రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, జులై 2020, శుక్రవారం

958 : రివ్యూ‘లా’ (కన్నడ)
రచన, దర్శకత్వం: రఘు సమర్థ్
తారాగణం: రాగిణీ ప్రజ్వల్, హేబ్బాలే కృష్ణ, రాజేష్ నటరంగ, అచ్యుత్ కుమార్, ముఖ్యమంత్రి చంద్రు, లిఖిత్ కుర్బా, ఇమ్రాన్ పాషా, మధు హెగ్డే తదితరులు
సంగీతం: వైభవ్ వాసుకి, ఛాయాగ్రహణం: సుగ్నన
నిర్మాతలు: అశ్వనీ పునీత్, రాజ్ కుమార్
విడుదల: అమెజాన్


        తొలి కన్నడ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ‘లా’ ఈ రోజు అమెజాన్ లో విడుదలయ్యింది. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ బ్యానర్ రూపొందించడంతో దీనికి మంచి హైప్ వచ్చింది. దర్శకుడు రఘు సమర్థ్ కి రెండో సినిమా. హీరోయిన్ రాగిణీ ప్రజ్వల్ కి తొలి సినిమా. తొలి సినిమా రెగ్యులర్ ప్రేమ సినిమాగా వుండకూడదని టాలెంట్ ని పరీక్షించే ఈ పాత్ర  ఒప్పుకున్నట్టు చెప్పుకుంది. ఈ సినిమా రెగ్యులర్ లీగల్ డ్రామాగా తీయలేదని దర్శకుడు కూడా చెప్పుకున్నాడు. అయితే ఇటీవల తమిళంలో ఓటీటీలో విడుదలైన జ్యోతిక నటించిన ‘పొన్మంగళ్ వందాళ్’ కూడా ఇలాటి లీగల్  డ్రామానే. ఇలాటి హీరోయిన్ పాత్రే. రేప్ బాధితురాలు తన కేసుని తను వాదించుకునే లాయర్ పాత్ర. ఈ కన్నడ క్రియేటివిటీ ఫ్లాపయిన జ్యోతిక క్రియేటివికి ఎంత భిన్నంగా వుంది? ఇది క్రియేటివిటీయేనా, లేక క్రిమి కీటకమా ఓసారి చూద్దాం...

కథ
    నందిని (రాగిణీ ప్రజ్వల్) లా గ్రాడ్యుయేట్. ఓ రాత్రి గ్యాంగ్ రేప్ కి గురవుతుంది. పోలీస్ స్టేషన్ కెళ్తే హేళన చేస్తారు. మూడు నెలలు గడిచిపోతాయి. ఆమె తనకి జరిగింది సోషల్ మీడియలో వైరల్ చేసేసరికి ఆందోళనలు చెలరేగుతాయి. దీంతో పోలీస్ కమీషనర్ కేసుని సీఐడీ ఇన్స్ పెక్టర్ పార్థ సారథి బ్రహ్మ (హేబ్బాలే కృష్ణ) కి అప్పగిస్తాడు. పార్థ సారథి బ్రహ్మ ఇన్వెస్టిగేట్ చేసి ముగ్గుర్ని (లిఖిత్ కుర్బా, ఇమ్రాన్ పాషా, మధు హెగ్డే) అరెస్ట్ చేసి కేసు పెడతాడు. నందిని ఈ కేసుని తను వాదిస్తానంటుంది. నిందితుల డిఫెన్స్ న్యాయవాదిగా శ్యాం ప్రసాద్ (రాజేష్ నటరంగ) వస్తాడు. న్యాయం కోసం అతడితో తలపడుతుంది నందిని. ఇందులో విజయం సాధించిందా? ఆమె విజయాన్ని ఇన్స్ పెక్టర్ బ్రహ్మ ఎందుకు అడ్డుకోబోయాడు? ఆమె దాచిన అసలు నిజం ఏమిటి? ఈ నిజం బయట పడితే ఏం చేసింది? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి. 

నటనలు-సాంకేతికాలు
    కొత్త హీరోయిన్ రాగిణీ ప్రజ్వల్ తొలి సినిమాకి ఎంపిక చేసుకున్న పాత్ర మంచిదే. కానీ తనకి నటించడం రాక, దర్శకుడికి సినిమా తీయడం రాక చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రారంభం నుంచీ ఎక్కడా రేప్ బాధితురాలిగా కన్పించదు. పోగొట్టుకుంది పర్సు అయినట్టు, పోతే పోయిందన్నట్టు మేకప్ చెదరకుండా తిరుగుతూంటుంది. బీఆర్ చోప్రా తీసిన ‘ఇన్సాఫ్ కా తరాజూ’ (1980) లో జీనత్ అమన్ ని చూస్తే రేప్ బాధితురాలంటే ఏమిటో తెలిసేది రాగిణికి. ఇక లాయర్ గా కూడా నవ్వొచ్చే విధంగా వుంది. చివర్లో అసలు నిజంతో క్లయిమాక్స్ లో నటన జలపాతం దగ్గర అరణ్య రోదనగానే మిగిలింది. ఎంత అరిచి ఏడుద్దామన్నా ఎమోషనే రావడం లేదు. ఎందుకైనా మంచిదని దర్శకుడు లాంగ్ షాట్ వేశాడు. సంగీత దర్శకుడు పీలగా విన్పించిన సంగీతం నుంచి మాత్రం మనకి రక్షణ లేదు. హీరోయిన్ని ఆచి తూచి ఎంపిక చేసుకున్నానని దర్శకుడనడమంటే ఇదేనేమో. ఇందులో ఏం ఆచి వుందో, ఏం తూచి వుందో అర్ధంగాదు. 


        హీరోయిన్ తండ్రి పాత్రలో అవినాష్, ఇన్స్ పెక్టర్ పాత్రలో హేబ్బాలే కృష్ణ, డిఫెన్స్ లాయర్ పాత్రలో రాజేష్ నటరంగ సమర్ధులైన సీనియర్ నటులు. కానీ కథ, సన్నివేశాలు తోడ్పడలేదు. అవినాష్ పోలీస్ స్టేషన్ లో రేప్ బాధితురాలైన కూతురి దగ్గరి కొచ్చి, ‘చట్టం తో ఏమీ తేలదమ్మా, జరిగింది మర్చి పో’ అనేసి లైట్ తీసుకుని కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయే పాత్ర. ఎక్కడా అతను జరిగిందానికి ఏ మాత్రం ఫీలవడు ఎవర్ గ్రీన్ గ్లామర్ గర్ల్ కూతురిలాగే. వీళ్ళని చూస్తే రేప్ మీదే మనకి జాలి పుడుతుంది. 

        ఇక జడ్జి సిద్ధ లింగయ్య పాత్ర వున్నాడు ముఖ్యమంత్రి చంద్రు అనే నటుడు. ఇతను కామెడీ జడ్జి. దర్శకుడికి కథలో ఎంటర్ టైన్మెంట్ తగ్గిందన్న బాధతో సీరియస్ కేసు వాదనల్లో జడ్జి కామెడీలు చూపించాడు. జడ్జికి తోడు బంట్రోతు. మధ్యలో జడ్జి గయ్యాళి పెళ్ళాం నుంచి ఫోను రావడం. బెంబేలెత్తి పోయి జడ్జి హనుమాన్ చాలీసా వేసుకోవడం. ఏం సినిమా తీసి అమెజాన్ కిచ్చాడో దర్శకుడికే తెలియాలి. 

         ‘పొన్మంగళ్ వందాళ్’ లో గోవింద్ వసంత అనే సంగీత దర్శకుడి లాగే ఇక్కడ కూడా వైభవ్ వాసుకి అనే సంగీత దర్శకుడు, పరికరాలే లేనట్టు వీలయినంత పేలవంగా సంగీత సృష్టి గావించాడు. కెమెరా మాన్ సుగ్నన అనే ఒకతను మాత్రమే అప్పగించిన బాధ్యతకి కాస్త న్యాయం చేసినట్టు కనబడతాడు. సినిమా నిడివి రెండు గంటలే అయినా రెండు యుగాల్లా వుంటుంది. 

కథా కథనాలు
    కథకి అయిడియా మంచిదే. ఆచరణలో చెదిరి పోయింది. ముగింపులో హీరోయిన్ మోటివేషన్ కి ఇచ్చిన కారణంతో దీన్నొక బలమైన ఎమోషనల్ లీగల్ యాక్షన్ డ్రామా చేయొచ్చు. తన అయిడియాలో వున్న బలం, లోతు పాతులు తనకే తెలియక పోతే ఎలా? ఈ అయిడియాలో హీరోయిన్ తన శీలంతో తనే ప్రయోగం చేయడమనే రాడికల్ తెగింపు వుంది. ఈ పాయింటుని  హైలైట్ చేసి మార్కెట్ యాస్పెక్ట్ ని పట్టుకోవాలనుకోలేదు దర్శకుడు. మొద్దుబారి
పోయిన వ్యవస్థని లేపడానికి శీలాలతో ఇలాటి ప్రయోగాలు  తప్పవా అన్న సామాజిక ప్రశ్న ఈ కథలో వుంటే, ఏవో కామెడీలు చేస్తూ వుండిపోయాడు దర్శకుడు. చట్టంతో మగాడు ఈజీగా ఆడుకోగలడు. ఆడది ఆడుకోవాలంటే ఇక శీలాల్ని పణంగా పెట్టాలేమో. 

        ఇలాటి కథలో కూడా దర్శకుడికి ఎంటర్ టైన్మెంట్ తగ్గుతోందన్న వర్రీ తీవ్రంగా వున్నట్టుంది. రేప్ బాధితురాలైన హీరోయిన్ కి కామెడీ ఫ్లాష్ బ్యాకులు. అల్లరి చేష్టలు. కథలో జరిగిన విషయానికీ ఈ ఫ్లాష్ బ్యాకులకీ సంబంధమేమిటో, వీటినెలా ఎంజాయ్ చేయాలో అర్ధంగాదు. ఫస్టాఫ్ లో నాల్గు సార్లు ఈ కామెడీ ఫ్లాష్ బ్యాకులేస్తాడు. ప్రతీ రాత్రీ తనకి జరిగిందే గుర్తుకొస్తూ నిద్రపట్టడం లేదని హీరోయిన్ డైలాగు. ఎప్పుడు గుర్తొచ్చింది, ఎప్పుడు నిద్ర పట్టలేదు సీన్లే చూపించలేదు. పోయింది పర్సే కదా అన్నట్టు జాలీగా తిరుగుతూంటే. 

        ‘పొన్మంగళ్ వందాళ్’, ‘లా’ రెండూ దాదాపు కథ లొకటే. తీసి ఫ్లాప్ చేసుకున్న విధం ఒకటే. క్రియేటివిటీకి రెండు తరాలు వెనకున్నాయీ సినిమాలు. కథ పక్కనబెట్టి, కనీసం ఇప్పుడు సినిమా ఇలా తీయరన్న ఆలోచన కూడా లేకపోతే ఎలా?

సికిందర్