రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, May 6, 2016

షార్ట్ రివ్యూ!

రచన, దర్శకత్వం : విక్రమ్‌ కె. కుమార్
తారాగణం : సూర్య (త్రిపాత్రాభినయం), సమంత, నిత్యా మీనన్‌,
శరణ్య,  అజయ్‌
, గిరీష్‌ కర్నాడ్‌, సుధ, తదితరులు.
మాటలు : శశాంక్ వెన్నెలకంటి, పాటలు : చంద్రబోస్, సంగీతం : ఏఆర్ రెహమాన్,  ఛాయాగ్రహణం:  ఎస్. తిరు, కూర్పు : ప్రవీణ్ పూడి, కళ : సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే,  మేకప్ : ప్రీతీ శీల్ సింగ్, క్లోవర్ వూటన్, సౌండ్ ఎఫెక్ట్స్ : ఇక్బాల్, డిటిఎస్ : లక్ష్మీ నారాయణ్, యాక్షన్ : అన్బరివ్

బ్యానర్‌ : 2 డి ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : సూర్య
విడుదల : మే 6, 2016
***
నం’  ఫేం విక్రంకుమార్ తాజాగా సూర్యతో ‘24’ అంటూ మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి తెర తీశాడు. కుటుంబ కథా చిత్రాల్ని దేనికది విభిన్నంగా ఎలా తీయవచ్చో మరోసారి అనితరసాధ్యమైన తన రీసెర్చి సహిత స్క్రిప్టుతో చాటి చెప్పాడు. ‘కాలం’ అతడి కుటుంబ కథల నేపధ్యమైనప్పుడు,  ‘మనం’ లో  అది మూడు తరాల చరిత్రలా చెప్పాడు. ఇప్పుడు ‘24’ లో చరిత్ర బదులు సైన్స్ ఫిక్షన్ చెప్పాడు. కాలంలో వెనక్కి ప్రయాణించే  26 ఏళ్ల నాటి సంఘటన కెళ్లి అక్కడ సైకోథెరఫీ చేశాడు.  మరీ ‘నాన్నకు ప్రేమతో’ లోలాంటి సోకాల్డ్ సైన్స్ ఫిక్షన్ లా కాకుండా, సగటు ప్రేక్షకుడూ వినోదించే తీరులో  సైన్స్ ఫిక్షన్ ని సింప్లిఫై చేశాడు. ఈ సినిమాలో సూర్య భాషలో చెప్పాలంటే, ఇమాజినో ఫీలియా చేశాడు!

          ‘గజినీ’ అనే విజయవంతమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తర్వాత ‘సెవెంత్ సెన్స్’ అనే సైన్స్ ఫిక్షన్  యాక్షన్ తో భంగపడ్డ తమిళ స్టార్ సూర్య,  మరోసారి సైన్స్ ఫిక్షన్ కి- అదీ నిర్మాతగానూ మారి సాహసించడం గొప్ప విషయమే. సైన్స్ ఫిక్షన్ తో వుండే రిస్కు తెలిసింత్తర్వాత కూడా దానికి జోలికెళ్లడం కొరివితో తలగోక్కోవడమే. ఐతే విక్రం కుమార్ చేతిలో  స్టీరింగ్ అంటూ ఉన్నాక సురక్షితంగా నిర్మాతలూ ప్రేక్షకులూ ఆనందతీరాలకి చేరతారనేది మరోసారి రుజువయ్యింది- ఈ  ‘24’ గడియారం 24 క్యారట్ల బంగారమే అయ్యాక.
          ఓసారి దీని కథాకమామిషేమిటో చూద్దాం...

కథ
     సైంటిస్టు శివకుమార్ (సూర్య) ఏళ్లతరబడి శ్రమించి ఒక మ్యాజిక్ వాచీ కనిపెడతాడు. ఇది కాలంలో 24 గంటల వరకూ వెనక్కి తీసికెళ్తుంది. ఈ విజయాన్ని భార్య ప్రియ (నిత్యామీనన్) తో పంచుకుందామనుకునేంతలోనే  శివకుమార్ కవల సోదరుడు ఆత్రేయ( సూర్య -2)  వాచీకోసం దాడి చేసి ప్రియని చంపేస్తాడు. ఏడాది నిండని కొడుకు మణి (సూర్య -3) తో పారిపోతున్న శివకుమార్నీ చంపేస్తాడు. ఈ దాడికి ముందు కొడుకుని ట్రైన్లో ఒకావిడకి అప్పగిం చేస్తాడు శివకుమార్. 


       26 ఏళ్ల తర్వాత ఇప్పుడు మణి పెంపుతల్లి సత్యభామ ( శరణ్య) తో ఉంటూ, వాచీ షాపు నడుపుతూంటాడు.  అటు ఆనాడు తమ్ముణ్ణి చంపి ప్రమాదం పాలై,  కాలు పడిపోయి కోమాలో కెళ్లిపోయిన ఆత్రేయ లేచి కూర్చుంటాడు. తన పరిస్థితికి తట్టుకో లేకపోతాడు. తన దగ్గర ఒక తాళం చెవి వుంటుంది. దాని పెట్టె మాత్రం దొరకడం లేదు. పడిపోయిన తన కాలు ఇక రాదని డాక్టర్ చెప్పేసరికి ఒక ఆలోచన చేస్తాడు. తమ్ముడు కనిపెట్టిన ఆ మ్యాజిక్ వాచీ ఎక్కడున్నా సరే దాన్ని సంపాదించుకుంటే, కాలంలో 26 ఏళ్ళు వెనక్కి వెళ్లి, ఆనాడు తనకి జరిగిన ప్రమాదం జరక్కుండా చూసుకుంటే, కాలు తిరిగి వచ్చేస్తుందని అసిస్టెంట్ మిత్ర (అజయ్) తో చెప్తాడు. తన దగ్గరున్న పనికి రాని ఆ తాళం  చెవిని విసిరి పారేస్తాడు. 

        ఆ తాళం  చెవి మణి  దగ్గరికి చేరుతుంది. తన దగ్గర ఎప్పుడూ తెరచుకోని ఓ పెట్టెని దాంతో తెరిచి చూస్తే  దాంట్లో మ్యాజిక్ వాచీ వుంటుంది. ఆ వాచీ పట్టుకుని కాలంతో ఆడుకుంటూ ఉంటాడు. 24 గంటల వరకూ వెనక్కి వెళ్లి,  జరిగిన సంఘటనలని తనకి నచ్చే విధంగా మార్చుకుని ఆనందిస్తూ ఉంటాడు. ఆ వాచీతో కాలాన్ని కూడా స్తంభింపజేసి, తన పనులు చేసుకుంటూ ఉంటాడు. తనకి పరిచయమైన సత్య (సమంతా) అనే అమ్మాయిని ప్రేమలోకి దింపడానికి కూడా ఆ వాచీతో రకరకాల గిమ్మిక్కులూ చేస్తాడు.

        ఈ వాచీ కోసం ఆత్రేయ ప్రకటన వేయించినప్పుడు మణి వెళ్లి కలిస్తే, కథ అడ్డం తిరుగుతుంది. మణికి కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి. తనెవరు, అసలెవరికి పుట్టాడూ  అన్న ప్రశ్నలతో కాలంలో వెనక్కి వెళ్లేందుకు అతడికా వాచీ కావాలి. తన ఆరోగ్యం బాగు చేసుకుని, తను చూడని 26 ఏళ్ల కాలాన్నీ  చూసేందుకు ఆత్రేయకీ ఆ వాచీ కావాలి- ఇప్పుడు ఇద్దర్లో ఆ వాచీ ఎవరికి దక్కుతుంది, ఎవరు గెలుస్తారు, ఈ ప్రయాణంలో ఎవరేం తెలుసుకుంటారు, ఇంకెవరెవరి జీవితాలు బాగుపడ్డాయీ అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 

     కథకుడి ఆలోచనలు బావుంటే కథలన్నీ బాగానే వుంటాయి. అసాధ్యమైన కథలు కూడా సుసాధ్యాలైపోతాయి. ఓ కుటుంబం- పోనీ ఓ రెండు కుటుంబాల కథకి కూడా సైన్స్ ఫిక్షన్ ని జోడించి చెప్పవచ్చన్న ఆలోచనే హైకాన్సెప్ట్ మూవీస్ స్థాయికి తీసి కెళ్తుంది. ఒక అన్యాయమైపోయిన సైంటిస్టు కుటుంబం, ఇంకో పెంపుడు కొడుకు కోసం తన కుటుంబానికే దూరమైపోయిన ఆవిడ జీవితం...సైంటిస్టు కుటుంబానికి న్యాయం చేకూర్చాలంటే ఇక్కడ్నించీ జీవితంలో వెనక్కి వెళ్ళాలి, తన కుటుంబానికి దూరమైన ఆవిడకి న్యాయం చేయాలంటే ఇక్కడ్నించీ జీవితంలో ముందు కెళ్ళాలి. పైకి యాక్షన్ కథలా పరుగెత్తే ఈ కథ ఊహించని విధంగా కుటుంబాల కథలుగా పొరలు విప్పుకుంటూ సాగుతుంది. ఈ కుటుంబాల  కథకి సైన్స్ ఫిక్షన్ నేపధ్యమైతే, కుటుంబాల  కథని నడిపించేది మాత్రం  సంభ్రమాశ్చర్యాల సస్పెన్స్, థ్రిల్ల్, మిస్టరీ ఎలిమెంట్స్ తో కూడిన కథనమే. వీటికి బలమైన భావోద్వేగాల కవరింగ్. బంధాలూ బంధుత్వాలూ అన్నీ కలిసిపోతూ ఒకే బిందువులో బందీ లైపోతారు అందరూ- మనమంతాఒకే బిందువు లోంచి ఉద్భవించిన వాళ్ళమన్న సత్యాన్ని అన్యాపదేశంగా స్థాపిస్తూ.

ఎవరెలా చేశారు
      తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన సూర్య ఈ సినిమాని ప్రతీ క్షణం నిలబెట్టాడు. ముఖ్యంగా ఆత్రేయ పాత్రలో కోరుకున్న దానికోసం అర్రులు చాచే అతడి అభినయం- యాక్షన్లో కొంత, చక్రాల కుర్చీకి బందీ అయిపోయి నిస్సహాయంగా మరికొంతా -ఉద్విగ్నభరితంగా  సీన్లని హైలైట్ చేస్తాయి.  చక్రాల కుర్చీలో తల వాల్చేసి అతను కూర్చునే విధం విఖ్యాత శాస్త్రవేత్త - చక్రాల కుర్చీకి అంకితమైపోయిన స్టీఫెన్ హాకింగ్ ని గుర్తుకు తెస్తుంది. చాలా విచిత్రం- అసలు సైంటిస్టు పాత్రేమో మామూలుగా వుంటే, విలన్ పాత్ర హాకింగ్ ని గుర్తు తెస్తూ సైంటిస్టులా కూర్చోవడం!


        సూర్య మూడో పాత్ర వాచీ మెకానిక్ గా ఎంటర్ టైన్ చేసేపాత్ర. సమంతా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కాలంతో అతను పాల్పడే చేష్టలన్నీకొత్తరకం  కామెడీ సీన్లని సృష్టిస్తాయి. ఆమెకోసం క్రికెట్ మ్యాచ్ ని కూడా తన వాచీలో ఆప్షన్ తో ఫ్రీజ్ చేసేసి-  ఇటు బాల్ ని అటు పెట్టి- ఫలితాన్ని మార్చేస్తాడు.  ప్రేమలో ‘రోమాన్సో ఇమాజినో ఫీలియా’ అనే కల్పిత థియరీ చెబుతూ నమ్మిస్తూంటాడు.  ఇలాటి క్రియేటివ్ గిమ్మిక్కులెన్నో ప్రదర్శిస్తాడు. సమంతా కూడా మరీ అమాయకత్వంతో కొత్తగా కన్పిస్తుంది.

        సూర్య సైంటిస్టు పాత్ర, నిత్యామీనన్ సంక్షిప్త పాత్రా కూడా గుర్తుండి  పోతాయి. మూలస్థంభంలాంటి పెంపుడు తల్లి పాత్రలో  ఒకప్పటి హీరోయిన్ శరణ్య ఫస్టాఫ్ లో చాలా ఈజ్ తో నటించుకుపోతుంది- సెకండాఫ్ లో అసలు తనెవరో, ఆనాడు క్షణంలో తన జీవితం ఎలా మారిపోయిందో చెప్పాల్సి వచ్చే ఘట్టంలో కంట తడిపెట్టించక మానదు. 

        టెక్నికల్ గా అత్యున్నత స్థాయిలో వున్న ఈ హై కాన్సెప్ట్ మూవీకి చాలా లో-  కేటగిరీ సంగీతాన్నిచ్చింది ఏఆర్ రెహ్మనే. ఇంత  సినిమాలో ఒక్క క్యాచీ పాట కూడా ఇవ్వలేకపోవడం శోచనీయమే. సాహిత్యం కూడా కుదర్లేదు. ఛాయాగ్రహణం  అంతర్జాతీయ స్థాయిలో వుంది. గ్రాఫిక్స్, కళాదర్శకత్వం, యాక్షన్ సీన్లూ  క్లాసిక్ లుక్ ని తీసుకొచ్చాయి. 

        దర్శకుడు విక్రం కుమార్ ప్రతీ ఒక్క విభాగం మీదా స్పష్టమైన అవగాహనతో, కమాండ్ తో కన్పిస్తాడు. మెగా దర్శకుడు శంకర్ కి దీటుగా తనూ ఎదిగివస్తున్నాడు- హృదయాలని కదిలిస్తూనే వినోదపర్చే  హైకాన్సెప్ట్  సినిమాలతో. కమర్షియల్ సినిమాలని కూడా క్వాలిటీతో కూడిన ఇంటలిజెంట్ రైటింగ్ తో ఆకట్టుకోవచ్చనీ, అయితే దీనికి రీసెర్చి అవసరమనీ తన సినిమాల ద్వారా ప్రకటిస్తూ- ఒక్కో సినిమాతో ఒక్కో మెత్తు ఎక్కుతున్నాడు. రీసెర్చి లేకుండా కొత్త సబ్బు కూడా తయారు కాదు. 

స్క్రీన్ ప్లే సంగతులు
    మొదటి అరగంట సమయంలో యంగ్ సూర్యకి పెట్టె తాళం చెవి దొరికి, పెట్టె లోంచి వాచీ తీస్తున్నప్పుడు ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతుంది. ఇక్కడ క్లాస్- మాస్ ప్రేక్షకులు ఈలలూ కేరింతలతో హోరెత్తించేస్తారు. ఈ ప్లాట్ పాయింట్ వన్ బ్యాడ్ సూర్యతో చాలా డిస్టర్బింగ్ ఇంటర్వెల్ కి దారి తీస్తుంది. తర్వాత పరిణామాల క్రమంలో, బ్యాడ్ సూర్యకి యంగ్ సూర్య ఇచ్చింది డూప్లికేట్ వాచీ అని బయట పడినప్పుడు ప్లాట్ పాయింట్ టూ ఏర్పడుతుంది. ఇక్కడా క్లాస్ మాస్ ప్రేక్షకులందరూ హోరెత్తించేస్తారు. ఈ వ్యాసకర్త అనుభవంలో ఇలాటి దెప్పుడూ చూడలేదు- ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, మళ్ళీ  ప్లాట్ పాయింట్ టూ దగ్గరా ప్రేక్షకులు ఇలా రెస్పాండ్ అవడం. దిసీజ్ వాట్ ఏ స్క్రీన్ ప్లే డిమాండ్స్. ప్లాట్ పాయింట్స్  రెండూ ప్రేక్షకుల్లో పట్టలేని ఎమోషన్స్ ని పుట్టించే మూలస్థంభాలుగా ఉన్నప్పుడే ఆ స్క్రీన్ ప్లేకి ఎదురుండదు. లేకపోతే మూలస్థంభాలకి అర్ధమే లేదు. మకర జ్యోతిని చూడ్డానికి శబరిమలై వెళ్తారు, ప్రభల్ని చూడ్డానికి కోటప్ప కొండకి వెళ్తారు- ప్లాట్ పాయింట్స్ చూసి తరించడానికి సినిమాకి రావాలి ప్రేక్షకులు! 


        ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్క్రీన్ ప్లేకి డెప్త్ కోసం హిడెన్ ట్రూత్ అనే టూల్ బాగా ఉపయోగపడింది. మిడిల్ (సబ్ కాన్షస్ మైండ్) అంటేనే నిగూఢ రహస్యాల్ని కలిగి వుండి అవి బయట పడ్డం కాబట్టి- అదిక్కడ బాగా ప్లే అయ్యింది. కాలంలో వెనక్కి వెళ్లి జరిగిన తప్పుల్ని సవరించుకు వచ్చి జీవితాల్ని మార్చుకోవడమంటే- సైకలాజికల్ గా పాస్ట్  లైఫ్ రిగ్రెషన్ అనే ట్రేట్ మెంట్ అనొచ్చు. హిప్నాటిజం లో కూడా గతంలోకి తీసికెళ్ళి అక్కడున్న మానసిక నిషేధాల్ని తొలగించి మనసికారోగ్యాన్ని చేకూరుస్తారు.  కాలంలో వెనక్కెళ్ళే  కథలతో ఇలాటి సినిమాలు కూడా ఇలా సైకోథెరఫీ చేస్తాయి. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ అనే ఆస్కార్ విన్నర్ లో,  టీనేజి కొడుకు పాత్ర కాలయంత్రంలో కొన్నేళ్ళు వెనక్కి ప్రయాణించి, అక్కడ టీనేజీ లవర్స్ గా వున్న తన తల్లిదండ్రుల్ని చూస్తాడు. ఆ లవ్ లో  ప్రధాన సమస్య తండ్రికి ఆత్మవిశ్వాసం లేకపోవడం. మన యంగ్ హీరో దాన్ని తొలగించి, తన కాబోయే తండ్రిని హీరోలా కాబోయే తల్లితో కలిపి,  తిరిగి ప్రస్తుత కాలంలోకి వచ్చేస్తాడు. ఇక్కడ చూస్తే,  జీవితంలో పరాజితుడుగా ఇన్నేళ్ళూ గడిపిన తండ్రి,  మంచి ఆత్మవిశ్వాసంతో సంపన్నుడై  తల్లిని సుఖ పెడుతూ ఉంటాడు.

     ఇలాటిదే జరుగుతుంది ‘24’ లోనూ. యంగ్ సూర్య 26 ఏళ్ళు కాలంలో వెనక్కి వెళ్లి ఆ సంఘటన జరిగిన నాడు,  ఏడాది నిండని పసివాడుగా తల్లిదండ్రుల్ని చూసుకుంటాడు. సంఘటనని రివర్స్ చేసి పెదనాన్న ఆత్రేయని తన నాన్న చంపేసేలా చేస్తాడు. ట్రైన్లో తల్లి దండ్రులతో ప్రయాణిస్తూ పెంపుడు తలిని చూస్తాడు. కానీ ఇప్పుడామె పెంపుడు తలిగా జీవుతం త్యాగం చేసుకునే అవసరం లేదు. ఆనాడు ఆమె తనని ఎత్తుకుని ట్రైన్ దిగి, పెళ్ళిసంబంధం వాళ్ళకి షాకిచ్చి. వాళ్ళకి చెప్పుకోలేక దగా పడింది. ఇప్పుడలా జరక్కూడదు...పెళ్లి చూపులకి వచ్చిన కన్నెపిల్లలా వాళ్ళ ముందు  ట్రైన్ దిగాలి తనూ...
       

           “If it can be written, or thought, it can be filmed.”
           Stanley Kubrick



-సికిందర్ 
cinemabazaar.in