రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, July 25, 2020

960 : రివ్యూ!



దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
సంగీతం : డీఎస్ఆర్, ఛాయాగ్రహణం: జోషి
బ్యానర్: ఆర్జీవీ
వరల్డ్ థియేటర్
విడుదల: జులై 25, 2020

***
        వివాదాలతో, దాడులతో, ట్రైలర్ లీకులతో హైప్ సృష్టించిన ఆర్జీవీ ‘పవర్ స్టార్’ శనివారం ఆర్జీవీ వరల్డ్ థియేటర్ సైట్ లో విడుదలయ్యింది. టికెట్టు ధర 150 రూపాయలు. నిడివి 37 నిమిషాలు. నటీనటులు కొందరు నిజ వ్యక్తుల్ని పోలిన నటులు. వాళ్ళ పేర్లు స్పెల్లింగులు మార్చారు. టైటిల్ పాత్ర పవన్ కళ్యాణ్ ప్రవన్ కళ్యాణ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ పోలికలతో వున్న ఇతను పవన్ బాడీ లాంగ్వేజీని బాగానే అనుకరించాడు. ఇతను తప్ప ఈ వెబ్ మూవీలో ఆసక్తి కల్గించేదేమీ లేదు. 

       చెప్పుకోవడానికి ఇది పేరడీ కాదు, డాక్యూడ్రామా కాదు, అసలు సినిమా కూడా కాదు. ఓ ఆరేడు ఒకదాని కొకటి సంబంధం లేని సీన్లు జోడించి ముగించారు. ఈ ఒక్కో సీన్లో ఒకొక్క ప్రవన్ కళ్యాణ్ సన్నిహితుడు వచ్చి ఓదార్చి వెళ్ళడం వుంటుంది. ఓదార్చి తిట్లు తిని వెళ్ళడం కూడా వుంటుంది. 

        ప్రవన్ కళ్యాణ్ ఎన్నికలు ఓడిపోయిన రాత్రి మొదలవుతుంది ఈ వెబ్ మూవీ. ప్రవన్ కళ్యాణ్ మన సేన పార్టీ ఒకటే స్థానం గెలుస్తుంది. తను పోటీ చేసిన రెండు స్థానాలూ ఓడిపోతాడు. ఈ పరాభవంతో వున్న అతడి దగ్గరికి పెద్దన్న మెగాస్టార్ వచ్చి మందలిస్తాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ వచ్చి సంజాయిషీ ఇచ్చుకుంటాడు. నిర్మాత బండ్ల గణేష్ వచ్చి కొత్త సినిమా ఆఫర్ ఇస్తాడు. జర్నలిస్టు కత్తి మహేష్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాడు. రష్యన్ భార్య వస్తుంది. చివరికి చిన్నన్న నాగబాబు పోన్లో పలకరిస్తాడు. చివరి సీను మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో వుంటుంది. ఆఖరికి ఆర్జీవి వచ్చి హితోపదేశం చేయడం వుంటుంది.

        ప్రవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత అమాయకుడో, అతడి చుట్టూ చేరి కొందరు ఎలా దెబ్బతీశారో అన్నదే చెప్పాలనుకున్నాడు ఆర్జీవి. ఇంతకి మించి పవన్ ని అవమానించడం ఎక్కడా చేయలేదు. సానుభూతి చూపించడం మాత్రమే చేశాడు. ఈ సానుభూతికి పరాకాష్ట చివర్లో ఆర్జీవి హితబోధ.

        ‘గడ్డి తింటావా’ అన్న పాటలో వున్న సెటైర్ మిగతా మూవీలో లేదు. డైలాగుల్లో పంచ్ తప్ప సెటైర్ లేదు. కెమెరాతో గిమ్మిక్కులు చేయకుండా స్టడీ షాట్లు తీశారు. ఒక ఫాం హౌస్ లో వారం రోజుల్లో షూటింగ్ ముగించారు. అతి లో బడ్జెట్ లో తీసిన ఈ వెబ్ మూవీ క్వాలిటీ గురించి చెప్పుకోవాల్సింది లేదు. విషయం గురించి అసలే లేదు. ప్రవన్ కళ్యాణ్ మీద సానుభూతి ఏమో గానీ, వర్మ మీద జాలిపడేలా వుంది. 

-సికిందర్