రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

6, జూన్ 2021, ఆదివారం

1044 : సందేహాలు - సమాధానాలు

 Q :  నా స్క్రిప్టు స్ట్రక్చర్ చెక్ చేయించాలనుకుంటున్నాను. మీరు తప్ప నాకెవవరూ కని పించడం లేదు. ట్రీట్ మెంట్, డైలాగ్ వెర్షన్ వీటిలో ఏది మీకు పంపాలి? ఎలా పంపాలి? స్ట్రక్చర్ చెక్ చేయిస్తే సరిపోతుందా? తెలియజేయగలరు. 
దర్శకుడు


A : డైలాగ్ వెర్షన్ కాకుండా ట్రీట్ మెంట్ పంపండి. డైలాగ్ వెర్షన్ లో ట్రీట్మెంట్ కి మార్పు చేర్పులు జరిగితే డైలాగ్ వెర్షన్నే పంపండి. స్ట్రక్చర్ చెక్ లో సరిచేసుకోవాల్సిన సమస్త లోపాల గురించే లిస్టు ఇవ్వడం వుంటుంది. వీటిని సరిచేయాల్సి వస్తే స్క్రీన్ ప్లే సెట్టింగ్ అని వేరే వుంటుంది. ఇది పదిహేను రోజులు ముఖాముఖీ సమావేశం. మెయిల్ అయితే : msikander35@gmail.com కి, వాట్సాప్ అయితే : 9247347511 కి పంపండి.

Q :  నాయాట్టు మూవీలో మణియన్ చనిపోయాక మిగిలిన ఇద్దరూ వీడియో ఆధారంగా కేసులోంచి  బయటపడి వుంటే అది గాథ కాకుండా కథ అయ్యేది కదా? కమర్షియల్ గా కూడా వుండేది కదా?
సత్యఫణి, దర్శకత్వ అభిలాషి

A :  ఈ కాన్సెప్ట్ కేసులోంచి బయటపడడం గురించి కాదు, బోగస్ కేసుకి బలి అవడం గురించి. కనుక ఇది కథగా మారే అవకాశమే లేదు. గాథ గానే సరిగా చూపించాలి. చనిపోయిన మణియన్ మాట్లాడిన వీడియో వున్న సెల్ ప్రవీణ్ చూసినప్పుడేం చేయాలి? వెనుక నుంచి పోలీసు టీం తరుముకొస్తోంది. తను ఎలాగూ దొరికిపోతాడు. ఆ వీడియోని ఇంకెవరికో సెండ్ చేసేస్తే వీడియో సేఫ్ అయిపోతుంది. ఇది చేయకుండా సెల్ తో సహా దొరికిపోతాడు. దీంతో అతడి దారులు పూర్తిగా మూసుకుపోయాయి. ఇలా పాసివ్ క్యారక్టర్ అయిపోయాడు. ఇలాకాక, వీడియో సెండ్ చేస్తున్నప్పుడు అతను దొరికిపోయి వుంటే సీను కరెక్టుగా వుండేది- కథనంతో, పాత్ర చిత్రణతో.

        తర్వాత ఆ వీడియోని పై అధికారి చూసి, దీని కాపీ వుందా అని అడుగుతాడు. లేదని కింది ఉద్యోగి చెప్పేసరికి, ఆ పై అధికారి సెల్లోంచి మెమరీ కార్డు తీసి విరిచేస్తాడు. అలా ఆ వీడియో సాక్ష్యం లేకుండా చేశానను కుంటాడు. ఇది కూడా తప్పే. ఆ వీడియోని ప్రవీణ్ సెండ్ చేసి వుండడని ఎలా నమ్ముతాడు. ఇక కథలు మాత్రమే కమర్షియల్ అనుకోకూడదు. సరిగా తీస్తే గాథలు కూడా కమర్షియల్సే. రియలిస్టిక్స్ కూడా కమర్షియల్సే. కథల్నే సరిగా తీయకపోవడంతో కమర్షియల్ గాకుండా పోతున్నాయి.   

Q :   'శివ 1989' పర్ఫెక్ట్ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో ఉంది కదా. మరి 'శివ 2006' ఎందుకు ప్లాప్ అయింది?
మహేష్ రెడ్డి, రైటర్

A : 1989 నాటి శివ 2006 నాటి రీమేక్ కి కాలం చెల్లిన పోయిన కథ. స్ట్రక్చర్ తో సంబంధం లేదు. 2006 లో కాలేజీ యూనియన్లూ, విద్యార్ధి రాజకీయాలూ ఎక్కడున్నాయి. 2019 లో విడుదలైన డియర్ కామ్రేడ్ లో చూపించిన హీరో వామపక్ష భావజాలం, స్టూడెంట్ యూనియన్లూ, స్టూడెంట్స్ మీద శివటైపు రాజకీయ పెత్తనాలూ, క్యాంపస్ ఎలక్షన్లూ  ఇప్పుడెక్కడున్నాయి. ఇది కూడా ఫ్లాపయింది. 2019 లోనే ఇలాటి కథతో జార్జిరెడ్డి హిట్టవ్వాల్సింది. ఎందుకంటే అది 1970 లలో  జార్జిరెడ్డి అనే రెబెల్ విద్యార్ధి బయోపిక్. దీన్ని గజిబిజిగా తీసి ఫ్లాప్ చేశారు. ఇలాటి కథలతో బయోపిక్స్ లేదా పీరియడ్ మూవీస్ తీయొచ్చేమో గానీ, ఈ కాలపు కాల్పనిక కథలుగా తీయడం అర్ధం లేని పని.     

Q :   నాయాట్టు చూశాక నాదొక సందేహం. అసలు  హీరోకి గోల్ లేకుండా కథ చేయలేమంటారా?
శ్యాంబాబు, అసిస్టెంట్

A : చేయొచ్చు మానసిక శాస్త్రంతో. ఏదైనా సాధిస్తే ఇంకా సాధించాలన్పిస్తుంది. ఎంత  సంపాదించినా ఇంకా సంపాదించాలన్పిస్తుంది. సంతృప్తి అనేది వుండదు. ఒక గోల్ అంటూ వుండదు. ఫుల్ స్టాప్ వుండదు. అలాగే హీరోకి విలన్ని చంపాలన్న గోల్ వుందనుకుందాం. ఆ గోల్ ని పట్టించుకోడు. చంపాక ఇంకా ఇంకా చంపాలన్పిస్తుంది కాబట్టి. ఒకసారి చంపాక ఇంకా ఇంకా ఎలా చంపుతాడు? ఇదీ సమస్య. ఆ సమస్యెలా తీరాలి? ఇదీ కథ.

Q : కథ రాసుకునేటప్పుడు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ తో వుండాలి?
ఒక అసోసియేట్    

A : ఏ పని చేసేప్పుడైనా బాడీ, మైండ్, ఎమోషన్, ఎనర్జీ కలిసి పనిచేసేట్టు చూసుకుంటే పనికి ప్రయోజనం చేకూరుతుంది- అని మనం కాదు, జగ్గీ వాసుదేవ్ చెప్తున్నాడు. 

సికిందర్