రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, ఆగస్టు 2018, ఆదివారం

673 : స్ట్రక్చర్ అప్డేట్స్


       సినిమా పాత్ర కథని పట్టుకుని ప్రయాణిస్తుందా, లేక కథని పుట్టిస్తూ ప్రయాణిస్తుందా? మొదటిది జరిగితే నష్టమేమిటి? రెండోది జరిగితే లాభమేమిటి? రెండోది జరిగితే  ‘గోల్డ్’  లాంటి లాభం. మొదటిది జరిగితే ‘శ్రీనివాస కళ్యాణం’ లాంటి నష్టం. ఇవాళ్ళ ఇది కొత్తగా చెప్పుకునే విషయం కాదు. చాలా పాత విషయమే. సినిమా కథ పాత్రని పట్టుకుని ప్రయాణిస్తే పాత్ర యాక్టివ్ గా వుంటుంది, ఆ యాక్టివ్ పాత్ర కథని ముందుకు నడుపుతుంది. సినిమా పాత్రే కథని పట్టుకుని ప్రయాణిస్తే పాసివ్ పాత్రవుతుంది, ఆ పాసివ్ పాత్ర కథని కూల్చేస్తుంది. నూటికి తొంభై సార్లు ఏం జరుగుతోందంటే, రెండున్నర గంటల పాత్రని ఆలోచించకుండా, కేవలం రెండున్నర గంటల కథని ఆలోచించడం వల్ల పాసివ్ పాత్రలు పుట్టి, 90 శాతం సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.
          ‘గోల్డ్’ లో పక్కకి తొలగకుండా పూర్తిగా రెండున్నర గంటల పాత్రని ఆలోచించారు. అందుకని ప్రేక్షకులు పాత్రని పట్టుకుని ప్రయాణిస్తూ, అది పుట్టిస్తున్నకథని అనుభవించే అదృష్టానికి నోచుకుంటున్నారు. పాత్ర కథని పుట్టించక పోతే, కథని కథకుడి పెంపుడు కుక్కలు కూడా అనుభవించ లేవు. దొంగలు పడ్డా మాకేంటని కునుకు తీసి, కథకుడి ఇంటిని దొంగల పాల్జేసి కక్ష తీర్చుకుంటాయి. కథకుడు సినిమా కథ రాయడం మొదలెట్టినప్పుడు ఈ కనీస జ్ఞానం లేకపోతే, నీరో చక్రవర్తి అవుతాడు. తను రాసి పక్కన పడేస్తున్న ఒక్కో పేజీ మీద లక్షో, కొన్ని లక్షలో బడ్జెట్ భస్మీపటలమవడానికి సిద్ధమవుతోంటే, తన లోకంలో తాను వీరోచితంగా రాసుకుంటూ భావప్రాప్తి పొందుతూంటాడు. ఇతడి ముందు నీరో చక్రవర్తి అట్టర్ ఫ్లాపవుతాడు. ఫిడేలు పడేసి పెన్ను అడుక్కుంటాడు. 

          పాత్ర కథనెలా పుట్టిస్తుందంటే, పాత్రకో అవసరం (గోల్) వుంటుంది, ఆ అవసరాన్ని పొందేందుకు కథని పుట్టిస్తూంటాడు. పాత్ర లేకుండా ‘అవసరం’ వుండదు. ఏ కథైనా పుట్టేది పాత్ర ‘అవసరం’ తోనే. అవసరమే కథకి పుట్టిల్లు. అక్కడ్నించీ కథని అత్తారింటికి పంపడమే పాత్ర చేసే పని, చింతామణి దగ్గరికి కాదు. పాత్రని పక్కన బెట్టి కథకుడు అవసరాన్ని వూహించ గలడా? తన కథైతే వూహించగలడు. అప్పుడు తన ‘అవసరం’ పాత్ర ‘అవసరం’ గా కల్పించి, పాత్ర చేతిలో కథని పెట్టడు. తన జీవితంలో ఆ ‘అవసరం’ తో అయిన అనుభవాలే పాత్ర అనుభవాలుగా నమ్మిస్తూ చిత్రించుకు పోతాడు. తన ఆనుభవాలతో పాత్రని నడిపిస్తాడు. కానీ జీవితం అచ్చంగా సినిమాకి తర్జుమా అవాలంటే అది ఆర్ట్ సినిమా అవుతుందని అర్ధం జేసుకోడు. ఫిడేలు రైటర్నే అవ్వాలనుకుంటాడు. పెన్ను కోసం నీరో చక్రవర్తి వచ్చినా తనే హీరో ఐపోవాలనుకుంటాడు. పెన్ను పెట్టి ఫటేల్మని ఫిడేలుని చీరేస్తాడు!
***
        ‘గోల్డ్’ లో ముఖ్యంగా గమనించాల్సింది,  గోల్ (అవసరం) అనే పాత్ర పరికరం అప్డేట్ అయిన విధం. ఏ సినిమా చూసినా, ‘పాత్ర గోల్ - దానికోసం సంఘర్షణ – విజయం’ – అనే బ్రాకెట్లోనే వుంటాయనేది తెలిసిందే. అయితే ఇదొక టెంప్లెట్ బారిన పడి మొనాటనీ వచ్చేసింది. మొదటి అరగంట కథలో గోల్ ఏర్పడడం, తర్వాత గంట కథలో గోల్ కోసం సంఘర్షించి ఓ పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం, దాంతో చివరి అరగంటలో గోల్ ని సాధించుకోవడం. ఇదే టెంప్లెట్ లో, అందులో ఇవే యాక్ట్ బ్రేక్స్ ప్లేస్ మెంట్స్ తో సినిమాలు వస్తూంటాయి. వీటికి రివ్యూలు రాయాలన్నా థ్రిల్ వుండదు, యాంత్రికమే. ఈ బ్రాకెట్ ని బ్రేక్ చేయకూడదా? బ్రాకెట్ ని బ్రేక్ చేయడమంటే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని బ్రేక్ చేయడం కాదు. త్రీ యాక్ట్ స్ట్రక్చర్ త్రీ యాక్ట్ స్ట్రక్చరే కమర్షియల్ సినిమాలకి. దీన్ని కాదనుకున్న వాళ్ళు నాన్ కమర్షియల్ యూరోపియన్ సినిమాలు తీసుకోవచ్చు. 

          హాలీవుడ్ లో పూర్వం అరిస్టాటిల్ నాటక నమూనాతో ప్రారంభించుకుని, తర్వాత జోసెఫ్ క్యాంప్ బెల్ పురాణ కథల నమూనా కొచ్చి, దీని తర్వాత సిడ్ ఫీల్డ్ ఆధునిక  నమూనా స్వీకరించారన్నసంగతి తెలిసిందే. సుమారు మూడు దశాబ్దాలుగా సిడ్ ఫీల్డ్ నమూనాతోనే హాలీవుడ్ సినిమా లొస్తున్నాయి. హాలీవుడ్ ని అనుసరించే ఇతర దేశాల కమర్షియల్ సినిమాలు సైతం ఈ బ్రాకెట్లోకే వచ్చేశాయి. ఇన్నేళ్ళుగా ఈ బ్రాకెట్లో సినిమాలు చూసి చూసి విసుగేయడం లేదూ?

          తప్పకుండా విసుగేస్తోంది. రివ్యూ రైటర్ అనే శాల్తీ, గోల్ ఎప్పుడొస్తుందాని టైము చూసుకుంటూ – అరగంటకి రాకపోతే ఇంకా ఎదురు చూస్తూ, ఇంటర్వెల్ కొస్తే అసంతృప్తి చెందుతూ, ఇంటర్వెల్ తర్వాత వస్తే మటాష్ అనుకుంటూ గడపాల్సి వస్తోంది.  గోల్ అరగంటకే ఎందుకు రావాలి? ఇంటర్వెల్ కి వస్తే ఫస్టాఫ్ డొల్లగా మారుతుంది గనుక. ఇంటర్వెల్ తర్వాత వస్తే మిడిల్ మటాష్ అవుతుంది గనుక. అయినా సరే, గోల్ అరగంటకే ఎందుకు రావాలి?

          గోల్ అరగంటకి రావాల్సిందే! అది స్ట్రక్చర్. వీలయితే అరగంట లోపు పావుగంటకే రావొచ్చు, నష్టం లేదు. స్ట్రక్చర్ ని బ్రేక్ చేయలేరు. స్ట్రక్చర్ లోపల టెంప్లెట్ గా మార్చుకున్న క్రియేటివిటీని బ్రేక్ చేయాలి.  క్రియేటివిటీ మన ఇష్టం, స్ట్రక్చర్ ఎవడబ్బ సొత్తూ కాదు.  అరిస్టాటిల్, జోసెఫ్ క్యాంప్ బెల్ ల నమూనాలని ఆధునిక కాలానికి తగ్గట్టూ సరళీకరించి,  సిడ్ ఫీల్డ్ ఇచ్చిన నమూనా శాశ్వతం. ఇంతకంటే సరళీకరణ ఇక కుదరదు. ఉన్నతీ కరించడం కూడా కుదరదు. కుదిరేది దీని లోపల కథతో క్రియేటివిటీ ని ఇన్నోవేట్ చేసుకోవడమే, అప్డేట్ చేసుకోవడమే. అప్పుడే స్ట్రక్చర్ లోపల మొనాటనీ బ్రేక్ అవుతుంది. ఫ్రెష్ సినిమాలొస్తాయి.

***
        అరగంట లోనో, అంతకి మునుపో గోల్ వస్తే అది టెంప్లెట్ బారిన పడకుండా ఎలా మేనేజ్ చేయాలి? ఒక్కటే మార్గం : దాని కోసం మొదలయ్యే  ప్రత్యక్ష సంఘర్షణని ఆలస్యం చేయడం. గోల్ ఒక ప్రొడక్టు అనుకుంటే, సంఘర్షణ దాన్నుంచి వచ్చే బై ప్రొడక్టు. దీన్నాలస్యం చేయాలి. ముందు శోభనం జరిపించెయ్యాలి, సంసారం పిల్లాపీచూ తర్వాతెప్పుడో! వాటి కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేట్టు చేయాలి. ‘గోల్డ్’ లో ఇదే చేశారు. ఒలింపిక్స్ పోటీలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూసేట్టు చేశారు. క్రియేటివిటీ అంటే ప్రేక్షకులతో ఆడుకోవడమే (నరకం చూపించే ఆట కాదు).  
       
          మామూలుగా టెంప్లెట్ లో ఎలా వుంటుందంటే, హీరోకి గోల్ ఏర్పడిన వెంటనే ప్రత్యర్ధితో, లేదా వ్యతిరేక పరిస్థితులతో ప్రత్యక్ష పోరాటం మొదలైపోతుంది. దీన్నాలస్యం చేయాలి. ‘గోల్డ్’ లో ఇదే చేశారు. కానీ గోల్ ని ఆలస్యం చేయలేదు. ఆట ప్రారంభమైన పది నిమిషాల్లోనే గోల్ ని ఏర్పాటు చేసేశారు. ఇందులో హీరో గోల్,  1948 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే. అంటే తనకి సవాలు విసురుతున్న అంశం ఒలింపిక్స్. అలాగని ఈ గోల్ ఏర్పడిన వెంటనే ఒలింపిక్స్  కూడా ప్రారంభమై పోరాటం మొదలు కాలేదు. ఈ ప్రత్యక్ష పోరాటాన్ని క్లయిమాక్స్ కి జరిపేశారు. 

          ‘మెకన్నాస్ గోల్డ్’ లో గోల్డ్ కోసం పోతే క్లయిమాక్స్ లో భూకంపం వస్తుంది. ఇది బిగ్ ఈవెంట్. ఒక ‘స్టార్ వార్స్’  సీక్వెల్ లో బిగ్ ఈవెంట్ క్లయిమాక్స్ లో డెత్ స్టార్ ని నాశనం చేయడం. వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’ లో బిగ్ ఈవెంట్  చివర్లో వచ్చే ‘బలపం పట్టి భామ వొడిలో’ పాట. రిపీట్ ఆడియెన్స్ ఈ పాట చూసేసి వెళ్ళిపోయే వాళ్ళు. అలాగే ‘గోల్డ్’ లో బిగ్ ఈవెంట్ వచ్చేసి క్లయిమాక్స్ లో వచ్చే ఒలింపిక్స్ గేమ్! 

           
రెండు గంటల 50 నిమిషాల నిడివి గల ‘గోల్డ్’ లో చివరి అరగంటకే ఒలింపిక్స్ గేమ్స్ తో క్లయిమాక్స్ వస్తుంది. అంతవరకూ దాని కోసం ఎదురు చూసేలా చేస్తారు. రెండు గంటలకి పైగా ఎదురు చూసేలా చేయడమంటే చాలా రిస్కు తీసుకోవడమే. అంత సేపూ ఏమేం చూపిస్తూ ప్రేక్షకుల్ని కూర్చోబెట్టాలి? భరిస్తారా, గొడవ చేస్తారా? 

       ఆట ప్రారంభమైన పది నిమిషాల్లోనే, 1936 జర్మనీ ఒలింపిక్స్ గోల్డ్ గెలిచినప్పుడు, ఆ గెలుపు క్రెడిట్ బ్రిటిష్ పాలకులు వాళ్ళ ఖాతాలో వేసుకున్నప్పుడు, హీరో అక్షయ్ కుమార్ కి రగిలిపోయి గోల్ ఏర్పడుతుంది. ఇక వచ్చే ఒలింపిక్స్ లో స్వతంత్ర ఇండియాకి గోల్డ్ సాధించాలని. దీంతో స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగం ముగుస్తుంది. 

          ఈ గోల్ తో వెంటనే సమస్యతో సంఘర్షణకి దిగాడా? లేదు, ఇదే క్రియేటివిటీ లోని బ్యూటీ. ఈ గోల్నే గనుక రొటీన్ టెంప్లెట్ లో పెడితే ఇలా వుంటుంది – హీరో బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి వెంటనే  స్వాతంత్ర్య పోరాటంలోకి దూకుతాడు. ఈ మిడిల్ విభాగమంతా గాంధీ నెహ్రూ మొదలైన నాయకుల వెంట వుండి పోరాడుతూ, లాఠీ దెబ్బలు, తూటా దెబ్బలూ తింటూ, గొప్ప దేశ భక్తిని రగిలిస్తాడు. తట్టుకోలేక స్వాతంత్ర్య మిచ్చేసి బ్రిటిష్ వాళ్ళు విమానాలెక్కగానే - ఇంకా అయిపోలేదురా – వస్తా, మీ ఇంటికే వస్తా, నా ఒక వైపే చూశారు, రెండో వైపు చూడలేదు, మీ ఇంటికొచ్చి చూపిస్తా- ఒలింపిక్ గోల్డ్ కొట్టు కెళ్ళిపోతా – అని మృదుమధురమైన భాషలో హెచ్చరించి, మిడిల్ విభాగాన్ని ముగిస్తాడు.  

          ఇక ఎండ్ విభాగంలో టీముకి ట్రైనింగు ఇప్పించుకుని లండన్ బయల్దేరతాడు. అక్కడ ఒలింపిక్స్ లో బ్రిటిషర్లని ఓడించి, గోల్డ్ ని కైవసం చేసుకుని గోల్ పూర్తి చేసుకుంటాడు.

          ఇలావుంటుంది, గోల్ తో వెంటనే సంఘర్షణ ప్రారంభిస్తే. స్వాతంత్ర్య పోరాటమంతా జొరబడి జానర్ మర్యాద దెబ్బతినిపోతుంది. ఈ కథ హాకీ క్రీడ గురించే గానీ ఫ్రీడం ఫైట్ గురించి కాదు. దాన్ని చొరబెట్టి కలుషితం చేయడం కాదు. ఒక గోల్ పెట్టుకుని దాన్నే గుర్తు చేస్తూ, సీను తర్వాత సీను దానికోసం సంఘర్షణే  చివరంటా చూపిస్తూ పోతూంటే, కథనం ఫ్లాట్ గా మారుతున్న, ముందేం జరుగుతుందో తెలిసిపోతున్న, పాత్ర తెగ బోరు కొడుతున్న, ఒకేలాంటి సినిమాలొస్తున్నాయి. టెంప్లెట్ తో వచ్చిన సమస్యే ఇది.  

        తాజాగా విడుదలైన జాన్ అబ్రహాం ‘సత్యమేవ జయతే’ చూస్తే కూడా ఇది బాగా అర్ధమవుతుంది. అతడికి యాంగ్రీ యంగ్ మాన్ గా అవినీతి పోలీసుల్ని అంతమొందించడం గోల్. చివరి దాకా ఈ గోల్ తో సాగే కథని నిలబెట్టడానికి, ఆ గోల్ తాలూకు యాక్షన్ ని అత్యంత హింసాత్మకంగా, జుగుప్సాకరంగా చూపించాల్సి వచ్చింది. గోల్ ఏమిటో తెలిసిపోయాక, ఇంకేం జరుగుతుందో తెలిసిపోయాక మిగిలేది మొనాటనీయే కాబట్టి- దీన్ని కప్పి పెట్టడానికి,  అత్యంత వయొలెంట్ యాక్షన్ గా మార్చి, దృష్టి మరల్చాల్సి వచ్చింది.

          ‘గోల్డ్’ లో గోల్ తాలూకు యాక్షన్ ని – అంటే ఒలింపిక్స్ అనే బిగ్ ఈవెంట్ ని పక్కకు పెట్టేశారు. జర్మనీలో గెలిచి వచ్చాక హీరో స్వాతంత్ర్యం కోసం ఎదురు చూస్తూంటాడు. ఇక స్వాతంత్ర్యం దగ్గర పడుతూ, 1948 ఒలింపిక్ ప్రకటన వెలువడగానే టీము అన్వేషణలో బయల్దేరతాడు. ఫస్టాఫ్ అంతా అతడి కుటుంబం గురించి, కొందరు టీం మెంబర్ల కథల గురించి, అవి హీరో ప్రయత్నాలని ప్రభావితం చేయడం గురించి, చివరికి అంతా రెడీ అనుకున్నాక, దేశ విభజన జరిగి టీము ముక్కలవడం గురించీ! ఇది ఇంటర్వెల్ పాయింట్.  

          బాగానే వుంది, మరి ఇక్కడ్నుంచీ ఎలా? మళ్ళీ ఇంకో టీము వెతుక్కోవాలా? ఇది మళ్ళీ ఫస్టాఫ్ కథలాగే వుండదా? ఉంటుంది, కాకపోతే ఫస్టాఫ్ కథకంటే కష్టాల - టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ - తీవ్రత ఎక్కువుంటుంది. ఈ టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ఎలా పెరుగుతూ పోతుంది? కథని (యాక్టివ్) పాత్ర నడిపితేనే పెరుగుతూ పోతుంది. ఇక్కడే అక్షయ్ కుమార్ పాత్రని వ్యూహాత్మకంగా నడిపారు. ఎలాగైతే  ‘భలే భలే మగాడివోయ్’ లో నాని పాత్ర కథలో పది నిమిషాల కో బ్యాంగ్ చొప్పున ఇచ్చుకుంటూ స్ట్రక్చర్ నే ఎగేసుకుంటూ వెళ్ళిపోతుందో,  అలా అక్షయ్ పాత్ర కథకున్న ఏకరూప ఫస్టాఫ్ – సెకెండాఫ్ అనే బోరు ఎక్కడా కలక్కుండా, జోడు గుర్రాల్లా వురికించే సన్నివేశాలు సృష్టించుకుంటూ సాగిపోతుంది. ఏ సినిమా కథయినా ప్రధాన పాత్రని పట్టుకుని కథకుడు ప్రయాణిస్తేనే కరెక్టుగా వస్తుంది. ఎందుకంటే కథంటే ప్రధాన పాత్రే. ఇంకెక్కడో వేరేగా వుండదు. ఇలా కాకుండా, కథకుడే తోచిన కథని ప్రధాన పాత్రకి పూస్తూ పోతూంటే, పోతూనే వుంటాడు అట్టర్ ఫ్లాప్ గోతి లోకి. గోతిలో పడ్డాక గానీ పెన్ను పడేసి ఫిడేలు అందుకోడు – అప్పుడు ఫిడేలు రైటర్. మళ్ళీ అదొక భయానక పుట్టుక. 

      ఈ సుదీర్ఘంగా సాగే మిడిల్ విభాగంలో పలక శుభ్రంగా తుడిచేసి కొత్త వ్రాత రాశారు. బిగినింగ్ విభాగంలో జర్మనీలో హీరో గెలిచాక, ఆ బ్రిటిషీయుల ఛాయలు మిడిల్లో ఎక్కడా పడనివ్వకుండా, పలక శుభ్రంగా తుడిచేశారు. ఆ క్లీన్ స్లేట్ మీద ఫ్రెష్ గా మిడిల్ రాసుకొచ్చారు. టీముల ఏర్పాటుకోసం హీరో చేస్తున్న ప్రయత్నాలకి బ్రిటిష్ పాత్రలు  జొరబడి గండి కొట్టడం ఎక్కడా వుండదు. ఎందుకు వుండదంటే, ఏర్పాటు చేసిన గోల్ తో వెంటనే సంఘర్షణలోకి స్క్రీన్ ప్లే వెళ్ళడం లేదు కాబట్టి. అదంతా ఎండ్ విభాగానికి జరిపేశారు కాబట్టి. బ్రిటిష్ పాత్రలు కూడా కన్పించవు మిడిల్లో. స్ట్రక్చర్లో ఒక కొత్త క్రియేటివిటీకి సమకట్టినప్పుడు దానికి కట్టుబడి వుండాల్సిందే. నిగ్రహం తప్పో, అభద్రతతోనో ఆ సమకట్టిన క్రియేటివిటీని అక్కడక్కడైనా చెరచడం చేస్తే, ఉద్దేశమే ఉల్ఫా అయిపోతుంది. 

          సారాంశ మేమిటంటే, స్ట్రక్చర్ లో గోల్ తో గల క్రియేటివ్ మొనాటనీని బ్రేక్ చేయడానికి, గోల్ నుంచి సంఘర్షణని విడదీసేయాలి…గోల్ నుంచి సంఘర్షణని విడదీసేయాలి
గోల్ నుంచి సంఘర్షణని విడదీసేయాలి మిడిల్లో ఆ గోల్ తాలూకు సన్నివేశాలే నడపాలి. కొన్ని తెలుగు సినిమాల్లో ఎలా వుంటుందంటే,  గోల్ ని ఏర్పాటు చేశాక,  దాన్ని పక్కన పెట్టేసి, ఇంకేవో గోల్ తో సంబంధంలేని కామెడీ కాలక్షేపాలు చేసుకుపోతారు. చిట్టచివర్లో ఎక్కడో గోల్ గుర్తొచ్చినట్టు ఉలిక్కి పడి కళ్ళు తెర్చి, కాసేపు ఆ గోల్ ని చికెన్ ఫ్రై చేసుకుని ముగించేస్తారు. సినిమా విడుదలయ్యాక ఖాళీ జేబులతో చికెన్ ఫ్రై కోసం తిరుగుతూంటారు. అది గోల్ ని చికెన్ ఫ్రై చేస్తే చికెన్లు పెట్టే శాపం. గోల్ గోల్డెన్ ఎగ్స్ పెట్టాలంటే ఇలాకాదు. 

          గోల్ నుంచి సంఘర్షణని విడదీసి, తర్వాత ఉపయోగంలోకి తెచ్చుకోవాలంటే ఏమిటి? ఆ సంఘర్షణని మొదలెట్టే సన్నివేశాలని తీసికెళ్ళి సంఘర్షణకి కలిపి సంఘర్షణని ప్రారంభించడమే. ‘గోల్డ్’ మిడిల్లో వున్నది సంఘర్షణని  మొదలెట్టడానికి కావలసిన ఇంధనం సమకూర్చుకున్న సన్నివేశాల సృష్టే!  ఏర్పాటయిన గోల్ కీ, సంఘర్షణ మొదలవడానికీ మధ్య వున్న స్పేస్ ని, సంఘర్షణకి సన్నద్ధం చేసే సన్నివేశాల కల్పనకి సద్వినియోగం చేసుకోవడమే. ప్రత్యక్షంగా ‘గోల్డ్’ ని చూసి ఆలోచిస్తే ఇది బాగా అర్ధమవుతుంది.
***
     ‘గోల్డ్’ లాగే గోల్ తో క్రియేటివిటీ కనబర్చే మూవీ ‘సంజు’. ఇక్కడ గోల్ రివర్సల్ జరుగుతుంది. అంటే కథ నడిపిస్తున్న హీరో కాస్తా డీలాపడిపోయి పాసివ్ గా మారిపోతాడు. కానీ కథ నడిపిస్తున్నంత సేపూ హీరోకి ఏ గోల్ ఏర్పడుతుందన్న ఆసక్తి క్రియేట్ అవుతుంది. తీరా చూస్తే గోల్ హీరోకి ఏర్పడదు. గోల్ రివర్సల్ ఎదురవుతుంది. అనూహ్యంగా గోల్ అతడి తండ్రికి ఏర్పడుతుంది. ఎందుకంటే డ్రగ్స్ కి బానిసై, ప్రేమలో విఫలమై హీరో అశక్తుడై పోయాడు. అందుకని హీరోని బాగు పర్చే గోల్ తో, కథని ముందుకు నడిపే యాక్టివ్ పాత్రగా, తండ్రి ప్రవేశించాడు.

          ఇది కూడా గోల్ తో వుండే మొనాటనీని ఛేదిస్తోంది. షానన్ అనే రచయిత ఏమంటాడంటే... ‘1 – గోల్’ లేదా లీనియర్ ప్లాట్ తో వస్తున్న సినిమాలు కథ తెలిసిపోతూ ఫ్లాట్ గా, ఏ మాత్రం ఆసక్తి రేకెత్తించని విధంగా వస్తున్నాయి. హీరోకి ఒకే గోల్ వుంటుంది, దానికోసమే సినిమా అంతా పాటుబడుతూ వుంటాడు. అదే కథ విసుగ్గా నడుస్తూ వుంటుంది. అయితే ఇంకో సినేరియాలో అప్పుడప్పుడు ‘2 – గోల్’ ప్లాట్ తో సినిమాలు కూడా వస్తున్నాయి. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన రెండు సినిమాలే వున్నాయి. ‘ఈటీ’ లో హీరోకి గ్రహాంతర జీవిని తనతోనే వుంచుకోవాలన్న గోల్ వుంటుంది. కానీ సెకండాఫ్ లో ఈ గోల్ మారిపోతుంది. గ్రహాంతర జీవి తిరిగి దాని గ్రహానికి వెళ్ళిపోయేందుకు సాయపడే  గోల్  ఏర్పడుతుంది. ‘జురాసిక్ పార్క్’ లో కూడా, హీరోకి పార్క్ ని సురక్షితంగా వుంచాలన్న గోల్ వుంటుంది. ఎప్పుడయితే డినోసారస్ లు అదుపు తప్పుతున్నాయన్న సూచనలం|దుతాయో, అప్పుడిక పార్క్ ఓనర్ పిల్లల సంరక్షణే గోల్ గా మారిపోతుంది...

         
గోల్ రివర్సల్ కి ఇంకో ఉదాహరణ చెప్పాడు షానన్. రెండు జెట్ విమానాలు చెరో గమ్యం వైపు దూసుకు పోతూంటాయి. మధ్యలో గుద్దుకుని పేలిపోతాయి. ఇక రెండు గమ్యాలూ క్యాన్సిల్ అయిపోయి, మూడో గమ్యం మొదలవుతుంది...

         దీన్నిలా కూడా చెప్పొచ్చు : హీరో ఒక గోల్ తో వెళ్తున్నాడు. అట్నుంచి హీరోయిన్ ఇంకో గోల్ తో వస్తోంది. ఇద్దరి కార్లూ పంజా గుట్ట సెంటర్లో గట్టిగా గుద్దుకుని పెద్ద ప్రమాదం జరిగింది. దాంతో ఇద్దరి గోల్సూ దుర్గం చెర్వులో పడి, ఇద్దరికీ కలిపి ఇంకో ఉమ్మడి గోల్ పుట్టుకొచ్చింది...


          ఇవీ గోల్ రివర్సల్ కి కొన్ని ఉదాహరణలు. ఒకే గోల్ ని సినిమా అంతా సింగిల్ ట్రాక్ మీద ఈడుస్తూ హీరోకే రోత పుట్టించేకన్నా, ఇలాటి 2 – గోల్ ప్లాట్స్ సృష్టించి, మొదటి గోల్ ని క్యాన్సిల్ చేసి, ఫ్రెష్ గా రెండో గోల్ ని ప్రారంభిస్తే మొనాటనీ పోతుంది. 

          ఇదిప్పుడు ఎందుకు అత్యవసరమో ఇంకో కారణం కూడా చెప్పుకుంటే, ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ అనేది పది సెకన్లకి పడి పోయిందని ఏనాడో సిడ్ ఫీల్డ్ చెప్పాడు. అంటే ఒక విషయం మీద పది సెకన్లకి మించి దృష్టిని పెట్టి చూడలేక పోతున్నారు ఆధునిక జీవన వేగం పెరిగిపోవడం వల్ల. అందుకే కథనంలో వేగమే కాదు, కదిలిపోయే దృశ్యాల్లో వేగం, గ్రాఫిక్స్ తో హంగామా ఇత్యాది టెక్నిక్స్ వాడాల్సి వస్తోంది.

         ఈ అటెన్షన్ స్పాన్ పరిధిలోకి  స్టోరీ గోల్ ని కూడా తీసుకొచ్చుకుని చూసినప్పుడు, ఒకే గోల్ తో రెండు గంటల కథ ఎంత బోరు కొడుతుంది... కనుక గోల్ తో రకరకాల క్రియేటివిటీలు అత్యవసరమే కావొచ్చు.