రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, సెప్టెంబర్ 2017, గురువారం

519 : రివ్యూ!





కథ, మాటలు, దర్శకత్వం : కె ఎస్ బాబీ  
తారాగణం :  ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేదా థామస్, పోసాని కృష్ణమురళి, సాయికుమార్,
ప్రదీప్ రావత్, రోణిత్ రాయ్, ప్రద్యుమ్న సింగ్ దితరులు
స్క్రీన్ ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి; సంగీతం:  దేవిశ్రీ ప్రసాద్ , ఛాయాగ్రహణం:  ఛోటా కె.నాయుడు 
బ్యానర్‌: ఎన్టీఆర్ ఆర్ట్స్
నిర్మాత: ళ్యాణ్రామ్, రికృష్ణ
విడుదల: సెప్టెంబర్  21, 2017 
***
          ట్రిపుల్ ఎన్టీఆర్ ఈ పండగ సీజన్ కి బంపర్ ఆఫర్. ఒక ఎన్టీఆరే  ఎక్కువనుకుంటే మూడు పాత్రల్లో ముగ్గురు ఎన్టీఆర్లు కన్పించడం, అదీ అల్లరవకుండా బాక్సాఫీసు ఉట్టిని కొట్టడం, నిజమైన ఎంటర్ టైనర్ అంటే ఏమిటో నిరూపించుకోవడం అన్నీ జరిగాయీసారి. ఎలా జరిగాయో ఓసారి చూద్దాం...

 కథ 
       జై, లవ, కుశలు అన్నదమ్ములు. జైకి నత్తి వుంటుంది. ఈ కారణంగా చులకన అవుతాడు. తల్లి వుంటుందిగానీ ఆమె అన్న (పోసాని) అండన వుంటుంది. ఈ అన్న లవ కుశల్ని వేసుకుని నాటకాలేస్తూ కుటుంబాన్ని పోషిస్తూంటాడు. రామాయణ ఘట్టాల్ని నాటకాలుగా వేసే క్రమంలో జై కి అనామక పాత్రలిస్తాడు, లేకపోతే లేదు. పైగా అడ్డమైన పనులు చేయించుకుంటాడు. లవకుశలు కూడా నత్తితో మాట్లాడలేని జైని  పురుగులా చూస్తారు. నాటకాల్లో తామే పాత్రలేసి  పాపులర్ అవుతారు. తనకి గుర్తింపు లేకుండాపోయిందన్న అక్కసుతో మేనమామ మీద,  తమ్ముళ్ళ మీదా పగ పెంచుకుంటాడు జై. ఒక రోజు నాటకం జరుగుతూంటే స్టేజిని తగలబెట్టేస్తాడు. పోలీస్ స్టేషన్ కూడా అంటుకుంటుంది. దాంతో అన్నదమ్ములు ముగ్గురూ,  మేనమామా చెల్లాచెదురై పోతారు.

          ఇరవై ఏళ్ల తర్వాత కుశ మాయ దొంగలా తయారవుతాడు. లవ అమాయకుడైన బ్యాంకు మేనేజర్ గా వుంటాడు. ప్రియ (రాశీఖన్నా) అనే మ్యారేజీ బ్యూరో ఆమెని  ఏక పక్షంగా ప్రేమిస్తూంటాడు. ఇతణ్ణి మోసం చేసి కోటి రూపాయలు లోన్ ఇప్పించుకుంటాడు ఒక గూండా లీడర్( ప్రదీప్ రావత్). దీంతో సమస్యలో ఇరుక్కుంటాడు లవ. ఒకరోజు  అనుకోకుండా లవ కుశలిద్దరూ ఒకరికొకరు తారస పడతారు. లవ ఉద్యోగం సమస్య, ప్రేమ సమస్య తెలుసుకుని కుశ ఒక ప్లాన్ వేస్తాడు. అప్పటికి తను కొట్టేసిన డబ్బు రాత్రికి రాత్రి పెద్దనోట్లు రద్దయి పనికి రాకుండా పోతాయి. ఈ నోట్లు మార్చుకోవాలంటే, పనిలోపనిగా ఆ గూండా పనిబట్టాలంటే లవ స్థానంలో తను మేనేజర్ గా బ్యాంకులో వుండాలని ప్లానేస్తాడు. ఇలా లవ ని ఫ్రీ చేసేసి ప్రేమ సమస్యకి ఫుల్ టైం కేటాయించు
కోమంటాడు. తను బ్యాంకులో మకాం వేసి ఆగమాగం చేస్తాడు. నోట్లు మార్చుకుని పారిపోతాడు. కేసు లవ మెడకి చుట్టుకోవడమే గాక ప్రియ కన్పించకుండా పోతుంది. పారిపోయిన కుశ, దొరికిపోయిన లవ ఇద్దరూ కిడ్నాప్ అవుతారు. తీరా చూస్తే తమని, ప్రియనీ  కిడ్నాప్ చేసింది జై అని తెలుస్తుంది. 

          జై ఎందుకీ పని చేశాడు? చిన్నప్పటి పగదీర్చుకోవడానికా? ఇంకేదో అవసరానికా?  జై ని నిర్లక్ష్యం చేసిన లవకుశలు తప్పు తెలుసుకున్నారా? ఇప్పుడు ముగ్గురి జీవితాలూ ఏ మలుపు తీసుకున్నాయి? ... ఇవి మిగతా కథలో తేలే అంశాలు.

ఎలావుంది కథ
       ఈ త్రిపాత్రాభినయపు కథకి కొత్త రూపమిచ్చారు. సాధారణంగా ముగ్గురు అన్నదమ్ములని చిన్నప్పుడు ఎవరో విలన్ విడదీసే కథలుంటాయి. ఇక్కడ తమ్ముళ్ళ జీ వితాల్లో అన్ననే విలన్ గా మార్చి కుటుంబ
సంబంధాలు చెప్పారు. పాత్రలకి పౌరాణిక పేర్లున్నా - ఈ ఇవి త్రివిధదళాల ఫ్రేంవర్క్ లో వున్నాయి : మాయలు  చేసి వాయు సేనలా ఎగిరిపోయే  పాత్ర, సమస్యల సముద్రంలో పోరాటం చేసే నావికా దళం లాంటి ఇంకో పాత్ర, భూభాగం మీద జండా పాతి కూర్చునే  సైనిక దళంలాంటి మరింకో పాత్ర. భావజాలాన్ని భావజాలంతో  ఓడించడమే పాత్రల మధ్య సంఘర్షణకి పరిష్కారమని చెప్పి ముగించారు. దీనికి రామాయణ ఘట్టాల్ని వాడుకున్నారు. 

ఎవరెలా చేశారు 
       ఇది పూర్తిగా ఎన్టీఆర్ షో. చిన్నప్పటి దృశ్యాలు వదిలేస్తే,  ప్రతీ సీనులో ఒక పాత్రగా,  రెండు పాత్రలుగా, మూడు పాత్రలుగా కన్పిస్తూ పోయే ఆల్టిమేట్ షో. పీక్స్ కి వెళ్ళిన నటన. మూడు పాత్రల విభిన్న స్వభావాల్లోకి దూరిపోవడం, బయటికి రావడం,  మళ్ళీ దూరిపో
వడం మామూలు విద్య కాదు. ఏ పాత్రా పలచన బడకుండా పకడ్బందీగా పోషించుకు రావడం తనకే చెల్లుతుంది. అమాయకుడు, దొంగోడు, దొంగోణ్ణి మించిన డాన్ పాత్రల్లో పాత్రకి  తగ్గ నవరసాలన్నీ పోషించి పారేశాడు. చివరి దృశ్యాల్లో మూడు పాత్రలతో గుండెల్ని బరువెక్కిస్తాడు. ఇంత బలమైన భావోద్వేగాలతో ముగిసే పాత్రలు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేవు. అన్నదమ్ములంటే ఏంటి? అని చెప్పేందుకు తక్కువ సంభాషణలు, ఎక్కువ హావభావాలతో రక్తి కట్టించాడు. మూడు పాత్రల లుక్స్ కోసం ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’  ఫేమ్  ప్రోస్థెటిక్స్  ఎక్స్ పర్ట్ వాన్స్ హార్ట్వెల్ తీసుకున్న శ్రద్ధ ఒక హైలైట్.

          హీరోయిన్లు
రాశీఖన్నా, నివేదా థామస్ లవి ఎన్టీఆర్ పాత్రల మలుపులకి, మతలబులకి తోడ్పడే  పాత్రలు. ఇద్దరూ గ్లామర్ కోషేంట్ కి బాగానే కొమ్ముకాశారు. నివేదితా థామస్ పాత్ర అమితాబ్ బచ్చన్ ‘డాన్’ లో జీనత్ అమన్ పాత్రని గుర్తుకు తెస్తుంది. ఇక పోసాని ఇంకో  గుర్తుంచుకోదగ్గ పాత్ర. మన్మోహన్ దేశాయ్ సినిమాల్లో చిన్నప్పుడు హీరోలతో విభజించు- పాలించు టైపు టక్కరి పాత్రలేసిన జీవన్ ని గుర్తుకు తెచ్చే పాత్ర. చివర్లో తమన్నా ఐటెం సాంగ్ లో వస్తుంది. ఈ సాంగ్ కి లీడ్ ‘షోలే’ లోగబ్బర్ సింగ్ ‘మహెబూబా మహెబూబా’ పాట ని గుర్తుకు తెస్తుంది. ఐతే దేవిశ్రీ ప్రసాద్ సారధ్యంలో పాటలంత ఊపులో లేవు. చిత్రీకరణలతో కలిపి చూస్తే చల్తాహై అన్నట్టుంటాయి తప్ప, పాటల్ని విడదీసి చూస్తే బలహీనమే. తమన్నా ఐటెం సాంగ్ ముగింపు కొచ్చేసరికి లిప్ సింక్ లేక, మూవ్మెంట్స్ కూడా కిక్ లేక, పేలవంగా ఎండ్ అవుతుంది కోరియోగ్రఫీ. 

          కేవలం మూడు పాత్రల వేర్వేరు నటనలతోనే కాదు, అదనంగా డాన్సులతో, ఫైట్లతో కూడా మెప్పించే బాధ్యత దిగ్విజయంగా మోశాడు ఎన్టీఆర్. పోతే, సెకండాఫ్ ని పూర్తిగా ఒడిసా నేటివిటీలోకి తీసి కెళ్ళారు. కాబట్టి ఒరియా ప్రజల బాధలు చూస్తాం. ఇవన్నీ కలిపి ఒక కనువిందైన ఛాయాగ్రహనంతో చూపించుకొచ్చాడు ఛోటా కె నాయుడు. తెర నిండా ఏ సీను వైభవోపేతంగా వెలిగిపోతుందో దాన్ని ఛోటా కె నాయుడు కెమెరా వర్క్ గా గుర్తుపట్టాలని ఆయన చెప్పే ప్రకారం మరోసారి చూస్తాం. ఐతే కొన్ని చోట్ల డీఐ అతిగా వుంది.  అలాగే డీటీఎస్ లో శబ్దఫలితాల విన్యాసాలు పెద్దగా ఏ అనుభూతినీ ఇవ్వవు. 

          దర్శకుడు బాబీకి  ఈసారి తనపైన స్వారీ చేసేవాళ్ళు లేకపోవడంతో సొంతంగా తనేమిటో చూపించుకునే  అవకాశం చిక్కింది. అతను వండర్ఫుల్ రైటర్ –డైరెక్టర్ సందేహం లేదు. ఇంకో స్టార్ టెంప్లెట్ సినిమా మీద రుద్దకుండా కథా కథనాల తీరుని మార్చి చూపించాడు. ఇందుకు ఒకప్పటి సింగిల్ విండో స్కీం మాస్టర్ కోనవెంకట్, మరో రైటర్ చక్రవర్తి బాగా తోడ్పడ్డారు. సెకండాఫ్ లో ఓ పదిమిషాలు కుంటుబడ్డా,  అవి తప్పని తద్దినంలా గతం తాలూకు సమాచారమిచ్చే సీన్లు గనుక ఓర్చుకోవాలి తప్పదు. ఇది మినహాయిస్తే సెకండాఫ్ మరింత బలం పెరిగిన కథా కథనాలతో వుంది.
          మొత్తానికి ఈసారి ఎన్టీఆర్ ఒక కల్తీ లేని ఫ్యామిలీ – మాస్ – ఫ్యాన్ ఎంటర్ టైనర్ తో ముందస్తుగా దసరా జరిపేస్తూ వచ్చేశాడు.

-సికిందర్
https://www.cinemabazaar.in