రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, ఏప్రిల్ 2016, బుధవారం

స్క్రీన్ ప్లే సంగతులు!

క ఉద్యోగానికి బయోడేటా పెట్టుకోవాలన్నా అందులో పరువుపోయే  అంశాలు రాయకుండా  జాగ్రత్త పడతారు. కానీ ఒక హీరో కోసం కథ  రాయాలంటే మాత్రం ఆ హీరో పరువంతా తీసే స్క్రీన్ ప్లే సంగతులు దట్టించి మరీ రాస్తారు. ఈ దర్శకుడు వచ్చి ఉత్త పుణ్యానికి తన పరువంతా తీస్తున్నాడని హీరో కి కూడా తెలుసుకునే పరిజ్ఞానం వుండదు. ఇద్దరు  అజ్ఞానులు కలిసి ఒక విజ్ఞానదాయక సినిమా తీస్తారు. కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి (పాతవాళ్లు చచ్చినా నేర్చుకోరు కాబట్టి) ఆ సినిమా ఒక విజ్ఞాన ఖనిలా ఉపయోగ పడుతుంది. ఆ సినిమాలు ప్రేక్షకుల కోసం కాక,  నేర్చుకునే వాళ్ళకోసం స్కూలు పుస్తకాలుగా ఉపయోగపడతాయి. నూటికి 90 శాతం ఫ్లాపవుతున్న  సినిమాలన్నీ నేర్చుకునే వాళ్ళ ప్రయోజనార్ధమే వ్యయ ప్రయాసల కోర్చి నిర్మిస్తున్నారు. ఇంత సేవ చేస్తూంటే నిందించడం, విమర్శించడం తగునా?