రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, August 15, 2016

నాటి సినిమా!






 సినిమా అనే మూడక్షరాల కళని మించిన కనికట్టేది? కథానాయకుణ్ణి  కమెడియన్ గా చూసి వున్న కళ్ళతో ట్రాజడీని చూస్తే సినిమా సాంతం కొత్తదనమే. కథలు అవే వున్నప్పుడు పాత్రధారి రివర్స్ ఇమేజితో దర్శన మిస్తే కథల  మొనాటనీ వెళ్లి మూసీలో కలిసిపోవాల్సిందే- ఉన్న కాసిని కథలతో పండించుకున్నన్ని కాంబినేషన్లు గనుక మనకుంటే!

        కానీ ‘ఈ తరం ఫిలిమ్స్’ అధినేత పోకూరి బాబూ రావు కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ తో సీరియస్ సినిమా అనుకున్నప్పుడు, ఆయనకి  పై బాక్సాఫీసు మంత్రాలేవీ మెదల్లేదు. సామాజిక దుస్థితిని ఎండగట్టే ఆయన తృష్ణకి ఏ కమర్షియల్ అవసరాలూ ముఖ్యమని తోచలేదు. కళ ఎప్పుడూ పాపులారిటీ కోసం ప్రాకులాడకూడదని అన్నాడు ఆస్కార్ వైల్డ్. అలాటి కళే కలకాలం నిల్చి వుంటుంది. కనుక తన రచయితలతో కలిసి బాబూరావు తయారు చేసుకున్న నంది అవార్డు లభించబోయే పాత్రకి ప్రత్యేకించి రాజేంద్ర ప్రసాద్ ని అనుకోవడానికి, సింపుల్ గా ‘సగటు మనిషి’ లో రాజేంద్ర ప్రసాద్ కమెడియన్ గా కన్పించక పోవడమే స్ఫూర్తి. రాజేంద్ర ప్రసాద్ ని కమెడియన్ గానే ముద్రవేశారు గానీ, ఆయనలో విభిన్న కోణాల విలక్షణ నటుడు దాగి వున్నాడని ఎవరూ సరిగ్గా గుర్తించలేదు. అందుకని బాబూరావు ఆయన్ని పిలిపించుకుని ‘ఎర్రమందారం’ కథ విన్పించారు. వినిపిస్తే రాజేంద్ర ప్రసాద్ వినేసి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఏమిటిలా వెళ్ళిపోయాడు? చేస్తాడా, చెయ్యడా చెప్పడే? కథ నచ్చలేదా?  నచ్చకపోతే చెప్పేసి వెళ్లి పోవచ్చుగా? ... లాంటి రకరకాల సందేహాలతో బాబూరావుంటే, గంట తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి- ‘పదే పదే అదే గుర్తు కొస్తోంది...చాలా ఫీలవుతున్నాను... ఆ క్యారక్టర్ నేను చేస్తాను...దానికిలా సమ్మర్ కటింగ్ చేయించుకుని,  ఇలా డ్రెస్ చేసుకుంటాను... ఇలా మాట్లాడతాను...’  అని చెప్పేస్తూ పాత్రలో కెళ్ళి పోయి దాన్ని తనదిగా చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. 

        చాప్లిన్ టు చలం నవ్వించి ఏడ్పించారు. . అది సేఫ్ బెట్. కానీ  దీన్ని కూడా త్రోసి రాజని రాజేంద్ర ప్రసాద్ నవ్వుని కాసేపు పక్కన పెట్టేసి, మొత్తంగా ఏడ్పించే రిస్కు తీసుకున్నారు సాహసోపేతంగా. కథలో సినిమా బండి రాముడుగా ప్రవేశించి, ఊరి దొర చేతిలో కీలుబొమ్మయ్యే దళిత సర్పంచ్ గా స్థిర పడి, తిరగబడి, చివరికి చచ్చి పోతాడు. పంచాయితీ రాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ల ప్రహసనానికి ఈ పాత్ర, ఈ సినిమా మచ్చు తునకలు.

      ట్రాజడీల్లో పాత్రల మనస్తత్వాల పైన ముగింపులు  ఆధార పడతాయి. ‘మనుషులు మారాలి’ లో శోభన్ బాబు పాత్ర మరణం, శారద పాత్ర మానసిక స్థితి వల్ల  మరో విషాదాంతానికి దారి తీస్తుంది.  అదే ‘ఎర్రమందారం’ లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర మరణం,  యమున  పాత్ర మానసిక బలం వల్ల  విజయానికి దారితీస్తుంది. వైఫల్య సాఫల్యాలు రెండూ వాటి నేపధ్య బలాలతో సినిమా విజయానికి తోడ్పడతాయి. చాలినంత నేపధ్య బలం లేకపోతే  ఏ సినిమాలూ నిలబడలేని ముగింపులు ఎదురవుతాయి. 

        ‘ఎర్రమందారం’ లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర మరణానికి ముందే చాలినంత  నేపధ్య బలం కల్పించారు. ఇందులో ఊరి దొర  నడిపే సినిమా టాకీసుకి, సినిమా బండిని తిప్పే చదువురాని బడుగు జీవి ‘రాముడు’ గా ఉంటాడు ది మల్టీ డైమెన్షనల్ రాజేంద్ర ప్రసాద్. ఈ జగ్గన్న అనే దొర  (దేవ రాజ్) కరుడు గట్టిన ఫ్యూడలిస్టు. ఇటు ప్రజల్నీ, అటు ప్రభుత్వాన్నీ దోచి పారేస్తూ దర్జాగా ఉంటాడు. ఇతను  ప్రవచించే సమన్యాయం ఐడియాలజీ తన స్వార్ధం కోసమే. తను బడుగుల వ్యతిరేకి కాదని తెలిసేందుకు గుళ్ళో దొంగతనానికి పాల్పడ్డ పండిత పూజారి మెడలో చెప్పుల దండ వేయించి,  గాడిద మీద ఊరేగించే ఘనకార్యం కూడా చేస్తాడు. 

        ఇలాటి జగ్గన్న దగ్గర ఊడిగం చేస్తున్న రాముడికి లక్ష్మి అనే కోడి పుంజుని  వెంటేసుకు తిరిగే అరుంధతి (యమున) తో సరసాలుంటాయి. ఈ సరసాలు పెళ్ళికి దారి తీసి ఓ ఇంటి వాడయ్యేసరికి, పంచాయితీ ఎన్నికలొస్తాయి. ఈసారి ఈ స్థానాన్ని రిజర్వుడు స్థానంగా ప్రకటించారు. దీంతో చక్కటి బలి మేకలా రెడీగా కన్పిస్తున్న దళితుడైన రిజర్వేషన్  హీరో రాముడిని పిలిచి, ఏక గ్రీవ ఎన్నిక పేరుతో  ఎంచక్కా వధ్యశిల నెక్కించేస్తాడు జగ్గన్న. ఇక సర్పంచ్ స్థానంలో కూర్చున్న వాడి చేత అడ్డంగా సంతకాలు చేయించుకోవడం, అభివృద్ధి నిధులు దండిగా జేబులో వేసుకోవడం లాంటి స్వకార్యాలు చక్క బెట్టుకుంటాడు జగ్గన్న. సర్పంచ్ గా ఎన్నికైన రాముడు వూరి కోసం ఏదో చేస్తాడని జనం ఎదురు చూస్తూంటారు. ఏదీ చెయ్యక పోగా, పాత రిక్షా బండి రాముడి లాగే జగ్గన్నకి దాస్యం చేయవలసి రావడం చూస్తూంటే  తనకే అసహ్యమేసి మీద తిరగబడతాడు రాముడు. దీంతో జగ్గన్న కి వొళ్ళు మండిపోయి రాముణ్ణి హత్య కేసులో ఇరికించేస్తాడు. రాముడు జైలు కెళ్ళి తిరిగొచ్చే నాటికి ఊళ్ళో తెలుగు గంగ ప్రాజెక్టు పేరుతో  భూములు పోతూంటాయి. ఈ భూముల వ్యవహారం  ఆరా తీస్తే ఏముంది- అవన్నీ తన లాంటి బడుగుల పేర పట్టాలు చేయించుకుని బినామీగా జగ్గన్న దొర అనుభవిస్తున్నవే. దీంతో మళ్ళీ తిరగబడ్డ రాముడికి మరణమే మిగుల్తుంది. 

        ఇక్కడ జగ్గన్న మరో నాటక మాడతాడు. ఆ శవం రాముడిది  కాదనీ, తన ఈరి గాడిదనీ, ఆ ఈరిగాణ్ణి రాముడే చంపి పారిపోయానీ పంచనామాలో రాయిస్తాడు. ఈ అక్రమాన్ని కళ్ళారా చూసిన రాముడి భార్య అరుంధతి-  ఆ పంచనామా మీద సంతకం పెట్టేస్తుంది. ఇక కొడుకుని వెంటేసుకుని తన రహస్య ఎజెండా  అమలు పరుస్తుంది. ఈ క్రమంలో దొరకి తను ఉంపుడుగత్తె అయ్యిందన్న పుకార్లు లేచినా లెక్క చెయ్యదు.  దాష్టీకపు దొర జగ్గన్నని ఊరించి ఊరించీ.... చివరికి వూరి చివర అతడి బంగళాకే రప్పించి- కొడుకు అందించిన ఆయుధంతో కస్సక్ మన్పిస్తుంది. 

        సంచలనం! అరుంధతి దొరని చంపి పారేసింది! ....ఈ సంచలనం మధ్య ఇంకో షాకి స్తుంది అరుంధతి పోలీసులకి- పారిపోయిన తన భర్త రాముడే వచ్చి దొరని చంపేశాడని!  ఏ మాటలతో తనని మభ్య పెట్టారో-  అలాటి మాటలే పోలీసుల నోట్లో కుక్కి వెళ్ళిపోతుంది ఎర్ర మందారమై. 

        ఇందులో స్క్రీన్ ప్లే పరిభాషలో చెప్పుకోవాలంటే, యమునది డెడ్ హ్యాండ్- ఆఫ్ పాత్ర. కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్ర తాత్కాలికంగా కనుమరుగై, దాని ఆశయ సాధన కోసం ఇంకో పాత్ర కథని కొంతవరకు ముందుకు నడిపించి, తిరిగి ఆ ప్రధాన పాత్ర ప్రవేశించగానే ఆ ఆశయాన్ని లేదా  విజయ పతాకాన్ని ప్రధాన పాత్రకి అప్పగించి తప్పుకుంటుంది. ఇది హ్యాండ్ - ఆఫ్ పాత్ర.  ఇలాకాక ప్రధాన పాత్రే మధ్యలో మరణిస్తే, చివరంటా దాని ఆశయాన్ని ముందుకు నడిపించే డెడ్ హ్యాండ్-  ఆఫ్ పాత్ర యమున పోషించిన పాత్ర లాంటిది. ఇంతకీ ఈ కథ ఏ పాత్ర కథ అన్న  ప్రశ్న వస్తే, బాబూరావే చెప్పినట్టు- ఏ పాత్రదీ కాదు,  అదొక కథ అంతే! 

        ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఈ సినిమా నడక ఆర్ట్ ఫిలిం కి దగ్గరగా వుంటుంది. సినిమాకి లాభం  రాకపోయినా నష్టం రాలేదు. అయితే రాజేంద్ర ప్రసాద్ కి ఆ సంవత్సర (1991) ఉత్తమ నటుడిగా సినిమాకి ఉత్తమ కథ చిత్రంగా, జాలాదికి ఉత్తమ గేయ రచయితగా, దేవ రాజ్ కి ఉత్తమ విలన్ గా, గౌతమ్ రాజుకి ఉత్తమ ఎడిటర్ గా ...ఇన్ని నంది అవార్డు లొచ్చాయి... దీంతో సినిమా పట్ల క్రేజ్  పెరిగి వీడియో క్యాసెట్లు  బాగా అమ్ముడు పోయాయి.

        ఇందులో కొడుకు పాత్ర పోషించిన కిరణ్  బాబూరావు సోదరుడి కుమారుడే. ఈయన ప్రస్తుతం అమెరికాలో డాక్టర్. చైల్డ్ ఆర్టిస్టుగా ఈయన నటన ఒక ఆశ్చర్యం గొలిపే సంఘటన. చక్రవర్తి స్వరపరచిన పాటల్లో జాలాది రాసిన గీతం గురించి చిన్న నేపధ్యం చెప్పారు బాబూరావు. ‘ఎర్రమందారం’ తీయడానికి పూర్వం ఎప్పుడో జాలాది బాబూరావు దగ్గరికి వచ్చి- ‘కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే మొయ్యాల’ అని పల్లవి విన్పించే సరికి, కదిలిపోయిన బాబూరావు దాన్ని మరెవ్వరికీ ఇవ్వకుండా అట్టి పెట్టుకున్నారు. ‘ఎర్రమందారం’  తీస్తున్నప్పుడు ఆ  పల్లవికి తగ్గట్టు సన్నివేశాన్ని చాలా యాతన పడి సృష్టించి-  మిగతా చరణాలు రాయించేశారు జాలాది చేత! దీనికే నంది అవార్డు వచ్చింది...

స్క్రిప్టు వెనుక క్రాఫ్టు 
       ‘ఎర్ర మందారం’ స్క్రిప్టు ఎలా తయారయ్యింది? ఇటీవల  ‘యజ్ఞం’, ‘రణం’, ‘ఒంటరి’ లాంటి భారీ సినిమాలు నిర్మించిన పోకూరి బాబూరావు అప్పట్లో ‘నేటిభారతం’, ‘రేపటి పౌరులు’, ‘దేశంలో దొంగలు పడ్డారు’ వంటి హిట్స్ కూడా నిర్మించి వున్నారు. ఒకరోజు ‘ఆంధ్ర జ్యోతి’  దీపావళి ప్రత్యేక సంచికలో ఎంవిఎస్ హరనాథ రావు రాసిన ‘ లేడి చంపిన పులి నెత్తురు’ కథ చదివి ఇన్స్ పైర్ అయ్యారు బాబూరావు. 

        దీన్ని సినిమాగా తీద్దామంటే, దీనికి  సరిపడా సినిమా లక్షణాల్లేవని తోసిపుచ్చారు హరనాథ రావే. బాబూరావు పట్టుబట్టడంతో ఇక తప్పదనుకుని ఆయనతో కలిసి కూర్చుని ఒక ఔట్  లైన్ తయారు చేశారు హరనాథ రావు. అది బాబూరావుకు నచ్చింది. కానీ హరనాథ రావుకి సంతృప్తి కలగలేదు. కథలో లైఫ్ మిస్ అయినట్టు వుందని, డాక్యుమెంటరీలా ఉందనీ చెప్పి ఇంకో పది  రోజులు టైం తీసుకున్నారు. అప్పుడొచ్చి పూర్తిగా మార్చేసిన కొత్త ఔట్ లైన్ విన్పించారు. 

        ఇంతకీ పత్రికలో వచ్చిన అసలు ఒరిజినల్ కథేమిటి? ఊరి దొర చేతిలో భర్తని పోగొట్టుకున్న పడతి, ఆ దొర మీద పగదీర్చుకోవడం అచ్చులో వచ్చిన  స్టోరీ లైన్. ఇందులో పూర్వం జరిగిన భర్త హత్య గురించి రేఖా మాత్రమైన ప్రస్తావనే తప్ప, కథగా వుండదు. పూర్తి కథ ఆమె పరంగా నడిచేదే. దళితవాడ నుంచి పెట్రేగిన స్త్రీ కథ. కథలో దొర ఆమెని అనుభవిస్తాడు కూడా. కొడుకు ఆమెకి సాయంగా వున్నా, దొర హత్యలో పాలుపంచుకోడు.  

        ఈ చిన్న కథని సినిమాకి తీసుకునే సరికి భర్త పాత్రని పెంచుతూ  రిజర్వేషన్ల అంశం జోడించి, దొర చేతిలో అతను హతమయ్యేందుకు అవసరమైన నేపధ్య బలమంతా కల్పించారు. కథానాయికని దొర అనుభవించే ఘట్టం తొలగించి, సినిమా కాబట్టి హీరోయిన్ పాత్ర పావిత్ర్యాన్ని కాపాడుతూ, అదే సమయంలో కొడుకు పాత్రని దొర హత్య కి తగు విధంగా యాక్టివేట్ చేశారు. ఇలా మారిపోయిన కొత్త  ఔట్ లైన్ బాబూరావుకి ఇంకా బాగా నచ్చి, మరో రచయిత సంజీవితో సీనిక్ ఆర్డర్,  ట్రీట్ మెంట్ వగైరా కానిచ్చారు. ఫైనల్ గా హరనాథ రావు డైలాగ్ వెర్షన్ రాశారు. ఇందులో ఆయన సోదరుడు, రచయిత మరుధూరి రాజా స్వల్ప పాత్ర పోషించారు. స్క్రీన్ ప్లే క్రెడిట్ బాబు రావు – సంజీవీలు తీసుకుంటే, కథ -మాటలు హరనాథ రావు వేసుకున్నారు. 

        ఈ స్క్రిప్టు దర్శకుడు ముత్యాల సుబ్బారావు చేతిలో ఎలా తెరకెక్కిందంటే, ఆయన లెఫ్ట్ కి ఎక్కువ ప్రాధాన్య మిచ్చినట్టు కన్పిస్తుంది. ముఖ్యంగా  రాత్రి పూట లాంతరు పట్టుకుని భర్త కోసం యమున వెతికే దృశ్యాల్లోని  మైన్యూట్ డిటైల్స్ అన్నీ, అచ్చం స్క్రీన్ ప్లేలో రాసిన వర్ణనలతోనే  చిత్రీకరించడంతో, అదంతా ఒక సినిమా చూస్తున్నట్టు వుండదు, సినిమాని చదువుతున్నట్టు వుంటుంది. అదీ సుబ్బయ్య టాలెంట్. దీనికి ఆర్. రామారావు కెమెరా వర్క్ క్లాసిక్ టచ్. 

        సాధారణంగా సినిమాల్లో విలన్ ఎంట్రీ ని కన్పించగానే,  ప్రత్యక్షంగా అక్కడికక్కడే ఏదో దారుణానికి పాల్పడ్డంతో  చూపిస్తూంటారు.  కానీ  ‘ఎర్ర మందారం’ స్క్రీన్ ప్లేలో విలన్ అయిన దొరని చూపించకుండానే అనుచరుల చేత అతడి దాష్టీకాన్ని చూపిస్తూ- చెప్పుల దండతో  గుడి పూజారిని ఊరేగించే దృశ్యంతో –ఇలాటి కర్కోటకుడు విలన్ అని పరోక్షంగా తెలియజేయడం  ఎంతో రిలీఫ్ నిస్తుంది రొటీన్ మూస నుంచి! విలన్ పాత్ర పరిచయం ఇలా ఎంత హాయిగా అన్పించిందో బాబూ రావుకి చెపితే, ఆయన కూడా హాయిగా చిరునవ్వుతో చూశారు.


-సికిందర్
(ఆగస్టు 2010-  ‘సాక్షి’)