రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, ఫిబ్రవరి 2020, సోమవారం

918 :


        నిన్నటి ‘QA’ లో రెండు ప్రశ్నల చివరి అంశాలకి వివరణలు మిస్సయ్యాయి : సహకార దర్శకుడు రవి అడిగిన నాల్గో ప్రశ్నలో చివరి భాగం - కొత్త ఐడియాలతో వస్తున్న కొత్త ఫిలిం మేకర్స్ కూడా ఇలాంటి అత్యంత ముఖ్యమైన విషయాలలో కూడా ఎందుకు ఫెయిలవుతున్నారు? స్ట్రక్చర్ గురించి నేర్చుకోకపోవడమా లేక అసలు దాని గురించి అవగాహన లేకపోవడం కారణమా? లేదా ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఇలాంటి స్క్రిప్ట్ ను ఓకే చేసి కూడా అందులో లోపాలను గుర్తించ లేకపోవడమా?
        దీనికి వివరణ : కొత్త ఫిలిం మేకర్స్ - ముడి ఫిలిం లేదు కాబట్టి మూవీ మేకర్స్ అందాం -అందరూ అలా లేరు, ఎందరో అలా వున్నారు. ఏడాదికి డెబ్భై మంది చొప్పున కొత్త దర్శకులు వస్తున్నారు. ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. కాబట్టి స్ట్రక్చర్ నేర్చుకు తీరాలని షరతు విధించలేం. అది ఇప్పటికిప్పుడు వొంట బట్టేది కూడా కాదు. సినిమాల్లోకి రావాలనుకుంటున్నప్పట్నించే సాధన చెయ్యాలి. మనం రివ్యూలు రాయాలనుకున్నప్పట్నించే సాధన చేశాం. రివ్యూలు రాయడానికి అర్హతలు వుండాలి కాబట్టి. సరే, ఇప్పటికిప్పుడు స్ట్రక్చర్ నేర్చుకోలేక పోయినా, క్రియేటివ్ యాస్పెక్ట్ తెలియక పోయినా, కనీసం పర్యావరణం తెలుసుకునైనా సినిమాలు తీస్తే, అపసోపాలు పడైనా ఒడ్డున పడొచ్చు. మరీ జీరో అవకుండా యావరేజీ అన్పించుకోవచ్చు. ఏమిటా పర్యావరణం? పర్యావరణంలో చాలా ఇమిడి వుంటాయి. వాటిలో కనీసం ఒక్క మార్కెట్ యాస్పెక్ట్ నైనా పట్టించుకోగల్గాలి. కొత్త దర్శకుల ఫ్లాప్స్ కి మొదటి కారణం ప్రధానంగా మార్కెట్ యాస్పెక్ట్ లోపించడమే. మార్కెట్ ని కూడా పట్టించుకోకుండా ఏం సినిమాలు తీస్తూంటారో అర్ధంగాదు. ఇప్పటి మార్కెట్ యాస్పెక్ట్ రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్. ఇంతేకాదు, మార్కెట్ యాస్పెక్ట్ సీన్లలో కూడా పెల్లుబకాలి. కథ, నటనలు, డైలాగులు, పాటలూ ప్రతీదీ మార్కెట్ యాస్పెక్ట్ తో కళకళ లాడాలి. ఇది కూడా చేతగానప్పుడు సినిమాలు తీయడం అనవసరం. హాలీవుడ్ లో అన్నేసి శాస్త్రాలు అన్వయిస్తే 50 శాతం సక్సెస్ సాధించగల్గుతున్నారు. శాస్త్రాల్ని పక్కనబెట్టి తెలుగులో 8 శాతానికి మించడం లేదు.
        ఇక  పెద్ద ప్రొడక్షన్ కంపెనీలనే కాదు, ఎవరైనా  స్క్రిప్ట్స్ ని ఓకే చేసేటప్పుడు అందులో లోపాలు గుర్తించే వ్యవస్థ ఇంకా తమిళంలో వున్నట్టు ఇక్కడ లేదు. తమిళంలో కనీసం రెండు కంపెనీల అధినేతలు ఈ కాంబినేషన్లని నమ్మి ఇక సినిమాలు తీయలేమని, స్క్రీన్ ప్లే కోర్సులు నేర్చుకుని వచ్చి ప్రొడ్యూసర్ సీట్లో కూర్చున్నారు. స్ట్రక్చర్ నేర్చుకున్న రచయితలతో స్క్రిప్ట్ డిపార్ట్ మెంట్ నేర్పాటు చేసుకుని, దర్శకుల్ని తళతళా మెరిసేలా తోముతున్నారు. కార్తీ తో ‘ఖైదీ’ ఇలా వచ్చిందే.
        సహకార దర్శకుడు పీఏ 
ప్రశ్నలో  empathy గురించి : అంటే మరేమీ లేదు. పాత్రకి అవసరమైన ఇతర పాత్రలపట్ల వుండాల్సిన దయ, సానుభూతి, సహాయ గుణం. పాత్ర నచ్చాలంటే ఈ మానవీయ కోణం అవసరం. చాలా సినిమాల్లో హీరోలకి ఇది లేకుండా వుండదు. హీరో సమాజంలో అట్టడుగు స్థాయి మనిషిగా వున్నా ఈ ఫీలింగ్ ని కల్గించవచ్చు. గోవింద్ నిహలానీ తీసిన ‘ఆక్రోశ్’ చూస్తూంటే ఇలాటి చాలా పవర్ఫుల్ పాత్రగా ఓంపురి పాత్ర కన్పిస్తుంది. డెంజిల్ వాషింగ్టన్ తో తీసిన ‘ఈక్వలైజర్ -2’ భారీ యాక్షన్ లో,  సామాన్యుల పట్ల సహాయగుణంతో అతను ఉన్నతంగా కన్పిస్తాడు. ముగింపు షాట్స్ ని మర్చిపోలేం. ఆత్మీయుల మరణానికి దుఃఖించే సన్నివేశాన్ని కూడా బలంగా రిజిస్టర్ చేస్తే పాత్ర ముద్రించుకు పోతుంది. జంతువుల్ని ప్రేమించే దృశ్యాలతో కూడా ఎంపతీని రాబట్ట వచ్చు. ఇంకా పెద్ద వయసు పాత్రలతో విధేయతగా మెలగినా కూడా ఈ ఫీల్ వస్తుంది. చిన్న పిల్లలతో విధేయత బాగా పనిచేస్తుంది. ఇలాటివన్నీ ప్రేక్షకుల్నిఆగి ఆలోచించేలా చేస్తాయి.
***