రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, ఆగస్టు 2020, సోమవారం

972 : రివ్యూ


దర్శకత్వం : నితిన్ కక్కర్
తారాగణం : కుముద్ మిశ్రా
, దివ్యా దత్తా, ఆకాష్ ఖురానా, సలీమా రజా, ఫరూఖ్ సేయర్ తదితరులు    
రచన : నితిన్ కక్కర్
, షరీబ్ హాష్మీ; సంగీతం : ట్రాయ్ ఆరిఫ్, అర్జిత్ దత్తా; ఛాయాగ్రహణం : శుభ్రాంశూ దాస్, మాధవ్ సలూంఖే
బ్యానర్ : లిటిల్ టూ మచ్ ప్రొడక్షన్స్
నిర్మాతలు : నితిన్ కక్కర్
, షరీబ్ హాష్మీ, ఉమేష్ పవార్
నిడివి : 95 నిమిషాలు
విడుదల : సోనీ లైవ్

***
        
కోవిడ్ -19 సృష్టించిన సంక్షోభంలో భారీగా ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డ దృశ్యాలు ఛానెల్స్ చూపించక పోవచ్చు, వార్తా పత్రికలు ప్రచురించకపోవచ్చు, కానీ ఆల్టర్నేట్ మీడియా నుంచి వెబ్ పాత్రికేయులు, యూట్యూబర్స్ ఈ విషయంగా నిత్యం అప్ డేట్స్ ఇస్తూ ప్రశ్నలు లేవదీస్తున్నారు. యాదృచ్ఛికంగా ఒక సినిమా కూడా ఇదే పని చేస్తోంది. ఈ సినిమా విడుదల కావాల్సిన 2018 లో విడుదలై వుంటే అప్పటి పరిస్థితుల్లో ఆలోచింప జేసేది కాదేమో. ఇప్పుడు ఈఎంఐ లకి రిజర్వ్ బ్యాంక్ పొడిగించిన మారటోరియం గడువు ఆగస్టు 31 న ముగియనుండగా, ఉద్యోగాలు కోల్పోయిన రెండు కోట్ల మంది రుణగ్రహీతలు ఆందోళనకి గురవుతున్న నేపథ్యంలో, రామ్ సింగ్ చార్లీ విడుదల ఒక ఆశ అయితే, మరో వైపు నిరాశ కూడా. ఆశావహ దృక్పథంతో నిరాశ కాదనుకుని చెరిపేసుకుంటే త్యాగం. త్యాగధను లన్పించుకోవడం మనసొప్పకపోతే దొరికిన ఉపాధిని ఇంకొకడికి దానం చేయాల్సి వచ్చిన నిస్సహాయత. ఈ నిస్సహాయత కూడా ఎందుకు తెచ్చుకోవాలి? ఆశకి పోతేనే నిరాశ. దీంతో జీవితమే ఒక నాటక రంగం, నీ వంతు పాత్ర నువ్వు పోషించి అక్కడ్నుంచి తప్పుకో, ఇంకేమీ ఆశించకు- అనే కఠిన వాస్తవం.     

        ప్రపంచమే ఒక నాటక రంగమన్న విలియం షేక్స్ పియర్ కొటేషనుతో ప్రారంభమయ్యే రామ్ సింగ్ చార్లీ - బయటి ప్రపంచంలో ఇంకా పెద్ద సర్కస్ వుంటుందని తెలియని, సర్కస్ రింగే లోకంగా జీవించే సర్కస్ కళాకారుల ఉపాధి కేక. ఆధునిక వినోద మాధ్యమాల వెల్లువలో సర్కస్ కళారంగం ఉనికిని కోల్పోతున్న వేళ- సర్కస్ గుడారం కళ్ళ ముందే నేల వాలుతూంటే, బ్రతుకు పోరాటంలో తెలియని విద్య అయిన జీవితపు సర్కసుకి సిద్ధపడే జీవితాల కథ.

కథ 
    కోల్కతలోని జాంగో సర్కస్ కంపెనీలో  రాంసింగ్ (కుముద్ మిశ్రా), భార్య కజ్రీ (దివ్యా దత్తా) సర్కస్ కళాకారులుగా సుఖంగా జీవిస్తూంటారు. చార్లీ చాప్లిన్ వేషం వేయడంలో దిట్ట రామ్ సింగ్. తోటి సర్కస్ కళాకారులందరూ సర్కస్సే జీవితంగా కలిసి మెలిసి వుంటారు. కానీ ఒక రోజు సర్కస్ కంపెనీ ఓనర్ మాస్టర్జీ (సలీమా రజా) పిడుగులాంటి వార్తతో హడలెత్తిస్తుంది. ఈ రోజుల్లో సర్కస్ నడపడం ఎంతమాత్రం లాభసాటిగా లేదనీ, భారీ నష్టాలు చవిచూస్తున్నామనీ, అందుకని కంపెనీని మూసేస్తున్నామనీ, అయితే మూడు నెలల జీతాలు చెల్లించి సాగనంపుతామనీ ప్రకటిస్తుంది. 

          హతాశులైన కళాకారులు మూగ జీవులై జీతాలు తీసుకుని వెళ్లిపోతారు. రామ్ సింగ్ గర్భవతిగా వున్న భార్యని కొడుకుతో వూరు పంపేస్తాడు. ఏదో చేసి డబ్బు సంపాదించి పంపిస్తానని మాటిస్తాడు. కానీ అది జరగదు. ఒక ఈవెంట్ కంపెనీలో పదిహేను వేల జీతానికి జోకర్ వేషాలేయడానికి కుదిరినా, ఒక పొరపాటు చేసి డిస్మిస్ అవుతాడు. అక్కడ షాజహాన్ (ఫరూఖ్ సేయర్) అనేవాడు పరిచయమవుతాడు. అతను రిక్షా లాగే పనిలో పెట్టిస్తాడు. రామ్ సింగ్ ఇక రిక్షా కార్మికుడిగా మారిపోతాడు. అనుకోకుండా అతడి రిక్షానే ఎక్కిన మాస్టర్జీ చలించి పోతుంది. ఎప్పుడైనా సర్కస్ ప్రారంభించాలనుకుంటే వచ్చి సామగ్రి తీసికెళ్ళ మంటుంది. 

      ఇలాటి పరిస్థితిలో బిడ్డనికని వచ్చి, రామ్ సింగ్ ని చూసి దిగ్భ్రాంతి చెందుతుంది భార్య కజ్రీ. రామ్ సింగే కాదు, సర్కస్ లో వయొలిన్ వాయించిన మాస్టర్, రోడ్ల మీద వయొలిన్ వాయించుకుంటూ బ్రతుకుతూంటాడు. ఇద్దరు లిల్లీపుట్ కళాకారులు బార్ ముందు వాచ్ మెన్లుగా కుదిరి వెక్కిరింతలకి గురవుతూంటారు. ఇలా చెట్ట కొకరు పుట్ట కొకరుగా చెదిరిపోతారు.

        అలాగే కష్టపడి సంపాదిస్తూ కొడుకుని స్కూల్లో చేర్పించిన రామ్ సింగ్
, ఫాదర్స్ డేనాడు కొడుకుతో ప్రదర్శన ఇవ్వడంతో అతడికి ఆఫర్స్ రావడం మొదలవుతాయి. క్రమంగా సర్కస్ ప్రారంభించాలన్న ఆలోచన చేస్తాడు. కానీ సర్కస్ సామగ్రి తీసి కెళ్ళ మన్న మాస్టర్జీ చనిపోయింది. ఆమె కొడుకు డబ్బు డిమాండ్ చేస్తాడు. షాజహాన్ పొలం అమ్మి డబ్బు తెచ్చి రామ్ సింగ్ కిస్తాడు. ఇక్కడ్నించీ రామ్ సింగ్ అసలు కష్టాలు మొదలవుతాయి. మనుషులు, వాళ్ళ నైజాలు, స్వార్ధాలు, అవకాశవాదం మొదటిసారి చవిచూస్తూ సర్కస్ విన్యాసాలు చేస్తున్నట్టే అయి పోతుంది జీవితం.

        సర్కస్ ప్రారంభించాలన్న రామ్ సింగ్ కల నెరవేరిందా లేదా
? ఆ నిర్ణయం సరైనదేనా? ఒకసారి చేస్తున్న వృత్తి వ్యాపారాలు కోల్పోయాక తిరిగి ఆ వృత్తి వ్యాపారాల కోసమే తాపత్రయపడ్డం సరైనదేనా? వృత్తి వ్యాపారాల గురించి తెలుసుకోవాల్సిన నీతేమిటి? ఇది తెలుసుకునేలా చేసేదే మిగతా కథ. 

నటనలు -సాంకేతికాలు
     కుముద్ మిశ్రా టాలెంట్ కిది నిలువెత్తు నిదర్శనం. అతడి క్లోజప్స్ అతడి హావభావాల, భావోద్రేకాల ముఖ పుస్తకం. సర్కస్ కళాకారుడైతే సర్కస్ కళాకారుడు, రిక్షా కార్మికుడైతే రిక్షా కార్మికుడు - ఏదైతే ఆ జీవితాన్ని సూక్ష్మ స్థాయిలో ప్రదర్శించి చూపిస్తాడు. తాగుబోతా, భార్యని తూలనాడేడా, తనలోని కళాకారుణ్ణి నిరసించాడా, రిక్షా కార్మికుణ్ణి భరించాడా, పరుగులెత్తే మహా నగరంలో పాసింజర్స్ ని ఎక్కించుకుని పశువులా లాగుతూ పరుగెత్తాడా, మాస్టర్జీ కొడుకుని ఆనాటి షర్టు ఇమ్మని కోరాడా, కూతురు పుడితే  లక్ష్మి పుట్టిందని వివశుడయ్యాడా, తిరిగి సొంతమవుతున్న వృత్తిని ఇంకొకరికి త్యాగం చేశాడా, ఏడుస్తూ నవ్వించాడా - ఇలా ఒకటి కాదు, ఏ సీను చూసినా మర్చిపోలేని సన్నివేశాల్ని సృష్టించాడు. స్థాయి ఏదైనా ప్రతీ మనిషిదీ అస్తిత్వ పోరాటమే. సామాన్యుడి అస్తిత్వ పోరాటాన్ని కుముద్ కంటే దృశ్యమానం చేసే కళాకారులుండరేమో. 

        కజ్రీ పాత్రలో దివ్యాదత్తా మౌనంతోనే కోటి అర్ధాలు నటిస్తుంది. భర్త రామ్ సింగ్ లో చార్లీని చూసిన కళ్ళతో రిక్షావాణ్ణి చూసేసరికి
, నిశ్చేష్టురాలై చూసే చూపు గుండెల్ని పిండేసే బాధ. చాలా సేపు ఆమె చూపులోంచి బయటపడలేక చస్తాం. జీవితపు సర్కస్ నెగ్గాలంటే తెలిసిన సర్కస్ నే ఎరగా వేయాలన్న మౌన నిర్ణయం చేతల్లోనే ప్రదర్శిస్తుంది. కొడుకు పెట్టె దించి ఫాదర్స్ డే ప్రోగ్రాంకి కాస్ట్యూమ్స్ తీస్తూంటే విసిరి కొడతాడు. కొడుక్కీ మళ్ళీ ఆ జీవితం వద్దంటాడు. ఆ జీవితమే కావాలని తండ్రీ కొడుకుల్ని స్టేజి ఎక్కిస్తుంది. అక్కడ్నించీ  జీవితం మారిపోతుంది. అయితే ఆడది తన సహజాతంతో ప్రకృతికి లోబడి ఒకటాలోచిస్తే,  దాంతో మగాడు ఓవరాక్షన్ చేసి చెడ గొట్టుకుంటాడన్నట్టు - ఈ పరిస్థితిని కూడా అనుభవించే మౌన పాత్రలో దివ్యాదత్తా దొక బలమైన ముద్రవేసే శైలి. 

      ఇతర పాత్రల్లో రెండు మూడు సన్నివేశాలే అయినా, మాస్టర్జీ గా వృద్ధ పాత్రలో సలీమా రజా గుర్తుండి పోతుంది. ఈ సర్కస్ నేం చూశావ్, బయటి ప్రపంచంలో ఇంకా పెద్ద సర్కస్ వుందని గుర్తు చేసే క్లుప్త పాత్ర. అలాగే రామ్ సింగ్ మిత్రుడు షాజహాన్ గా ఫరూఖ్ సేయర్ సర్కస్ కోసం పొలం అమ్మి డబ్బు తెచ్చిస్తే, రామ్ సింగ్ ఇంకో అత్యవసరానికి వాడెయ్యడంతో, లోలోపల అతడిలో రూపుదిద్దుకునే ఇంకో మనిషి స్వార్ధం వైపు నడిపిస్తాడు. ఈ పాత్రలోని షేడ్స్ ని అతను సులువుగా పోషించాడు.

        ఈ పాత్రలే కాదు మిగిలిన సహాయ పాత్రలూ
, వాటిని నటించిన నటులూ ఒకే విజన్ ని పరివ్యాప్తం చేస్తారు : ఈ కథ స్పిరిట్ ని. సాంకేతికంగా చూస్తే వెనుక బడలేదు. సాంకేతికం గొప్ప, కంటెంట్ దిబ్బ అన్పించుకునే సినిమాలే వ్యర్ధంగా తీస్తున్న కాలంలో రెండిటా ముందుండే ప్రొడక్షన్ గా ఈ సెమీ- రియాలిస్టిక్ కన్పిస్తుంది. సంగీతం, ఛాయాగ్రహణం, కూర్పు ఒకే విజన్లో బలంగా వుంటాయి. 

కథా కథనాలు
    చిన్న సినిమాకి దానిదైన సొంత జీవితం ప్రత్యేకంగా వుంటుంది. పెద్ద సినిమాల ఛాయల్ని దగ్గరికి కూడా రానివ్వదు. పెద్ద సినిమాలన్నీ ఒకే పోతలో పోసినట్టున్నా చెల్లిపోవచ్చు. చిన్న సినిమాలకి ఏ కథకా కథగా యూనిక్ క్రియేషన్ వుంటుంది. ఇదే వాటిని నిలబెడుతుంది. అదే సమయంలో చిన్న సినిమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్ట్రక్చర్ ని పాటిస్తే కథా కథనాలే కాదు, ప్రధాన పాత్ర ననుసరించి ఇతర పాత్రలు, పాత్ర చిత్రణలు, వాటి ప్రయాణాలు, చెప్పాలనుకున్న పాయింటూ సమస్తం ప్రభావ శీలంగా అర్ధవంతంగా వస్తాయి. స్ట్రక్చర్ వల్ల కాన్సెప్ట్ దానికదే లోతుపాతుల్లోకి వెళ్ళిపోతుంది. స్ట్రక్చర్ మొహమే తెలియని లొట్ట పీసు స్క్రిప్టుతో చిన్న సినిమా చెత్త బుట్ట దాఖలవుతుంది. బుట్ట దాఖలయ్యే సినిమాలే మెట్ట వ్యవసాయం చేస్తున్నాయి. చినుకు పడదు, చిల్లులు మాత్రం పడుతూంటాయి నిర్మాతగారి జేబుకి. 

       
రామ్ సింగ్ చార్లీ స్ట్రక్చర్ లో వున్న అర్ధవంతమైన కథ, కథనమూ. కథనంలో దృశ్యాల అల్లిక చాలా సార్లు మెస్మరైజ్ చేస్తుంది. ఉదాహరణకి వూరికెళ్ళి పోయిన కజ్రీ అక్కడెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టు కన్పిస్తుంది. తీరా ఇటు ఓపెన్ చేస్తే రామ్ సింగ్ తోనే మాట్లాడుతున్నట్టు దృశ్యం థ్రిల్ చేస్తుంది. ఇంకో దృశ్యంలో బార్ దగ్గర ఒకడు అదే పనిగా వెక్కిరిస్తూంటే, పొట్టి లిల్లీపుట్ చూసి చూసి లాగిపెట్టి లెంపకాయ కొడతాడు. లెంపకాయ తిన్నవాడు పరమ కోపంగా చూస్తాడు. అంతే, దృశ్యం కట్ అయిపోతుంది. తర్వాతి దృశ్యంలో రామ్ సింగ్ ఇంటికి పరుగెత్తు కొచ్చి డబ్బులన్నీ తీసుకుని పరిగెడతాడు. 

     ఈ దృశ్యమేంటో కూడా అర్ధం గాకుండానే కట్ అయిపోతుంది. దీని తర్వాతి దృశ్యంలో  గాయపడిన లిల్లీపుట్ హాస్పిటల్లో పడి వుంటాడు. అక్కడికి డబ్బుతో వచ్చేస్తాడు రామ్ సింగ్. ఇలా మొదటి దృశ్యంతో సస్పెన్స్ క్రియేట్ చేసి, రెండో దృశ్యంతోనూ సస్పెన్స్ క్రియేట్ చేసి, రెండిటి అర్ధాలూ మూడో సీన్లో స్పష్టం చేస్తాడు దర్శకుడు. ఇదీ దృశ్య మాలిక అంటే. రొటీన్ మెలోడ్రామాని తొలగించే ఈ మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ కథనపు టెక్నిక్ వల్ల కథ చెడకుండా సినిమా నిడివి, షూటింగ్ సమయం, బడ్జెట్ ఎంతో ఆదా అయ్యాయి. ఇలా కథని బట్టి దానిదైన యూనిక్ డైనమిక్స్ తో కథనం చిన్న సినిమాకే సాధ్యమవుతుంది.

        సర్కస్ కంపెనీలో ఉద్యోగాలు పోవడం ప్లాట్ పాయింట్ వన్
, ఈ సమస్యతో రామ్ సింగ్ తనే సర్కస్ పెట్టాలని పరిష్కారానికి రావడం ప్లాట్ పాయింట్ టూ. ప్లాట్ పాయింట్ వన్ తో సమస్యలో పడ్డ రామ్ సింగ్ తో కష్టాలు, భార్యతో సంసారపు ఈతిబాధలు, ఇంట్లో గొడవలు, వీటన్నిటితో ఇక బీదల పాట్లుగానే సాగుతుందన్నట్టు బోరు కొట్టే పరిస్థితి వచ్చేలోగా, ఈ మిడిల్ కథనం ఇందులోంచి వూహించని నెక్ట్ లెవెల్ కెళ్లిపోతుంది. ఫాదర్స్ డే ప్రోగ్రాంకి కజ్రీ రాంసింగ్ ని బలవంతం చేసి, కొడుకు సమేతంగా చార్లీ చాప్లిన్ ప్రదర్శన ఇప్పించడంతో వాళ్ళ జీవితాలే మారిపోతాయి. ఇది కావాలని ఫార్ములా మలుపా, కాదు. పునర్విజయానికి మెట్లు సహజంగా ఇలాగే వుంటాయి.

        గతవారం యూట్యూబ్ లో ఏదో సెర్చి చేస్తూంటే, ఇంకేదో ఆటోమేటిగ్గా వూడి పడి ఆటో ప్లే అవుతోంది. ఏమిటాని చూస్తూంటే, ఒక స్పిరిచ్యువల్ గురు ప్రేక్షకుడడిగిన ప్రశ్నకి సమాధాన మిస్తున్నాడు. నా పనీ పాటలు పోయాయ్, నేనిప్పుడేం చెయ్యాలి?’ అని ప్రేక్షకుడి ప్రశ్న. నీకలవాటైన పనీ పాటలు తప్ప నువ్వింకేమీ చెయ్యలేవు, ఇది గుర్తు పెట్టుకో. ఆ పనీ పాటలకి తలుపులు పడిపోయాయ్. ఆ తలుపుల్నే చూస్తూ కూర్చోకు. వెళ్లిపో, వెళ్ళిపోయి కొత్త తలుపులు తెరువ్. ఆ కొత్త తలుపుల్లోంచి ఇంకో చోట అవే పనీ పాటల కోసం వెతక్కు. నీకు తెలిసిన ఆ పనీ పాటల్లోంచి కొత్తగా నువ్వేం సృషించగలవో ఆలోంచించు. అదే నువ్వు చెయ్యాల్సిన పని అని స్పష్టం చేశాడు నార్త్ స్పిరిచ్యువల్ గురు.

    ఈ సూత్రం కజ్రీ కెలా తెలిసింది? ప్రకృతి నియమాలకి దగ్గరగా వుండే ఆమె స్త్రీ సహజాతమది. మగాడికి ప్రకృతీ లేదు, పర్యావరణం లేదు. అయితే ఆవారా, కాకపోతే బంజారా. దీంతో మూసుకు పోయిన సర్కస్ పనిలోంచే ఆమె చాప్లిన్ కామెడీ షోలు సృష్టించగల్గింది. అప్పటి వరకూ రామ్ సింగ్ ఏం చేస్తున్నాడు? ఈసురో మని రిక్షా లాగుతూ మూతపడ్డ సర్కస్ ని మర్చిపోలేక పోతున్నాడు. మేకప్ వేసుకుని మధన పడిపోతున్నాడు. తాగి పడిపోయి ఇంకా సర్కస్ నే కలవరిస్తున్నాడు.

        భార్య కజ్రీ స్టేజి ఎక్కించాక ఆఫర్లు వస్తూంటే అతనేం చేసి వుండాల్సింది
? దాన్ని పెంచుకుంటూ నల్గురికి నేర్పి ఈవెంట్ కంపెనీ ప్రారంభించుకోవచ్చు. కానీ ఏం చేశాడు? ఇది కాదని అత్యాశకి పోయి మళ్ళీ మూత బడ్డ సర్కస్ అనే పాత తలుపుల్నే తెరవాలనుకున్నాడు. పతనానికి మెట్లేసుకుని మళ్ళీ మొదటి కొచ్చాడు. చనిపోయాడు. ఇక కొడుకు పెద్దవాడై కామెడీ షోలతో తండ్రి పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తూంటాడు... ప్లాట్ పాయింట్ టూలో అతను అనుకున్నది పరిష్కారమా? కాదు, తప్పుడు నిర్ణయం. 

      సర్కస్ జీవితం మీద తీసిన మేరానామ్ జోకర్ (1970) లో జోకర్ గా రాజ్ కపూర్ జీనా యహా మర్నా యహా అంటూ హిట్ సాంగ్ పాడతాడు. ఇక్కడే జీవనం, ఇక్కడే మరణమనే అర్ధంలో. ఆ శకం ముగిసింది. సర్కస్ చచ్చిపోయి, ఇక్కడే జీవనం, ఇక్కడే మరణమనే సీను బయటి ప్రపంచానికి మారింది. 

        ఇదే సినిమాలో రాజ్ కపూర్ ఇంకో హిట్ సాంగ్ లో బయటి ప్రపంచాన్ని చూపిస్తాడు -
యే భాయ్ జర దేఖ్ కే చలో పాటలో -  ఈ ప్రపంచమొక సర్కస్. ఈ సర్కస్ లో పెద్దోడు చిన్నోడు, ఉన్నోడు లేనోడు, బక్కోడు బలిసినోడు, పైనుంచి కిందికీ, కింది నుంచి పైకి పడుతూ లేస్తూ వెళ్లిపోవాల్సిన వాళ్ళే. ఈ సర్కస్ కేవలం మూడు గంటలు... మొదటి గంట బాల్యం, రెండో గంట యవ్వనం, మూడో గంట వృద్ధాప్యం. ఆ తర్వాత అమ్మ లేదు అయ్యలేడు, కొడుకు లేడు కూతురు లేదు, పిల్లాలేదు పీచూ లేదు, నువ్వూ లేవు నేనూ లేను, అదీ లేదు ఇదీ లేదు, ఏదీ లేదు ఏదీ వుండదు ... ఖాళీ ఖాళీ కుర్చీలే, ఖాళీ ఖాళీ గుడారాలే, ఖాళీ ఖాళీ తివాచీలే, పక్షు లెగిరిపోయిన గూళ్ళే!

        ఇది ప్రకృతి ఆడించే సర్కస్
. ఈ ఆటలో - కాల చక్రంతో పాటు ముందుకే వెళ్లాలి తప్ప, కాల చక్రాన్ని వెనక్కి తిప్పాలనుకుంటే రామ్ సింగ్ లాగే దాని పళ్ళ కింద ముక్కలవుతారు. పనీ పాటల రహస్యాన్ని ఇంత బాగా చెప్తున్న ఈ సినిమా అర్దం గావాలంటే, బయటి ప్రపంచమే తెలియకుండా సర్కస్ గుడారాల్లో వుండి పోకూడదు.

    గ్లోబలైజేషన్ అనే సర్కస్ గుడారమూ ఇంతే. గ్లోబలైజేషన్ వచ్చి రాజకీయరంగాన్ని పండగలా మార్చేసింది. గ్లోబలైజేషనే జీవితంగా కొట్టుకుపోతూ సమాజంలోకి తొంగి చూసే వర్గాలు తగ్గిపోతున్నాయి. గ్లోబలైజేషన్ పూర్వం 1990ల వరకూ రాజకీయ రంగాన్ని ఢీకొనే సామాజిక చైతన్యం విద్యార్థి లోకం సహా వివిధ వర్గాల్లో వుండేది. గ్లోబలైజేషన్ పుణ్యమాని అదిప్పుడు మంటగలిసింది. ఇందుకే రాజకీయ రంగానికి ఎదురులేకుండా పోయి ఆడిందే ఆటగా మారింది. ఈ ఆటలో పాలు పంచుకోవడం కూడా నాగరికత అనుకుంటున్నారు. రాజకీయ రంగం నాణ్యత, దానితో సామాజికారోగ్యం, సామాజికారోగ్యంతో ఆర్ధికారోగ్యం జనం కాస్త సమాజంలోకి తొంగి చూడ్డంలోనే వుంది. సమాజంనుంచి దృష్టి మళ్లించే సుశాంత్ సింగ్ కేసు కోలాహలం లాంటి మత్తు మందుని వెదజల్లే మీడియాలకి దాసులవడంలో లేదు. ఇది నీతులు చెప్తున్నట్టు అన్పించవచ్చు గానీ వాస్తవం. సమాజమే తెలీని, బయట బతకడమే తెలీని  కోట్లాది మంది నిరుద్యోగ రామ్ సింగ్ చార్లీలు ఇలాగే పుట్టుకొచ్చి జాంబీలుగా మారిపోతే, సినిమాలకి ప్రేక్షకులు కూడా వుండరు.  

సికిందర్
telugurajyam.com