రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, అక్టోబర్ 2021, శనివారం

1069 : రివ్యూ


 

రచన - దర్శకత్వం: సాయికృష్ణ ఎన్రెడ్డి
తారాగణం: సునీల్, సుహాస్, దివ్య శ్రీపాద, శ్రీవిద్య మహర్షి, చాందిని రావు, రుణ్,, తరుణ్ కివీష్ కౌటిల్య తదితరులు.
కథ: సందీప్ రాజ్, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం : వెంకట్ ఆర్. శాఖమూరి
నిర్మాతలు: ప్రదీప్ , మ్యా చౌదరి
విడుదల: అక్టోబర్ 22, 2021 (జీ 5)
***

        కొత్త టాలెంట్ తో మరో రియలిస్టిక్ మూవీ జీ5 లో ఈ రోజు విడుదలైంది. కలర్ ఫోటో కి కథ ఇచ్చిన రచయితల్లో ఒకరైన సందీప్ రాజ్ కథతో, సాయికృష్ణ ఎన్రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ హెడ్స్ అండ్ టేల్స్ తీసి స్ట్రీమింగ్ కిచ్చేశాడు. ఫిలాసఫిక్ టచ్ తో ఓ ముగ్గురమ్మాయిల కథ చెప్పాలని ప్రయత్నం. రోమాంటిక్ కామెడీల్లోనైతే అమ్మాయిల్ని ఎలా చూపించినా చెల్లిపోవచ్చు గానీ, సీరియస్ రియలిస్టిక్ జానర్లో కూడా ఇలాగే చూపిస్తే చెల్లుతుందా? బొమ్మా బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పై చెయ్యీ అని పాత పాట. ఈ టాస్ వేసినప్పుడు ఈ కొత్త టాలెంట్ గెలిచారో లేదో చూద్దాం...

కథ

    రిపోర్టర్ రఘురాం దేవుడ్ని (సునీల్) ఇంటర్వ్యూ చేస్తూంటాడు. బిగ్ బ్యాంగ్ గురించి, కోవిడ్ మహమ్మారి గురించీ కామెడీగా చెప్తాడు దేవుడు. ఈ దేవుడు ముగ్గురమ్మాయిల కథ కూడా చెప్పుకొస్తాడు. అలివేలు మంగ(దివ్య శ్రీపాద), శృతి (చాందిని రావు), అనీషా (శ్రీవిద్య )ల జీవితాల గురించి చెప్తాడు. వీళ్ళు ముగ్గురూ కర్మ సిద్ధాంతానికి ప్రతీకలు. అలివేలు మంగ కానిస్టేబుల్. బార్లో పనిచేసే ఆమె భర్తతో సమస్య వస్తుంది. అతను బార్లో చేసిన ఒక నష్టానికి డబ్బు కట్టాల్సి వచ్చి మంగ మెడలో వున్న నగ ఇమ్మని వేధిస్తూంటాడు.

        అనీషా సినిమా హీరోయిన్ అవ్వాలని ప్రయత్నిస్తూంటుంది. ఆమెకి వేశ్యగా నటించే అవకాశం వస్తుంది. వేశ్యాగా నటిస్తే చంపుతానని బెదిరిస్తూంటాడు ఆమెతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న బాయ్ ఫ్రెండ్, దీంతో ఆమె పోలీస్ స్టేషన్ కెళ్ళి కానిస్టేబుల్ మంగ రక్షణ కోరుతుంది. శృతికి కూడా బాయ్ ఫ్రెండ్ తో సమస్యలుంటాయి. ప్రతీ బొమ్మకీ మగాడు బొరుసు మగాడు అన్నమాట. ఆ మగాళ్ళు  టార్చర్ పెట్టే మృగాలు. వీళ్ళతో ఈ ముగ్గురి జీవితాలేమ య్యాయన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ
    ఆడవాళ్ళ స్వాతంత్ర్యం- మగాళ్ళ స్వార్ధం అనే పాయింటు ఈ సినిమా కాన్సెప్ట్. కాలం మారినా మగాడు మారడు. మారాలనుకుంటున్న ఆడదానితో అదే పెత్తనం. దీనికి పరిష్కారమేమిటి? ఇదే చెప్పారు ఈ కథలో. అయితే చెప్పడంలో పట్టుగానీ, నేర్పుగానీ కనిపించవు. పాత్రల మధ్య సరైన సంఘర్షణ, భావోద్వేగాలూ లేకపోవడం కాన్సెప్ట్ ని నీరుగార్చింది. పరిష్కారాల్ని అంత తేలికగా చెప్పేశారు. అన్నీ సమస్యలకీ సులువైన పరిష్కారాలుంటాయి గానీ, ఇది తెలుసుకోక కష్టాలు పెంచుకుంటామని చెప్పారు. ముగ్గురి కథల్లో సమస్యలే సరిగ్గా చూపించనప్పుడు, పరిష్కారాలు ఇంతే బలహీనంగానే, సులువుగానే నే కదా వస్తాయి.

        ముగ్గురమ్మాయిల్లో ఎవరి సమస్యా ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే బలంతో లేకపోవడం, పాత్ర చిత్రణల్లో స్థిరత్వం లేకపోవడం కేవలం 83 నిమిషాలే వున్న ఈ ఫిమేల్ డ్రామాని కూడా నిలబెట్టలేకపోయాయి. ముగ్గురి కథల్లో ఏ వొక్కరి కథకీ సహేతుక పరిష్కారం లేదు.

నటనలు - సాంకేతికాలు

     ముగ్గుర్లో కానిస్టేబుల్ మంగగా నటించిన దివ్య మాత్రం నటనతో స్కోరు చేస్తుంది. ఆమె పాత్ర  కొంతలో కొంత సానుభూతి పొందేలా వుండడం నటించడానికి స్కోపు నిచ్చింది. పాత్ర తెలంగాణా మాట్లాడుతుంది. మిగిలిన ఇద్దరికీ పాత్రలతో బాటు నటనలూ సరిగ్గా లేవు, ఒక్క నటిగా సీఐగా నటించినప్పుడు మాత్రం శ్రీవిద్య బావుంటుంది. ఇంకెవరికి సరైన పాత్రలున్నాయంటే, భర్త పాత్ర, బాయ్ ఫ్రెండ్స్ పాత్రలు నటించిన ముగ్గురికీ ఎక్కువసేపు పాత్రల్లేవు. వున్న ఆ కాసేపు అంతంత మాత్రం. ఇక  తలరాతలు రాసే దేవుడిగా నటించిన సునీల్ కామెడీతో లాగించేశాడు. కానీ ఆ తలరాతలకి దేవుడిగా ముగింపు ఎలా ఇవ్వాలో తేల్చుకోలేకపోయాడు. బొమ్మా బొరుసాట ప్రారంభించి తేల్చలేక - ఏదో అయ్యిందనిపించి బుక్కైపోయాడు. ఇక కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ ది పంచ్ డైలాగులతో అర్ధం లేని అతిధి పాత్ర.

        ఈ కథ ఎక్కువ భాగం రాత్రి జరుగుతుంది. హైదారాబాద్ రాత్రి దృశ్యాలు బాగా చూపించాడు కెమెరామాన్ శాఖమూరి. మణిశర్మ సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా బలంగా వుంది. కానీ బలహీన కథకి బలమైన సంగీతం ఏం ఉద్ధరిస్తుంది. సినిమా ఫస్టాఫ్ మాత్రం కథ ప్రారంభం కాక కంటిన్యూటీ వుండని సీన్లతో బాగా నస పెట్టేస్తుంది. సెకండాఫ్ లో బలహీన ఫిమేల్ డ్రామా ఓపికని తెగ పరీక్షిస్తుంది. ఓటీటీలో ఈ సినిమాని మాస్ చూడకపోవచ్చు. క్లాస్ వర్గం చూడాలంటే ఈ క్రియేటివిటీ, కంటెంట్ సరిపోతాయా?

—సికిందర్
(దీనిపై సమగ్ర విశ్లేషణ సోమవారం)