రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, మార్చి 2018, శనివారం

617 : స్పెషల్ ఆర్టికల్


          క ‘శంకర్ దాదా జిందాబాద్’ కూడా కథ దగ్గరే  చేతులెత్తేశాక, సినిమా రచననేది నానాటికీ ఎంత పలచనబారి పోతోందో మనకి తెలిసివస్తోంది. ఎంతటి సీనియర్ రచయితలైనా ఏ సినిమాకా సినిమా ఒక పాఠంగా తీసుకుని పని చేయకపోతే, ఇలాటి శృంగభంగాలు భంగు కొట్టి నర్తిస్తూనే వుంటాయి. తెలుగు సినిమా రచన నానాటికీ ఇలా తీసికట్టుగా తయారవడానికి కారణమేమిటా అని చూస్తే,  ఇగో స్వామ్యమే కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది.  ఓ పక్క డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లూ సినిమాల విజయాలకి కావాల్సింది అదిరిపోయే కాస్ట్యూమ్సూ,  ఫారిన్ లొకేషన్స్ లో డాన్సులూ కాదని, గుండెని తాకే సరైన కథే నని మొత్తుకుంటూనే వున్నారు. వాళ్ళేం పనికిరాని  ప్రేక్షకులు కాదు వాళ్ళ మొత్తుకోళ్లని బేఖాతరు చేయడానికి. వాళ్ళ అభిప్రాయాలు బాక్సాఫీసు ఇండెక్సులే.  స్టార్ సిస్టం దీని పైనే ఆధారపడుం
టుంది. ఇప్పుడు హిందీలో వచ్చినట్టుగా స్టార్ డమ్ ని పక్కన బెట్టి సబ్జెక్ట్ ఈజ్ సుప్రీం భావజాలానికి తెలుగులో కూడా తెర తీసినప్పుడు మాత్రమే చరిత్ర ఓ మలుపు తిరుగుతుంది. తెలుగు సినిమా చరిత్ర (‘శివ’) తో ఓ మలుపు తిరిగి రెండు దశాబ్దాలు కావొస్తున్నా, ఇప్పటికీ ఇలాటి ఇంకో  మైలురాయనేదే లేకుండా పోయింది.  

         
వితేజ నుంచి చిరంజీవి వరకూ వాళ్ళ స్టార్ ఇమేజుల్ని దెబ్బ తీసే విధంగా ఏ సాంప్ర దాయాలు నెలకొని వున్నాయా  అని  చూస్తే, ప్రధానంగా మూడు కనపడతాయి. 1. కథ – స్క్రీన్ ప్లే – మాటలు పరస్పరాధారభూతాలని  భావించకపోవడం, 2. మాటల రచయిత ముందు నుంచీ కథా చర్చల్లో పాల్గొనకపోవడం, 3. మాటల రచయితకి లెఫ్ట్ రాసే స్వేచ్ఛ లేకపోవడం. ఈ మూడూ ఎవరికి వాళ్ళు పెట్టుకునే  ఇగోల వల్ల ఏర్పడే ప్రతిబంధకాలే. సినిమాలు తీయడం హాలీవుడ్ నుంచి నేర్చుకున్నాక, సినిమా కథలు రాయడాన్ని వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అనసరం లేదని ఇగోలు పెంచకోవడంతోనే వస్తోంది సమస్య. రాసే కథని కథ, మాటలు, స్క్రీన్ ప్లే లుగా మూడుగా విడగొట్టి పంచుకుని ఎవరి ఇగోల ప్రకారం వాళ్ళు తలో రూటులో  రాసుకుపోవడం. 

       అసలు కథ మాటలు స్క్రీన్ ప్లే అని విడివిడి క్రెడిట్లు హాలీ వుడ్ లో వుండవు. ఒకటే స్క్రీన్ ప్లే అని వుంటుంది. అందులోనే కథ, అందులోనే మాటలు వుంటాయి. ఇదంతా ఒక్క రచయిత పడే కష్టం.  అది ఓకే అయితే అప్పుడు మార్పు చేర్పులుంటే ఇతర రచయితల సాయం తీసుకోవచ్చు కంపెనీలు. అలా ఫైనల్ చేసిన  స్క్రీన్ ప్లే కి ఆ ఒరిజినల్ గా రాసిన రచయిత పేరే వుంటుంది తప్ప, కథ వేరే ఫలానా, మాటలు వేరే ఫలానా, స్క్రీన్ ప్లే వేరే ఫలానా అని వెయ్యరు. ఒక నవలకి కథ వెంకట్రావ్, వర్ణన అప్పారావ్, మాటలు సుబ్బారావ్ అని ఎలా వేయలేరో, హాలీ వుడ్ స్క్రీన్ ప్లేలకీ అంతే. కానీ  తెలుగు సినిమా స్క్రిప్టులకే విడి విడి క్రెడిట్స్ తో త్రిమూర్తులుంటారు. పది తలల రావణాసురుడికైనా తలకాయలన్నీ సమన్వయంతో పనిచేస్తాయిగానీ, ఇక్కడ తెలుగు త్రిమూర్తులకి ఇగోలతో పనిచెయ్యవు. ఒక తలకాయ ఒక కథ అనుకుని అందిస్తే, ఇంకో తలకాయ ట్రీట్ మెంట్ (స్క్రీన్ ప్లే) కి కూర్చుని కథని ఇంకేదో అనుకుని మార్చేస్తుంది. ఇక్కడ కథా  సహకారం రచయిత లుంటే అప్పుడా తలకాయల సమ్మేళనం వేరేగా వుంటుంది. ఆ ట్రీట్ మెంట్ తీసుకున్న ఇంకో తలకాయ ఇంకేదో అనుకుంటూ మాటలు రాసేస్తుంది. మాటలు రాసే తలకాయ మాత్రం ఎప్పుడూ ఒక్కటే వుంటుంది అదేమిటో? ఆయన జోలికెవరూ వెళ్లరు. 

          మరి దర్శకుడేం చేస్తాడంటే, దృశ్యాలని ఎలా తీస్తాడో విజువల్స్ ఒక్క ముక్కా చెప్పకుండా మౌనంగా వుంటాడు. డైలాగ్ వెర్షన్ తీసుకున్నాకే శ్రద్ధ చూపిస్తాడు. అప్పుడా డైలాగ్ వెర్షన్లో మాటలు దిద్దడంతో బాటు సీన్ల డ్రైవ్ కూడా మార్చేస్తాడు. ఇలా సమన్వయం లేకుండా ఇన్నిసార్లు ఇన్ని చేతులు పడ్డాక వచ్చే అంతిమ రూపం  ఎలా వుంటుందో వూహించుకో వచ్చు. స్ట్రక్చర్ ని పక్కన పెడదాం, తెలుగు సినిమాల కిది వొంట బట్టేది కాదు. తమతమ  సొంత నమ్మకాలతో స్క్రిప్టు ఇలా వుండచ్చు, ఇలా వుంటుందేమోనని, రకరకాల వూహాగానాలు చేసి రాసే స్క్రిప్టులు, మూడు ముక్కలుగా విడగొట్టుకుంటే, విభజించి పాలించానుకుంటే,  ఫలితాలు సంఘటితంగా ఎలా వుంటాయి వికటించక? ప్రొడక్షన్లో కొన్ని ఇబ్బందుల వల్ల, హీరోల జోక్యం వల్ల, ఫైనాన్స్ సమస్యల వల్ల ఫ్లాపయితే అది వేరు. కానీ మౌలికంగా స్క్రిప్టు పని అనేది బలహీనంగా జరక్కూడదుగా? ఇగోలతో బలం ఏమీ రాదు, అంతా  బలహీనమే. ఇగో అనేదే బలహీనత. బాధించే  రుగ్మత. దీంట్లో బాధ్యత వుండదు. ఎలాగూ మనం చెప్పేది వినరు, రాయనివ్వరు – మనమెందుకు బాగా రాయాలన్న  నిర్లక్ష్యం పేరుకుంటుంది. తూతూ మంత్రం వ్యవహారంగా కానిచ్చి బయటపడతారు. ఇగోలు అసంతృప్తులుగా మారతాయి. దీని రియాక్షన్ గా మనదేంటో మనం చూపించుకోవాలని రచయితలు దర్శకత్వం వైపుకి వచ్చేస్తారు.  దీంతో దర్శకులెక్కువైపోతూ,  రచయితలు  


తగ్గిపోతూ,  రచనా రంగం మరీ అన్యాయంగా తయారవుతోంది. నిరంతరం రచనని అభివృద్ధి పర్చుకునే పరిశీలన, పరిశోధన, అధ్యయనం, అభ్యాసం వగైరాలతో నైపుణ్యం పెంచుకునే వాళ్ళు ఇప్పుడు లేరు. రచనా రంగం రాజకీయాలు ఇందులోంచి బయటపడాలన్న కసిని పెంచు తున్నాయి. బయటపడితే ఇక దర్శకత్వమే శరణ్యం. మళ్ళీ అక్కడా రచనా సామర్ధ్యాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా ఏమీ వుండదు!
***
          స్క్రిప్టుకి  తుది రూపం డైలాగ్ వెర్షన్ తో లభిస్తున్నప్పుడు, డైలాగ్ వెర్షన్ తోనే తెరమీద బొమ్మలెలా కదలాడతాయో తెలుస్తున్నప్పుడు, అసలా మాటలు రాసే రచయిత పాత్ర ఎక్కడ్నించీ ప్రారంభం కావాలి? కచ్చితంగా కథని అల్లే వన్ లైన్ ఆర్డర్ దశ నుంచే అతనుండాలి. ఆ తర్వాత ట్రీట్ మెంట్ లోనూ పాల్గొనాలి. అప్పుడే కథ మీద, దాని కథనం మీద, అందులోని పాత్రల మీదా పూర్తి లోతైన అవగాహన ఏర్పడుతుంది. అప్పుడే సీన్ల ప్రారంభ ముగింపులు, పాత్రలు మాట్లాడుకునే క్రమం బాగా తెలుస్తాయి. కానీ ఇలా జరగదు. దర్శకత్వ శాఖ ట్రీట్ మెంట్ దాకా పూర్తి చేసి మాటల రచయిత కందిస్తే, ఆయన అప్పటికప్పుడే కథేమిటో తెల్సుకుని, లోతైన పూర్తి అవగాహన కలక్కుండానే,  వారం పది రోజుల్లో మాటలు రాసిచ్చేస్తాడు. అది పట్టుకుని షూటింగ్ కెళ్ళిపోతారు. 

      ట్రీట్ మెంట్ ఒకేసారి సమగ్రంగా రాయలేరు. కనీసం రెండు మూడు నెలలు కసరత్తు చేస్తూంటేనే తప్ప కథ లోతుపాతులు, అందులో హైలైట్ చేయాల్సిన పాయింటులూ పూర్తిగా పట్టుబడవు. ఇలాటిది మాటల రచయిత వారం పది రోజుల్లో మాటలెలా రాసెయ్యగలడు?   అతను మొదట్నించీ ఆ కథా చర్చల్లో వుంటే మాత్రమే ఎలా రాయవచ్చో ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తూ అలా రాయగలడు. ఇలా వుండకపోతే ఇచ్చిన ట్రీట్ మెంట్లో సీన్ల ఉద్దేశంతో బాటు,  వుండాల్సిన కీ డైలాగుల ప్రాముఖ్యం తెలీక, మాటలు రచయిత ఎగరగొట్టేసి తానేదో రూట్లో వెళ్ళిపోయే సందర్భాలెన్నో. 

          మాటల  రచయితే కథా చర్చల్లో వుంటే, విషయం మీద పూర్తి పట్టు వుంటుంది కాబట్టి, మాటలు రాసేటప్పుడు ఒక్కో చోట ఒక సీనేదో అవసరమే లేదన్పించవచ్చు. తర్వాతి సీన్లో ఒక్క  డైలాగు రాసి ఆ సీనుని ఎత్తేసే వీలూ కలగొచ్చు. అలా సీన్లూ తగ్గిపోవచ్చు. 

          ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే, హాలీవుడ్ లో స్క్రీన్ ప్లే రచయిత ఎంతో, టాలీవుడ్ లో మాటల రచయిత అంతే వుండాలి. హాలీవుడ్ స్క్రీన్ ప్లే రచయిత డైలాగులు రాస్తూ సీన్లని విజువలైజ్ చేస్తాడు. కానీ తెలుగు మాటల రచయిత ఒక దానికింద ఒకటి మాటలు మాత్రమే రాసుకుంటూ పోతాడు, విజువలైజేషన్ తో సంబంధం లేకుండా. డైలాగ్ వెర్షన్ లో  లెఫ్ట్ రాస్తే,  దర్శకుడు ఒప్పుకోడనే దొకటుంది. రాస్తే కోపంతో చించేస్తారని రాయరు. అలా రాస్తే సీను ఎలా తీయాలో యాక్షన్ నాకే చెప్తావా అని దర్శకుడు కేకలేస్తాడ ని రాయకుండా వూరుకుంటారు. 


     మద్రాసులో వున్నప్పుడు  ఒక పేరున్న దర్శకుడు, మాటల రచయిత లెఫ్ట్ రాస్తే, ఆ లెఫ్ట్ నిలువునా చించి అవతల పారేసి, కుడి పక్క రాసిన డైలాగులు పెట్టుకుని సీన్లు తీసేవాడనే టాక్ వుంది. దిసీజ్ ఇగో. రచయిత కెమెరా యాంగిల్స్ రాస్తే అది తప్పు కావొచ్చు. హాలీవుడ్ లో కూడా తప్పే. కానీ లెఫ్ట్ లో పాత్రల  కదలిక, యాక్షన్ రియాక్షన్లు రాయకపోతే, కుడి పక్క ఆ పాత్రలేం మాట్లాడాలో రాయడానికి మాటలెలా తోస్తాయి? పాత్ర ఏం చేస్తోందో రాయకపోతే ఏం పలకాలో మాటల రచయితకెలా తెలుస్తుంది? లెఫ్ట్ రాస్తే ఒక్కోసారి మాటల  అవసరమే రాకపోవచ్చు. పాత్ర ‘నో’ అని చెప్పడానికి బదులు, టేబుల్ మీద కప్పు గట్టిగా పెట్టాడని లెఫ్ట్ రాస్తే,  ఆ సీను ఉన్నతంగా  వుండే అవకాశముంది. దర్శకుడికి మండిపోయి, ఆ వెధవ  నో అనాలనుకుంటే నో అనే కుడి పక్క రాయ్ - లెఫ్ట్ లో కప్పులు గిప్పులు వాడి డైరెక్షన్ నాకు నేర్పకు అంటే - మాటల రచయిత నాకేంటని అలాగే పేజీలకి పేజీలు కుప్పతెప్పలుగా మాటలు నింపి పారేసి అవతల పడేసి వెళ్ళిపోతాడు. అందుకే చాలా సినిమాలు ఉత్త మాటల మోతలా తలనొప్పిగా వుంటాయి. 

          ఇదే సమన్వయం చేసుకుని పనిచేస్తే, కె. విశ్వనాథ్ – జంధ్యాలల ‘శంకరాభరణం’ లా సినిమా మొత్తం మీద పదిహేను పేజీల డైలాగులే వుంటాయి. బాపూ  రమణల ‘ముత్యాల ముగ్గు’ లాగా  తక్కువ డైలాగులే వుంటాయి. పుట్టు రచయితలైన దాసరి నారాయణరావు, వంశీ ల ‘మేఘ సందేశం’, ‘సితార’ ల్లాగానూ అతితక్కువ డైలాగులే వుంటాయి.  


         దర్శకుడు ట్రీట్ మెంట్ దశనుంచే ఏ సీను ఎలా తీయాలో విజువల్స్ తో, మూవ్ మెంట్స్ తో, పాత్రల యాక్షన్ - రియక్షన్లతో, టేకింగ్ చెబితే, సీన్లు ఎలా ఓపెనై  ఎలా ఎండ్ అవ్వాలో వివరిస్తే, ఇది పట్టుకుని మాటల  రచయిత  ప్రతిభావంతమైన డైలాగ్ వెర్షన్ అందించగలడు. బాలీవుడ్  దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ  రచయితలతో ఇలాగే కనెక్ట్ అయి,  ప్రొఫెషనల్ గా వుంటారు. దర్శకుడు ఏం తీస్తాడో తెలియకపోతే, ఎలా తీస్తాడో చెప్పకపోతే, రచయితకి రాయడానికి కన్పించేదంతా శూన్యమే. షాట్ డివిజన్ దర్శకుడి అధికారమే. కానీ విజువల్ సెన్స్ కి, కెమెరా సెన్స్ కీ రచయితలూ హక్కుదార్లే. రాయడం కోసం తెలుసుకునే హక్కు వాళ్లకుంది.  

          కానీ కింది నుంచి పైదాకా ఇగోలు పెంచుకుని, పై నుంచి కింది దాకా గొడ్డళ్ళు పట్టుకుని,  ఒకరి పనిని ఇంకొకరు నరుక్కుంటే, బాక్సాఫీసు దగ్గర మిగిలేదేమిటి....అందరి బలిపీఠం!

సికిందర్
(ఆంధ్రభూమి వెన్నెల – ఆగస్టు 3, 2007)



616 : మూవీ నోట్స్


       ఆస్కార్ విన్నర్ స్క్రీన్ ప్లేగా ‘గెట్ అవుట్ ‘ కి రెండు ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా హార్రర్స్ కి ఆస్కార్స్ ఇవ్వరు. రెండోది, నల్లజాతీయుడు స్క్రీన్ ప్లేకి ఇంతవరకూ ఆస్కార్ గెల్చుకోలేదు. ‘గెట్ అవుట్’ విషయంలో ఈ రెండూ సాధ్యమయ్యాయి. కారణం,  కథా వస్తువు  రాజకీయ, సామాజిక కామెంట్లు చేయడం. జాతివివక్షని  సున్నితంగా ఎత్తి చూపడం. ఒబమా నుంచి ట్రంప్ కొచ్చేసరికి మారిపోయిన పరిస్థితుల నేపధ్యాన్ని అద్దం పట్టడం. కమెడియన్, రచయితా, దర్శకుడూ అయిన జోర్డాన్ పీల్ దీన్ని సాహసంగానే సంధించాడు. శ్వేత జాతీయులు, నల్లజాతీయులు పక్కపక్కనే కూర్చుని ఈ సినిమా చూడ్డానికి ఇబ్బంది పడతారేమోనని సంకోచించినప్పటికీ, ప్రయత్నం ఆపకుండా తెరకెక్కిం చేశాడు. దీనికి సభ్య సమాజమంతా హర్షించి అత్యుత్తమ స్క్రీన్ ప్లే అవార్డు కట్టబెట్టేసింది. అవార్డు స్క్రీన్ ప్లేకి ఇచ్చినా సృజనాత్మకతా పరంగా ఇది సీదా సాదా స్క్రీన్ ప్లేనే.  జాతి వివక్షని  అపూర్వ కోణంలో చూపెట్టింది కాబట్టి విషయపరమైన ప్రాధాన్యమే స్క్రీన్ ప్లే అవార్డుకి అర్హమైంది. ఎక్కువగా ఉపోద్ఘాతంతోనే నడిచే ఈ స్క్రీన్ ప్లేలో అసలేముందో ఇప్పుడు చూద్దాం...

       కాన్సెప్ట్ ని చూస్తే, హీరోయిన్ కుటుంబం దశాబ్దాలుగా నల్లజాతీయుల్ని తమ లాంటి శ్వేత జాతీయులకి సరఫరా చేస్తూంటుంది. ఇక చచ్చిపోయే ధనిక శ్వేత జాతీయులు తాము స్వర్గతుల్యం చేసుకున్న అగ్రరాజ్యంలో ఒక్క జీవితమే జీవిస్తే చాలదని, ఇంకా ఇంకా జీవించి ఇందులోని మజా అంతు చూడాలని ఉవ్వీళ్ళూరుతూంటారు. స్వర్గం ఇంకెక్కడోలేదు, ఇక్కడే అమెరికాలోనే వుంది. ఇది తమ వల్లే సాధ్యమైంది. తమవల్ల సాధ్యం కానిదేదీ లేదు. తమ కలల్ని సాధ్యం చేసుకోవడానికి బానిసజాతి ఉపయోగపడుతూనే వుండాలి. అందుకని హీరోయిన్ తాత బతికుండగా ఒక ఆలోచన చేశాడు. అది కోగులా ప్రాసెస్. దీని ప్రకారం హిప్నాటిజంతో, న్యూరో సర్జరీతో చనిపోయిన వెంటనే ధనిక శ్వేత జాతీయుల ఆత్మని నల్లజాతీయుల శరీరంలోకి ప్రవేశ పెడతారు. నల్లజాతీయులే ఎందుకంటే వాళ్ళ శరీరం బలిష్టంగా వుంటుందని. 1936 ఒలింపిక్స్ లో ఓ నల్లజాతీయుడు అథ్లెట్స్  లో తనని ఓడించడాన్ని ఇందుకు ఆధారంగా తీసుకున్నాడు హీరోయిన్ తాత. 


ఈ ఆపరేషన్ ఇలా జరుగుతుంది : నల్లజాతీయుణ్ణి హిప్నటైజ్ చేసి అతడి ఆత్మని అట్టడుగుకు నెట్టేస్తారు. అప్పుడు మెదడు కొత్తగా ప్రవేశ పెట్టిన ఆత్మని స్వీకరిస్తుంది. అట్టడుగుకి వెళ్ళిపోయిన బాధితుడి ఆత్మ అక్కడ అంధకారంలో బందీ అయి వుండిపోతుంది. ఈ క్రమంలో చనిపోయిన శ్వేతజాతి వాడి నుంచి బాధితుడికి పాక్షిక మెదడు మార్పిడి చేస్తారు. అప్పట్లో చనిపోయిన హీరోయిన్ తాత, నానమ్మ ఈ ప్రాసెస్ తోనే  నల్లజాతి పనివాళ్ళ  రూపంలో ఇంట్లోనే వున్నారు, పొడిగించుకున్న  జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ. ఇప్పుడు హీరోయిన్ తండ్రి న్యూరో సర్జన్ గా, తల్లి హిప్నటిస్టుగా దూరంగా ఒక చోట ఎస్టేట్ లో వుంటున్నారు. ఇక్కడే ఆత్మల మార్పిడి తంతు రహస్యంగా నిర్వహిస్తున్నారు...

ఈ నేపధ్యంలో కథేమిటో చూస్తే, క్రిస్ అనే నల్లజాతి ఫోటోగ్రాఫర్ హీరోయిన్ ప్రేమలో పడతాడు. ఐదారునెలల ప్రేమాయణం తర్వాత  క్రిస్ ని రోజ్ తన తల్లిదండ్రులకి పరిచయం చేస్తానని ఎస్టేట్ కి తీసికెళ్తుంది. వాళ్ళెలా రిసీవ్ చేసుకుంటారో నని సంకోచిస్తూనే ఆమె వెంట వెళ్తాడు క్రిస్. ఆమె తల్లిదండ్రులు తమ కూతురు ఎంపిక చేసుకున్న రంగు తేడా వాణ్ణి చూసి సాదరంగా ఆహ్వానిస్తారు. ఎంతో మృదువుగా సంభాషిస్తూ,  ఆఫ్రికన్ - అమెరికన్లంటే తమకెంత ప్రేమో, ఒబమాకి రెండు సార్లు ఎంత ప్రేమతో ఓట్లేసి గెలిపించుకున్నామో గర్వంగా చెప్పుకుని అతడి అభిమానం పొందుతారు. క్రిస్ సంకోచంనతా తీరిపోతుంది. రోజ్ తో అక్కడే సెటిలవుతాడు.

కానీ ఇంట్లో నల్లవాళ్ళయిన పనివాడు, పనిమనిషి విచిత్రంగా తోస్తారు. వాళ్ళు వాళ్ళ వయసుకి తగ్గట్టు ప్రవర్తించడం లేదని తెలుస్తుంది. ఒక  రాత్రి పనివాడు స్పీడుగా  రన్నింగ్ చేస్తూ తన కెదురొచ్చేస్తాడు. ఇంతరాత్రి పూట రన్నింగ్ ఎందుకు చేస్తున్నాడో అర్ధంగాదు.  . వాడిలో అథ్లెట్ అయిన రోజ్ తాత వున్నాడని తెలీదు. పనిమనిషిలో రోజ్ నానమ్మ వుందని కూడా తెలీదు. ఇంతలో రోజ్ తమ్ముడు వచ్చి జాయిన్ అవుతాడు. చూడగానే క్రిస్ మీద ద్వేషం పెంచుకుని బాహాటంగానే  విమర్శిస్తాడు. క్రిస్ కి ధూమపానం మానెయ్యాలని వుంటుంది. ఈ విషయం తెలుసుకున్న రోజ్ తల్లి మిస్సీ,  తనకి హిప్నటిజం వచ్చని, దాంతో దూరం చేస్తానని అంటుంది. ఒకరోజు చుట్టుపక్కల ముసలి ధనికులంతా  పార్టీ కొస్తారు. క్రిస్ ని చూసి అంచనాలు వేసుకుంటారు. క్రిస్ కి ఇది మామూలు గెట్ టు గెదర్ లా అన్పిస్తున్నా, నిజానికి వాళ్ళు వేలం పాట కొచ్చారు. రోజ్  తండ్రి డీన్ మూగ సైగలతో క్రిస్ ని వేలం వేస్తూంటాడు. ఎక్కువకి పాడుకున్న వాడికి ఓకే చేస్తాడు.       
    
ఇక క్రిస్ మీద కోగులా ప్రాసెస్ కి రహస్య ఏర్పాట్లు చేస్తూంటారు డీన్, మిస్సీలు కలిసి. ఇంతలో రోజ్ గదిలో క్రిస్ కి చాలా ఫోటోలు దొరుకుతాయి. ఆ ఫోటోలలో  రకరకాల నల్లవాళ్ళతో ఆమె సన్నిహితంగా వుంటుంది. దెబ్బతింటాడు క్రిస్. రోజ్ తనని వంచించిందని. కోపంతో బ్యాగు సర్దుకుని వెళ్లిపోతూంటే,  రోజ్ తల్లిదండ్రులూ తమ్ముడూ చుట్టుముట్టేసి తమ నిజరూపాలు చూపిస్తారు. అతణ్ణి హిప్నటైజ్  చేసి పడగొట్టి కగోలా ప్రాసెస్ మొదలెడతారు. 

ఇప్పుడుగానీ క్రిష్ కి అసలేం జరుగుతోందో, ఎలాటి వలలో తను చిక్కుకున్నాడో తెలిసిరాదు. రోజ్  ప్రేమ నాటకాలాడుతూ నల్లవాళ్ళని పట్టుకొచ్చి తల్లి దండ్రులకి అప్పగిస్తోందన్నమాట. వాళ్ళు ఇలా ఆత్మల మార్పిడి చేస్తూ తమ జాతి జీవితాల్ని పొడిగించుకుని ఆనందిస్తున్నారన్న మాట. 
           ఇందులోంచి  క్రిస్ ఎలా తప్పించుకున్నాడన్నదే మిగతా కథ. 

         
జాతి వివక్ష గురించిన లోతైన అర్ధాలు ఈ కథావస్తువులో దొరుకుతాయి. వీళ్ళు హిట్లర్ కంటే ముందు కెళ్ళి ఆలోచించారు. హిట్లర్ తనకి పడని  జాతిని నిర్మూలించాడు. వీళ్ళు తమ మరణాంతర జీవితాలకి ఇక్కడే వారధిగా నిర్మించుకుంటున్నారు. ఒక మానవ హక్కుల అంశాన్ని ఇలా ప్రధాన
స్రవంతి హార్రర్ కథగా మార్చి  చూపించడంలో దర్శకుడు పెద్దగా క్రియేటివిటీ జోలికి పోలేదు. గంటా నలభై నిమిషాల స్క్రీన్ ప్లేలో గంటా పదిహేను నిమిషాలకి ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. అప్పుడే కోగులా ప్రాసెస్ కుట్ర ప్రేక్షకులకి తెలుస్తుంది. కానీ హీరోకి తెలీదు. ఇంకో పదినిమిషాలయ్యాక తన మీద దాడి జరిపి బందీ చేసినప్పుడే తెలుసుకుంటాడు. అక్కడ్నించీ మిడిల్ పదిహేను నిమిషాలే వుండి, క్లయిమాక్స్ కెళ్ళిపోతుంది కథ. 

అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్న మాట. గంటంపావు దాకా బిగినింగ్ విభాగమే సుదీర్ఘ ఉపో ద్ఘాతంతో కథ మొదలెట్టుకోవడా
నికి సన్నాహాలు చేసుకుంటూనే వుంటుంది.  దర్శకుడు దీన్ని ఇండీ ఫిలిం గా తీశాడు. అందుకే స్ట్రక్చర్ లో లేదు. వరల్డ్ మూవీస్, ఇండీ ఫిలిమ్స్ స్ట్రక్చర్లో వుండవనేది తెలిసిందే. 

          ఇలా జాతి వివక్ష పాయింటే ఆస్కార్ అవార్డు రావడానికి పనిచేసింది తప్ప గొప్ప స్క్రీన్ ప్లే అని కాదు.

సికిందర్