రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, ఏప్రిల్ 2016, శనివారం

స్పెషల్ ఆర్టికల్ :

త సంవత్సరం హిట్టయిన చిన్నా పెద్దా సినిమాలు ఎందుకు హిట్టయ్యాయో ఇదివరకు కొన్నిసార్లు చెప్పుకున్నాం. కేవలం ఏ జానర్ ప్రధానంగా ఆ సినిమాలు తీశారో తూచా తప్పకుండా ఆ జానర్స్ ని కలుషితం చేయకుండా, వాటి మర్యాదని కాపాడుతూ తీసిన సినిమాలే హిట్టయ్యాయి. అంటే ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతిని మార్చుకున్నారా?
ఎలాటి నాన్సెన్స్ నీ అంగీకరించడం  లేదా? కథ ఏదైనా  దాన్ని స్వచ్ఛంగా, సరళంగా, అర్ధవంతంగా చూపించాలని కోరుకుంటున్నారా? ఏమో చెప్పలేం గానీ, అలాటి సినిమాలే 
హిట్టయ్యాయి...ఈ నేపధ్యంలో ఈ జానర్ మర్యాద అంటే ఏమిటో, దాన్నెలాకాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం


      జానర్ అంటే కేటగిరీ, వెరైటీ, తరహా, జాతి, గ్రూపు, టైపు, మోడల్...ఇలా అనేక పర్యాయ పదాలున్నాయి. జానర్ అనే మాట ఎందుకు అవసరమైందంటే సినిమాల్ని గుర్తు పట్టడానికే.  మీదే జానర్ సినిమా అంటే యాక్షన్ అనో, లవ్ అనో, ఫ్యామిలీ అనో చెప్పొచ్చు.  జానర్ గురించి ఇంకా బాగా అర్ధమవాలంటే,  మీదే జానర్ సినిమా అని అడిగారంటే, ఏ రస ప్రధానమైన సినిమా అని అడిగినట్టే - హాస్య రస ప్రధానమా, భక్తి  రసప్రధానమా అని! ఇలా సినిమాల్ని  వివిధ జానర్లుగా గుర్తిస్తున్నారు. పైన చెప్పుకున్న యాక్షన్, లవ్, ఫ్యామిలీ లతో బాటు, కామెడీ, క్రైం, హార్రర్, ట్రాజెడీ, డ్రామా, అడ్వెంచర్, స్పోర్ట్స్ , హిస్టారికల్, బయోపిక్, మ్యూజికల్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, వార్, కౌబాయ్..ఇంకా జానపద, పౌరాణిక, భక్తి, ఉద్యమ, విప్లవ, దేశభక్తి, రాజకీయ, సామాజిక, ప్రయోగాత్మక, బాలల ...చెప్పుకుంటే పోతే ఎన్నో. మళ్ళీ వీటిలో కొన్నిటికి సబ్ జానర్లు కూడా వున్నాయి. ఈ సబ్ జానర్లు వందల్లో వుంటాయి. ఎప్పటికప్పుడు కొత్తకొత్తవి చేరుతూనే వుంటాయి. 

        యాక్షన్ జానర్ కి  సబ్ జానర్లు గా  యాక్షన్ కామెడీ, థ్రిల్లర్, ఫ్యాక్షన్, టెర్రరిజం, మార్షల్ ఆర్ట్స్, ఎపిక్, స్పై, డిజాస్టర్, సూపర్ హీరో..ఇంకెన్నో  వున్నాయి. క్రైం జానర్ లో  డిటెక్టివ్, గ్యాంగ్ స్టర్, మాఫియా, రోడ్ మూవీ, రేప్ రివెంజి, లీగల్ థ్రిల్లర్స్, కోర్ట్ రూమ్ డ్రామాలు మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్..ఇంకా మరెన్నో సబ్ జానర్లుగా వున్నాయి. అలాగే లవ్ జానర్లో రోమాంటిక్ డ్రామా, రోమాంటిక్ కామెడీ, రోమాంటిక్ థ్రిల్లర్, చిక్ ఫ్లిక్స్ లాంటివి అనేకం  సబ్ జానర్లుగా వున్నాయి. హారర్ర్ జానర్ కి ఘోస్ట్ హార్రర్, హార్రర్ కామెడీ, పారానార్మల్, జాంబీ, క్షుద్ర శక్తులు, చేతబడి లాంటివెన్నో వున్నాయి...       తెలుగులో ఇప్పుడు ఎక్కువగా చెలామణి లో వుంటున్నవి  యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, లవ్, హార్రర్, అడ్వెంచర్, టెర్రర్, ప్రయోగాత్మకాలతో బాటు మాస్....పక్కా మాస్ అనే లోకల్ జానర్ సినిమాలు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే కేవలం ఏదో ఒక జానర్ మీద ఆధారపడి  సినిమాలు తీయడం అరుదు. రెండు మూడు జానర్ లు కలిపి హైబ్రిడ్ గా తీసే సినిమాలే ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువగా వుంటున్నాయి. తెలుగులో యాక్షన్ తీస్తే, అందులో కామెడీ, ఫ్యామిలీ కూడా కలప వచ్చు – తప్పని తద్దినం  మాస్ అనే పదార్ధాన్ని కూడా అందులో ఎటూ కలపాల్సిందే. హార్రర్ తీస్తే దాన్ని కామెడీతో కలిపి ఇప్పుడు హార్రర్ కామెడీ గా తీయాల్సిందే. లవ్ తీస్తే దాంట్లో కామెడీ కలిపి రోమాంటిక్ కామెడీగా, లేదా డ్రామా కలిపి రోమాంటిక్ డ్రామాగా, థ్రిల్లర్ కలిపి రోమాంటిక్ థ్రిల్లర్ గా తీస్తున్నారు.

        ఈ కలపడంలో ఎక్కువ తక్కువల దగ్గరే తేడా వస్తోంది. రెండు మూడు జానర్ లు కలిపినప్పుడు వాటిలో ఒకటే మెయిన్ జానర్ గా వుంటుంది, వుండాలి కూడా. మిగిలినవి పక్క వాద్యాలుగా వుండాలి. ఒకవేళ పక్క వాద్యాలలో ఒకటి లేదా రెండూ కలిసి  మెయిన్ జానర్ గా మారిపోయి,  మెయిన్ జానర్ ని పక్కకి తోసేస్తే ఏం జరుగుతుంది? అది జానర్ మర్యాదని కాపాడని సినిమాగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. మైక్రోఫోన్ ముందు నుంచి మెయిన్ సింగర్ని తోసేసి కోరస్ పాడేవాళ్ళు పాటెత్తుకుంటే ఎలావుంటుందో,అలావుంటుంది
మెయిన్ జానర్ తో డ్రెయిన్ (సైడుకాల్వ) జానర్ల  పెత్తనం.


         తాజాగా ఈ ఏప్రెల్ 29 న విడుదలైన ‘రాజా చెయ్యి వేస్తే’ కూడా ఇంతే. డ్రైనేజీ జానర్ల దెబ్బకి మెయిన్ జానర్ మూసీ నదిలా పారింది. సినిమా తీసే దర్శకుడు అసలు సినిమా లెందుకు ఫ్లాపవుతున్నాయో వేయి కళ్ళతో గమనిస్తూ, పరిశీలిస్తూ ఉండడమనే  మార్కెట్ మూల్యాంకన చేసుకునే ఓపిక వుంటే  తప్ప, తనూ ఇంకో అలాటి ఫ్లాప్ ఇవ్వకుండా ముందు జాగ్రత్త పడలేడు. ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారిపోతున్నాయి. తీసిన సినిమా ఎందుకు ఫ్లాపయయిందో అర్ధం కానంతగా కొత్త కొత్త కారణాలు వచ్చి చేరుతున్నాయి. గత సంవత్సరం కల్తీ లేని జానర్లకే పట్టం గట్టి నట్టే, సింగిల్ స్క్రీన్ సినిమా కథలకే ఓటేశారు ప్రేక్షుకులు. అంటే జానర్ల పరిరక్షణతో బాటు, సింగిల్ స్క్రీన్ కథలు- మల్టీప్లెక్స్ కథలు అనే తేడా కూడా దర్శకులు గుర్తించాల్సిన అగత్యం ఏర్పడిందన్నమాట!

        పెద్ద,  మధ్య తరహా సినిమాలు విడుదల అవుతాయి. చాలా కొన్నే హిట్టవుతాయి. వీటికి రెట్టింపు సంఖ్యలో చిన్న చిన్న సినిమాలు  విడుదల అవుతాయి. అన్నీ ఫ్లాపవుతాయి. ఇది ఆన్ స్క్రీన్ దృశ్యం. కానీ చిన్న సినిమాలు ఎన్ని విడుదలై ఫ్లావుతాయో, అన్నేసి  అసలే విడుదల కాకుండా బుట్ట దాఖలై పోతున్నాయన్న వాస్తవం కూడా గమనించాలి. ఇది ఆఫ్ స్క్రీన్ గా కన్పించే సీను. చిన్నా చితకా సినిమాలు నిర్మాణ రంగంలోనే తప్ప, ప్రదర్శనా రంగంలో ఎవ్వరికీ నయా పైసా  అందించని మొండి ఘటాలైపోయాయి. ఇవి తీసినా  ఒకటే తీయకపోయినా ఒకటే అన్నట్టు తయారయ్యింది పరిస్థితి.          గత సంవత్సరం జయాపజయాల్ని ఆయా  సినిమాల జానర్ మర్యాద కిచ్చిన ప్రాధాన్యమే నిర్ణయించింది. అంటే జానర్ మర్యాద పాటించిన సినిమాలనే తమకి తెలీకుండానే  ఎక్కువ చూశారు ప్రేక్షకులు. ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్దాం... 2015 లో మొత్తం చిన్నా పెద్దా తెలుగు స్ట్రెయిట్ సినిమాలు 88 విడుదలయ్యాయి.  డబ్బింగ్ సినిమాలు 39 విడుదలయ్యాయి. మొత్తం కలిపి విడుదలైన  సినిమాల సంఖ్య  127. విడుదలైన 88 స్ట్రెయిట్ చిత్రాల్లో పెద్ద సినిమాలు 10 వుంటే, మధ్య తరహా 36, చిన్నవి 42 వున్నాయి. పెద్ద సినిమాలు పదింటిలో 5 విజయం సాధించగా, మధ్యతరహా 36 లో 9, 42 చిన్న సినిమాల్లో 2 సక్సెస్ మాత్రమే అయ్యాయి. మొత్తం  88 లో 16 హిట్టయ్యాయి. ఈ పదహారూ జానర్ మర్యాదని కాపాడుకున్నవే.

        పెద్ద సినిమాల్లో  శ్రీమంతుడు, గోపాల గోపాల, టెంపర్, బాహుబలి, రుద్రమదేవి, లయన్, బ్రూస్ లీ, సన్నాఫ్ సత్యమూర్తి, కిక్-2, బెంగాల్ టైగర్ అనే  10 వుండగా,  శ్రీమంతుడు, గోపాల గోపాల, బాహుబలి, రుద్రమ దేవి, టెంపర్ –ఈ ఐదు  మాత్రమే హిట్టయ్యాయి.

        హిట్టయిన శ్రీమంతుడు జానర్ మర్యాద ఎలా కాపాడుకుందో చూద్దాం. ఇది ఫ్యామిలీ –యాక్షన్ రెండు సజాతి జానర్ల కలబోత కాగా, దీంట్లోకి మళ్ళీ పక్కా మాస్ ని చొరబెట్టలేదు.  అలాగే పెద్ద సినిమాల్లో అదేపనిగా వస్తున్న ‘సెకండాఫ్ లో విలన్ ఇంట్లో హీరో చేరుట మరియు బ్రహ్మానందంతో  కన్ఫ్యూజ్ కామెడీ చేయుట అవశ్యము’  అనే సింగిల్ విండో స్కీములోకి కథని తోసెయ్యకుండా ఆ రెండు యాక్షన్- ఫ్యామిలీ జానర్లనే కాపాడుకుంటూ కథ నడిపారు. ఇందులో మహేష్ బాబు పాత్ర పూర్తి డొల్లగా వుంటుంది. ఈ సూక్ష్మం ప్రేక్షకులు తెలుసుకోవడం కష్టం. వాళ్లకి డిస్టర్బెన్స్ లేకుండా రెండు జానర్లతో ‘అర్ధమయ్యేలా’ కథ నడిపించారు.         ‘గోపాల గోపాల’ నాస్తికుడికీ, దేవుళ్ళ పేర్లతో దందాలు చేసే ఆస్తికులకీ మధ్య సంఘర్షణగా  ప్రయోగాత్మకంగా తీశారు. ప్రయోగాత్మకంలో మాస్- కామెడీ ల వంటి విజాతి జానర్ లని  చొరబెడితే  చాలా అనాగరికంగా  వుంటుంది  కాబట్టి ఆ జాగ్రత్త పడ్డారు. ఈ కథలో కూడా పెద్ద లోపముంది- తన వ్యాపారం మీద పిడుగుపడి నష్ట పోయినందుకుగాను, ఆ నష్ట పరిహారం దేవుడు చెల్లించాలని దేవుడి మీద కేసు వేస్తాడు నాస్తికుడైన హీరో. కానీ ఇలాటి వాటికి ప్రకృతి  వైపరీత్యాల ఖాతాలో నష్ట పరిహారం ఇస్తూనే వుంటాయి  ప్రభుత్వాలు.  ఈ సూక్షం కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు. పట్టించుకున్నా క్షమించేయ గలరేమో  జానర్ మర్యాద దృష్ట్యా.

       
‘టెంపర్’ని  సామాజిక జానర్లో తీశారు. రేప్ అనే సామాజిక సమస్యతో సినిమాటిక్ పరిష్కారంకోసం ప్రయత్నించారు. ఇందులో దాదాపు సగం సినిమా మాస్ ఎలిమెంట్స్ తో గడిచిపోతుంది. సామాజికం - మాస్ సజాతి జానర్లే  కాబట్టి చెల్లిపోయింది. కథా పరంగా ఇందులో లక్ష తప్పులున్నా పట్టించుకోలేదు ప్రేక్షకులు. 

       
మూడు మాత్రమే జానర్ల పాలన సరిగ్గా వుండి హిట్టయిన పెద్ద స్టార్ల రెగ్యులర్ సినిమాలు. బాహుబలి, రుద్రమ దేవిల్లాంటి ఫాంటసీ, చారిత్రక సినిమాల్ని కూడా రెగ్యులర్ సినిమాలకి లాగే వాటి జానర్ మర్యాదని చూసి సక్సెస్ చేశారు ప్రేక్షకులు. వీటిలో కథల్లో  ఇమడని మాస్, కామెడీ లాంటి జానర్లని తెచ్చి కలపలేదు. రెండిట్లో మళ్ళీ స్క్రీన్ ప్లే పరంగా  పెద్ద లోపాలు చాలానే వున్నాయి


        ఫ్లాపయిన లయన్, బ్రూస్ లీ, సన్నాఫ్ సత్యమూర్తి, కిక్-2, బెంగాల్ టైగర్ ఐదింటి జానర్లూ మానభంగానికి గురయ్యాయి.  లయన్ ని క్రైం జానర్లో సస్పెన్స్ థ్రిల్లర్ సబ్ జానర్ గా తీశారు. దీంట్లోకి వేరే జానర్లు కలపకపోయినా సస్పెన్స్ థ్రిల్లర్  ఎలిమెంట్స్ నే ప్రవేశపెట్ట లేకపోయారు- ‘రాజా చెయ్యి వేస్తే’ లో  క్రైం ఎలిమెంట్స్ ని కలపలేకపోయినట్టు. కనీసం టెంపో గానీ, స్పీడు గానీ ఉండాలన్నా ఆలోచనే చెయ్యలేదు.

        బ్రూస్ లీ ని ఒక దుష్టుడి బారి నుంచి తన కుటుంబాన్ని- అక్కనీ  కాపాడుకునే ఫ్యామిలీ జానర్లో,  సిస్టర్ సెంటిమెంట్ అనే సబ్ జానర్ గా తీయబోయారు. దీనికి సజాతి యాక్షన్ జానర్ ని కూడా జోడించారు.  ఈ మొత్తాన్నీ మెడబట్టి  సింగిల్ విండో స్కీం లోకి నెట్టేశారు. 

        సన్నాఫ్ సత్యమూర్తి లోనైతే ఓపెనింగ్ లోనే  ఇదొక నరుక్కునే రాక్షసుల కుటుంబ కథ అన్న సీనేశారు. దీంతో మొత్తం ఫ్యామిలీ జానర్ ఖూనీ అయిపోయింది. ఇందులో హీరో పాత్ర తప్పులతడకయినా, కల్తీ జానరే  ప్రాణం తీసింది. యాక్షన్ జానర్ లో కాలం చెల్లిన సబ్ జానర్ ఫ్యాక్షన్ పట్ల విసుగెత్తింది ప్రేక్షకులకి.        కిక్-2 సింపుల్ గా తెలుగులో వర్కౌట్ కాని, యాక్షన్ జానర్ లో ‘ఫారిన్ (పరాయి) ఇష్యూ’  సబ్ జానర్ కిందికొస్తుంది. ఎక్కడో రాజస్థాన్ వాళ్ళ సమస్యలు అక్కర్లేదు తెలుగు ప్రేక్షకులకి. ఇక బెంగాల్ టైగర్ మాస్, యాక్షన్ సజాతి జానర్ల కథలోకి, క్రైం జానర్ ని దింపారు. లాజిక్ ని డిమాండ్ చేసే  క్రైం జానర్ ని, మాస్ యాక్షన్ తో కలపి,  దానికి కూడా లాజిక్ లేకుండా చేయడంతో- మొత్తం మాస్ యాక్షనే సెకండాఫ్ లో డొల్లగా మారింది.

        ఇలా జానర్ మర్యాదని కాపాడుకుని ఐదు పెద్ద సినిమాలని ప్రేక్షకులు హిట్ చేస్తే, కాపాడుకోలేని ఐదు పెద్ద సినిమాల్ని ఫ్లాప్ చేశారు.

(ఇంకా వుంది)
-సికిందర్
http://www.cinemabazaar.in