రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, మార్చి 2021, బుధవారం


      ప్రభుత్వం రైతు చట్టాలు తెచ్చింది. వద్దన్నారు రైతులు. బావుంటుంది, తినండి, మీ కోసమే ఈ ఫలహారం అంది ప్రభుత్వం. ఫలహారం మాకొద్దంటే తినమంటారేంటీ?’ అని ఆందోళనకి దిగారు రైతులు. ఇక రైతుల దారి రైతులది, ప్రభుత్వం దారి ప్రభుత్వానిదైంది. రైతులతో చర్చించకుండా చట్టాలు చేస్తే ఇలా వుంది. ఫంక్షన్ హాల్లో అడక్కుండా మెనూ తయారు చేసి, బావుంటుంది తినమంటే, ఇలాగే ఆందోళనకి దిగుతారు పోనీకదాని పెళ్ళికి వచ్చిన జనాలు. పాత్రలతో చర్చించకుండా కథకుడు చేస్తే ఇలాగే వుంటుంది కథ కూడా. ఈ బేసిక్స్ ని అర్ధం జేసుకోవడం లేదు కొందరు కథకులు. కథకుడు కథ నడప కూడదనీ, పాత్రల్నే కథని నడుపుకోనివ్వాలనీ ప్రాథమిక సూత్రం ఈ బ్లాగులో కీ బోర్డు అరిగి అరిగి కరిగి పోయేలాగా ఎన్నిసార్లు అ ఆలు గుర్తు చేసినా, అర్ధం జేసుకోక పోతే, ఈ బ్లాగు ఏమర్ధమవుతున్నట్టు. ఎందుకు చదువుతున్నట్టు.

        2. బేసిక్స్ నే ప్రశ్నిస్తూ వాదన కూడా. అక్షర మాల  అఆ లతో కాకుండా, ఇఈ లతో ప్రారంభమవుతుందనేలాటి వాట్సాప్ స్కూలు వాదన. ఇందాక వార్తలు చూస్తూంటే కథ రాయడానికి ఏ బేసిక్స్ ని  దృష్టిలో పెట్టుకోవాలో సరీగ్గా ఒక కామన్ సెన్సు టిప్ దొరికింది ఇది చెప్పడానికి. వార్తల్లో, ఫలానా వ్యక్తి ఫలానా విధంగా అన్నాడని వార్తలు చదువుతాడు. వ్యక్తి అనని మాటలు తను కల్పించి వార్తలు చదవడు. వార్తలు సేకరించాలంటే వ్యక్తులు ఏమంటున్నారో, ఏమనుకుంటున్నారో తెలుసుకోకుండా వార్తలు సేకరించరు. ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వ్యక్తిని అడిగి తెలుసుకుంటాడు తప్ప, వ్యక్తిని కూర్చోబెట్టి తను చెప్పెయ్యడు ఇంటర్వ్యూ కర్త. కానీ కథకుడు మాత్రం పాత్రల్ని కూర్చోబెట్టి తను రాసేస్తూంటాడు వాటి కోసం కథ.

        3. సీనంటే మరేమిటో కాదు సిట్యుయేషన్. సిట్యుయేషన్ అంటే అవసరం. పాత్రల  అవసరం. పాత్రల అవసరాలే సిట్యుయేషన్ని సృష్టిస్తాయి. పాత్రల అవసరాలు చూడకుండా, ఆ సిట్యుయేషన్ తో కథకుడు తానుగా ఇంకేదో నచ్చింది ఫీలై సీను రాసేస్తే, అది సీను అవ దు, కథకుడి అధికారమవుతుంది. సీను మీద పాత్రలకే అధికారముంటుంది.  

        4. నచ్చడాలు నచ్చక పోవడాలు కథకుడి కుండవు. పాత్రలకే వుంటాయి. కథకుడి పాయింటాఫ్ వ్యూ గాలి బుడగ. స్వతంత్రంగా కథకుడి మైండ్ కి అర్ధం లేదు. పాత్రల మైండ్ లోపలుంటేనే ఎంతో కొంత అర్ధం పర్ధం. కథలు రాసి కథకుడు మెచ్యూర్ అవడు. పాత్రల్లోపల జీవించే మెచ్యూర్ అవుతాడు. కథ మీద కథకుడికి ఏ ఆధారిటీ లేదు, పాత్రలకే వుంది. కథకుడు కథలు రాయడు, పాత్రలు అనుకున్నదే రాస్తాడు. పాత్రలు అనుకుంటున్న దాంతోనే వాదిస్తాడు. కథంటే ఇన్నర్ ఇంజనీరింగ్, కథకుడు పై పైన వేసే పూతకాదు. బయట బయట వుంటే కథకుడికి రక్షణ లేదు, గర్భస్థ శిశువుగా పాత్రల్లోపలుంటేనే తన వాదంతో రక్షణ. ప్రతీ కథతో పాత్రలు పుట్టవు. అవి ఆల్రెడీ పుట్టివుంటాయి. కథకుడే  శిశువుగా పుట్టి నేర్చుకుంటాడు.

5. సింపుల్ ఉదాహరణ. హీరోయిన్, సెకండ్ హీరోయిన్, హీరో వున్నారు. హీరో హీరోయిన్లు ప్రేమలో వున్నారు. వీళ్ళ మధ్యకి సెకండ్ హీరోయిన్ వచ్చింది. ఈమెకి తనకంటే ఎక్కువ అర్హతలున్నాయని హీరోయిన్ కి ఇన్ఫీరియారిటీ ఏర్పడింది. హీరో తనతో వుంటాడా ఈమెతో వెళ్ళి పోతాడాని అనుమానం వేసింది, వీళ్ళిద్దరూ ఒకటై తనకి అన్యాయం చేస్తారేమోనని భయం ఏర్పడింది. దీంతో హీరో తనని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో తేల్చుకోవాలనుకుంది. సెకండ్ హీరోయిన్ సమక్షంలోనే హీరోకి టెస్టు పెట్టింది. ఆ టెస్టులో ప్రాణాలు పోయే ప్రమాదం జరిగి భయపడి పారిపోయింది. పారిపోయి హీరోతో కాంటాక్టు లేకుండా ఎక్కడో దాక్కుంది. ఇక కనిపించలేదు హీరో కనుక్కునే దాకా. ఇదీ సిట్యుయేషన్.

ఇప్పుడు, హీరోయిన్ అలా ఎలా పారిపోయి దాక్కుంటుందని కథకుడు ప్రశ్నిస్తే? ప్రాణాలుపోయే ప్రమాదం జరిగితే హీరోని వదిలేసి పారిపోయి, హీరో ఏమైపోయాడో పాపమని కూడా తల్లడిల్లకుండా, హీరోని కలుసుకునే ప్రయత్నం చేయకుండా, దాక్కోవడమేమిటని కథకుడు అనుకుంటే?

అప్పుడే కెవ్వున కేకేసి ఆ ప్రమాదం నుంచి హీరోని కాపాడి, టెస్టు పెట్టిన తన అసలు ఉద్దేశం చెప్పుకుని, క్షమించమని లొంగిపోతే కరెక్టా? లేదా అలా పారిపోయినా, కలుసుకోవడానికి తల్లడిల్లుతూ ప్రేక్షకుల కంట నీరు తెప్పించాలనుకుంటే కరెక్టా? ఏది కరెక్టు?

ఈ రెండూ తానుగా ఏదో ఫీలైపోతూ పునాది లేకుండా కథకుడాలోచించడమే. పాత్ర కోసం కథకుడు తనకి నచ్చిన విధంగా ఆలోచించి పెట్టి కథ చెయ్యడమే. రెండూ తప్పే. పాత్ర మైండ్ లో కెళ్ళి అప్పుడేం ఆలోచిస్తూ వుంటుందో చూడగల్గితే కథకుడు దారిలో వుంటాడు. పాత్ర ఆలోచనలే కథ. కథకుడి ఆలోచనలు కథ కాదు. వెనుక సీన్లని కథకుడు మర్చిపోతాడేమో గానీ, పాత్ర అస్సలు మర్చిపోదు. పాత్రకి సీన్లంటే అనుభవాల శ్రేణి. ఆ శ్రేణిలోంచే నిర్ణయాలు.

హీరోయిన్ మానసిక స్థితి సీక్వెన్స్ చూద్దాం : 1. తనకి తక్కువ అర్హతలున్నాయని సెకండ్ హీరోయిన్ వల్ల హీరోయిన్ కి ఇన్ఫీరియారిటీ ఏర్పడింది, 2. హీరో తనతో వుంటాడా ఈమెతో వెళ్ళి పోతాడాని అనుమానం వేసింది, 3. వీళ్ళిద్దరూ ఒకటై తనకి అన్యాయం చేస్తారేమోనని భయం ఏర్పడింది, 4. దీంతో హీరో తనని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో తేల్చుకోవాలనుకుంది, 5. సెకండ్ హీరోయిన్ సమక్షంలోనే హీరోకి టెస్టు పెట్టింది... టెస్టుకి దారి తీసిన కారణాలు కార్యకారణ సంబంధంతో వరస క్రమంలో- ఇన్ఫీరియారిటీ, హీరో మీద అనుమానం, వాళ్ళిద్దరంటే భయం, భయనివృత్తి నిర్ణయం...

ఇలా క్రమంగా ఆమె వాళ్ళిద్దరంటే భయపడే స్థితికి వచ్చింది. టెస్టు పెట్టినప్పుడు ఏం తేలుతుందో నన్న భయం. టెస్టులో వూహించని విధంగా ప్రమాదం జరిగి భయం రుజువైపోయింది. హీరో టెస్టు ఇష్టం లేక
, వాళ్ళిద్దరూ కలిసి ప్రమాదం జరిపి తనని అడ్డు తొలగించు కోవాలకున్నారనీ ప్రాణ భయంతో పారిపోయింది. కనపడకుండా దాక్కుందంటే వాళ్ళంటే ప్రాణ భయంతోనే. దీనికంతటికీ మూలం - ట్రిగ్గర్ పాయింట్- డ్రైవింగ్ ఫోర్స్- ఏదై తే అది- తనకి తక్కువ అర్హతలున్నాయని అనుకోవడమే. ఈ సెటప్ కి పే ఆఫ్ ప్రమాదం.  

అప్పుడు ఇదంతా వదిలేసి, హీరోయిన్ తన మానసిక స్థితిని శుభ్రంగా తుడిపేసుకుని, ఎలా తల్లడిలుతూ వచ్చి ఇంకా హీరోనే ప్రేమిస్తున్నట్టు క్షమాపణ అడిగి సెటిలై పోతుంది? అది పాత్రేనా, ఎవడు పడితే వాడు కూర్చునే చబూత్రానా? వాళ్ళు చంపాలనుకున్నప్పుడు హీరోకి తన మీద ప్రేమే లేదని తేలిపోయాక? పాత్ర మైండ్ లోకి వెళ్ళి, ఏది ఎందుకాలోచిస్తోందో చూసే ఓపిక వుంటే, సీన్లు సరీగ్గా వస్తాయి. పాత్రలకి వాటి భావస్వాతంత్ర్యంతో కొనసాగే ప్రజాస్వామ్యాన్నివ్వాలి, కట్టడి చేసే నియంతృత్వం కాదు.

 6. కథ మీద ఆర్నెల్లు కూర్చున్నా, ఏడాది కూర్చున్నా, పాత్రల్లోపల గంటైనా కలిసి కూర్చున్నారా లేదా అన్నది పాయింటు. పాత్రలు సృష్టించుకునే కథాప్రపంచంలో కథకుడు పాత్రలు జరుపుకునే ఉత్తరప్రత్యుత్తరాలకి  కేవలం పోస్టు మన్ లాంటి వాడే తప్ప ఇంకో మహావీరుడు కాదు.

        7. కథ ఎంతవరకూ వచ్చిందని వాకబు చేయకుండా, పాత్రలెంతవరకూ వచ్చాయని వాటి ప్రోగ్రెస్ అడగడం రిలేటెడ్ గా వుంటుంది. కథతో కథకుడు అంతర్ దృష్టితో వుండడానికి.

8. టిప్స్ సీరియస్ అవుతున్నాయి కాబట్టి కాసేపు లైట్ గా... దర్శకుడు పెట్టింది కథకుడు తినడం కాక, కథకుడు పెట్టిందీ దర్శకుడు తినడం గాక, పాత్రలు పెట్టింది ఇద్దరూ కలిసి విందు చేసుకోవాలి. పక్కన ఒక బాటిల్ వుంచుకున్నా ఫర్వా లేదు.

9. బాటిల్ చేసే పని ఇంతా అంతా కాదు. కథకుడ్ని డబ్బులిచ్చేశాంగా రాస్తాడులే అన్నట్టు గాకుండా - బాటిల్, సిగ్గీ ప్యాక్ వంటి మంగళ ద్రవ్యాలు కూడా పెట్టి పంపిస్తూంటే, ఇంట్లో కూర్చుని తనలోని రెండో మనిషిని లేపుతాడు. అప్పుడు చచ్చినా కథలోకి వెళ్ళలేడు. పాత్రల్లోకే పరకాయ ప్రవేశం చేసి వాటితో విహరిస్తాడు. తెల్లారి వచ్చి తను కను గొన్న అమృత విషయాలు వెల్లడిస్తాడు. రెండో మనిషి కంట్రిబ్యూషన్ ఇంతా అంతా కాదు. టీంలో ఇంకొక మెంబర్ని ఫ్రీగా యాడ్ చేస్తాడు కథకుడు.

10. నటులు పరకాయ ప్రవేశం చేస్తారు కాబట్టే నటించగల్గుతారు. కథకుడు పరకాయ ప్రవేశం చేస్తే రాయగల్గుతాడు. అసలు కథకులు యాక్టింగ్ కోర్సు కూడా చేసి రావాలంటాడు ఒక హాలీవుడ్ అతను.

11. ఇప్పుడు సీరియస్... ప్రేక్షకులిప్పుడు ఎదిగిపోయారు. వాళ్ళతో పోటీ పడాలి. ఇంకా రెండు మూడేళ్ళ  క్రితం రాసుకున్న కథలతో ప్రయత్నాలు వృధా. అవి మూలన పడేసి, మారిన కొత్త బిజినెస్ మాడెల్ తో ఇప్పుడు రాసుకునే కథలు, రెండు మూడేళ్ళకైనా పనికొస్తాయి. సినిమా అనేది ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో మారిపోయే బిజెనెస్. ఈ బిజినెస్ లో పాత్రల్ని అమ్మగల్గాలే గానీ కేవలం కథల్ని కాదు.

        12. మాటలు పాత్రల నోటి నుంచి రావాలి. ముద్ద చేసి పాత్రల నోట్లో పెట్టడం కాదు. పాత్రలు సృష్టించుకునే కథని పాత్రలే అనుభవిస్తాయి. వాటి మాటలు కథ గురించే వుంటాయి. పాత్రలనుభవిస్తున్న కథ లోంచే మాటలు వస్తాయి. ఏ మాట చెప్పినా అది కథతోనే రిలేటెడ్ గా వుంటుంది. ఈ సైన్సు కోసం  దేర్ విల్ బి బ్లడ్ చూడొచ్చు.


సికిందర్