రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, May 8, 2024

1427 : రివ్యూ!

దర్శకత్వం : డేవిడ్ అయర్       
తారాగణం : జేసన్ స్టాథమ్, ఎమ్మీ రావర్-లాంప్‌మాన్, ఫిలిసియా రషద్, జోష్ హచర్సన్, డేవిడ్ విట్స్, బాబీ నాడేరీ, జెరెమీ ఐరన్స్
సంగీతం : డేవిడ్ సర్డీ, ఛాయాగ్రహణం : గాబ్రియేల్ బెరిస్టైన్
బ్యానర్స్ : మెట్రో గోల్డ్విన్ మేయర్, మీరామాక్స్
నిర్మాతలు : బిల్ బ్లాక్, జేసన్ స్టాథమ్, డేవిడ్ అయర్, క్రిస్ లాంగ్, కర్ట్ విమ్మర్
విడుదల ; ఏప్రిల్ 26, 2024 ( లయన్స్ గేట్ ప్లే ఓటీటీ)
***
            హాలీవుడ్ యాక్షన్ సీనియర్ హీరో జేసన్ స్టాథమ్ గత సంవత్సరం నాలుగు సినిమాలు నటించి మరో యాక్షన్ తో వచ్చాడు. 1998 నుంచీ ఫ్యాన్స్ ని పోగొట్టుకోకుండా ట్రాన్స్ పోర్టర్’, మెకానిక్’, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మొదలైన 30కి పైగా హెవీ మాస్ యాక్షన్ సినిమాలతో కొనసాగుతున్న స్టాథమ్, వరుస యాక్షన్ సినిమాల దర్శకుడు డేవిడ్ అయర్ తో కలిసి ది బీకీపర్ అనే మరో భారీ యాక్షన్ కి తెరతీశాడు. జనవరిలో థియేట్రికల్ గా విడుదలై విజయం సాధించి గతవారం నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ  కథాకమామిషేమిటో చూద్దాం...

కథ
రిటైర్డ్ స్కూల్ టీచర్ ఎలోయిస్ పార్కర్ (ఫిలిసియా రషద్) ఒంటరిగా నివసిస్తూంటుంది. ఆమె ఎస్టేట్ లో ఆడమ్ క్లే (జెసన్ స్టాథమ్) తేనెటీగల పెంపకం దారుగా జీవిస్తూంటాడు. ఒక రోజు ఎలోయిస్ ఫిషింగ్ స్కామ్ లో ఇరుక్కుంటుంది. తను నిర్వహిస్తున్న బాలల ఛారిటీ ఫండ్ తాలూకు బ్యాంకు ఖాతా నుంచి 2 మిలియన్ డాలర్లని ఒక్క క్లిక్ తో పోగొట్టుకుంటుంది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె కుమార్తె ఎఫ్బీఐ అధికారిణి వెరోనా పార్కర్‌ (ఎమ్మీ రావర్-లాంప్‌మాన్) వెంటనే ఆడమ్ ని అరెస్టు చేస్తుంది. తర్వాత అనుమాన నివృత్తి చేసుకుని వదిలేస్తుంది. అయితే తన తల్లిని దోచుకున్న ఆన్ లైన్ స్కామ్ ముఠాని ట్రాక్ చేసి  పట్టుకోలేకపోతున్నామని, ఈ విషయంలో సాయం చేయమనీ ఆడమ్ ని కోరుతుంది.
        
ఆడమ్ ఒకప్పుడు బీకీపర్స్ అనే సీక్రేట్ గ్రూపులో పనిచేసిన వాడే. ఈ గ్రూపు ఆన్ లైన్ స్కామర్స్ ని పట్టుకునే గోల్ తో పనిచేస్తూంటుంది. ఆడమ్ ఈ గ్రూపుని సంప్రదించి మిక్కీ గార్నెట్ (డేవిడ్ విట్స్) అనే యువ టెక్కీ నడుపుతున్న ఒక కాల్ సెంటర్ అడ్రసు తెలుసుకుని, అక్కడికెళ్ళి అందర్నీ చిత్తుగా తన్ని, కాల్ సెంటర్ ని పేల్చేస్తాడు. దీన్ని మిక్కీ తన బాస్ డెరెక్ (జోష్ హచర్సన్) కి రిపోర్టు చేసి, ఆడమ్ బీకీపర్స్ మాజీ మెంబరని చెప్తాడు.
        
డెరెక్ మాజీ సీఐఏ డైరెక్టర్ వాలెస్ వెస్ట్ విల్డ్ (జెరెమీ ఐరన్స్) కి ఆడమ్ గురించి చెప్తాడు. డెరెక్ నడుపుతున్న గ్లోబల్ కాల్ సెంటర్స్ కి సెక్యూరిటీ చూస్తూంటాడు వాలెస్. ఇతను ప్రస్తుత సీఐఏ డైరెక్టర్ హార్వర్డ్ కి కాల్ చేసి ఆడమ్ ని ఆపాల్సిందిగా కోరతాడు. ఇంతలో ఆడమ్ బోస్టన్ లో డెరెక్ కి చెందిన కాల్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ ని పేల్చేయబోతున్నాడని వేరొనాకి సమాచారమందుతుంది.
       
ఆడమ్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శత్రువుల్ని నాశనం చేయాలని ప్ర్రయత్నిస్తూంటే
, వెరోనా చట్టప్రకారం సక్రమ మార్గంలో నేరస్థుల్ని పట్టుకోవాలని పరుగులు దీస్తూంటుంది. ఈ క్రమంలో ఈ స్కామ్ తో అమెరికా అధ్యక్షురాలు జెస్సికాకి సంబంధం వుందని తెలుసుకున్న ఆడమ్ ఆమెని చంపడానికి సాగిపోతాడు. ఇప్పుడేం జరిగింది? అధ్యక్ష్యురాలిని చంపకుండా వెరోనా ఆడమ్ ని ఆపగల్గిందా?
రిటైర్డ్ స్కూల్ టీచర్ ఎలోయిస్ మృతికి కారకులైన శత్రుశ్రేణిని చంపడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్న ఆడమ్,  ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ సమీపంలోకి చేరుకోగల్గిన క్షణాన ఏం జరిగింది? ఇదీ మిగతా కథ.

నాన్ స్టాప్ బాదుడు
సినిమా సాంతం ఎవర్నో ఒకర్ని బాదుతూనే వుంటాడు జేసన్ స్టాథమ్. వృద్ధుల నుంచి లాక్కోవడం పిల్లల నుంచి దొంగిలించినంత చెడ్డది. పోగొట్టుకుంది పిల్లవాడైతే వాడికి తల్లిదండ్రులు వుంటారు. వృద్ధులకి ఎవరుంటారు చెప్పుకోవడానికి? కొన్నిసార్లు ఒంటరిగా పోరాడతారు, కొన్నిసార్లు పోరాడలేరు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళే వుండరు అన్న డైలాగుతో ఈ కథకి ఎమోషనల్ గ్రిప్ ఇస్తాడు.
        
ఈ సెంటిమెంటల్ అప్రోజ్ తో ఒక్కొక్కడ్నీ బాదిన ప్రతీసారీ ప్రేక్షకుల కచ్చి తీరుతూంటుంది. ఈ డ్రమెటిక్ పాయింటు పట్టుకుని ఈ యాక్షన్ మూవీని బలంగా నడిపిస్తూంటాడు. ఒంటరిగా ఒంటిచేత్తో ఎలా అంత మందిని చంపుతాడు, ఎలా ఎప్పుడు పడితే అప్పుడు పేల్చేస్తాడూ అన్న లాజిక్ కి ఇక్కడ స్థానం లేదు. ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలికి న్యాయం చేస్తున్నాడా, మన కచ్చి తీరిందా అన్నదే ముఖ్యం. ఏయ్, నా మాటల్ని రిపీట్ చేయండి...మేము బలహీనుల నుంచి దొంగిలించే పని మళ్ళీ చెయ్యం అని చెప్పించుకుని మరీ చంపుతూంటాడు.
        
జీవితాంతం కష్టపడి పనిచేయడం తప్ప మరేమీ చేయని వ్యక్తుల నుంచి మీరు వందల మిలియన్లు దొంగిలించారు. ఆమె విద్యావేత్త. ఒక అమ్మ. తన జీవితమంతా ప్రజలకి  సహాయం చేయడానికి అంకితం చేసింది.  ఆమె నడుపుతున్న ఛారిటీ నుంచి  మీరు రెండు మిలియన్లు కాజేస్తే కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎప్పుడూ నన్ను జాగ్రత్తగా చూసుకున్న ఏకైక వ్యక్తి ఆమె అని జేసన్ స్టాథమ్ విసిరే డైలాగులకి జవాబులుండవు దుష్టుల దగ్గర.
       
అసలు స్కామ్ కూడా అంత ఈజీగా ఎలా జరుగుతుందని వివరించే జోలికి కూడా పోలేదు దర్శకుడు డేవిడ్ అయర్.
యువ టెక్కీల గ్రూపు ఒక భారీ హై-టెక్ సెంటర్ నడుపుతూ,  ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి  ప్రతి రోజూ మిలియన్ల డాలర్లని ఎలా తుడిచి పెట్టేస్తారు, అది ప్రభుత్వ దృష్టికి పోకుండా ఎలా వుంటుందీ అనే చిక్కుల్ని వివరించడానికి ఎలాటి ప్రయత్నం చేయలేదు.
        
ఆన్ లైన్లో దోపిడీ జరుగుతోందనేది ఆందోళనకర వాస్తవం. ఎలా జరుగుతోందనేది తెలిసిందే. కాబట్టి ఆ ప్రక్రియ జోలికి పోకుండా, ఒక వృద్ధురాలు భారీ మొత్తంలో పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంది, ఆమెకి న్యాయం జరగాలి- అని సూటిగా సగటు ప్రేక్షకుల స్థాయికి దించి చెబితే కమర్షియల్ గా హిట్టే. 40 కోట్ల డాలర్ల  బడ్జెట్ కి 152 కోట్ల డాలర్ల బాక్సాఫీసు వచ్చిందంటే కథతో ఈ ఫార్ములా కరెక్టే అనుకోవాలి.

కిక్‌లు- పంచ్‌లు- పేల్చివేతలు
మార్షల్ ఆర్టిస్టు జేసన్ స్టాథమ్ ఇచ్చే కిక్‌లు, పంచ్‌లు, ఢామ్మని చేసే బ్లాస్టింగులూ - ఆ యాక్షన్ కొరియోగ్రఫీ (గాబ్రియేల్ బెరిస్టైన్) ప్రారంభం నుంచీ ముగింపు దాకా అదరగొడతాయి. ఇతరుల కష్టార్జిత డబ్బు పట్ల ఏమాత్రం మానవత్వం చూపని వారిపై రివెంజ్ ఈ యాక్షన్ కి భావోద్వేగాల్ని సృష్టిస్తూ వుంటుంది. చాలా పాత్రలు మూస పాత్రలే. ప్రజల డబ్బు దోచుకుని సూపర్ రిచ్ గా మారిన ఘరానా వ్యక్తులు. వీళ్ళతో ఏళ్ళకి ఏళ్ళు పట్టే చట్టాలూ న్యాయప్రక్రియా వర్కౌట్ కావు. వ్యవస్థకి పై స్థాయిలో వ్యవహరించే ది బీకీపర్స్ చేసే తక్షణ న్యాయం జరగాలి. ఇది యూనివర్సల్ సమస్య. ఎవరో నైజీరియా విద్రోహక శక్తులకే పరిమితమై లేదిప్పుడు. ఎంత హైటెక్ గా ఈ ఫ్రాడ్స్ జరుగుతూంటే అంత నాటుగా శిక్షలు పడాల్సిందే. ఆ రుచే వేరు. ఈక్వలైజర్ సిరీస్ సినిమాలతో ఇలాటి నాటు శిక్షలే వేస్తాడు డెంజిల్ వాషింగ్టన్. ఇప్పుడు జేసన్ స్టాథమ్. అయితే ఇంగ్లీషులో తప్ప మరో భాషలో స్ట్రీమింగ్ అవట్లేదు ఈ మూవీ!

—సికిందర్