రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, May 26, 2021

1041 : సందేహాలు - సమాధానాలు

 Q : కుల వివక్షపై సినిమాలు తీస్తున్న దర్శకులు నేటి సమాజంలోని వివక్షను చూపించకుండా దశాబ్దాల కిందటి కాలం ఎందుకు ఎంచుకుంటున్నారు? ఉదా: కర్ణన్, అసురన్, పలాస, ఉప్పెన. కాంటెంపరరీ వివక్ష కథలు చెప్పవచ్చు కదా?

మహేష్ రెడ్డి, రైటర్
A : పాయింటే. ఫలానా ఆ రోజుల్లో ఇలా జరిగిందని ఇలాటి సినిమాలు తీయడం కంటే సమకాలీనంగా చెబుతూ తీస్తే వివాదాలొస్తాయని కావచ్చు. కానీ సమకాలీనంగా కె. విశ్వనాథ్ సప్తపది తీశారు, ముత్యాల సుబ్బయ్య ఎర్రమందారం తీశారు. ఆ మధ్య ఒక అసోసియేట్ కోసం సమకాలీన కథే చేశాం. అయితే కుల వివక్ష గురించి కాక ఈర్ష్య గురించి. దీనికి సామాజికార్ధిక చారిత్రక నేపథ్యాల్ని విస్తృతంగా రీసెర్చి చేసి. ఇది కమర్షియలే  అయినా ఎంటర్ టైనర్ గా కూడా వుంటుంది. దీనికి పెద్ద బడ్జెట్, పెద్ద హీరో అవసరం. ఎన్నేళ్ళు  పడుతుందో తెలీదు. కుల వివక్ష సినిమాలు పీరియెడ్ మూవీస్ గా తీసినా అణిచివేత గురించే వుంటున్నాయి. కర్ణన్ లో కుల వివక్ష కూడా కనిపించదు. అలాటి పరిస్థితుల్లో ఎవరితోనైనా పోలీసులలాగే ప్రవర్తిస్తారు. కర్ణన్ లో ఆ వ్యక్తి తలపాగా తీయలేదని పగ పెంచుకుని అదంతా చేశాడు పోలీసు అధికారి. ఆ వ్యక్తి స్థానంలో ఇంకే కులం వాడున్నా పోలీసులతో అదే జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా ఒక కులంతో ఇలా జరిగినట్టు కర్ణన్ లో చూపించారు. ఒకసారి ఒక పోలీసు అధికారికి పరిచయం చేయడానికి ఒక కొత్త దర్శకుణ్ణి పిలిపించాం. అతను చాలా లేటుగా, పైగా బ్లాక్ స్పెక్ట్స్ పెట్టుకుని స్టయిలుగా వచ్చేసరికి, ముందు స్పెక్ట్స్ తీసేయమని మనం చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఆ అధికారి చూసే చూపులకి చెంప ఛెళ్ళు మనే దేమో! ఇలాటి పరిస్థితిని ఆహ్వానించడానికి కులమే అవసరం లేదు. కొందరి ముందు కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి వుంటుంది. కర్ణన్ లో కులాన్ని ఆపాదించారుగానీ, నిజానికది ప్రోటోకాల్ సమస్య.

Q : నేను కథ రాసేటప్పుడు ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతున్నాను. ప్రతీ కథతో ఇలాగే జరిగి ఆపేస్తున్నాను. ఎందుకిలా జరుగుతోంది? నేనేం చేయాలి?
బిందు కుమార్, అసోసియేట్  
A : అసలు కథకి తీసుకున్న ఐడియాతో కనెక్ట్ కాకపోతే ఇక దేంతోనూ కనెక్ట్ కాలేరు. ముందు మీ ఐడియాల క్వాలిటీ ఏమిటో పరిశీలించుకోండి. ఐడియాలో స్పార్క్ వుంటే ఆలోచనలు వాటికవే స్పార్క్ అయి లాక్కెళతాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి చేరడం రొటీన్, సాధారణ ఐడియా. బిల్ గేట్స్ కాలేజీ డ్రాపవుట్ అయితే, మన హీరో బిల్ గేట్స్ ని తలదన్నేలా హై స్కూల్ డ్రాపవుట్ గా, హై స్కిల్స్ తో సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరడం స్పార్క్ వున్న ఐడియా. ఈ కథ రాయడంలో థ్రిల్ వుంటుంది. అసాధారణ ఐడియాల్లో స్పార్క్, దాంతో థ్రిల్ వుంటాయి. అసాధారణ ఐడియాలతో కూడా కనెక్ట్ కాలేక పోతే, మీరు మనస్ఫూర్తిగా సినిమాల్లోకి రావాలనుకున్నారో లేదో ఆత్మ పరిశీలన చేసుకోండి.

Q :  'నెయిల్ పాలిష్ 2021' కథావస్తువుకు, 'దీవాన్గీ 2002 కథావస్తువుకు తేడా ఏమిటి? ఇంకో ప్రశ్న, అమ్మాయిలకు మాత్రమే నేషనల్ క్రష్ అనే బిరుదు ఎందుకు ఇస్తారు? అబ్బాయిలకు ఎందుకు కాదు?

ఎంఆర్, రైటర్
A : రెండూ స్ప్లిట్ పర్సనాలిటీతో హత్య చేయడం గురించే. కాకపోతే, మొదటి దానిలో అది నిజంగా స్ప్లిట్ పర్సనాలిటీ. అంతేగాకుండా ఒక న్యాయ సమస్యతో కోర్టు రూమ్ డ్రామా. రెండోదానిలో ఆ స్పిల్ట్ పర్సనాలిటీ నటన. రెండో ప్రశ్నకి, మేల్ నేషనల్ క్రష్ అవార్డులు కూడా వున్నాయి. విజయ్ దేవరకొండ మేల్ నేషనల్ క్రష్ -2021.

***