రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, November 10, 2014

షార్ట్ నోట్స్

   తెలంగాణా నుంచి టెర్రిఫిక్ థాట్! 

                                                                                      'ఆనపకాయ’ 
చన, ఛాయాగ్రహణం, సంగీతం : శ్రీనివాస్ బండారి

తారాగణం: రుక్మిణి బండారి, కిషన్, మంగ్యా నాయక్, శ్రీనివాస్ బండారి, సంధ్యా బండారి, సత్యేందర్ మాదికాయల, సుజాతా మాదికాయల తదితరులు 

                                                            ***
        సెన్సిబిలిటీ వుంటే టెక్నాలజీకి కళాత్మక గౌరవం దక్కుతుంది. ప్రకృతితో గాఢంగా
పెనవేసుకున్న హృదయంలోంచే  స్వచ్చమైన సృజనాత్మకత సహజత్వం ఉట్టిపడుతూ పులకింప జేస్తుంది. టెక్నాలజీ ప్రకృతిని పట్టుకోగలగాలే గానీ, టెక్నాలజీని ప్రకృతిమీద రుద్ద కూడదు. అందుకే ‘బెన్ హర్’  లాంటి ప్రపంచ ప్రసిద్ది పొందిన చలన చిత్రంలో, అజరామరంగా నిల్చిపోయిన - సుదీర్ఘంగా సాగే, గుర్రపు రధాల పోటీ ఎపిసోడంతా ఎలాటి నేపధ్య సంగీతం లేకుండా, కేవలం రధ చక్రాల సవ్వడులతో మనం కూడా ఆ సన్నివేశంలో పాల్గొంటున్నట్టే అనుభవాన్నిస్తాయి.  అలాటి స్పందనలే మనలో కలిగించే షార్ట్ ఫిలిం ‘ఆనపకాయ’  అనే అచ్చ తెలంగాణా జీవిత చిత్రణ!
          షార్ట్ ఫిలిం అన్నాక క్షణకాలం కూడా స్క్రీన్ టైంని  వృధాచేయకుండా, మొదటి షాట్ నుంచే ప్రేక్షకుల్ని కట్టి పడేయాలన్న సూత్రానికి నిలువెత్తు నిదర్శనం గా ఈ ‘ఆనపకాయ’ ని చెప్పుకోవచ్చు. ఒక పల్లె జీవితం, దీనికి కాంట్రాస్ట్ గా నగర జీవితం చూపిస్తూ పల్లెనుంచి ప్రయాణం కట్టిన ఒక ఆనపకాయ, ఏ తీరాలకి చేరి ఏం చెప్పబోతోందో నన్న ఉత్కంఠ  రేకెత్తిస్తూ సాగే కథనానికి,  శ్రీనివాస్ బండారి దర్శకుడే గాక ఛాయగ్రహకుడు కూడా.
          పచ్చని పొలాలు, పల్లె మార్గాలు, కాడెద్దులు, కోడి పుంజులు, రైతు బిడ్డలు,గిరిజన యువతి లాలిపాట ...ఇదంతా ఏ నేపధ్య సంగీతమూ లేకుండా కేవలం పక్షికూతల నేపధ్యంలో వాటి వాటి సహజ ధ్వనులతో- చుట్టూ వాతావరణానికి జీవం పోస్తూంటే, బైక్ మీద బయలేదిరిన అతనితో యాంత్రిక శబ్దాలు మొదలుతాయి. పైగా హుషారుగా  ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సినిమా పాటల సందడి ! ఇతను ఆ గిరిజన కుటుంబం దగ్గరికి అప్పు వసూలుకి వస్తాడు. వచ్చి వెళ్తూ చెట్టుకి కాసిన ఆనప కాయ అడుగుతాడు.  గిరిజన రైతు సంతోషంగా అది తెంపి ఇస్తాడు. బయల్దేరిన ఆ యువకుడికి ఇంటికి చేరుకునే సరికి, అప్పిచిన అతను కార్లో వస్తాడు. అతనికి విషయం చెప్పి ఇంట్లో పెట్టుకున్న ఆనపకాయ తెచ్చి ఇచ్చేస్తాడు. ఇంటి కెళ్ళిన కారతను ఆ ఆనపకాయని భార్య కిస్తాడు. భార్య అక్క కూతురికి సంబంధం వచ్చిందనీ, సిటీ కెళ్లా లనీ అనేసరికి, ఆమెని సిటీలో దింపి వెళ్ళిపోతాడు వేరేపని మీద. ఆమె అక్క కిద్దామని ఆ కార్లో పెట్టుకొచ్చిన ఆనపకాయ కార్లో అలాగే వుండి పోతుంది...అతను కారులో ల్యాండ్ కొనుగోలు వ్యవహారంలో ఇంకో చోటికి వెళ్లేసరికి, కారులో మళ్ళీ అనపకాయ కన్పిస్తుంది...
          ఇలా చేతులు, స్థలాలు మారుతూ పోతూంటుంది ఆనపకాయ. చివరికి అదేమయ్యిందీ, ఎక్కడికి చేరబోతోందీ చూపించి, మళ్ళీ పల్లె కి వచ్చేసి అదే గిరిజన రైతు మీదికి కెమెరా ని పాన్ చేసి- ఇంగ్లీషులో సబ్ టైటిల్స్ వేయడం మొదలెడతాడు దర్శకుడు. కథనం తెలంగాణా యాసలో సాగుతూ, మొదట్నుంచీ సబ్ టైటిల్స్ కూడా పడుతూనే వుంటాయి. చివరికి గిరిజన రైతు దగ్గరికి వచ్చేసరికి,  కథ ప్రారంభమైనప్పటి కాలుష్యంలేని అదే పల్లె నిశ్శబ్దం పర్చుకుని వుంటుంది. ఆరుబయట  పడుకుని ఆకాశంలోకి చూస్తున్న ఆ రైతుకి పైన విమానం పోతూ కన్పిస్తుంది...ఇక సబ్ టైటిల్స్ మొదలౌతాయి. పల్లె జీవితం, నగర జీవితం రెండిటినీ చూపించు కొచ్చిన దర్శకుడు –ఆ సబ్ టైటిల్స్ ద్వారా మాత్రమే తేల్చి చెప్పదలచుకున్న విషయాన్ని వ్యక్తం చేస్తూంటాడు- ముక్తాయింపుగా ఆ టెర్రిఫిక్ మెసేజ్ ఏమిటో స్వయంగా చూసి చప్పట్లు కొట్టాల్సిందే!
          సంభాషణలు పనిగట్టుకుని రాసినట్టుగా లేవు. పలికే తీరులో కూడా తెచ్చి పెట్టుకున్న నటనలు లేవు. నిత్య జీవితంలో మనం చుట్టూ చూసే దృశ్యాలే అన్నంతగా ఇన్వాల్వ్ చేస్తూ చకచకా సాగిపోతూంటాయి. విజువల్ మీడియాకి రాయాలనుకునే సరికి కృత్రిమ తెలంగాణా యాస  తెరకెక్కడం మనం చూస్తూనే వుంటాం. అలాటి చాపల్యం కూడా కన్పించని నిగ్రహం ఇక్కడ కన్పిస్తుంది. బాగా జీవితం తెలిసిన అనుభవంతో ఆద్యంతం చైతన్యాన్ని నింపిన దర్శకుడ్ని అభినందించక ఉండలేం. తెలుగుదనం తెలుగుదనం అంటూంటాం- అసలు తెలుగుదన మంటే ఏంటో  దాని అసలు రుచెలా వుంటుందో ఈ అనపకాయ చూస్తే తెలుస్తుంది.
          ముందు చెప్పుకున్నట్టు- టెక్నాలజీకే కాదు, తెలుగు దనానికే కళాత్మక గౌరవం చేకూర్చి పెట్టిన ఈ ‘ఆనపకాయ’ ఒనాఫ్ ది బెస్ట్ షార్ట్స్  గా చిరకాలం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని చెప్పొచ్చు!

సికిందర్ 
(నోరీల్స్ డాట్.కాం)