రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, నవంబర్ 2021, గురువారం

1088 : రివ్యూ

దర్శకత్వం : అజయ్ భుయాన్
తారాగణం : రవి దుబే, జోయా ఆఫ్రోజ్, రవి కిషన్, పీయూష్ మిశ్రా, మధుర్ మిట్టల్, నావెద్
అస్లం. రాజేష్ శర్మా, ఋత్విక్ షోరే తదితరులు
కాన్సెప్ట్ : దేబూ పుర్కాయస్థ, కథ : నరేష్ దుబే, శివ్ సింగ్, తేజ్పాల్ రావత్, దేబూ పూర్కాయస్థ, స్క్రీన్ ప్లే: శివ్ సింగ్, మాటలు : అనుకృతీ ఝా, ఛాయాగ్రహణం : మనోజ్ రెడ్డి
బ్యానర్ : ఎమెక్స్ ప్లేయర్
నిర్మాతలు: దీపక్ ధార్, ఋషి నేగీ
విడుదల : నవంబర్ 18, 2021, ఎమెక్స్ ప్లేయర్
***
        పాపులర్ టీవీ స్టార్ రవి దుబే వెబ్ సిరీస్ మత్స్య కాండ్ సీజన్ -1 విడుదలైంది. థ్రిల్లర్ జానర్లో 11 ఎపిసోడ్ల షో ఇది. నాగ చైతన్యతో 2014 లో దడ తీసిన దర్శకుడు అజయ్ భుయాన్, రవి దుబేతో ప్రయోగాత్మక వెబ్ సిరీస్ తీశాడు. బాలీవుడ్ సహాయ నటుడు పీయూష్ మిశ్రా ఓ పాత్ర వేశాడు. భోజ్ పురి సూపర్ స్టార్ రవి కిషన్ కీలక పాత్రలో కన్పిస్తాడు. రివెంజీ దాని చుట్టూ స్కామ్స్ తో సాగే దీని కథాకథనాల నిడివి ఆరు గంటలు. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40 నిమిషాలు. ఇది పెద్దలకు మాత్రమే వెబ్ సిరీస్.  

        ఇందులో రవి దుబే ఎపిసోడ్ కొక బ్యాంగ్ తో కనిపిస్తాడు. కన్పించినప్పుడు రవి దుబే అని గుర్తుపట్ట లేనంత మాయ చేస్తాడు పాత్రలకే కాదు, ప్రేక్షకులకి కూడా. అతను మాయగాడు. పేరు మత్స్య. మాయగాడుగా అతనెలా మారాడని తెలియజేస్తూ జైలు సీనుతో ప్రారంభమవుతుంది.

        సైనికుడైన మత్స్య తండ్రి కార్గిల్ యుద్ధంలో మరణిస్తాడు. ప్రభుత్వ సాయం కింద అతడి తల్లికి పెట్రోలు బంకు కేటాయిస్తారు. ఆ పెట్రోలు బంకు తగుల బెట్టేసి జైలుకి పోతాడు మత్శ్య. జైల్లో సిబ్బంది హింసిస్తారు. తను బయటికెళ్ళి పగ దీర్చుకునే పనుంది. అందుకని  జైల్లోంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూంటాడు. జైల్లో మహాభారతం బోధించే శివో పాసకుడు ఆనంద్ పండిత్ (పీయూష్ మిశ్రా) వుంటాడు. మత్స్య బయటికెళ్తే బయటి ప్రపంచంలో ఎలా పరిస్థితుల్ని ఎదుర్కోవాలో అభిమన్యుడి కథ భోదిస్తాడు. జైల్లోంచి బయటపడ్డ మత్స్య ఇక మాయగాడుగా మారతాడు. చిటికెలో మాయచేసి దోచుకుని మాయమై పోతూంటాడు. ఈ కేసులు ఏసీపీ తేజ్ రాజ్ సింగ్ (రవి కిషన్) దృష్టికొచ్చి వేట మొదలెడతాడు. తేజ్ రాజ్ కంటే తెలివైన మత్స్య ఎత్తుకి పై ఎత్తులేసి తప్పించుకుంటూ మాయలు చేస్తూంటాడు. ఇతడ్ని తేజ్ రాజ్ ఎలా పట్టుకున్నాడన్నది మిగతా కథ.

      ఇందులో మెజీషియన్ ఊర్వశీగా జోయా ఆఫ్రోజ్ తో రవి దుబేకి రోమాన్స్ వుంటుంది. కామెడీ వుంటుంది.  రవి దుబే పగ దీర్చుకునే విలన్లు కావలసినంత మంది  వున్నారు, ఢిల్లీ, మీరట్, జైపూర్, సాంభార్లలో ఈ గ్యాంగ్ స్టర్స్ తో పగదీర్చుకునే కథకి రవి దుబే ప్రత్యేక ఆకర్షణ. టీవీ సీరియల్స్ తో సాఫ్ట్ రోల్స్ లో కన్పించే ఇతను ఇంత హార్డ్ కోర్ క్రిమినల్ పాత్ర వేసి ఆశ్చర్య పరుస్తాడు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ బ్యాగేజ్, యాక్షన్ సిల్స్ లో పూర్తిగా కొత్త రవి దుబే ప్రత్యక్షమవడం ఒకెత్తయితే, మాయగాడుగా ఎపిసోడ్ కొక మారు వేషం వేయడం ఒకెత్తు. 11 ఎపిసోడ్లలో 11 మారు వేషాల్లో కన్పిస్తాడు. కన్పించినప్పుడల్లా గుర్తు పట్టలేనంత మాయ చేస్తాడు, థ్రిల్ చేస్తాడు  మనల్ని. ఈ క్రెడిట్ మేకప్ డిపార్ట్ మెంట్ నరేంద్ర ఝెట్వా, మేఘనా సకట్ లకి పోతుంది.     

    గ్యాంగ్ స్టర్స్ మీద పగ దీర్చుకునే రక్త దాహ పాత్ర  రవి దుబేది. మాయలు చేసి అనూహ్య సంఘటనలు సృష్టిస్తూనే, ఎక్కడా తనని పట్టించే ఆధారం వదలని మాస్టర్ క్రిమినల్ గా పాత్రని తీర్చిదిద్దిన తీరుకి క్రెడిట్ రచయితలకి పోతుంది. అలాగే ఏసీపీ గా రవికిషన్ పాత్ర కూడా. కర్కోటకుడైన బ్యాడ్ పోలీసు పాత్ర. ఇతడికీ, ఇతను పట్టుకోవాల్సిన రవి దుబేకీ మధ్యే ఈ ఎపిసోడ్లు కాబట్టి, ఇద్దరి ఎలుకా పిల్లీ చెలగాటపు కథనాన్ని హైలైట్ చేస్తూ కాన్సెప్ట్ ని నిలబెట్టారు.

        గ్యాంగ్ స్టర్స్ తో వెబ్ సిరీస్ అంటేనే ఆయుధాలు, హత్యలు, బూతులూ కాబట్టి ఇవి ఇందులోనూ వున్నాయి. పాత్రలు బండ బూతులు తిడితే తప్ప ఇలాటి వెబ్ సిరీస్ కి నిండుదనం రాదన్నట్టు ప్రేక్షకులకి పళ్ళెంలో పెట్టి అందిస్తున్నారు. ఈ సిరీస్ చూస్తూంటే ఇందులోని బండ బూతులు మన ఇంటి నిండా ప్రతిధ్వనించి దరిద్రంగా వుంటుంది ఇల్లు. ఈ బూతులు తాకిన గోడలు మలినమైపోతాయి.

        అజయ్ భుయాన్ దర్శకత్వమెలా వున్నా పదకొండు మారువేషాలనే యూఎస్పీ ఎపిసోడ్స్ ని నిలబెట్టింది. దర్శకత్వం మీద మన దృష్టి పడనంతగా రవి దుబే ఈ మారు వేషాలతో కమ్మేస్తాడు. నాల్గు నగరాల లొకేషన్స్ మనోజ్ రెడ్డి ఛాయాగ్రహణంలో బావున్నాయి. ఇండోర్స్ కి డార్క్ లైటింగ్ చేశారు. మిస్టరీ, థ్రిల్, డ్రామా ప్రధానంగా ఈ సిరీస్ మొదటి రెండు ఎపిసోడ్లు కదలని కథతో ఆసక్తికరంగా వుండవు. మిగిలిన ఎపిసోడ్స్ గేమ్ అందుకుని వేగం పుంజుకుంటాయి.

—సికిందర్