రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, జూన్ 2022, శనివారం

1177 : కొత్త విడుదలలు



    ఈ వారం 8 సినిమాలు విడుదలయ్యాయి. చిన్న హీరోలు, కొత్త హీరోలూ నటించిన ఈ ఎనిమిదీ వివిధ జానర్స్ తో ప్రేక్షకుల ముందు కొచ్చాయి. వీటికి 8 మంది దర్శకుల్లో ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళు కొత్తవాళ్ళు. కొండ కి రాంగోపాల్ వర్మ, 7 డేస్ 6 నైట్స్ కి ఎంఎస్ రాజు, చోర్ బజార్ కి జీవన్ రెడ్డి (జార్జిరెడ్డి దర్శకుడు) ముగ్గురూ ఈసారి కూడా విషయం లేని సినిమాలు తీశారు. మాజీమంత్రి కొండా మురళి జీవితం ఆధారంగా ఏం తీశారో వర్మకే తెలీదు. వజ్రం దొంగతనం కథతో  చోర్ బజార్' ఏం తీశాడో దర్శకుడికే తెలీదు. ఇందులో పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరో. వరసగా ఆకాష్ పూరీ సినిమాలు ప్లాపవుతున్నాయి. ఇక  7 డేస్ 6 నైట్స్ గోవాలో బ్యాచిలర్ పార్టీ కథతో ఎం ఎస్ రాజు మరో అడల్ట్ సినిమా ఏం తీశారో ఆయనకే తెలీదు. ఇదొక కొత్త ట్రెండ్ ప్రారంభమైందేమో. ఏం తీస్తున్నారో వాళ్ళకే తెలియకుండా సినిమాలు తీసే ట్రెండ్. ఈసారి కూడా ఎంఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ కి ఫ్లాప్. ఈ ట్రెండ్ ని అమాయకులైన కొత్తదర్శకులు ఫాలో అయినా ఆశ్చర్యం లేదు.

        'మ్మతమే' కిరణ్ అబ్బవరం నటించిన రోమాంటిక్ కామెడీ. కొత్త దర్శకుడు గోపీనాథ్ రెడ్డి పాత ప్రేమ కథతో వచ్చాడు. ఇంటి పనులు చూసుకోవడానికి తగిన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకునే హీరో కథ. ఇది వర్కౌట్ కాలేదు. కిరణ్ అబ్బవరంకి మరో ఫ్లాప్. ఇషాన్ ఆర్య అనే కొత్త దర్శకుడు హీరో లక్ష్ తో తీసిన పాత మాస్ కథ 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' కూడా బాక్సాఫీసుకి బరువైపోయింది. కొత్త దర్శకురాలు అపర్ణా మల్లాది ప్రిన్స్ తో, కొత్త వాళ్ళతో తీసిన 'పెళ్ళికూతురు పార్టీ' ప్రేమలూ పెళ్ళిళ్ళ చుట్టూ బ్యాచిలరెట్ పార్టీ సినిమానే. దీనికీ తగిన దమ్ము లేకుండా పోయింది. కొత్త వాళ్ళతో కొత్త దర్శకుడు ఉమాశంకర్ తీసిన 'సాఫ్ట్ వేర్ బ్లూస్' అనే రోమాంటిక్ కామెడీ కూడా డిటో.

        కొత్త వాళ్ళతో కొత్తదర్శకుడు మోహన్ శ్రీవత్స తీసిన 'కరణ్ అర్జున్' రోమాంటిక్ యాక్షన్ ఒక్కటే విడుదలైన వాటిలో బెటర్ సినిమా. దీనికి హాలీవుడ్ 'వెడ్డింగ్ గెస్ట్' తో పోలికలున్నా ఈ ట్రయాంగులర్ లవ్ సినిమా, థార్ ఎడారిలో రోడ్ యాక్షన్ మూవీగా తగిన సస్పెన్స్ తో వుంటూ నిలబడే అవకాశముంది.

***