రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, October 27, 2014

   రివ్యూ..              రీసెర్చి కథనాని కవసరం!


రచన –దర్శకత్వం : చందు మొండేటి
తారాగణం : నిఖిల్, స్వాతి, రావు రమేష్, భరణి కిషోర్, ప్రవీణ్, తులసి, జోగినాయుడు, చంటి
సంగీతం : శేఖర్ చంద్ర      ఛాయాగ్రహణం : ఘట్టమనేని కార్తీక్
బ్యానర్ : మాగ్నస్ సినీ ప్రైమ్
నిర్మాత : వెంకట్ శ్రీనివాస్
సెన్సార్ :     విడుదల: 24 అక్టోబర్, 2014 

***


        మిస్టరీలు - అందునా గుళ్ళూ గోపురాల చుట్టూ నిగూఢ రహస్యాలతో కూడిన హిస్టారికల్ మిస్టరీలు తెలుగు  ప్రేక్షకులకి కొత్తేం కాదు. మిస్టరీ కాకపోయినా, ఈ మధ్యే గోపీచంద్ నటించిన ‘సాహసం’ అనే హిస్టారికల్ థ్రిల్లర్ ని చూశారు. అంతకి ముందు వెంకటేష్ తో వచ్చిన “నాగవల్లి’ అనే మరో హిస్టారికల్ థ్రిల్లర్ నీ చూశారు. హిందీలో నైతే ‘పురానా మందిర్’  లాంటి హర్రర్ లు అనేకం వచ్చాయి. ఇంకా చెప్పాల్సి వస్తే తాజాగా “స్వామి రారా’ అనే మరో హిస్టారికల్ థ్రిల్లర్ ని కూడా చూశారు. ఇంకోసారి ఇప్పుడు  ‘కార్తికేయ’ రూపంలో ‘హిస్టారికల్ మిస్టరీ’ చూస్తున్నారు. అదీ కొత్త దర్శకుడి ఆధ్వర్యంలో. ఈ కొత్త దర్శకుడు  ‘స్వామి రారా’ కి పనిచేసిన సహాయకుడే. ‘స్వామిరారా’ అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించిన కేరళ లోని అనంత పద్మనాభ స్వామి ఆలయ విగ్రహం చుట్టూ సాగే ఓ ‘థ్రిల్లర్’ కథ చెప్పింది. ఇప్పుడు ‘కార్తికేయ’  అదే హీరో హీరోయిన్లని రిపీట్ చేస్తూ, అదే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధం కోణాన్నే కొంత మార్చి ‘హిస్టారికల్ మిస్టరీ’ చెబుతోంది. ఆ హిస్టరీ - అంటే ఆ ఆలయం చుట్టూ చారిత్రక నేపధ్యం దర్శకుడి కల్పనే అనేది వేరే విషయం. 
           ఈ కొత్త దర్శకుడు అసలేం చెప్పాడో వివరాల్లోకి వెళ్దాం...


ఆలయాన వెలసిన అదో మిస్టరీ!

     కార్తికేయ (నిఖిల్ ) ఫైనల్ ఇయర్లో వున్న మెడికో. అతడికి తల్లి, అన్నా వదినె లుంటారు. వల్లి (స్వాతి) బీడీఎస్ స్టూడెంట్. ఆమెకు పూజలు పురస్కారాలు చేసుకునే తండ్రి (తనికెళ్ళ) ఉంటాడు వూళ్ళో. కార్తికేయ తనకేదైనా ప్రశ్న ఎదురయ్యిందంటే దాని అంతు చూడకుండా నిద్రపోని మనస్తత్వం కలవాడు. అతడికి ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో సుబ్రహ్మణ్య పురం అనే గ్రామంలో మెడికల్ క్యాంపు పడుతుంది. ఆ ఊరే వల్లి సొంతూరని అక్కడి కెళ్లాక తెలుసుకుంటాడు. క్లాస్ మేట్స్ తో ఓ పాతబడిన బంగళాలో బస చేసి మెడికల్ క్యాంపులో పాల్గొంటూ ఉంటాడు. కాలేజీలోనే వల్లిని ప్రేమించిన కార్తికేయ, ఇప్పుడు ఆమె తండ్రికి కి ఆ విషయం తెలియజేస్తాడు. ఆ తండ్రి నుంచి పెద్దగా వ్యతిరేకత వుండదు. 

           ఇలా వుండగా, దేవాదాయ శాఖకి చెందిన ఉద్యోగి ఒకతను కొంత కాలం క్రితం ఈ వూరికి వచ్చి, ఇక్కడ మూతబడిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి సంబంధించి సంభవిస్తున్న మరణాలని పరిశోధిస్తూ పాముకాటుకి గురై మరణిస్తాడు. ఇలాగే తర్వాత ఇంకో రెండు మరణాలు సంభవిస్తాయి. ఆ ఉద్యోగి మరణాన్ని పురస్కరించుకుని దర్యాప్తు కొచ్చిన పోలీసు ఇన్స్ పెక్టర్ ( భరణీ కిషోర్) కూడా ప్రమాదం పాలై చనిపోతాడు. అతను రాస్తున్న పుస్తకం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ఈ ప్రమాదాన్ని కళ్ళముందు చూసిన కార్తికేయ ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభిస్తాడు- కానీ అది ఆలయ మిస్టరీ గురించి పూర్తి సమాచార మివ్వదు. ఇక తనే ఛేదించాలని నిర్ణయించుకుంటాడు.

         ద్రవిడుల కాలంలో కీర్తివర్మ అనే రాజు,  తమిళ నాడు- ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో పరిపాలిస్తూ ఉంటాడు. ఒకసారి తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడి రాజ్యం ఎడారిగా మారుతోంటే, ఏమీ పాలుపోని అతడికి శిథిలాల మధ్య ఒక విగ్రహం కన్పిస్తుంది. అది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. తనకి ఆలయం కడితే రాజ్యం సస్యశ్యామల మవుతుందని ఆ స్వామి చెప్పడంతో ఆలయం నిర్మిస్తాడు. ప్రతీ కార్తీక పౌర్ణమికి  ఆలయం మీద చంద్ర కాంతి పడినప్పుడు ఊరంతా వెలిగిపోయేట్టు ఒక రహస్య ఏర్పాటు చేస్తాడు...రాజ్యం తిరిగి కళకళ లాడుతుంది. అప్పట్నుంచీ ప్రతీ కార్తీక పౌర్ణమికి సుబ్రహ్మణ్య స్వామికి ఇరవై ఒకటో రోజున షష్టి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అలా ఈ ఆలయం సంవత్సరం క్రితం వరకూ రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తుల్ని ఆకర్షిస్తూ వుండేది. సడెన్ గా ఆలయంలోనే ఆలయ పూజారి దుర్మరణం చెందడంతో, మైల అనే కారణం చెప్పి మూసేశారు. అప్పట్నుంచీ తిరిగి తెరవాలనుకుంటున్న వాళ్ళు, తెరిచే ప్రయత్నం చేసే వాళ్ళూ పాముకాటుకి గురై చనిపోతున్నారు.

          అదే పాము ఇప్పుడు మరణాల మిస్టరీ ఛేదించడానికి పూనుకున్న కార్తికేయ మీద పగబట్టింది. ఈ ప్రమాదాన్ని కాచుకుని కార్తికేయ మిస్టరీని ఎలా ఛేదించాడనేది మిగతా కథ!


ఎవరెవరెలా..

           మరీ ‘స్వామిరారా’ లోలాంటి హుషారైన పాత్రకాదు హీరో నిఖిల్ ది. ‘స్వామిరారా’ థ్రిల్లర్. ప్రస్తుత సినిమా ‘మిస్టరీ’.  ఈ తేడా పాత్ర తీరు మీద, తద్వారా నటన మీదా సహజంగానే ప్రభావం చూపింది. పోనీ ఈ స్లో క్యారెక్టర్ కి బలం చేకూర్చే ఎమోషనల్ ఆసరా ఏమైనా దక్కిందా అంటే అదీ లేదు. ఇప్పుడు ఒక నాగార్జున లేదా వెంకటేష్ నటించాల్సిన పాత్ర నిఖిల్ ఈ వయసులోనే నటించేశాడు! యువ హీరోలు ఫార్ములా పాత్రల మీద వ్యామోహం వదులుకుంటే తప్ప, మిస్టరీ కథలతో కూడిన ఇలాటి సినిమాలు వాళ్లకి నప్పవని ససాక్ష్యంగా నిరూపించాడు!

           ఈ సందర్భంగా 2007 లో హిందీ లో వచ్చిన ‘మనోరమ – సిక్స్ ఫీట్ అండర్’ అనే విజయవంతమైన మిస్టరీ మూవీ గుర్తు కొస్తోంది. ఇందులో హీరో అభయ్ డియోల్ ది చాలా ఆసక్తి గొల్పే రియలిస్టిక్ క్యారెక్టర్. మారుమాల గ్రామంలో పీ డబ్ల్యీవ్ డీ లో సగటు ప్రభుత్వ  ఇంజనీర్ గా ఉంటూ, డిటెక్టివ్ కథలు రాస్తూంటాడు. గుల్ పనాగ్ వచ్చి, “నీలాటి వాడే  నాక్కావాలి- పద, నా మొగుడి మీద నిఘా పెట్టు!” అంటుంది.  దీంతో రాసేవాడు కాస్తా చేసే డిటెక్టివ్ అవతారమెత్తి- ఒక పెద్ద మర్డర్ మిస్టరీనే నానా పాట్లూ పడి చచ్చినట్టూ ఛేదిస్తాడు. నవదీప్ సింగ్ అనే కొత్త దర్శకుడు తీసిన ఈ సినిమాకి అప్పట్లో జాతీయ మీడియా అంతా కలిసి 4/5 రేటింగ్ ఇచ్చి సత్కరించింది!

Manorama -six feet under
      స్వాతీ రెడ్డి ది ఇంకో ఫార్ములా పాత్ర. ఫార్ములా సినిమాల్లో హీరోయిన్ దేనికోసమైతే వుంటుందో స్వాతి కూడా దానికోసమే యధాశక్తి కృషి చేస్తున్నట్టు కన్పిస్తుంది- ప్రేమలకి, పాటలకి మాత్రమే. కాకపోతే వొళ్ళు చేసినందువల్ల నాజూగ్గా చూపించడానికి కెమెరా మాన్ ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ప్రారంభ దృశ్యాల్లో ఆమె స్కూటీ హీరో కారుకి తగిలే సన్నివేశంలో కూడా అటువంటి జాగ్రత్తే పడి వుంటే ఇంకా బావుండేది. 

 హీరో ఫ్రెండ్స్ గా వేసిన ఇద్దరూ మెడికల్ స్టూడెంట్స్ లా లేరు. మూస ఫార్ములా మాస్ పోకిరీ షోకిల్లా రాయుళ్ళానే వున్నారు. ఇతర నటులవి అలా వచ్చి ఇలా వెళ్ళే పాత్రలే- ప్రతినాయకుడి పాత్ర రావురమేష్ సహా! 
          శేఖర్ చంద్ర సంగీతంలో పాటలేవీ క్యాచీగా, హుషారుగా లేవుగానీ, నేపధ్య సంగీతానికి తనదైన బ్రాండ్ ని మాత్రం బాగా కాపాడుకున్నాడు. ఛాయాగ్రాహకుడు కార్తీక్ కి ఈ మిస్టరీ మూడ్ ని ఆద్యంతం ఎలివేట్ చేద్దామంటే, ఆ లైటింగ్ స్కీముకి  అడపాదపా లవ్ ట్రాక్ అడ్డు పడుతూ పోయింది. అలాకాక హీరోహీరోయిన్ల ప్రేమాయణం కూడా ప్రధాన కథలోనే  కలిసిపోయి సాగి వుంటే – ఆ లైటింగ్ కి, కలర్ స్కీములకి  ఏకత్వం సాధ్యపడేది. 
          ఇందులో గ్రాఫిక్స్ పాళ్ళు ఎక్కువే. గుడి స్థల పురాణం చిత్రకథ, పాము దృశ్యాలు, గుళ్ళో చంద్రకాంతి రిఫ్లెక్షన్ లాంటివి చాలాభాగం ఆక్రమించాయి. అయితే అవి పకడ్బందీగా వున్నాయి. 
          కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అన్నీ తానై నిర్వహించిన ఈ కొత్త దర్శకుడి నుంచి అప్పుడే ఎక్కువ ఆశించకూడదు. తనకు సాధ్యమైనంత చేసుకుపోయాడు. మరీ ఇష్టారాజ్యంగా చుట్టేసి మొదటి సినిమాతోనే ఐపు లేకుండా పోతున్న కొత్త దర్శకులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో- నిర్మాతకి లాభం చేసి కొత్తాఫర్లు దక్కించుకునే హోదానే పొందాడు ప్రస్తుత దర్శకుడు. కాకపోతే టెక్నికల్ గా మాత్రమే, విషయపరంగా కాదు.


స్క్రీన్ ప్లే సంగతులు 
     దర్శకుడు తను తీస్తున్న కథ ఏ genre కి చెందుతుందో గుర్తించకపోవడం, గుర్తించినా దాని అసలు కథన రీతు లేమిటో తెలుసుకోకపోవడం; బదులుగా గుళ్ళ గురించీ, ఇతర పాముల్ని హిప్నటైజ్ చేయడం గురించీ క్షుణ్ణంగా రీసెర్చి చేస్తూ కూర్చోవడం  – ఇవీ ఈ స్క్రీన్ ప్లే ని పేలవంగా మార్చేసిన కారణాలు. అసలు రీసెర్చి చేయాల్సింది genre గురించి! దాంతో స్క్రీన్ ప్లే ని అర్ధవంతంగా మల్చుకోవడం గురించి!!

          సారవంతమైన భూమిలోనే మొక్కలు బలంగా పెరుగుతాయి. సారవంతమైన స్క్రీన్ ప్లే లేనిదే బలమైన కథనం కూడా రాదు. స్క్రీన్ ప్లే కి ఆ ‘భూసారాన్ని’ ఇచ్చేది ఆ కథ తాలూకు  genre లక్షణాలు. సాధారణంగా ఏ సస్పెన్స్ తో కూడిన కథా చిత్రాలనైనా సస్పెన్స్ థ్రిల్లర్ అనెయ్యడం పరిపాటి. ఆ దోవనే పడి గుడ్డిగా కథ తయారు చేసుకోవడమూ ఆనవాయితీ. కానీ సస్పెన్స్ అనేది ఒక్క థ్రిల్లర్ genre లోనే కాదు,   ‘మిస్టరీ’ అనే మరో genre లో కూడా ఉంటుందనీ,  రెండూ వేర్వేరు జాతులనీ తెలుసుకోవడం మాత్రం జరగడం లేదు. హార్రర్లో కూడా సస్పెన్స్ వుంటుంది. దాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ అనరు గానీ, మిస్టరీని మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ లో కలిపేసి మాట్లాడ్డం చాలా విచిత్రం. 
          సస్పెన్స్ థ్రిల్లర్ లో విలన్ ఎవరో తెలిసిపోతూంటాడు, మిస్టరీలో చివరిదాకా తెలియడు. సస్పెన్స్ థ్రిల్లర్ ‘సీన్ - టు- సీన్ సస్పెన్స్’ అనే  కథన ప్రక్రియతో, విలన్ తో ఓపెన్ గేమ్ గా నడుస్తుంది, మిస్టరీ ‘ఎండ్ సస్పెన్స్’  కథన ప్రక్రియతో విలన్ తో ‘క్లోజ్డ్ గేమ్’ గా సాగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ని  ‘ఎండ్ సస్పెన్స్’ ప్రక్రియతో నడిపినా, లేదా మిస్టరీని ‘సీన్ –టు- సీన్’ ప్రక్రియతో నడిపినా రెండూ అట్టర్ ఫ్లాప్ అవుతాయి.  సస్పన్స్ థ్రిల్లర్ స్పీడుగా సాగుతుంది, మిస్టరీ నిదానంగా నడుస్తుంది. రెండిటి సస్పెన్సుకూ రెండు పార్శ్వా లుంటాయి- ఎందుకు?/ఎవరు ? – అన్నవి. నేరం ‘ఎందుకు’ జరిగింది?/ ‘ఎవరు’ చేశారు?- అని. సస్పెన్స్ థ్రిల్లర్ కి ఈ రెండూ ఓపెన్ చేసి విలన్ ని పట్టుకోవడం గురించి ఎత్తుకుపై ఎత్తుల సీన్- టు- సీన్ సస్పెన్స్ గా నడపవచ్చు. మిస్టరీకి అలా కుదరదు. ఎందుకు జరిగిందో తెలియకూడదు, ఎవరు చేశారో కూడా తెలియ కూడదు. ఈ ప్రశ్నలకి సమాధానాల్ని అన్వేషిస్తూ, క్లూస్ ని పట్టుకుంటూ చిట్ట చివరికి ఆ దోషిని పట్టుకుని, నేరం ఎందుకు చేశాడో అప్పుడు తెలుసుకుంటాడు హీరో.
          మిస్టరీకి ముగింపు అప్పటివరకూ సాగిన కథన తీవ్రతకి మించిన స్థాయిలో వుండాలి. బయట పడే ఆ మిస్టరీ (రహస్యం) ప్రేక్షకులకి షాకింగ్ గా వుండాలి, ఓస్ ఇంతేనా అన్పించ కూడదు. ఇందుకే మిస్టరీ ముగింపు చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. దీనికెంతో ఆలోచనా శక్తీ, సబ్జెక్టు పట్ల రీసెర్చీ అవసరం. అలాగే మిస్టరీ కథనంలో క్లూస్ ఇస్తూ అనుమానాన్ని ఇతరుల మీదికి పోనిస్తూ ( ఇలా అనుమానితులుగా చూపించడాన్ని, నేరస్థుడ్ని పట్టివ్వగల అవకాశమున్న క్లూస్ ని చూపించడాన్నీ ‘రెడ్ హెర్రింగ్స్’ అంటారు, చాలావరకూ వీటిని ప్రేక్షకుల్ని మిస్ లీడ్ చేస్తూ బిజీగా ఉంచడానికి ప్రయోగిస్తారు) నడపాలి. ఇలా కాకుండా నడపడం, మర్డర్ మిస్టరీల రచయిత్రి ఒక్క స్వర్గీయ అగథా క్రిస్టీ కే చెల్లింది! పాఠకులకి ఆమె పట్ల వల్లమానిన అభిమానమో మరేంటో, చివరి పేజీలవరకూ ఆమె ఇచ్చే అన్ని సమాధానాల కోసం ఓపిగ్గా చదివేవారు. అలా రెడ్ హెర్రింగ్స్ ని కూడా దాచిపెట్టి ఇంకెవరైనా రాస్తే చదవలేక విసిరికొట్టేయడం గ్యారంటీ!

సినిమాలో కొస్తే...
        ఈ సినిమాకథ ‘మిస్టరీ’ కోవకి చెందుతుందని ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆలయాన్ని ఆశ్రయించి చిట్ట చివర్లో తెలిసే ఈ మరణాల రహస్యం మిస్టరీ కథలా సాగలేదు. మిస్టరీలాగే మందకొడి నడక నడిచినా, ఆ నడకలో బలం లేదు. కారణం, తగినన్ని మలుపుల్లేక పోవడం, రెడ్ హెర్రింగ్స్ అసలే లేకపోవడం. లాజిక్ పట్ల ప్రొఫెషనలిజం లోపించడం. మర్డర్ ఇన్వెస్టిగేషన్ కాని సస్పెన్స్ థ్రిల్లర్స్ లో కొంత లాజిక్ ని ( సృజనాత్మక స్వేచ్చ- సినిమాటిక్ లిబర్టీ వగైరా వగైరా వంకలతో) ఎగేయవచ్చుగానీ, మిస్టరీల్లో  ప్రతీ చిన్న అంశం పట్లా లాజికల్ గా పటిష్టంగా ప్రొఫెషనల్ గా ఉండాల్సిందే. లేకపోతే దర్శకుడి మీద  జాలి కలుగుతుంది ప్రేక్షకులకి. 

          కథా ప్రారంభంలో చూపించిన పాముకాటు మరణంలో ఆ  ఉద్యోగి రాస్తున్న పుస్తకం, ఎక్కడో దూరాన వూళ్ళో ఉంటున్న భార్య చేతిలో కెలా వెళ్ళింది? క్రైం సీన్లో అది పోలీస్ ప్రాపర్టీ కాదా? అలాగే, ఇంటర్వెల్ సీన్లో మరణించిన ఇన్స్ పెక్టర్ దగ్గరున్న అదే పుస్తకం, మళ్ళీ ఆ క్రైం సీన్లో పోలీస్ ప్రాపర్టీ కాకుండా హీరో చేతికెలా వచ్చింది? అది క్రైం కాదా? మెడికో అయిన అతడికి మెడికో-లీగల్ వ్యవహారాలు తెలియవా? లేక పోలీసుల మీదే నమ్మకంపోయి, చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడా? అలా చూపలేదే? 
          కథా ప్రారంభంలో ‘సింహరాశి’ హీరో కాస్తా ముగింపులో ‘మేషరాశి’ హీరో అయిపోయాడేమిటి? మెడికల్ క్యాంపుకి బయల్దేరుతున్న కొడుక్కి, నీకు సర్పదోషముందని, తల్లి కట్టిన కంకణం ప్రసక్తి తర్వాత పాము సీన్లలో లేదేమిటి? అదుండగా పామెందుకు పగబట్టిందని హీరోకి అన్పించదా?
          ఇలా మున్ముందు ఏదో ప్లే చేస్తుందని బిల్డప్ ఇస్తూ ప్రయోగించిన ఈ ప్లాట్ డివైస్ (కంకణం) -అంటే సెటప్ చివరికి పే ఆఫ్ కాక  నీరుగారిపోయింది. అలాగే, కారుమీద స్క్రాచెస్ పడతాయని అన్న వారించే సీను, ఇలా చేస్తే  రేపు మెడికల్ క్యాంపు కెళ్ళేందుకు డబ్బివ్వనని అన్న చెప్పే మరో సీను, రాబోయే సీన్లకి లీడ్స్ గా రాసుకుని వుంటే  పొరపాటే. అవి కథని ముందే పట్టించేస్తాయి. ఆలాగే, అన్న కూతురితో, తల్లితో మాంఛి హార్రర్ సీన్లకి తెరతీసి, ఏమీ జరక్కుండా ముగించడం- ‘సీనస్ ఇంటరప్టస్’  కి దారి తీసి తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. ఇది కూడా పే ఆఫ్ కాని సెటప్పే!
          చిట్టచివరికి అసలు సంగతేంటో హీరో తెలుసుకోవడానికి అతడ్ని శక్తి పీఠం స్వామి వారి దగ్గరికి తీసుకుపోతాడు హీరోయిన్ తండ్రి. ఆ పని మొట్ట మొదటే వూళ్ళో మకాం వేసి పుస్తకం రాస్తున్న పాపం ఆ దేవాదాయ శాఖ ప్రాణి తోనే  చేయవచ్చుగా? అప్పుడు  అతనే ఈ మిస్టరీ ఛేదించి, హీరోకి ఈ శ్రమంతా లేకుండా చేసి, బతికే వుండే వాడుగా?  అంటే, ఈ అప్పుడీ కథంతా లేనట్టే, అంటే సినిమా అనవసరంగా తీసినట్టేగా? ఈ రకంగా కథ తయారుచేసుకుంటే ఎట్లా!
          ఇన్స్ పెక్టర్ కి ఆ వాహన ప్రమాదం అంత అట్టహాసంగా ఎలా జరిగిందో చివర్లో విలన్ తో కూడా  వివరణ ఇప్పించ లేదు.  అది సినిమాలో ఒనాఫ్ ది బెస్ట్ సీన్స్ , అంత త్వరగా జ్ఞాపకాల్లోంచి చెరగిపోయేది కాదు.
          ఈ మిస్టరీ బలంగా సాగక పోవడానికి ఇంకో కారణం కూడా వుంది. అది పూరీ మార్కు స్టయిల్ స్క్రీన్  ప్లే.  ఫ్లాపయిన పూరీ జగన్నాథ్ సినిమాల్లో బాధ్యతారాహిత్యంగా కథనం ఇలా వుంటుంది – ఒక లవ్ సీన్, తర్వాత ఒక యాక్షన్ సీన్, ఆ తర్వాత ఒక కామెడీ సీన్...దీని తర్వాత వెంటనే మళ్ళీ ఒక లవ్ సీన్, ఆ తర్వాత మళ్ళీ వెంటనే అర్జెంటుగా ఒక యాక్షన్ సీన్, దీని తర్వాత మళ్ళీ వెంటనే యమర్జెంటు గా ఒక కామెడీ సీన్... దీన్తర్వాత మళ్ళీ...అదే గానుగెద్దు రౌండప్. ఈ రౌండప్ లతో రోల్ అవుతూ అవుతూ ఎలాగో అయ్యిందన్పించి, హమ్మయ్య అని ఒడ్డునపడి నిట్టూర్చడం!
          ప్రస్తుత మిస్టరీ కూడా ఇంతే... ఒక లవ్ సీన్, బ్యాక్ డ్రాప్ లో ఒక పోలీస్ సీన్, ఒక ఫ్యామిలీ సీన్...మళ్ళీ ఒక లవ్ సీన్, బ్యాక్ డ్రాప్ లో ఒక పోలీస్ సీన్,  ఒక ఫ్యామిలీ సీన్...సెకండాఫ్ లో ఒక లవ్ సీన్, ఒక హర్రర్ సీన్, ఒక కామెడీ సీన్, ఫ్యామిలీ లేదని అర్జెంటుగా, ఇల్లాజికల్ గా వాళ్ళందర్నీ రప్పించుకుని,  మళ్ళీ ఒక ఫ్యామిలీ సీన్...మళ్ళీ ఒక లవ్...ఇలా!
          పోలీస్ బ్యాక్ డ్రాప్ తోబాటు; కృతకంగా, తెచ్చి పెట్టుకున్నట్టు వున్నాసరే, కొంత మేరకు హీరో ఫ్యామిలీ దృశ్యాలూ భరించవచ్చు. కానీ ప్రధాన కథకి తీవ్రంగా విఘాతం కల్గించింది లవ్ ట్రాకే. ఈ లవ్ ట్రాక్ లో కూడా కొత్తదనం గానీ, థ్రిల్ గానీ ఏమాత్రం లేక- కొత్త దర్శకుడే గానీ, కొత్త తరం దర్శకుడు కానే కాదని అన్పించేస్తూంటాయి. హీరోయిన్ని కూడా హీరో అన్వేషణలో భాగంగా చేసి, ఆ అన్వేషణ లో ప్రేమాయణాన్ని కలుపుకుంటూ పోయుంటే సరైన పధ్ధతి.
          ఎందుకో ఈ  కొత్త దర్శకుడికి భారీ సినిమాల మూస ఫార్ములా కథనం నచ్చుతుందిలా వుంది. లేకపోతే హీరోయిన్ పాత్ర తను పనిచేసిన ‘స్వామిరారా’ పద్ధతిలో కథలో భాగంగా వుండేది. ఒకసారి ఈ రివ్యూ శీర్షికన ఫోటోని చూస్తే  ఏమనిపిస్తుంది? హీరోయిన్ కూడా కథలో భాగమైన న్యూవేవ్ సినిమాలా  అన్పిస్తుంది. కానీ యాడ్ కోసం ఇది మిస్ లీడ్ చేసే ఫోటో షూట్ అని సినిమా చూస్తే గానీ తెలీదు. 
          ముగింపులో తేల్చిన విషయం ఏనాడో ‘దేవుడు చేసిన మనుషులు’ నాటి నుంచీ చూస్తున్న విషయమే. ఆకస్మికంగా వచ్చే క్లైమాక్స్ దాని తర్వాత ఉపసంహారం చాలా పేలవంగా వున్నాయి. క్లైమాక్స్ ని ముచ్చట్లు చెప్పుకుని ముగించినట్టుంది. హీరోకి దొరికియినంత మాత్రాన ఏ విలనూ అంతా చెప్పేసుకోడు. ప్రేక్షకుల కోసమో, లేదా దర్శకుడు సినిమా ముగించడం కోసమో చెప్పేస్తున్నట్టుంది. 
పాత్రోచితానుచితాలు 

          ఆలయ మిస్టరీని ఛేదించడానికి వచ్చిన మొదటి పాత్ర దేవాదాయ శాఖ ఉద్యోగి వంటి రియలిస్టిక్ క్యారక్టర్ అయినప్పుడు, హీరో పాత్ర కూడా అలాటి రియలిస్టిక్ క్యారక్టర్ అయివుండాల్సింది. (ఉదా. ‘మనోరమ-సిక్స్ ఫీట్ అండర్’) నిఖిల్ మెడికో పాత్ర ఫార్ములా పాత్ర అయిపోయింది. పైగా ‘మనోరమ- సిక్స్ ఫీట్ అండర్’ లోని పాత్రలా కథలో ఒదిగి పోలేదు. ‘మనోరమ-సిక్స్ ఫీట్ అండర్’ లో అతను ప్రభుత్వ ఇంజనీర్ - కమ్  - డిటెక్టివ్ రచయిత. డిటెక్టివ్ రచయిత అనే హాబీవల్ల ఆ మర్డర్ మిస్టరీ కథలో పాలూ నీళ్ళలా కలిసిపోయాడు. ఇది భవిష్యత్తులో ఇంకా బాగా రాసే అనుభవం అవ్వొచ్చు అతడికి. కథ ద్వారా పాత్ర ఎదుగుదలని చూపించాలి.
          కథతో సంబంధంలేని నిఖిల్ మెడికో పాత్ర ఎదుగుదలకి నోచుకోలేదు. పక్కా మూస ఫార్ములా పాత్రలా ఆషామాషీగానే  ఉండిపోయింది. మనస్పూర్వకంగా కథలో ఇన్వాల్వ్ కాకపోవడం వల్ల భావోద్రేకాలు కొరవడి కథకి బలం కూడా చేకూర్చలేక పోయింది. సజీవ పాత్రకి అంతర్గత - బహిర్గత ముఖాలు రెండూ వుంటాయి. కానీ ఈ మెడికోకి అంతర్గత సంఘర్షణ కొరవడింది. కథలో బోలెడంత crisis వుంది కానీ పాత్రకి conflict కొరవడింది. వూళ్ళో మిస్టరీ మరణాలు సంభవించడం కథలో crisis. వాటి పట్ల హీరో లేటుగానే మేల్కొన్నా ఆ  crisis అతడిలో conflict ని బలంగా సృష్టించలేక పోయింది. కారణం, అతను ప్రేమ ట్రాకు, ఫ్యామిలీ ట్రాకూ అనే మూస ఫార్ములా గుదిబండలు మోసుకుంటూ తిరగడం.
        ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోవాలి : మర్డర్ మిస్టరీల్లో ఇలాటి వాటికి స్థానం వుండదు. ‘శివ’ లాంటి మాఫియా సినిమాల్లో కుటుంబ జీవితం ఉండొచ్చు. ఆ కుటుంబం ఇబ్బందులు పడొచ్చు. అది ఆ genre  సినిమాలో ఒదిగిపోయే కథనమే. కానీ మిస్టరీ genre లో జరుగుతున్న మర్డర్లు తప్పించి మరో కథనం  జొరబడ కూడదు. ఒకసారి బాపు – రమణల  ‘ముత్యాల ముగ్గు’ నే చూద్దాం : ఇది కుటుంబ కథే అనుకుంటే శుద్ధ పొరపాటు! ఇది క్రైం ఎలిమెంట్ ప్రధానమైన కుటుంబ కథ! కాబట్టి ఇందులో క్రైం ఎలిమెంటు అనే అద్భుతరస ప్రధానంగానే స్క్రీన్ ప్లే సాగుతుంది. రావుగోపాలరావు పాత్ర చాలా పకడ్బందీగా కుట్ర చేసి భార్యాభర్తల్ని (హీరో హీరోయిన్లని) విడదీసేది ఆ క్రైం ఎలిమెంట్. మరి దీంతో బాపు – రమణలు ఏం చేశారు?
  
        ఫస్టాఫ్ లో ఆనందంగా సాగుతున్న శ్రీధర్ – సంగీతల వైవాహిక జీవితంలోకి  రావుగోపాలరావు రూపంలో దుష్టశక్తిని ప్రవేశ పెట్టి అల్లకల్లోలం సృష్టించారు. దీంతో కడుపుతో వున్న సంగీత శీలమ్మీద నింద  పడి వీధిపాలయ్యింది. ఈ ఘట్టంలోంచి సెకండాఫ్ కథని ఎలా ఎత్తుకోవాలి? సెకండాఫ్ కథ ఎజెండా తిరిగి వాళ్ళిద్దర్నీ కలిపి సుఖాంతం చేయడమే. ఈ ఎజెండా ని పట్టుకునే సెకండాఫ్ కథ నడపాలి.  

         ఈ ఎజెండాని మోసే కవలలు పుట్టి రావడానికి ఇంకా చాలా టైముంది. వాళ్ళ తల్లి (సంగీత) మీద పడ్డ నింద తొలగించేందుకు భవిష్యత్తులో ఉపయోగపడే సాధనాలు వాళ్ళే. కనుక 1) సహజంగా ఆ పిల్లలు  దూకాల్సిన కార్య క్షేత్రంలోకి, వాళ్లింకా పుట్టలేదని మరొకర్ని పంపి కథ నడిపించేయాలా?  మరి ఇక్కడ రామాయణం ఉత్తర కాండ కథ కదా చెప్తున్నారు. దాని సంగతేమిటి? 

          లేకపోతే 2) శ్రీధర్ – సంగీత ల ఎడబాటు తాలూకూ బాధల్ని వాళ్ళిద్దరి మీదా చిత్రీకరిస్తూ పిల్లలు పుట్టి వచ్చేవరకూ లాగించేయాలా ?  మరైతే అది టోకున శోకరసాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రధాన రసాన్ని(క్రైం ఎలిమెంట్) భంగ పరుస్తుందేమో?

మరి పిల్లలుపుట్టి వచ్చేవరకూ ఏంచేయాలి? ఈ గ్యాప్ ని పూడ్చడానికి, ఏ బ్రహ్మానందాన్నో దింపి కామెడీ మీద కామెడీ పెట్టి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించెయ్యాలా? సర్కస్ లో మెయిన్ షోలో మధ్య మధ్య షోకి సంబంధం లేకుండా జోకర్ వచ్చి నవ్వించి పోయినట్టు? 1975 లో కాకపోయినా 2005 తర్వాత నుంచైనా ఈ పనేగా చేయబోతారు భావి దర్శక మహాశయులు- అదేదో తామే ముందు చేసిపారేస్తే సువర్ణా క్షరాలతో లిఖిస్తారుగా తర్వాత చరిత్రలో? 
          బాపూ రమణలు ఇలా ఆలోచించి వుంటే, ముత్యాలముగ్గు బుగ్గి అయ్యేది. అదికాదు రసపోషణ. మొదట్నుంచీ ఈ కథ నడక చూస్తే  అద్భుత రస ( క్రైం ఎలిమెంట్) ప్రధానంగానే సాగుతూ వచ్చింది. కనుక ఈ ప్రధాన రసానికి భంగం కలక్కూడదు. నవరసాల్లో మిగిలిన రసాలు ఎవున్నా అవి సైడ్ ట్రాకులోనే పరిమితంగా వుండాలి. అందుకని ప్రధాన రసమైన ఈ అద్భుత రస స్రవంతికి మొదట్నుంచీ ఒక చోదక శక్తిగా ఉంటూ వస్తున్న రావుగోపాలరావు అండ్ గ్యాంగు పాత్రలు నాల్గింటినీ దింపి, అసలు వీళ్ళ భాగోతం ఏంటబ్బా  అని  పోస్ట్ మార్టం చేసి మనకి చూపెట్టడం మొదలెట్టారు -  వివిధ దృశ్యాల ద్వారా -సిద్ధహస్తులైన స్వర్గీయ బాపూ రమణ ద్వయం దిగ్విజయంగా!
          స్క్రీన్ ప్లే కి బలం దాని genre తాలూకు రసపోషణే. ఇలా  ‘ముత్యాల ముగ్గు’ సెకండాఫ్ సరైన కథనానికి అది మార్గం చూపించింది.

         కానీ నిఖిల్ పాత్ర కళ్ళముందు పోలీసు చావు జరిగినా, చేతిలో ఆ పుస్తకం వున్నా, ఇలా ఎప్పుడో ఇంటర్వెల్లో ఈ ప్రధాన మలుపు దగ్గర,  ప్రధాన కథతో తను కనెక్ట్ అయినప్పటికీ- ఆ మెయిన్ స్టోరీ లోకి సీరియస్ గా వెళ్ళిపోకుండా- మళ్ళీ అవే లవ్ ట్రాకులు- దాని తాలూకు పెళ్లి ప్రతిపాదనలు, ఫ్యామిలీని పిలిపించుకుని మాట్లాడించడాలూ, వాళ్ళతో అనవసరమైన హార్రర్ సీన్లూ- మళ్ళీ ప్రేమాయణాలూ వగైరా వగైరా. ఇంకా ఆ మెడికల్ క్యాంపు కృతక దృశ్యాలూ. 

         1972 లో, హిందీలో ‘జంగల్ మే మంగళ్ ’ అనే కాలేజీ యూత్ హార్రర్-మ్యూజికల్ కామెడీ సూపర్ హిట్ వచ్చింది. అందులో ఒక ప్రొఫెసరమ్మ అమ్మాయిల్నేసుకుని కేరళ అడవులకి ‘ఫీల్డ్ ట్రిప్’ కని  టిప్ టాప్ గా వస్తుంది. ఇంకో రిటైర్డ్ కల్నల్ అబ్బాయిల్నేసుకుని అదే పని మీద అక్కడికే ధూం ధాంగా వస్తాడు. ఇక అందరి అల్లర్లు, ఏడ్పించుకోవడాలూ ప్రేమలూ మొదలై పోతాయి. అప్పుడు మర్డర్లు జరగడం ప్రారంభమౌతుంది. అంతే, దాంతో ఎక్కడి ప్రేమలు అల్లర్లూ కామెడీలూ అక్కడే బంద్! ఫీల్డ్ ట్రిప్ క్లోజ్! క్యారెక్టర్లు సీరియస్ మూడ్ లోకి వెళ్ళిపోతాయి! ఆ అడవిలో అదృశ్య శ్యక్తేదో తమ ప్రాణాలు తీస్తూంటే- దాన్నెదుర్కొని ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్య ఎజెండా గా మారిపోతుంది. అంటే కథ పాయింటు కొచ్చేసింది. వచ్చాక ఆ వచ్చిన పాయింటు మీదే నడవాలి- ఇంకే  పాత విషయాల ప్రసక్తీ రాకూడదు. 
          మెడికో విషయంలో అలాకాదు. అతను వచ్చిన మెడికల్ క్యాంపు వ్యవహారం సినిమా చివరంటా నడుస్తూనే వుంటుంది. అసలు మెడికల్ క్యాంపు ఎన్నాళ్ళు నిర్వహిస్తారు? సరే, ఈ కాలపరిధిని పక్కన పెట్టినా, హీరోకి ప్రధాన సమస్య ఎదురయ్యాక క్యాంపు వదిలేసి ముందు కెళ్ళి పోవాలి. కానీ ఈ ‘ఫీల్డ్ ట్రిప్’ ని ఇంకా లాగుతూ వుంటే, బ్యాక్ డ్రాప్ లో కథతో ఏమాత్రం సంబంధం లేని ఆ సీన్లు అవుట్ డేటెడ్ అయిపోయి, కథనం కూడా వెలసి పోయినట్టు వుంటుంది.
           నీలకంఠ తీసిన ‘మాయ’ లో ప్రారంభంలో చెప్పిన ఎప్పుడో జరగబోయే చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో ఏర్పాట్ల తాలూకు కథనమే బ్యాక్ డ్రాప్ లో నడుస్తూ, తీరా క్లైమాక్స్ లో ఆ షో ఏర్పాటయ్యే సరికి దాని నావెల్టీయే  కోల్పోయింది!
          మన మెడికో మెడికల్ క్యాంపు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఫ్యామిలీ అనే మొదటి అంకం కథనం తాలూకు వ్యవహారాల్ని వదిలేసి- ప్రధాన కథలో ఎంటరైనప్పుడు- ఈ రెండో అంకం లో జరగాల్సిన బిజినెస్ తో  – ప్రధాన సమస్యతో conflict కి లోనవకుండా- సంఘర్షణ పడకుండా పోయాడు. అసలు ఏ స్క్రీన్ ప్లేలో నైనా మొదటి అంకం బిజిబ్\నెస్ ని రెండో అంకంలో ఎలా కంటిన్యూ చేస్తారు? దాని వాళ్ళ రెండో అంకం బలాన్ని కోల్పోదా? 

           ఈ స్క్రీన్ ప్లే తో అసలు జరిగిందేమిటంటే, కథ ద్వారా పాత్రని నడిపించడం. అదే పాత్ర ద్వారా కథని నడిపించి వుంటే అదొక ‘స్వామిరారా’ లోలా హీరో షైన్ అయ్యేవాడు. కానీ మన హీరో కథ మీద ఆధారపడి డల్ అయ్యాడు. ఇది మూసఫార్ములా పాత్రయినా ఇంటర్వెల్ నుంచీ ఆసక్తి కల్గించే అవకాశముంది. దీన్ని కూడా చేజార్చుకున్నాడు. తనకి మూఢ నమ్మకాలంటే పడదని మొదటే చెప్పాడు. ప్రశ్న తలెత్తితే దాని అంతు చూస్తానన్నాడు. మరి తన మీదే పాము  పగబడితే తను స్పందించి చేసిం దెంత? ఆ పాముని పట్టుకుని పాముల నిపుణుడికి చూపించాడు! అ నిపుణుడు పాములకి హిప్నటైజ్ చేయడం గురించి చాంతాడంత డాక్యుమెంటరీయే చేప్పుకోస్తూంటే పాసివ్ గా వింటూ కూర్చున్నాడు. 
          నిజానికి ఒక ఫార్ములా పాత్రైనా, తన  వైద్య వృత్తికి కనెక్ట్ అయ్యే పాముల హిప్నాటిజం వరంలా అందివచ్చింది. దాన్ని తనే స్వయంగా ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి,  మూఢ నమ్మకాల్ని బద్దలు కొట్టి వుంటే మెడికో పాత్రకి ఎంతో వన్నె చేకూరేది! పాత్ర ఎదుగుదల కన్పించి ఎక్కడో వుండేది!


-సికిందర్