ అదేదో ఇక్కడే వుందన్నకొత్త ఎరుక ఏదో కలుగుతోంది...

          మాయాంక్, శశాంక్ లు నితిన్ లో ఏదో మార్పుని గమనించి సౌందర్య లహరిని పరిచయం చేశారు. ఆమెతో ప్రేమలో పడ్డాడు నితిన్. ఇక నటన లేదు, నాటక రచనా లేదనీ, తనలో లేని వాటిగురించి గాలిమేడలు కట్టుకోవద్దనీ నిర్ణయం తీసుకుని, అలాగని తండ్రితోనూ  ఐశ్వర్యవంతమైన జీవితంలోకి  పోకూడదనీ, దేనికీ ఫిక్స్ కావద్దనీ, జీవితమంటే తెలుసుకోవడమేననీ, తర్ఫీదు పొందడమేననీ గ్రహింపు కొచ్చి, సౌందర్య లహరితో సామాన్య జీవితాన్ని స్వీకరిస్తూ డైరీలో ఇలా రాసుకున్నాడు : జ్ఞానానికి రెండు ఊట బావులున్నాయి -  అంతరంగంలో ఒకటి, బాహ్య ప్రపంచంలో ఇంకొకటి.  

          ఇంట్లో చింకీ చిత్రపటం పెడుతూంటే అనుమానంగా చూసింది సౌందర్య లహరి. దత్తపుత్రిక అన్నాడు.

           ఈ సాంప్రదాయ కథ పైన పేర్కొన్న గోథె రాసిన విల్ హమ్ మిస్టర్స్ అప్రెంటీస్ షిప్’ నవల లోనిది.



next : ఆధునిక దృశ్యం

 సికిందర్