రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, సెప్టెంబర్ 2020, గురువారం

973 : రివ్యూరచన, కూర్పు, దర్శకత్వం : మహేష్ నారాయణ్
తారాగణం : ఫహాద్ ఫాజిల్
, దర్శనా రాజేంద్రన్, రోషన్ మాథ్యీవ్, అమాల్డా లిజ్, మాలా పార్వతి తదితరులు
సంగీతం : గోపీ సుందర్
, ఛాయాగ్రహణం : సబిన్ ఉలికాందీ
నిర్మాతలు : ఫహాద్ ఫాజిల్
, నజ్రియా నజీమ్
నిడివి : 97 నిమిషాలు
విడుదల : అమెజాన్ ప్రైమ్


        క్రియేటివిటీకి లాక్ డౌన్ లేదు. మనుషుల జీవితాలు లాక్ డౌన్ లో డిజిటల్ స్క్రీన్స్ కి ఎలాగూ బదిలీ అయ్యాయి. ఒక ఫార్మాట్ కాకపోతే ఇంకో ఫార్మాట్ స్క్రీన్. స్క్రీనితం జీవితమని వర్చువల్ జీవితాలై పోయాయి. కానీ లాక్ డౌన్ ఆంక్షల్లో సినిమా నిర్మాణం నార్మల్ గా అసాధ్య మైనప్పుడు, క్రియేటివిటీ చేతులు ముడుచుకుని కూర్చోదు. అది సంకెళ్ళు తెంచుకుంటూ మూవీ మేకింగ్ ని ఫక్తు వర్చువల్ ప్రాసెస్ గా మార్చేస్తుంది. ఐడియా అంటూ రావాలే గానీ డిజిటల్ ప్రపంచంలో అందుబాటులో లేని డివైసులులేవు. వర్క్ స్టేషన్లో కూర్చుని వీడియో గేమ్స్, కార్టూన్ ఫిలిమ్స్ వంటి ఆన్లైన్ డిజిటల్ కంటెంటే కాకుండా, రెగ్యులర్ సినిమాల్ని కూడా నటుల లైవ్ నటనలతో వెండి తెరకెక్కించ వచ్చన్న ఐడియా రావడం, అదీ రెండు నెలల్లో ప్రొడక్టుగా మారి- దేశంలో లాక్ డౌన్ లో నిర్మించిన తొలి సినిమాగా ప్రపంచ ప్రేక్షకుల మధ్యకి రావడం ఒక్క మలయాళం నుంచే జరిగింది.

        కప్పుడు సిడ్ ఫీల్డ్ చెప్పాడు ది టర్మినేటర్ ని దృష్టిలో పెట్టుకుని - కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్ల ఇక కథలు చెప్పే విధానం మారిపోతుందని. సీయూ సూన్ ఇంకో అడుగు ముందుకేసి - చేతిలో వున్న స్మార్ట్ ఫోన్స్, లాప్ టాప్స్, డెస్క్ టాప్సే కథలు చెప్పేందుకు మాధ్యమాలవుతాయని చెబుతోంది. ఇంత కాలం కథల్ని చూసేందుకు ఇవి మాధ్యమాలుగా వున్నాయి, ఇప్పుడు చెప్పేందుకు మాధ్యమాలవుతాయి. ఆనాడు మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రేమికుల మధ్య కేవలం ఉత్తరాలతో ప్రయోగాత్మకంగాదూరం అనే నవల విజయవంతంగా నడిపారు. ఉత్తరాల్లోనే కథ ప్రవహిస్తూంటుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ లో, లాప్ టాప్స్ లో, డెస్క్ టాప్స్ లో, ఇంకా సీసీ కెమెరాల్లో, టీవీలో కథ పరుగెత్తుతూంటే ఎలా వుంటుంది?

       సీయూ సూన్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీనుకి మారే  సస్పెన్స్ థ్రిల్లర్. ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ కి మారే కథా కథనాలు. పాత్రలు ఎక్కడున్నవి అక్కడే వుంటాయి. వాటి మధ్య దూరాలు అప్లికేషన్స్ భర్తీ చేస్తాయి. దుబాయ్ లో వుండే జిమ్మీ కురియన్ (రోషన్ మాథ్యీవ్), డేటింగ్ యాప్ టిండర్ లో దుబాయ్ లోనే వుండే అనూ సెబాస్టియన్ (దర్శనా రాజేంద్రన్) తో కనెక్ట్ అవుతాడు. చాటింగ్ తో, టెక్స్ట్ మెసేజెస్ తో బయోడేటాలు తెలుసు కుంటారు. ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసుకుంటారు. హేంగవుట్స్ లో చాటింగ్ చేస్తారు. వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు. గూగుల్ డ్యూయోలో మాట్లాడుకుంటారు. వీడియో కాల్ లో తల్లి (మాలా పార్వతి) తో మాట్లాడిస్తాడు. తల్లికి నచ్చుతుంది. అయితే తల్లి అనూ బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయాలనుకుని బంధువుల కుర్రాడు కెవిన్ థామస్ (ఫహాద్ ఫాజిల్) కి వీడియో కాల్ చేస్తుంది. సైబర్ సెక్యూరిటీ నిపుణుడైన కెవిన్ థామస్ ప్రైవసీ రూల్స్ కి విరుద్ధమని ఒప్పుకోడు. 

        తర్వాత తప్పనిసరై పూనుకుంటాడు. అనూ ఐపీ అడ్రస్ హ్యాక్ చేసి
, ఆన్లైన్ లోనే వివిధ డేటా సోర్సెస్ చెక్ చేసి, అనూకి క్లీన్ చిట్ ఇచ్చేస్తాడు. ఇంతలో అనూ మాయమైపోతుంది. గాయాలతో వున్న అనూ జిమ్మీకి వీడియో కాల్ చేసి కన్పించకుండా పోతుంది. దీంతో గాభరాపడ్డ జిమ్మీ ఆమెని వెతకమని కెవిన్నే ఆశ్రయిస్తాడు. వివిధ అప్లికేషన్స్ తో కెవిన్ అనూ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ని ట్రెస్ చేయడం మొదలెడతాడు. 

     ఇదీ కథ. రెగ్యులర్ మిస్సింగ్ కేసు కథే. కథ చెప్పడం డిజిటల్ టూల్స్ తో చెప్పడంతో, రెగ్యులర్ కెమెరాతో రెగ్యులర్ సీన్స్ వుండే సినిమాలకి భిన్నంగా థ్రిల్ చేస్తుంది. గత నెలే హిందీలో ఖుదా హాఫీజ్ అనే థ్రిల్లర్ విడుదలైంది. గల్ఫ్ లో హీరోయిన్ని బ్రోతల్ ఏజెంట్లు అపహరించే కథ. ఇలాటి కథే సీయూ సూన్ కి ప్రాతిపదిక. దర్శకుడు మహేష్ నారాయణ్ కి ఒక మిత్రుడు గల్ఫ్ నుంచి ఒక కేరళ అమ్మాయి ఏడుస్తూ తల్లికి పంపిన వీడియోకాల్ పంపాడు. దర్శకుడు దాన్ని ఫాజిల్ కి పంపాడు. ఫాజిల్ సినిమా దీన్ని తీద్దామన్నాడు. ఐఫోన్ తో షూట్ చేసి మే - జులై మధ్య పూర్తి చేశారు. 

        విశేషమేమిటంటే  ఈ డిజిటల్ టూల్స్ చెప్పే కథ ఎక్కడా బోరు కొట్టదు సరికదా
, ఒక్క క్షణం కూడా  కళ్ళు తిప్పుకోనివ్వని సస్పెన్సు తో కట్టి పడేస్తుంది. ఇంకోటి స్క్రిప్టు రాయడం సులభం చేసేస్తుంది. పాత్రల నేపథ్యాలు, మనస్తత్వాలు, పాత్ర చిత్రణలు వంటి బరువుని తగ్గిస్తుంది. పాట లెలాగూ వుండవు.

సికిందర్