రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, జూన్ 2021, బుధవారం

1042 : రివ్యూ


నాయాట్టు (మలయాళం)
దర్శకత్వం : మార్టిన్ ప్రకట్
తారాగణం : కెంచకో బొబన్
, జోజు జార్జి, నిమీషా సజయన్, యమ గిల్గమేష్, జాఫర్ ఇడుక్కి తదితరులు
రచన : షాహీ కబీర్, సంగీతం : విష్ణు విజయ్
, ఛాయాగ్రహణం : షైజు  ఖాలిద్
బ్యానర్ : గోల్డెన్ కాయిన్ మోషన్ పిక్చర్
, మార్టిన్ ప్రకట్ ఫిలిమ్స్
నిర్మాతలు : రంజిత్
, పి ఎం శశిధరన్, మార్టిన్ ప్రకట్
విడుదల : ఏప్రెల్ 8
, 2021, నెట్ ఫ్లిక్స్
***

కథ
ప్రవీణ్ మైకేల్ (కొంచాకో బొబన్) పోలీసుద్యోగంలో చేరతాడు. అదే స్టేషన్లో సునీత (నిమీషా సజయన్) పని చేస్తూంటుంది. మణియన్ (జోజు జార్జి) ఏఎస్సైగా వుంటాడు. సునీత, మణియన్ దళితులు. మణియన్ కూతురికి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తూ ఆమె అందులో పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ వుంటాడు. ఒక రోజు సునీత బంధువు, దళిత పార్టీ కార్యకర్త బిజూ అనే అతను, పోలీస్ స్టేషన్లో బీభత్సం సృష్టిస్తాడు. ఏఎస్సై మణియన్ లాకప్ లోవేస్తే ఫోన్లు చేయించుకుని విడుదలై పోతాడు. పార్టీ కార్యకర్తలు పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు.

        ఇంకో రోజు మణియన్, ప్రవీణ్ లు ఒక పెళ్ళికి హాజరై బాగా తాగుతారు. జీపు డ్రైవ్ చేయడానికి మణియన్ మేనల్లుడు రాహుల్ ని తెచ్చుకుంటాడు. అదే జీపులో సునీత ఎక్కుతుంది. దారి మధ్యలో యాక్సిడెంట్ జరుగుతుంది. జీపు డ్రైవ్ చేసిన రాహుల్ పారిపోతాడు. ఆ యాక్సిడెంట్ లో దళిత పార్టీ కార్యకర్త జయన్ చనిపోతాడు. దీంతో దళిత ఆందోళన చెలరేగుతుంది. ఆ నియోజక వర్గంలో ఉప ఎన్నిక వుంది. 50 వేల దళిత ఓట్లున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాక్సిడెంట్ చేసిన సిబ్బందిని అరెస్ట్ చేయమని ఆదేశిస్తాడు ముఖ్యమంత్రి జయప్రకాష్ (జాఫర్ ఇడుక్కి).


        దీంతో ప్రవీణ్, మణియన్, సునీత ముగ్గురూ పారిపోతారు. వాళ్ళని పట్టుకోవడానికి ఎస్పీ అనూరాధ (యమ గిల్గమేష్) తో టీంని నియమిస్తాడు డిజిపి. వేట మొదలవుతుంది. దొరక్కుండా ప్రదేశాలు మారుస్తూ పరారీలో వుంటారు ముగ్గురూ. ఇలా ఎక్కడిదాకా ఎంతకాలం పరుగుదీశారు? అనూరాధ టీం వాళ్ళని పట్టుకోగలిగిందా? మధ్యలో తలెత్తిన వూహించని పరిణామమేమిటి? చేయని నేరానికి నేరస్థులుగా ముద్రపడిన పోలీసులు ముగ్గురూ, ముఖ్యమంత్రి ఓట్ల రాజకీయానికి కెలా బలయ్యారు? ... ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

      ఇది  2011 లో కేరళలో జరిగిన ఉదంతం. నల్గురు పోలీసులు ఒక టాక్సీలో పెళ్ళికి వెళ్ళి వస్తూంటే యాక్సిడెంట్ జరిగి ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆగ్రహం పెల్లుబికింది. ఆ నల్గురు పోలీసుల మీద ఎస్సీ ఎస్టీ చట్టం కింద, హత్య కేసు కింద అరెస్టు చేయమని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నల్గురూ అజ్ఞాతంలో కెళ్ళిపోయి బెయిల్ కోసం ప్రయత్నించారు. 100 రోజుల తర్వాత సుప్రీం కోర్టులో బెయిలు లభించింది. ఇప్పుడు పదేళ్ళు గడిచిపోయినా కేసు ఇంకా తేలలేదనేది వేరే సంగతి.

        ఈ ఉదంతాన్ని తీసుకుని సినిమా కనుగుణంగా కల్పన చేశాడు రచయిత షాహీ కబీర్. ఈయన సెలవులో వున్న పోలీసు. పోలీసు శాఖ పనితీరు ప్రత్యక్షంగా తెలుసు గనుక ఆ అనుభవంతో ప్రొఫెషనల్ గా రచన చేశాడు. పాలకులు తమ రాజకీయావసరాల కోసం అవసరమైతే పోలీసుల్ని సైతం ఎలా బలి చేయగలరో చెప్పాలనుకున్నాడు రచయిత.     

ఇది మ్యాన్ హంట్ థ్రిల్లర్ జానరైనా రెగ్యులర్ కమర్షియల్ హీరోయిజంతో వుండదు. హీరోయిజం లేని రియాలిస్టిక్ అప్రోచ్ తో వుంటుంది. నేరంలో ఇరుక్కున్న హీరో అసలు నేరస్థుణ్ణి పట్టుకుని నిర్దోషిగా బయటపడే రొటీన్ టెంప్లెట్ ని బ్రేక్ చేసి, కమర్షియల్ సినిమా ఇలా కూడా తీయవచ్చని పరిస్థితి- పాత్ర సంబంధాన్ని తారుమారు చేసి చూపించాడు.     

వాస్తవ జీవితంలో చూస్తే పరిస్థితిని జయించే హీరోయిజాలు మాత్రమే వుండవు. ఆ హీరోయిజాలు పరిస్థితుల్ని ఎదుర్కొలేని నిస్సహాయ స్థితీ కూడా వుంటుంది. ఇంతకాలం మనల్ని మనం మభ్య పెట్టుకుంటూ తియ్యటి హీరోయిజాల సినిమాలు ఆనందిస్తూ వచ్చాం. కాస్త తేడాగా చేదు వాస్తవాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత సినిమా షోకిల్లా రాయుళ్ళుగా ఇకపై మనకుంటుంది.

 ***
        కమర్షియల్ కి, రియాలిస్టిక్ కి మధ్య విభజన రేఖ చైనా సరిహద్దు లాగా చెరిగి పోతున్న ప్రస్తుత వినోద కాలమాన పరిస్థితుల్లో, సినిమా కథా రచనా నిర్వచనాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఇక ఏర్పడుతోందేమో. ఈ దిశగా మేధోమధనం జరగాలి.  సిట్టింగ్ రూమ్స్ కాక చితికి పోతున్న స్టోరీస్ కి ప్రయోగ శాలలు కావాలిప్పుడు. సైంటిస్టుల్లా కూర్చుని బుర్రకి పనిచెప్పే ప్రొఫెషనల్స్ కావాలి. స్టార్ సినిమాల్ని వదిలేస్తే, మిగిలిన వాటి సృజనాత్మక స్వేచ్ఛకి తలుపులు బార్లా తెరిచి పెట్టేసి వున్నాయిప్పుడు. కానీ దురదృష్టమేమిటంటే, తెలుగులో ఇలాటి నిర్వచనాలు మార్చే సినిమాలు కనుచూపు మేరలో కూడా వచ్చే సూచనలు లేకపోవడం. ఎవరైనా మేకర్ ఇలాటి ప్రయత్నమేదో చేసినా ఇంకా మూస కథల్నే కోరుకునే, లేదా మేకర్ ప్రయత్నాన్ని మూసగా మార్చేసే, మూస మనసులే ఇంకా బిజినెస్ మోడల్ మారిన ఈ రోజుల్లోనూ రాజ్యమేలుతున్నాయి.

        నాయాట్టు (వేట) ని చూస్తే ఇది కథ కాదు. జీవితంలో కథలుండవు, గాథలే వుంటాయి. గాథల్ని సినిమాలుగా తీస్తే ఆడవు గనుక కథగా మార్చి తీస్తారు. ఐతే గాథలా వున్న నిజ సంఘటనని అనుకోకుండా గాథగానే తీసి విజయం సాధించారు నాయాట్టు తో. ఇది ఇంకో ప్రత్యేకత.

        అయితే దళిత కోణంలో చేసిన ఈ గాథ కాన్సెప్ట్ పరంగా డొల్ల అని చెప్పక తప్పదు. ఎత్తుకున్న దళిత కోణాన్ని నిజాయితీగా చెప్పలేక అపహాస్యం చేసిన వరస కన్పిస్తుంది. గాథ అయివుండీ, యాంటీ క్లయిమాక్సుతో మ్యాన్ హంట్ థ్రిల్లర్ గా నిలబడిన రచన, కాన్సెప్ట్ పరంగా చొరవ చూపలేక చతికిల బడిందని ఒప్పుకోవాలి.        

నటనలు - సాంకేతికాలు

     తారాగణంలో ఎక్కువగా గుర్తుండి పోయే నటన ఎస్పీ అనూరాధగా నటించిన యమ గిల్గమేష్ ది. ఇంతకంటే అచ్చం రియలిస్టిక్ నిజ జీవిత పోలీసుని నటించడం చూడం. కమర్షియల్ పోలీసు పాత్రల్లా క్రూరత్వంతో కేకలేస్తూ విరుచుకుపడే ఓవరాక్షన్ కాదు. అసలు క్రూరత్వముండదు, విరుచుకు పడడముండదు. ఆమె ఫేసు చూస్తేనే పోలీసు ఫేసు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కేరళకి చెందిన ఆర్టిస్టు. రియలిస్టిక్ సినిమాల్లో నటించే కమర్షియల్ ఆర్టిస్టులు రియలిస్టిక్ నటన ఈమెని చూసి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈమె ఇరుక్కునేలా డిజిపి బ్లాక్ మెయిల్ చేసేప్పుడు ఈమె కనబర్చే రియాక్షన్, ముగింపులో నిందితుల్ని కోర్టుకి తరలిస్తున్నప్పుడు గిల్టీగా చూసే చూపూ మరువ లేనివి. యమ రియలిస్టిక్ ఈమె.

        కొంచాకో బొబన్ పూర్తిగా పోలీసు పాత్రని డౌన్ ప్లే చేశాడు. అతను కొత్తగా పోలీసు శాఖలో చేరాడు గనుక సిన్సియర్ గా పనిచేయాలని భావించి కష్టాల్లో పడతాడు. ఈ విషయం మీదే ఇతడికీ ఏఎస్సై పాత్ర జోజు జార్జికీ పడదు. అలాగే ఇంకో పోలీసు సునీతగా నటించిన నీమీషా సజయన్ చివర్లో జోజు జార్జి పట్ల విధేయతతో, మానాన్న నేరస్థుడు అనే దుఖభారం అతడి కూతురి కుండ కూడదన్న భావంతో, తను బలి అవడానికి సిద్ధపడుతూ చెప్పే మాటలు పాత్రని పై స్థాయికి తీసికెళ్తాయి. నైతిక విజయం ఈ బాధిత పోలీసుల వైపే వుంది. అయినా వీళ్ళ భవిష్యత్తు ఓట్ల రాజకీయాధికారం చేతిలో వుంది.  

        ఏఎస్సైగా జోజు జార్జి పాత్రకీ పరిపూర్ణత వుంది- అది విషాదాంతమైనా. తను నేరస్థుడు కాదని కూతురికి నిరూపించేందుకు ఒకే ఒక్క మార్గంతో ఈ విషాదాంతం. ఇంకా చట్టానికి దొరక్కుండా పారిపోతూ వుండడం నిర్దోషిత్వాన్ని నిరూపించదు. లొంగి పోవడమూ నిరూపించదు. అయితే ఒక పని చేయవచ్చు. సహజమైన ఆ పని చేయకపోవడం పాత్ర చిత్రణ లోపమే. నేర కథ లోప రహితంగా వుండాల్సిన అవసరముంది.

        ఈ గాథలో విలన్ ఎవరు? ముఖ్యమంత్రే. ఈ పాత్రలో జాఫర్ ఇడుక్కి విలన్ లక్షణాలు ప్రదర్శించకుండా కూల్ గా వుంటాడు. క్యాజువల్ గా ఓట్ల మీద దృష్టితో ఒక్కో ఆదేశం ఉలిక్కిపడేలా ఇస్తూంటాడు. రేపే పోలింగ్ అన్నప్పుడు డిజిపి రిస్కు తీసుకుని రచించిన ఫేక్ డ్రామా, పోలింగ్ అయ్యాక బెడిసి కొడితే, ఓట్లు పడ్డాక నువ్వెలా చస్తే నాకేంటనే ధోరణిలో డీజీపీనే ఇరికిస్తూ చేతులు దులుపుకునేలాంటి  - కూల్ నెస్ మాటున కరుడుగట్టిన క్రూర మనస్తత్వం వుందే - ఇది ఇడుక్కి నటనని చెబుతుంది.

***
        ఇది మ్యాన్ హంట్ థ్రిల్లరైనా పాత్రలతో, నటనలతో చీకటి వెలుగుల హ్యూమన్ డ్రామా వల్ల దేశీయ జీవితంతో రాణించింది. దేశీయ జీవితం లేని థ్రిల్లర్ కట్ అండ్ పేస్ట్ కథనమవుతుంది. కమర్షియల్ సినిమాలు ఆర్టిఫిషియల్ గా వున్నాయని, రియలిస్టిక్ సినిమాల్ని ఆర్టిఫిషియల్ గా చుట్టి పారేయడం ఇక కుదరదు. ఆర్గానిక్ గానే  రూపొందించాలి.

        థ్రిల్లర్ కేవలం థాట్స్ తో వుంటే, ఎమోషన్ లేని ఒట్టి యాక్షన్ రియాక్షన్ల కథనమే జొరబడుతుంది. థాట్ కి ఎదురు థాట్ ఇచ్చే పాత్రల మధ్య సంఘర్షణతో ఫేక్ కథనం అన్నమాట. థాట్స్ క్షణికమే. థాట్స్ తో పుట్టే ఎమోషన్స్ జీవిత కాలమెక్కువ. అతను మంచివాడు అని ఇప్పుడు పుట్టిన థాట్,  అతను మంచివాడు కాదు అనే థాట్ గా రేపు మారిపోవచ్చు. కానీ అతను మంచి వాడు అని థాట్ రాగానే పుట్టిన ఎమోషన్, కాదని థాట్ రాగానే వెంటనే మారిపోదు. టైమ్ తీసుకుంటుంది. రోజులు పట్టొచ్చు. థాట్ కి నిలకడ తక్కువ, ఎమోషన్ కి నిలకడ ఎక్కువ. ఇది ప్రశ్నిస్తుంది. నిన్న మంచోడన్నావ్  కదా, ఇప్పుడు కాదంటావేంటని కన్విన్స్ కాలేక వుండిపోతుంది. తర్వాత్తర్వాత చల్లబడుతుంది. 

ఇలా మనిషన్నాక ఎమోషన్ లేని థాట్స్ వుండవు. సినిమాల్లో ఎమోషన్ లేని థాట్స్ తో యాక్షన్ రియాక్షన్ల కథనం చేసినప్పుడు అది డీప్ గా టచ్ చేయదు ఆడియెన్స్ కి. పైపైన థ్రిల్ చేస్తుందంతే. ప్రస్తుత సినిమా ఈ టైపులో లేదు. ముఖ్యమంత్రి ఒక థాట్ చేస్తే ఆ నెగెటివ్ ఎమోషన్ ప్రభావం వెన్నాడుతుంది. బాధితులైన పోలీసు పాత్రలు ఇంకో థాట్ చేస్తే ఆ పాజిటివ్ ఎమోషన్ అంతే వెన్నాడుతుంది. ఇలా పాజిటివ్ - నెగెటివ్ ఎమోషన్ల ఇంటరాక్షన్ కథనంతో, ఈ మ్యాన్ హంట్ థ్రిల్లర్ బలమైన హ్యూమన్ డ్రామా అవుతోంది.

***
        సాంకేతికంగా కూడా దేశీయ జీవితం కనబడుతుంది- ఫారిన్ లుక్ వుండదు. ఆర్గానిక్ గా వుంటుంది. కెమెరా ఫారిన్ దే కావచ్చు, దాని పనితనం దేశీయ పౌరసత్వం తీసుకుంది. దీంతో ఫారిన్ సినిమా చూస్తున్నట్టుగాక (థ్రిల్లర్ అనగానే ఫారిన్ సినిమా అన్పించేలా చుట్టేయక పోతే తెలుగు మనసూరుకోదు కదా, తెలుగు మల్లెల మనసే ఫారినోడి కొక్కోరోక్కో పుంజు) మన సినిమా చూస్తున్నట్టే వుంటుంది. మలయాళీ, బెంగాలీ మేకర్ల నుంచి మన సినిమాలు తీయడం నేర్చుకోవాల్సిన అవసరం ఇకనైనా వుందేమో తీవ్రంగా ఆలోచించాలి. తెలుగు మేకర్లు మలయాళ సినిమాలు తెగ చూసేస్తూ వుంటారు. ఎందుకు చూస్తారో, ఏం తెలుసుకుంటారో తెలీదు మల్లెల మనసుతో. పనిలోకి దిగితే మాత్రం ఫారినోడి కోడి పుంజులే. విసుగు లేకుండా చికెన్ మేళా కోరస్.

        నేపథ్య సంగీతం, సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కడ ఎలా ఎప్పుడు, ఎంత మేర వాడితే మిస్టీరియస్ ఫీలింగ్ క్రియేటవుతుందో- అక్కడ అలా అప్పుడు, ఆ మేర వాడి ఫలితాల్ని సాధించారు. ఈ థ్రిల్లర్ ఆడియో థీమ్ ఒకటే : మిస్టరీ ఫీల్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని మిస్టీరియస్ వాతావరణం ఈ కథలో ఇమిడి వుండడంతో. గాథకి మిస్టీరియస్ ఫీలే కదా వుండాలి.

స్క్రీన్ ప్లే సంగతులు

     దొంగని పోలీసులు వేటాడ్డం సాంప్రదాయ కథనం. పోలీసుని పోలీసే వేటాడ్డం సాంప్రదాయం మీద తిరుగుబాటు కథనం. రోల్ రివర్సల్ తో ఈ తిరుగుబాటు. జరిగిన ఒక ఉదంతంలోంచి కొత్త అయిడియా ఆవిర్భావం. పోలీసుల్ని పోలీసులే వేటాడే ఐడియా. రోగ్ పోలీసుని పోలీసులు వేటాడ్డం వేరు. న్యాయంగానే వుంటుంది. మంచి పోలీసుని పోలీసులు వేటాడి బలిపశువు చేయడం అన్యాయంగానే వుంటుంది. ఇలాటి ఉదంతాలు అరుదుగా జరుగుతాయి. ఇటీవలే ముంబాయిలో జరిగింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా వ్యవస్థకి ఎంతో ఇష్టుడైన, అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేసి పాపులరైన, ఏసీపీ సచిన్ వజే చివరికి జైలు పాలయ్యాడు. ముఖేష్ అంబానీ ఇంటి ముందు 'కారులో బాంబులు' కేసులో కారు ఓనర్ని చంపాడన్న ఆరోపణలతో జైల్లో వేసి సీబీఐ కి అప్పజెప్పారు!

        ఉదంతాన్ని ఉదంతం లాగే తీస్తే కథ అన్పించుకోదు, గాథ కూడా అన్పించుకోదు. ఉత్తమ జర్నలిస్టు న్యూస్ రిపోర్టింగ్ అన్పించుకుంటుంది. బలిపశువులున్న ఉదంతాన్ని వీరత్వమున్న ముగింపుగా మార్చి తీస్తే ఓవరాక్షన్ అన్పించుకుంటుంది. ఉదంతంలోని సారాన్ని సారం లాగే వుంచి, బాధిత పాత్రల్ని బాధితులుగానే కొనసాగించి, అది ఏ న్యాయ అన్యాయాల్ని చెబుతోందో, దాన్ని ప్రేక్షకుల చర్చకి వదిలేయడం కథ కాకపోవచ్చు గానీ, గాథ అవుతుంది స్ట్రక్చర్ లో వుంటే. గాథల ముగింపులు ఆనందింప జేయవు, ఆలోచింప జేస్తాయి.

        మన దేశంలో గాథ తీయాలనుకుని గాథ కుండే నిర్మాణంతో శాస్త్రీయంగా గాథలు తీసే వాళ్ళు లేరు. కథలే తెలుసు, గాథలనేవి వుంటాయని తెలిస్తేగా. కథలనుకుని స్ట్రక్చర్ లేకుండా తీస్తే అవి మిడిల్ మటాష్ తో గాథలు కాని గాథలై ఫ్లాపవుతున్నాయి.నాయాట్టు కూడా కథ - గాథ తేడాలు తెలిసి, గాథగా గాథ నియమాలు తెలిసి తీశారనుకోలేం. కథగానే తీస్తూంటే / రాస్తూంటే అది తెలియకుండానే ఏదో స్ట్రక్చర్లో వున్న గాథై పోయిందని మాత్రం నమ్మకంగా చెప్పొచ్చు.  

***
        ఇంతకీ ఇది స్ట్రక్చర్లో వున్న గాథెలా అయింది? బిగినింగ్ అరగంటకి పోలీసులు ముగ్గురూ యాక్సిడెంట్ చేసి పారిపోయే సంఘటన ప్లాట్ పాయింట్ వన్నై, తర్వాత మిడిల్ టూ చివర, ఆ పోలీసులు ముగ్గురూ పోలీసులకి దొరికిపోయే సంఘటన ప్లాట్ పాయింట్ టూ అయి, కథలాగే త్రీయాక్ట్ స్ట్రక్చర్లో వున్న గాథయింది. బాధిత పోలీసులకి గోల్ లేకపోవడంతో గాథయింది. బాధిత పాత్రలు పాసివ్ కావడంతో గాథయింది. ఇలా గోల్ లేకపోయినా, పాసివ్ పాత్రలైనా, గాథగా నిలబడ్డానికి కారణం - గోల్ లేకుండా, పాసివ్ లా అన్పిస్తున్న పరారీలో వున్న పోలీసు పాత్రలు, నిజానికి పాసివ్ రియాక్టివ్ పాత్రలు కావడం.      

  యాక్టివ్ పాత్ర తెలుసు, పాసివ్ పాత్ర తెలుసు, పాసివ్ రియాక్టివ్ ఏమిటి? ఎన్టీఆర్ నటించిన అశోక్ లో విలన్ జరిపే దాడుల్ని ఎన్టీఆర్ ప్రతీసారీ తిప్పి కొడుతూ తప్పించుకోవడమే చేస్తాడు. చూస్తే గొప్ప యాక్షన్ కొరియోగ్రఫీయే కన్పిస్తుంది. ఎన్టీఆర్ పాత్ర బయోగ్రఫీ కన్పించదు. అది యాక్టివ్ యాక్షన్ కాదు. విలన్ చేస్తున్న దాడులకి రియాక్ట్ అయి, తిప్పికొట్టి తప్పించుకునే పాసివ్ ప్రొఫైల్ని విలన్ కి ప్రకటించుకోవడం. దీంతో యాక్టివ్ విలన్ ఇంకిన్ని దాడులు చేస్తూ పోవడం. వాటిని తిప్పికొడుతూ ఎన్టీఆర్ పాసివ్ రియాక్టివ్ స్వభావం వెల్లడించుకుంటూ పోవడం.
 
        ఇదే ఎన్టీఆర్ యాక్టివ్ పాత్రయితే, పరిస్థితిని తన చేతుల్లోకి తెచ్చుకుని, వ్యూ హాత్మకంగా పైచేయి సాధించి, తనే ఫస్ట్ హేండ్ దాడులు చేస్తూ, విలన్ని ఆత్మరక్షణలో పడేస్తాడు. తను ఆత్మ రక్షణ చేసుకునే పాసివ్ రియాక్టివ్ పాత్రవడు. పాసివ్ రియాక్టివులు కథలకి పనికిరావు, ఫ్లాపవుతాయి. అశోక్ హిట్ కాలేదు.

        నాయాట్టు లో ముఖ్యమంత్రి, డిజిపి, ఎస్పీ, సిబ్బందీ ఒకవైపు, బాధిత పోలీసులు ముగ్గురూ మరోవైపు. ఈ బాధిత పోలీసులు ప్రధాన పాత్రలు, ముఖ్యమంత్రీ డీజీపీ ఎస్పీ వాళ్ళ సిబ్బందీ ప్రత్యర్ధి పాత్రలు. ఈ రెండు పక్షాల మధ్య స్క్రీన్ ప్లే మిడిల్ విభాగంలో వుండాల్సిన సంఘర్షణతో కూడిన, యాక్షన్ రియాక్షన్ల పోరాటమే వుంది. ఇందుకూ గాథగా బలం చేకూరింది. ఇక పట్టుకోవడానికి ప్రత్యర్ధి పక్షం, తప్పించుకోవడానికి ప్రధాన పక్షం. పాసివ్ రియాక్టివ్ పాత్రల్లాగా ఎత్తుకు పైయెత్తు వేస్తూ ప్రధాన పాత్రలు తప్పించుకుంటూనే వుంటారు. తమ ముఖ్యమంత్రే, నమ్మిన తమ పోలీసు శాఖే, ఐనా తమ మీదే కుట్ర చేస్తూంటే, కింది స్థాయి పోలీసులైన తామింకేం చేయగలరు. అలాగెలా వుంటారు, ప్రధాన పాత్రలన్నాక గెలిచితీరాలని వాదిస్తే, అది కల్పనల కమర్షియల్ కథవుతుంది. వాస్తవిక కథ ఉన్నదున్నట్టు చూపిస్తుంది. హాలాహల్ అనే హిందీ వాస్తవికతలో హీరో అయిన ఎస్సై ని చంపేస్తారు చివరికి. పెద్దసార్ల ముందు మాట వినని అతనెంత.

        కనుక నాయాట్టు పోలీసులు ముగ్గురూ ఇక తప్పించుకోలేక, ప్లాట్ పాయింట్ టూలో బ్రేకుపడి దొరికిపోతారు. స్ట్రక్చర్ లో ప్లాట్ పాయింట్ టూ అనేది సమస్యకి పరిష్కార ఘట్టమని తెలిసిందే. ఇలా పోలీసులు ముగ్గురూ దొరికిపోవడంతో ప్రత్యర్ధుల సమస్య పరిష్కారమైంది. పరిష్కారమైందా? కాలేదు, తిరగబడింది. దొరికిపోయిన ముగ్గురూ పోలీసుల్లో ఒకడు ఉరేసుకుని!
        ఏఎస్సై మణియన్ కూతురి పట్ల దిగులుతో ఉరేసుకుని చనిపోతాడు.  

***

      పోలింగ్ దగ్గర పడుతోంటే ఏదో వొకటి చేయాలన్న ముఖ్యమంత్రి ఇచ్చిన అల్టిమేటంకి, ఫేక్ అరెస్టులు చూపిస్తాడు డిజిపి. ఓ ముగ్గురికి ముసుగులేసి, పారిపోయిన పోలీసులు దొరికి పోయినట్టు మీడియాకి చూపిస్తాడు. అసలు పోలీసులు ఎప్పుడు దొరికినా కవర్ చేసుకోవచ్చనుకుంటాడు. ముఖ్యమంత్రి కూడా ఇక దళిత ఓట్లు తమకే పడతాయనుకుంటాడు. కానీ అటు ఎస్పీ టీం పోలీసులు ముగ్గుర్నీ పట్టుకుంటే, మణియన్ మృతదేహంగా కన్పిస్తాడు. దీంతో డిజిపి ప్లాను రివర్స్ కొట్టింది. ఈ చావుని డిజిపి మీద తోసేస్తాడు ముఖ్యమంత్రి. ఇలా డైనమిక్స్ కూడా ఈ గాథ కథనానికి బలాన్నిచ్చాయి.

        కూతురు జీవితాంతం తండ్రి నేరస్థుడన్న మచ్చ మోయకూడదన్న భావంతో, కూతురికి వీడియో పెట్టి ఉరేసుకుంటాడు మణియన్. తను నేరస్థుడు కాదని కూతురికి చెప్పుకుంటాడు. శవాన్ని ముందు చూసిన సహ పోలీసు ప్రవీణ్ కి ఈ వీడియో దొరుకుతుంది. దీంతో కేసులోంచి బయటపడొచ్చను కుంటాడు. ఎస్పీ అనూరాధ వచ్చి సెల్ ఫోన్ లాక్కోవడంతో ఈ ఒక్క ఆశా ఆవిరై పోతుంది. ఇలా మిగిలిన ప్రవీణ్, సునీతలు అరెస్ట్ అవుతారు. పోలీసులు కోర్టుకి తీసికెళ్తూంటే ఓపెన్ ఎండ్ గా ముగుస్తుంది.

***

        అయితే కొన్ని ప్రధానమైన లాజికల్ (కామన్ సెన్సు) లోపాలు లేకపోలేదు. ప్లాట్ పాయింట్ వన్ లో ఇది కొట్టొచ్చి నట్టుంటుంది. బాగా రాత్రి వేళ ముగ్గురు పోలీసులు జీపులో పోతున్నప్పుడు నిర్జన ప్రదేశంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు, ముగ్గురూ అక్కడ్నుంచి ఉడాయించి, తెలియనట్టు వుండిపోవచ్చు. సన్నివేశం చూస్తూంటే ఇలా అన్పించేలా వుంది. మణియన్ వదిలేసి పోదామనే అంటాడు. ప్రవీణ్ మృతుణ్ణి హాస్పిటల్ కి తీసికెళ్దామనే అంటాడు. ఇంతలో ఒక దళిత పార్టీ వాడు అటుగా పోతూ చూసేసరికి హాస్పిటల్ కే తీసికెళ్ళి ఇరుక్కుని, అక్కడ్నించి పారిపోతారు సునీత సహా. ఇలా ఈ ఘట్టంలో లోపాల్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు.   

        జీపు డ్రైవ్ చేసింది మణియన్ మేనల్లుడు రాహుల్. అతను పారిపోతాడు. అప్పుడు జీపుని హాస్పిటల్ కి ప్రవీణ్ డ్రైవ్ చేస్తాడు. చిట్ట చివరికి అరెస్టయ్యాక, జీపు డ్రైవ్ చేసింది రాహులని ప్రవీణ్ అంటే, స్టీరింగ్ మీద ప్రవీణ్ వేలిముద్రలున్నాయని పై అధికారి నోర్మూయిస్తాడు. జీపుని ప్రవీణ్ హాస్పిటల్ కి డ్రైవ్ చేస్తే, రాహుల్ వేలిముద్రలు చెడిపోయి, ప్రవీణ్ వేలి ముద్రలే పడతాయన్న లాజిక్ ని తీసి అవతల పెట్టేశారు.

        ఉరేసుకున్న మణియన్ కూడా చేయాల్సిన అసలు పని చేయకుండా, కూతురికి వీడియో పెట్టి చనిపోవడం కూడా లాజిక్ కి అడ్డుపడే వ్యవహారమే. అసలు జరిగింది విన్నవించుకుంటూ అతను సోషల్ మీడియాలో వీడియో పెట్టి వుంటే, అది వైరల్ అయి ప్రజా మద్దతు లభించే అవకాశముండేది.

చివరికేమిటి

      మ్యాన్ హంట్ థ్రిల్లర్ జానర్ గాథగా కొన్ని లోపాలతో చీకటి వెలుగుల హ్యూమన్ డ్రామాగా థ్రిల్ చేసే మాట నిజమే, అయితే కాన్సెప్ట్ పరంగా అసందర్భంగా వుంది. దళిత కాన్సెప్ట్ తీసుకుని అర్ధం లేని గాథ చేశారు. దళిత వర్సెస్ దళిత వర్సెస్ దళిత అన్నట్టు పాత్రల్ని ఎడాపెడా వాడేశారు. యాక్సిడెంట్ చేసిన పోలీసుల్లో ఇద్దరు దళితులు, యాక్సిడెంట్ లో చనిపోయిన వాడూ దళితుడు, యాక్సిడెంట్ చేసిన దళితులున్న పోలీసుల్ని పట్టుకోవాలని రచ్చ రచ్చ చేసేదీ దళిత పార్టీ! ఇలావుంది బలాబలాల సమీకరణ. ఒక సామాజిక వర్గం మీద అదే సామాజిక వర్గాన్ని ప్రయోగిస్తే సామాజిక వర్గ గాథ అవుతుందా. తమ వాణ్ణి యాక్సిడెంట్ చేసిన తమ సామాజిక వర్గాన్ని పోలీసులు పట్టుకుంటే, హుర్రే అని అదే సామాజిక వర్గం అధికార పార్టీకి ఓట్లు గుద్దేసి గెలిపించేస్తుందా? ఏం చెప్పాలనుకున్నారు? దళితులు వర్సెస్ దళితేతరులుగా విజాతి బలాబలాల సమీకరణగా చేసి, ఈ గాథ ఎందుకు చెప్పలేకపోయారు? ఇదీ చివరికి మిగిలే ప్రశ్న.

సికిందర్