రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, జనవరి 2020, శుక్రవారం

904 : నిర్మాతల స్పెషల్


       రెండేళ్ళ క్రితం కోలీవుడ్ లో ప్రధానమైన మార్పు వచ్చింది. కోలీవుడ్ అంటే చెన్నైలో తమిళ సినిమా పరిశ్రమ. చెన్నైలోని  కోడంబాక్కంలో ఈ పరిశ్రమ నెలకొంది కాబట్టి కోలీవుడ్ అనే పేరొచ్చింది. ఇక్కడ రెండేళ్ళ క్రితం నుంచి కొన్ని కంపెనీలు మూస పధ్ధతి నుంచి బయటి కొచ్చేశాయి : బిగ్ నేమ్స్ ని కూడేసి సినిమాల విజయాల కోసం ప్రయత్నించే మూస పధ్ధతి. విజయాల కోసం స్టార్ హీరో - స్టార్ డైరెక్టర్ - స్టార్ నిర్మాతల కాంబినేషన్ల మీద ఇంకెంత మాత్రం నమ్మకం పెట్టుకోలేని మార్పు. వైనాట్ స్టూడియోస్, స్టూడియో గ్రీన్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వంటి సంస్థలు ఈ చట్రాన్ని ఛేదించుకుని బయటికొచ్చేశాయి. ఇక సబ్జెక్టుల కూలంకష మూల్యాంకన చేపట్టాయి. స్క్రిప్టులు చదవడానికి, విశ్లేషించడానికి, నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేయడానికీ క్రియేటివ్ టీమ్స్ ని నియమించుకున్నాయి. ఈ టీమ్స్ లో రచయితలుండడం లేదు, స్క్రిప్ట్ డాక్టర్సే వుంటున్నారు. కాంబినేషన్స్ తో చాలా సినిమాలు బోల్తా కొట్టడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఏర్పడింది. ఇంతలో తాము తీసిన కొన్ని విజయవంతమైన చిన్న సినిమాల ప్రభావంతో - విపరీతంగా స్క్రిప్టులు వచ్చి పడడంతో - సినిమాలు తీయడానికి ప్రత్యామ్నాయ మార్గం ఇలా తట్టింది...

        నిర్మాతలు శశి కాంత్ (వై నాట్ స్టూడియోస్), ప్రభు (డ్రీమ్ వారియర్ పిక్చర్స్) ఇద్దరూ స్క్రిప్టుల కూలంకష విశ్లేషణ తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న నిర్ణయానికొచ్చేశారు. పేరున్న దర్శకుడు వచ్చినా సరే, ఇదే ప్రక్రియ. కేవలం ఒక దర్శకుడు రెండు గంటలు కథ చెప్పినంత మాత్రాన వినేసిన నిర్మాత కోట్లాది రూపాయలు గుమ్మరించడం అవివేకమని తెలుసుకున్నారు. నిర్మాత శశికాంత్ ఇక స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని తెలుసుకోవడం ప్రారంభించారు. స్క్రీన్ ప్లే వర్క్ షాపులకి హాజరవుతూ వున్నాక, నిర్మాత క్రియేటివ్ గా  కూడా ఇన్వాల్వ్ అవడం ఎంత అవసరమో గుర్తించారు. ఏవీఎం లాంటి పెద్ద సంస్థల శైలిని తెలుసుకున్నారు. ఆ సంస్థల అధినేతలు మొదట రచయితలతో కలిసి కూర్చుని కథ తయారు చేసుకుని, దాని ప్రకారం దర్శకుడు, హీరో, ఇతర తారాగణం వగైరా ఎవరైతే బావుంటారో నిర్ణయించే వాళ్ళు. అవి నిర్మాతల రోజులు. ఇప్పుడు నిర్మాతల రోజులు బాగాలేవు, వాళ్ళు జీ హుజూర్లు. 

        స్క్రీన్ ప్లే క్లాసులకి హాజరయ్యాక స్క్రిప్టు ఎంత ఇంపార్టెంటో తెలిసింది. దాంతో ఇన్ హౌస్ స్టోరీ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో టీముతో కృషి చేస్తూంటే, ఐడియాల్ని పొదిగి పిండ దశ నుంచీ అంచెలంచెలుగా ఎలా అభివృద్ధి చేస్తూ కథలుగా మార్చవచ్చో తెలిసింది. తమ సంస్థలతో పనిచేయాలనుకునే దర్శకులైనా, రచయితలైనా గిరిగీసుకుని వుండకూడదనే నియమం. సొంత ఐడియాల్ని అభివృద్ధి చేసుకోవడమే గాక, తమకందే పూర్తి స్థాయి స్క్రిప్టుల పరిశీలన కూడా ఒక సెక్షన్. వైనాట్ స్టూడియోస్ బ్యానర్లో ధనుష్ హీరోగా సుబ్బరాజ్  దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘సురులి’ ఐడియాని, సుబ్బరాజ్ తో కలిసి తామే డెవలప్ చేశారు.

        డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాత ప్రభు ఈ కొత్త పంథా ననుసరించే కార్తీతో ‘ఖైదీ’ తీసి సూపర్ హిట్ చేసుకున్నారు. తమ రచయితల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళడం ఒక సమస్యగా వుందన్న విషయం ప్రభు గ్రహించారు. నేటి సినిమా రచయితలకి ఒక క్రియేటివ్ మార్గ దర్శనం గానీ, వేదిక గానీ లేకపోవడం కారణం. వాళ్ళకి ఆర్ధిక ఆలంబన కూడా లేదు. ఐడియాల్ని పంచుకోవడానికి, రాయడం నేర్చుకోవడానికీ వేదికలు లేవు. విపరీతమైన అభద్రతా భావం ఇంకోవైపు. సినిమా రచనని కూడా ఒక క్రాఫ్ట్ గా పరిశ్రమ గుర్తిస్తే తప్ప ఈ సమస్యలన్నీ తొలగవని ప్రభు అభిప్రాయం. తమ దగ్గరికి వచ్చే స్క్రిప్టుల్లో కథా కథనాలు దాదాపు యాభై శాతం మార్పు చేర్పులకి లోనవుతాయి. ఐడియాలు మాత్రం అవే వుంటాయి.

        నిర్మాతకి స్క్రీన్ ప్లే నాలెడ్జి వుంటే తమకి అదెంతో ప్రయోజనకరంగా వుంటుందని పుష్కర్ లాంటి దర్శకులు కూడా అభిప్రాయ పడుతున్నారు. నాలెడ్జి వున్న వాళ్ళ ఆర్గ్యుమెంట్ కీ, నాలెడ్జి లేని వాళ్ళ ఆర్గ్యుమెంట్ కీ తేడా వుండడమే ఆ ప్రయోజనం. 

          తెలుగులో ఇంకా ఈ మెట్టు ఎక్కలేదు. నిర్మాతలకే కాకుండా మరెవ్వరికీ నాలెడ్జి అంత ముఖ్యమన్పించడం లేదు.

సికిందర్