రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, మార్చి 2018, శనివారం

616 : మూవీ నోట్స్


       ఆస్కార్ విన్నర్ స్క్రీన్ ప్లేగా ‘గెట్ అవుట్ ‘ కి రెండు ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా హార్రర్స్ కి ఆస్కార్స్ ఇవ్వరు. రెండోది, నల్లజాతీయుడు స్క్రీన్ ప్లేకి ఇంతవరకూ ఆస్కార్ గెల్చుకోలేదు. ‘గెట్ అవుట్’ విషయంలో ఈ రెండూ సాధ్యమయ్యాయి. కారణం,  కథా వస్తువు  రాజకీయ, సామాజిక కామెంట్లు చేయడం. జాతివివక్షని  సున్నితంగా ఎత్తి చూపడం. ఒబమా నుంచి ట్రంప్ కొచ్చేసరికి మారిపోయిన పరిస్థితుల నేపధ్యాన్ని అద్దం పట్టడం. కమెడియన్, రచయితా, దర్శకుడూ అయిన జోర్డాన్ పీల్ దీన్ని సాహసంగానే సంధించాడు. శ్వేత జాతీయులు, నల్లజాతీయులు పక్కపక్కనే కూర్చుని ఈ సినిమా చూడ్డానికి ఇబ్బంది పడతారేమోనని సంకోచించినప్పటికీ, ప్రయత్నం ఆపకుండా తెరకెక్కిం చేశాడు. దీనికి సభ్య సమాజమంతా హర్షించి అత్యుత్తమ స్క్రీన్ ప్లే అవార్డు కట్టబెట్టేసింది. అవార్డు స్క్రీన్ ప్లేకి ఇచ్చినా సృజనాత్మకతా పరంగా ఇది సీదా సాదా స్క్రీన్ ప్లేనే.  జాతి వివక్షని  అపూర్వ కోణంలో చూపెట్టింది కాబట్టి విషయపరమైన ప్రాధాన్యమే స్క్రీన్ ప్లే అవార్డుకి అర్హమైంది. ఎక్కువగా ఉపోద్ఘాతంతోనే నడిచే ఈ స్క్రీన్ ప్లేలో అసలేముందో ఇప్పుడు చూద్దాం...

       కాన్సెప్ట్ ని చూస్తే, హీరోయిన్ కుటుంబం దశాబ్దాలుగా నల్లజాతీయుల్ని తమ లాంటి శ్వేత జాతీయులకి సరఫరా చేస్తూంటుంది. ఇక చచ్చిపోయే ధనిక శ్వేత జాతీయులు తాము స్వర్గతుల్యం చేసుకున్న అగ్రరాజ్యంలో ఒక్క జీవితమే జీవిస్తే చాలదని, ఇంకా ఇంకా జీవించి ఇందులోని మజా అంతు చూడాలని ఉవ్వీళ్ళూరుతూంటారు. స్వర్గం ఇంకెక్కడోలేదు, ఇక్కడే అమెరికాలోనే వుంది. ఇది తమ వల్లే సాధ్యమైంది. తమవల్ల సాధ్యం కానిదేదీ లేదు. తమ కలల్ని సాధ్యం చేసుకోవడానికి బానిసజాతి ఉపయోగపడుతూనే వుండాలి. అందుకని హీరోయిన్ తాత బతికుండగా ఒక ఆలోచన చేశాడు. అది కోగులా ప్రాసెస్. దీని ప్రకారం హిప్నాటిజంతో, న్యూరో సర్జరీతో చనిపోయిన వెంటనే ధనిక శ్వేత జాతీయుల ఆత్మని నల్లజాతీయుల శరీరంలోకి ప్రవేశ పెడతారు. నల్లజాతీయులే ఎందుకంటే వాళ్ళ శరీరం బలిష్టంగా వుంటుందని. 1936 ఒలింపిక్స్ లో ఓ నల్లజాతీయుడు అథ్లెట్స్  లో తనని ఓడించడాన్ని ఇందుకు ఆధారంగా తీసుకున్నాడు హీరోయిన్ తాత. 


ఈ ఆపరేషన్ ఇలా జరుగుతుంది : నల్లజాతీయుణ్ణి హిప్నటైజ్ చేసి అతడి ఆత్మని అట్టడుగుకు నెట్టేస్తారు. అప్పుడు మెదడు కొత్తగా ప్రవేశ పెట్టిన ఆత్మని స్వీకరిస్తుంది. అట్టడుగుకి వెళ్ళిపోయిన బాధితుడి ఆత్మ అక్కడ అంధకారంలో బందీ అయి వుండిపోతుంది. ఈ క్రమంలో చనిపోయిన శ్వేతజాతి వాడి నుంచి బాధితుడికి పాక్షిక మెదడు మార్పిడి చేస్తారు. అప్పట్లో చనిపోయిన హీరోయిన్ తాత, నానమ్మ ఈ ప్రాసెస్ తోనే  నల్లజాతి పనివాళ్ళ  రూపంలో ఇంట్లోనే వున్నారు, పొడిగించుకున్న  జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ. ఇప్పుడు హీరోయిన్ తండ్రి న్యూరో సర్జన్ గా, తల్లి హిప్నటిస్టుగా దూరంగా ఒక చోట ఎస్టేట్ లో వుంటున్నారు. ఇక్కడే ఆత్మల మార్పిడి తంతు రహస్యంగా నిర్వహిస్తున్నారు...

ఈ నేపధ్యంలో కథేమిటో చూస్తే, క్రిస్ అనే నల్లజాతి ఫోటోగ్రాఫర్ హీరోయిన్ ప్రేమలో పడతాడు. ఐదారునెలల ప్రేమాయణం తర్వాత  క్రిస్ ని రోజ్ తన తల్లిదండ్రులకి పరిచయం చేస్తానని ఎస్టేట్ కి తీసికెళ్తుంది. వాళ్ళెలా రిసీవ్ చేసుకుంటారో నని సంకోచిస్తూనే ఆమె వెంట వెళ్తాడు క్రిస్. ఆమె తల్లిదండ్రులు తమ కూతురు ఎంపిక చేసుకున్న రంగు తేడా వాణ్ణి చూసి సాదరంగా ఆహ్వానిస్తారు. ఎంతో మృదువుగా సంభాషిస్తూ,  ఆఫ్రికన్ - అమెరికన్లంటే తమకెంత ప్రేమో, ఒబమాకి రెండు సార్లు ఎంత ప్రేమతో ఓట్లేసి గెలిపించుకున్నామో గర్వంగా చెప్పుకుని అతడి అభిమానం పొందుతారు. క్రిస్ సంకోచంనతా తీరిపోతుంది. రోజ్ తో అక్కడే సెటిలవుతాడు.

కానీ ఇంట్లో నల్లవాళ్ళయిన పనివాడు, పనిమనిషి విచిత్రంగా తోస్తారు. వాళ్ళు వాళ్ళ వయసుకి తగ్గట్టు ప్రవర్తించడం లేదని తెలుస్తుంది. ఒక  రాత్రి పనివాడు స్పీడుగా  రన్నింగ్ చేస్తూ తన కెదురొచ్చేస్తాడు. ఇంతరాత్రి పూట రన్నింగ్ ఎందుకు చేస్తున్నాడో అర్ధంగాదు.  . వాడిలో అథ్లెట్ అయిన రోజ్ తాత వున్నాడని తెలీదు. పనిమనిషిలో రోజ్ నానమ్మ వుందని కూడా తెలీదు. ఇంతలో రోజ్ తమ్ముడు వచ్చి జాయిన్ అవుతాడు. చూడగానే క్రిస్ మీద ద్వేషం పెంచుకుని బాహాటంగానే  విమర్శిస్తాడు. క్రిస్ కి ధూమపానం మానెయ్యాలని వుంటుంది. ఈ విషయం తెలుసుకున్న రోజ్ తల్లి మిస్సీ,  తనకి హిప్నటిజం వచ్చని, దాంతో దూరం చేస్తానని అంటుంది. ఒకరోజు చుట్టుపక్కల ముసలి ధనికులంతా  పార్టీ కొస్తారు. క్రిస్ ని చూసి అంచనాలు వేసుకుంటారు. క్రిస్ కి ఇది మామూలు గెట్ టు గెదర్ లా అన్పిస్తున్నా, నిజానికి వాళ్ళు వేలం పాట కొచ్చారు. రోజ్  తండ్రి డీన్ మూగ సైగలతో క్రిస్ ని వేలం వేస్తూంటాడు. ఎక్కువకి పాడుకున్న వాడికి ఓకే చేస్తాడు.       
    
ఇక క్రిస్ మీద కోగులా ప్రాసెస్ కి రహస్య ఏర్పాట్లు చేస్తూంటారు డీన్, మిస్సీలు కలిసి. ఇంతలో రోజ్ గదిలో క్రిస్ కి చాలా ఫోటోలు దొరుకుతాయి. ఆ ఫోటోలలో  రకరకాల నల్లవాళ్ళతో ఆమె సన్నిహితంగా వుంటుంది. దెబ్బతింటాడు క్రిస్. రోజ్ తనని వంచించిందని. కోపంతో బ్యాగు సర్దుకుని వెళ్లిపోతూంటే,  రోజ్ తల్లిదండ్రులూ తమ్ముడూ చుట్టుముట్టేసి తమ నిజరూపాలు చూపిస్తారు. అతణ్ణి హిప్నటైజ్  చేసి పడగొట్టి కగోలా ప్రాసెస్ మొదలెడతారు. 

ఇప్పుడుగానీ క్రిష్ కి అసలేం జరుగుతోందో, ఎలాటి వలలో తను చిక్కుకున్నాడో తెలిసిరాదు. రోజ్  ప్రేమ నాటకాలాడుతూ నల్లవాళ్ళని పట్టుకొచ్చి తల్లి దండ్రులకి అప్పగిస్తోందన్నమాట. వాళ్ళు ఇలా ఆత్మల మార్పిడి చేస్తూ తమ జాతి జీవితాల్ని పొడిగించుకుని ఆనందిస్తున్నారన్న మాట. 
           ఇందులోంచి  క్రిస్ ఎలా తప్పించుకున్నాడన్నదే మిగతా కథ. 

         
జాతి వివక్ష గురించిన లోతైన అర్ధాలు ఈ కథావస్తువులో దొరుకుతాయి. వీళ్ళు హిట్లర్ కంటే ముందు కెళ్ళి ఆలోచించారు. హిట్లర్ తనకి పడని  జాతిని నిర్మూలించాడు. వీళ్ళు తమ మరణాంతర జీవితాలకి ఇక్కడే వారధిగా నిర్మించుకుంటున్నారు. ఒక మానవ హక్కుల అంశాన్ని ఇలా ప్రధాన
స్రవంతి హార్రర్ కథగా మార్చి  చూపించడంలో దర్శకుడు పెద్దగా క్రియేటివిటీ జోలికి పోలేదు. గంటా నలభై నిమిషాల స్క్రీన్ ప్లేలో గంటా పదిహేను నిమిషాలకి ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. అప్పుడే కోగులా ప్రాసెస్ కుట్ర ప్రేక్షకులకి తెలుస్తుంది. కానీ హీరోకి తెలీదు. ఇంకో పదినిమిషాలయ్యాక తన మీద దాడి జరిపి బందీ చేసినప్పుడే తెలుసుకుంటాడు. అక్కడ్నించీ మిడిల్ పదిహేను నిమిషాలే వుండి, క్లయిమాక్స్ కెళ్ళిపోతుంది కథ. 

అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్న మాట. గంటంపావు దాకా బిగినింగ్ విభాగమే సుదీర్ఘ ఉపో ద్ఘాతంతో కథ మొదలెట్టుకోవడా
నికి సన్నాహాలు చేసుకుంటూనే వుంటుంది.  దర్శకుడు దీన్ని ఇండీ ఫిలిం గా తీశాడు. అందుకే స్ట్రక్చర్ లో లేదు. వరల్డ్ మూవీస్, ఇండీ ఫిలిమ్స్ స్ట్రక్చర్లో వుండవనేది తెలిసిందే. 

          ఇలా జాతి వివక్ష పాయింటే ఆస్కార్ అవార్డు రావడానికి పనిచేసింది తప్ప గొప్ప స్క్రీన్ ప్లే అని కాదు.

సికిందర్