రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, March 5, 2016

షార్ట్ రివ్యూ!







కథ, స్క్రీన్ ప్లే,  దర్శకత్వం : బి.వి. నందినీ రెడ్డి

తారాగణం : నాగశౌర్య, మాళవికా నాయర్‌, పర్ల్‌ మానే, రాశి,  ఆనంద్‌,  ఐశ్వర్య,  రాజ్‌ మదిరాజు, తాగుబోతు రమేష్‌, మిర్చి హేమంత్‌, జెమిని సురేష్‌, ప్రగతి తదితరులు
మాటలు, పాటలు : లక్ష్మీభూపాల్‌, సంగీతం : కళ్యాణ్‌ కోడూరి, ఛాయాగ్రహణం : జి.వి.ఎస్‌. రాజు, కూర్పు: జునైద్‌ సిద్ధిఖీ
బ్యానర్‌ :
 శ్రీ రంజిత్‌ మూవీస్‌, నిర్మాత : కె.ఎల్‌. దామోదరప్రసాద్‌
విడుదల :  4 మార్చి,  2016
***
       2011 లో బివి నందినీ రెడ్డి  ‘కొత్త దర్శకురాలి ఉత్తమ తెలుగు చిత్రం’ కేటగిరీ కింద ‘అలా మొదలైంది’ కి నంది అవార్డు, దీనికే ఉత్తమ దర్శకురాలిగా ఫిలింఫేర్ నామినేషనూ పొంది ఒక స్థానం సంపాదించుకున్నాక, ‘జబర్దస్త్’  అనే ఫ్లాప్ తీసి, దాన్ని ‘బ్యాండ్ బాజా బరాత్’ నుంచి కాపీకోట్టారని యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి లీగల్ నోటీసు కూడా అందుకుని ప్రతిష్ట కోల్పోయాక- చాలా కాలంపాటు  ఇంకో సినిమా కోసం విఫలయత్నాలు చేసి, ఇప్పుడు ‘కళ్యాణ వైభోగమే’ అంటూ ముందుకొచ్చారు. 

       ధునిక దృక్పథం గల ఫిమేల్ డైరెక్టర్ గా తను ‘జబర్దస్త్’  లాంటి మెల్ డైరెక్టర్ ల ఆటస్థలమైన మాస్ మసాలా జోలికి వెళ్ళాల్సింది కాదు. ఓ యాభై మాస్ మసాలాలు కూడా తీసిపారేసి విజయాలు సాధించిన ఫిమేల్ డైరెక్టర్ విజయనిర్మల దరిదాపులకి తెలుగులో ఇంకో ఫిమేల్ డైరెక్టర్ రాలేకపోయారు ఇంతవరకూ. ఒక విషయాన్ని లేదా సమస్యని మేల్ డైరెక్టర్లు వాళ్ళ పురుష దృక్కోణం లోంచి చూసే పధ్ధతి వేరు, ఫిమేల్ డైరెక్టర్లు వాళ్ళ సహజాతం (ఇన్ స్టింక్ట్) తో చూసే పరిస్థితి వేరు. కమర్షియల్ సినిమాల పేరుతో వెలువడుతున్న కాలుష్యం బారినుంచి  ప్రేక్షకుల్ని పక్కకు తీసి, వాస్తవ జీవితాన్ని దగ్గరగా చూసే క్లోజప్ కథలతో తమదైన స్త్రీ వాయిస్ ని విన్పించే ప్రయత్నం చేసినపుడే ఫిమేల్ డైరెక్టర్లంటే ఏమిటో తేడా తెలుస్తుంది. 

        గతవారం చునియా అనే దర్శకురాలు ‘పడేసావే’ అనే మేల్ డైరెక్టర్లు వాడేసిన విషయాన్ని తీసుకుని తనుకూడా  మేల్ వాయిస్ నే విన్పిస్తూ తన జెండర్ ఐడెంటిటీని ప్రదర్శించుకునే బంగారు అవకాశాన్ని కోల్పోవడం పరిస్థిని తెలియజేస్తోంది.


        కానీ ఇప్పుడు నందినీ రెడ్డి ఈ లోటు తీర్చడానికా అన్నట్టు ‘కళ్యాణ వైభోగమే’ అన్న కొత్తతరం ప్రేమకథని తన జెండర్ ఐడెంటిటీతో డిఫరెంట్ గా చూపిస్తూ ముందుకొచ్చారు. అయితే ...అయితే... అయితే...అన్ని నదులూ వెళ్లి సముద్రంలోనే కలుస్తాయన్నట్టు, అంతలోనే  వెళ్లి వెళ్లి తనూ మేల్ డైరెక్టర్ల మెగలోమేనియాలో పడిపోయారు! 

        దర్శకురాలు దర్శకుడు అన్పించుకోవాలన్న మోజు ఎందుకో!

        అనేక ఫ్లాపులతో సతమతమవడమే తప్ప తెరిపిన పడ్డం తెలియకుండా పోతున్న హీరో నాగశౌర్య ఎట్టకేలకు ఈ సినిమాతో విజయతీరాలకి చేరుకున్నట్టే  కొలంబస్ లా. ఇక్కడ్నించీ ఈ పయనం ఇంకే తీరాలకో ఇక ముందు గానీ తెలీదు. నటించగల టాలెంట్ వుండీ  తీరాలు వెతుక్కునే తంటాలు ఇకనైనా తప్పుతాయా? చాలా మంది కొత్త హీరోలు మాస్ అనుకుంటూ మునకలేస్తున్నారు, తనొక్కడైనా  ఈ ‘కవైభో’ లాంటి యూత్ ఐడెంటిఫై చేసుకోగల  జనరేషన్- జెడ్ తరహా ఫ్రెష్ క్యారక్టర్లని  తన స్పెషాలిటీగా  గుప్పెట పట్టుకుని బ్రాండ్ అంబాసిడర్ అవగలడా? 

        ‘కవైభో’ ఇలాటి దానికి కావలసినంత పునాది వేస్తోంది మరి...

పెళ్లి పెటాకుల ప్యాకేజీ 
        శౌర్య (నాగ శౌర్య) యుక్త వయస్సుని సంపూర్ణంగా, స్వేచ్చగా అనుభవించే ఏకైక లక్ష్యంతో జీవితాన్ని ప్లాన్ చేసుకుంటాడు. అందులోభాగంగా అమెరికాలో సెటిలయ్యేందుకు  ప్రణాళిక వేసుకుంటాడు. కానీ ఇంట్లో పెళ్లిగోల. 

        ఇంకో చోట దివ్య (మాళవికా నాయర్‌) డాక్టరుగా పనిచేస్తూ ఏ బాదరబందీ లేని జీవితాన్ని హాయిగా గడిపెయ్యాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఇంట్లో పెళ్లిగోల. 

        అటు శౌర్యకీ ఇటు దివ్యకీ పెళ్ళంటే వైముఖ్యం లేదు, కానీ ఇంకా పాతిక కూడా  నిండని జీవితాలకి ఆ గుదిబండ తగిలించుకోవడం ఇష్టం లేదు. 

        ఇలాటి అపరిచయస్థులైన  ఇద్దరూ పెద్దవాళ్ళ బలవంతంతో పెళ్లి చూపులకి సిద్ధమవుతారు. అక్కడే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పరస్పరం ఇష్టపడలేదని ప్రకటించేసి బయట పడతారు. ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వెళ్లి పోయి ఎంజాయ్ చేస్తూంటారు.

       కానీ  పెద్ద వాళ్ళు వదలరు. ఇంకా సంబంధాలు తెస్తూ పెళ్లి చూపులకి చంపేస్తూంటారు.  ఈ వరస పెళ్ళిచూపులతో అలసిపోయి ఇద్దరూ ఒక ఆలోచన చేస్తారు. ఈ గోల తప్పాలంటే తామిద్దరూ పెళ్లి చేసుకుని పెద్ద వాళ్ళ కోరిక తీర్చి, ఆర్నెల్లయ్యాక విడాకులతో విడిపోయి తమ కోరిక తీర్చుకుందామని మరో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు.

        అలా పెళ్ళవుతుంది. వెంటనే రహస్యంగా విడాకులకి అప్లై చేసుకుని ఫ్రెండ్స్ తో ఆటా పాటలతో డివోర్స్ సెలెబ్రేషన్ కూడా జరుపుకుంటారు. శౌర్యతో ఎక్కడో నగరంలో కాపురం పెట్టిన దివ్య ఇక కలిసివుండడంలో అర్ధం లేదని సామాన్లు సర్దుకుంటుంది. ఫ్రెండ్స్ సహాయంతో ఆమెని ఆపి,  ఎప్పుడైనా వచ్చే పేరెంట్స్ కోసమైనా ఫ్రెండ్స్ గా ఒకే ఫ్లాట్ లో కలిసి ఉందామని ఒప్పిస్తాడు శౌర్య. 

        ఇక హోటల్ రూమ్ లా ఫ్లాట్ ని వాడుకుంటూ, వచ్చిపోతూ, ఎవరిదారిన వాళ్ళు తిని పడుకుంటూ వుంటారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరి జీవితాలు ఏఏ మలుపులు తిరిగాయన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ?
        నేటి యువసమాజం ఆలోచనా ధోరణికి అద్దం పట్టేలా వుంది. వెంటనే యూత్ కి కనెక్ట్ అయ్యే జీవన శైలితో వుంది. ఇప్పడు ప్రపంచం ఒక కుగ్రామమైతే, జీవితం  విశ్వమంత విస్తరించి కూర్చుంది. దీని అంతు చూడకుండా మడిగట్టుకు కూర్చోవాలని ఏ ఉడుకు రక్తమూ అనుకోదు. ఇలాటి యూత్ ఐడెంటిఫై చేసుకోగల రెండు పాత్రలతో ఒక ఫ్రెష్ నెస్ ని మోసుకొస్తూ, ఇప్పటి మూవీ మార్కెట్ లో జోరుగా అమ్ముడయ్యే నవీన ఉత్పత్తిలా వుంది. కానీ చివరి కొచ్చేటప్పటికి  యూటర్న్ తీసుకుని, ఈ జోరుకి కళ్ళేలు వేయాలన్న ఆందోళనతో, లేకపోతే  ‘కన్హయ్యా కుమార్’  లా  ‘స్వేచ్ఛ ఎక్కువైపోయి’  సోకాల్డ్ సమాజానికి తీవ్ర హానికలుగుతుందన్న మోరల్ పోలీసింగ్ కి పాల్పడింది! ఓ రచయిత కథలో మోరల్ పోలీసింగ్ వుంటే పోనీలే మగ దురహంకారం అనుకోవచ్చు. రచయిత్రుల కథలు కూడా మగ దురహంకారంతో  వుంటాయా?

 ఎవరెలా చేశారు 
        ప్రతీ ఒక్కరూ ఈ రోమాంటిక్ కామెడీలో ప్రేక్షకులు ప్రేమించే పాత్రలుగానే తారసపడతారు. ఎవర్నీ తీసెయ్యడానికి లేదు. ఇంత మంచి పాత్రల సంకలనం రెండేళ్ళ క్రితం ‘మనం’ తర్వాత ఇదే. ఫ్యామిలీ స్టోరీస్ అంటూ సాంతం నరుక్కునే రాక్షసుల కుటుంబాల కథలే చూపించే దౌర్భాగ్యంతో తెలుగు సినిమాలుంటున్న కాలంలో, ఈ సినిమా ఒక చెంప పెట్టు. నరుక్కునే రాక్షాసుల్ని మన జీవితాల్లో చూడం. ఎక్కడో వున్నట్టు వింటూంటాం. తెల్లారి లేస్తే మన చుట్టూ కన్పించేది  సాత్విక ప్రపంచమే, సామాన్య మనుషులే, మనిషితనంతో వుండే  మామూలు కుటుంబాలే. ఇవే ఈ సినిమాలోనూ కన్పిస్తాయి. ఒక్కటి కూడా నెగెటివ్ పాత్ర లేకుండా తమతమ పాజిటివ్ దృక్పథాలతో ఒక డ్రీమ్ వరల్డ్ ని సృష్టిస్తాయి. సున్నిత హాస్యాన్ని ఒలకబోస్తాయి. హీరో హీరోయిన్ల దగ్గర్నుంచీ వాళ్ళ ఫ్రెండ్స్ గా నటించిన వాళ్ళ వరకూ, హీరో హీరోయిన్ల పేరెంట్స్ గా నటించిన వాళ్ళ దగ్గర్నుంచీ సిక్కు కుటుంబమూ వాళ్ళ పిల్లల వరకూ, ప్రతీ ఒక్కరూ జనరంజకం చేశారు దృశ్యాల్ని. 

        నాగశౌర్య తల్లిగా నటించిన ఐశ్వర్య ఒక అయోమయపు క్యారక్టర్ అయితే, తండ్రిగా నటించిన రాజ్ మాదిరాజు ‘గొప్ప’ ఆలోచనా పరుడు. హీరోయిన్ మాళవికా నాయర్ తల్లి దండ్రులుగా నటించిన రాశి, ఆనంద్ డీసెంట్ జంటే- కానీ పైకి కనపడని దూరాలతో సతమతమవుతున్న జీవులు వాళ్ళు. మాళవికా నాయర్ పెద్ద అందగత్తె  కాకపోయినా సరీగ్గా ఆ  పాత్ర స్వభావానికి సరిపోయే ఫీచర్స్ తో, నటించగల స్తోమతతో కన్పిస్తుంది. పెళ్ళికి ముందు రాత్రి తల్లీ కూతుళ్ళుగా మాళవికా- రాశీల మధ్య వైవాహిక జీవితం గురించిన సింపుల్, మెచ్యూర్డ్  సంభాషణతో కూడిన దృశ్యం- దాని ఫీల్ కి తగ్గట్టు మెస్మరైజింగ్ లైటింగ్ తో చిత్రీకరణా ఒక గొప్ప ఎచీవ్ మెంట్ అనొచ్చు.  గర్ల్ ఫ్రెండ్ గా వైదేహి అనే విచిత్ర పాత్రలో వచ్చిపోయే పెర్ల్ మానే కూడా ఎక్సెలెంట్. 

        ఇక మ్యారేజ్ బ్రోకర్ గా సూటు బూటు వేసుకుని,  బాబ్డ్ హెయిర్ తో విగ్గు పెట్టుకుని గుర్తుపట్టకుండా వుండే ప్రగతి,  తనది కార్పొరేట్ లుక్ అనడం రాక  కార్పోరేషన్ గెటప్ అనే అమాయకత్వంతో చేసే కామెడీ తన టాలెంట్ ఏ ఏ రకాలుగా విస్తరించగలదో మరొక్క సారి గా నిరూపించుకునే అవకాశాన్ని దక్కించుకుంది- మొన్నే ‘మలుపు’ లో గమ్మత్తయిన తల్లి పాత్ర వేసి తన స్పెషాలిటీని చాటుకున్నాక.

        ఇలా ప్రతీ చిన్నా పెద్దా పాత్రా ఏదీ వృధాగా లేదు సినిమాలో. చివర్లో వస్తారు తాగుబోతు రమేష్, ఆశీష్ విద్యార్ధి లు. ఇక హీరో నాగశౌర్య కళాపోషణ గురించి ముందే చెప్పుకున్నాం. 

        టెక్నికల్ గా చూస్తే  ఈ కథ మొత్తాన్నీ- ఇది ప్రతిపాదిస్తున్న భావజాలపు నీడల్నీ కెమెరా జీర్ణించుకుని  తెరమీద దృశ్యమానం చేస్తున్నట్టుంది కెమెరా పనితనం. ఛాయాగ్రాహకుడు జివీఎస్ రాజు దీని కర్త. ఒక వండర్ఫుల్ రంగుల ప్రపంచాన్ని సృష్టించాడు. ఇదొక ‘క్లోజప్ కథ’ అనుకుంటే, అంతే క్లోజ్ గా అది హృదయాలకి హత్తుకుపోయే ఎజెండా పెట్టుకున్నట్టు దృశ్యాల చిత్రీకరణ జరిపాడు. కేవలం సినిమాలో ‘విషయం’ మాత్రమే మార్కెట్ ఫ్రెండ్లీగా వుంటే చాలదు, దాని ప్రెజెంటేషన్ లోనూ ఆ మార్కెట్ స్పృహ కనపడాలనేది ఇక్కడ ఇలా షూట్ చేసి చూపించారు.

        కళ్యాణ్‌ కోడూరి  సంగీతం, పాటలు కూడా ఈ క్లోజప్ కథా మర్యాదని దాటి విశృంఖల విహారం చేయలేదు. చాలా మెలోడియస్ గా, స్మూత్ గా స్వరాలు కూర్చి సమన్వయం సాధించాడు. పబ్ లో మొదటి పాట ‘జైబోలో జవానీ మళ్ళీ రాదనీ...’ ఇందుకొక ఉదాహరణ. మాటలు రాసిన లక్ష్మీ భూపాలే అన్ని పాటలకీ మంచి సాహిత్యాన్ని అందించాడు. సున్నిత హాస్యంతో మాటలు చాలా ఉన్నతంగా వున్నాయి. మాటలు రాయడం వెనుక చాలా ఆలోచన జరిగినట్టు కన్పిస్తోంది. క్వాలిటీ రైటింగ్ మాత్రమే కాదు, ఇంటలిజెంట్ రైటింగ్ కి కూడా ముందూ వెనుకా చూడకుండా పట్టం గట్టారు.

        నందినీ రెడ్డి దర్శకత్వ విలువలూ చాలా డీప్ స్టడీ తో కూడుకుని కన్పిస్తాయి. ప్రతి ఫ్రేములోనూ ఆవిడ మేధస్సు కన్పిస్తుంది. స్క్రిప్టు దగ్గర్నుంచీ పోస్ట్ ప్రొడక్షన్ వరకూ ఈ మాధ్యమం పై తనకి గల కమాండ్ మామూలుదేం కాదని ఇట్టే తెలిసిపోతుంది సినిమా చూస్తూంటే. అయితే తన కమాండ్ ని ఈ ఫ్రేములోనే వుంచి –జీవితాలకి దగ్గరగా వుండే ఇలాటి ఫోటో ఫ్రేమ్- క్లోజప్ కథలు తీస్తూంటే తనకో బ్రాండ్ నేమ్ వస్తుందనేది మాత్రం ఖాయం.


చివరికేమిటి? 

        పెళ్లి గురించి నేటి అర్బన్ యూత్ ఆలోచనలెలా ఉంటాయో వాళ్లెలాటి సాహసాలకి ఒడిగడతారో చాలా ఫన్నీగా, ఫ్రెష్ గా చూపించుకొచ్చారు. ఎంతవరకూ? ఇక ఈ అడ్వెంచర్ ని ఎలా కొలిక్కి తేవాలన్నంత వరకే. ఇంతవరకూ మ్యాచ్ ఫిక్సింగ్ తో పెళ్లి చేసుకున్న ఇద్దరూ వెంటనే విడాకులకి పెట్టుకోవడం సంచలనాత్మక ఆవిష్కరణ. విడాకులు మంజూరవడానికి ఆర్నెల్లు పడుతుంది. అంతకాలం సహజీవనం కాని సహజీవనం చేస్తున్నారు. అయితే పక్కలో బల్లెంలా ఈ ప్లాట్ డివైస్ గా పెట్టుకున్న విడాకుల అంశం పే ఆఫ్ అయ్యే సంగతి కూడా కథకురాలు దృష్టిలో పెట్టుకోవాలి. దాన్నే  ప్లే చేసి వాళ్ళ ఆటకట్టించే ప్రయత్నం చేయాలి. కానీ ఇంత  బలమైన ప్లాట్ డివైస్ ని డైల్యూట్ చేసేసి కథంతా అయిపోయాక ముందుకు తెచ్చారు. అక్కడ కథని ఇంకా పొడిగిస్తూ పొడిగిస్తూ పోవడానికే అది  ఉపయోగపడింది.

        ఓ యాభై నిమిషాల్లో విడాకులకి అప్లయి చేయడంతో ఇంటర్వెల్ వేసేసినప్పుడు, సెకండాఫ్ ఇంకో గంటకి మించదు అనుకుంటాం. కానీ గంటదాటిపోయి  గంటా నలభై ఏడు నిమిషాల వరకూ సాగుతుంది! మొత్తం ఈ సింపుల్ సినిమా స్టోరీ నిడివి రెండు గంటలా 37 నిమిషాలుంది!! 

        సెకండాఫ్ లో గంట గడుస్తోందనగా ఒకటొకటే వ్యాధి లక్షణాలు బయట పడుతూ వస్తాయీ కథలో. అది గర్ల్ ఫ్రెండ్ వైదేహి రాకతో దివ్యకి జెలసీ పుట్టడం ద్వారామొదలై, దివ్య ఊరెళ్ళి నప్పుడు శౌర్య ఆమె లేని లోటుని ఫీలవ్వడం దగ్గరికొచ్చినప్పుడు- ఓహో ఇంతా చేసి ఈ కథ వీళ్ళని కలపడానికి రొటీన్ ఫార్ములా బారిన పడుతోందన్న మాట అని భయపడతాం. ఇలా ఒక దశ కొచ్చేటప్పటికి ఫీలింగ్స్ తో బరువైన సన్నివేశాలు వచ్చి, హీరో హీరోయిన్లు కలిసిపోవడమే కదా రొటీన్ మూస ప్రేమకథల బాట? ఇదే ఇక్కడా జరుగుతోంది. 

        ఇక్కడితో ఆగకుండా ఇది మరింత నాటు వ్యవహారంలోకి తిరగబెట్టింది. అది విడాకుల విషయం పెద్దలకి తెలిసిపోవడంతో! ఇక ఇక్కడ్నించీ మొదలు కథంతా రచ్చ అవడం! పెళ్ళీ గిళ్ళీ సాంప్రదాయమూ  గొప్ప గొప్ప విలువలంటూ ఆ పెద్దల రొటీన్  లెక్చర్లు! వీళ్ళు తలలు వంచుకోవడం! మామ అల్లుడ్ని ఫెడీ మని బాదడం! విడాకులు మంజూరైపోతే, కూతురికి  మరో పెళ్లి చేసేయబోవడం!...హీరోగారు వెళ్లి ఓ ఆత్మహత్యా ప్రయత్నంలో ఇరుక్కోవడం! హీరోయిన్ పెళ్లి మానుకుని వచ్చేసి కాపాడుకోవడం...అంతా రచ్చరచ్చ! ఇదంతా దాదాపు యాభై నిమిషాలు టార్చర్! ఇదిగో... ఇక్కడ అయిపోతుందనుకుంటే,  ఇంకా ఇంకా సాగడం, సహనానికి పెద్ద పరీక్ష పెట్టడం. 

        దర్శకురాలు తన ఫిమేల్ వాయిస్ ని నొక్కేసుకుంటూ మేల్ డైరెక్టర్ గా యూటర్న్ తీసుకోవడం వల్ల ఈ సమస్య. ఇలాటి పాత చింతకాయ మూస ప్రేమ కథలు మేల్ డైరెక్టర్లే తీస్తారు. అంతవరకూ సమస్యకి ఫిమేల్ డైరెక్టర్ వెర్షన్ గా ఫ్రెష్ గా, పాత మూస ధోరణులకి దూరంగా, న్యూవ్ వేవ్ సబ్జెక్టుతో ట్రెండీ గా ఉంటూ వచ్చిన విషయం, తీరా పరిష్కరించే దగ్గర జానర్ మర్యాద తప్పి –మేల్ డైరెక్టర్ ని ఆవాహన చేసుకుని చివరికి ఆ సముద్రంలోనే కలిసిపోయింది! యూ టూ మేడమ్ నందినీ రెడ్డీ? అన్న షేక్స్ పియరిన్ షాక్ లో మనం! 

        యూత్ తమ సమస్యలకి తామే పరిష్కారాన్ని కనుక్కోలేరా? ఎంత క్యాజువల్ గా కామెడీగా పెళ్ళీ, ఆ తర్వాత విడాకుల పథకమేసుకున్నారో- అంతే క్యాజువల్ గా కలిసిపోయే చిలిపి ఆలోచన ఒకటి చేయలేరా? శౌర్య అన్న ఒక్కమాటతో అతడి అంతరంగం తెలుసుకుని గర్ల్ ఫ్రెండ్  వైదేహి అంత సింపుల్ గా బై చెప్పేసి వెళ్లి పోయిందే - అంత సింపుల్ గానూ  శౌర్యా దివ్యలు విడాకులతో వేసుకున్న తమ పథకం బెడిసికొట్టే పరిస్థితి వచ్చి- దీనికంటే మొగుడూ పెళ్ళాలు గా శోభనం చేసుకోవడమే  బెటర్రా బాబో అని మొత్తుకుని,పథకమేసినంత క్యాజువల్ గానూ, కామెడీగానూ  కలిసిపోయి ఆడియెన్స్ కి కిక్కివ్వలేరా? అలాటి క్రేజీ టర్నింగ్ పాయింటుని క్రియేట్ చేయకూడదా ఇంత చేసుకొచ్చిన దర్శకురాలు, ఇది పెద్దవాళ్ళతో  సంబంధం లేని రోమాంటిక్ కామెడీ అయినప్పుడు? 

        ఈ పెద్దలెవరు ఇంకా పాత లెక్చర్లిచ్చి సినిమాని నాశనం చేయడానికి. రొమాంటిక్ కామెడీలో వీళ్ళకేం పని మోరల్  పోలీసింగ్ చేయడానికి.  యూత్ వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ విలువలేవో వాళ్ళు కనుగొంటారు. ఆ విలువలతో ఇబ్బందులుంటే తప్పకుండా మార్చుకుంటారు. సినిమాగా కథలో చూపించాల్సింది స్వయంగా వాళ్ళు పరిణతి చెందిన విజయాన్నే. పెద్దలెవరో క్లాసు తీసుకుంటే తలలూపి లొంగిన  అపజయాలు కాదు. అప్పుడు ఏమీ నేర్చుకున్నట్టు కాదు. బేసిగ్గా సినిమా కథంటేనే ఇగోని స్వయం ప్రతిపత్తితో మెచ్యూర్డ్ ఇగోగా మార్చే దిశగా పాత్రని ప్రయాణింపజేయడం కాదా?


        ఈ సినిమా రచ్చ అవడానికి ముందు కొత్తదనంతో నీటుగా సాగుతున్న విషయాన్ని- పాత్రధారులూ, వాళ్ళ ప్రవర్తనలూ మాటలతో సహా- తల్లి పాత్రలతో కూడా కలిపి- పై తరగతి నుంచీ కింది తరగతుల వరకూ ప్రేక్షకులు ఎంత ఎంజాయ్ చేశారో, రచ్చ రచ్చ అవడం మొదలవగానే అంత సైలెంట్ అయిపోయారు.




-సికిందర్ 
http://cinemabazaar.in