రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, సెప్టెంబర్ 2018, మంగళవారం

685 :స్ట్రక్చర్ అప్డేట్స్


      T – Time-bound :  కార్పొరేట్ వ్యవస్థలో SMART గోల్స్ నిర్ణీత కాలానికి ఉద్దేశించినవై వుంటాయి. ఆ డెడ్ లైన్ లోగా గోల్స్ ని సాధించాల్సి వుంటుంది. సినిమాల్లో జానర్ ఏదైనా, మీ ప్రధాన పాత్రకి ఇచ్చిన గోల్ కి ఒక డెడ్ లైన్ ఏర్పాటు చేస్తే, అది కథకి బిగిని పెంచడమే గాక, చెక్కుచెదరని ఫోకస్ ని కూడా ఇస్తుంది. క్లయిమాక్స్ లో ఈ డెడ్ లైన్ ని అతిక్రమించి కూడా గడియారం ముల్లు టిక్ టిక్స్ తో టెన్షన్ ని పతాక స్థాయికి చేర్చవచ్చు. అయితే వాస్తవికతని బలిపెట్టే విధంగా మీ కథకి కాలావధిని కుదించ కూడదు. 

          మీ కథ ఒరిజినల్ కాలావధిని ఈ మూడు సందర్భాల్లో విస్తరించ వచ్చు : 1. ప్రధాన పాత్ర పాల్పడే చర్యలు లాజికల్ గా ఒక కాలావధిలో అసాధ్యమైనప్పుడు. అంటే, ప్రధానపాత్ర ఆదివారం బ్యాంకు కెళ్తూంటే మీ కథకి 24 గంటల కాలావధిని  నిర్ణయించడం సబబు అన్పించుకోదు.

       2. ఒకరంటే ఒకరికి తెలియని హీరో హీరోయిన్లకి ప్రేమ పుట్టినప్పుడు కథ ఒక కాలావధిలో ఒదగదు. రోడ్ థ్రిల్లర్ ‘స్పీడ్’ లో లాగా తప్పని సరైనప్పుడు కుదురుతుంది. కానప్పుడు సాధ్యం కాదు.

      3. మీ ప్రధాన పాత్రకి ప్రత్యర్ధి నెదుర్కోవడానికి తగిన స్కిల్స్ సంపాదించుకోవడానికి చాలినంత సమయం లేనప్పుడు, మీ కథకి కాలావధిని నిర్ణయించడం కుదరదు. ప్రధాన పాత్రకి స్కిల్స్ వున్న సహాయ పాత్రని జత చేసినప్పుడు గోల్ కి డెడ్ లైన్ విధించవచ్చు. 

       ఇకపోతే SAMRT గోల్ ఎలిమెంట్స్ లో
A (Actionable) గురించి చెప్పుకున్నాం (స్మార్ట్ గోల్ సెట్టింగ్ -4 చూడండి). దీనికి అనుబంధంగా వుండే Adaptable ఎలిమెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మీ ప్రధాన పాత్ర ఒక గోల్ ని విడనాడి మరొక గోల్ ని చేపట్టడమన్నమాట. ఇది సాధారణంగా ఇంటర్వెల్లో జరుగుతుంది. 

          నూటికి నూరు శాతం స్పష్టత కోసం ఒరిజినల్ గోల్ తో పాటూ ఈ కొత్త గోల్ రెండూ SMART  ఫ్రేమ్ వర్క్ లోనే వుండేట్టు చూసుకోవాలి. ఇలా లేనప్పుడు మీ కథ వెంటనే ఎపిసోడిక్ కథనం బారిన పడుతుంది. దిక్కూదిశా వుండవు. ఉన్నపళాన కుప్పకూలుతుంది. మీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకి లోనవుతారు.

      ‘లీగల్లీ బ్లాండ్’ లో చూద్దాం. ఇందులో ముందుగా రీస్ విథర్ స్పూన్ మాజీ బాయ్ ఫ్రెండ్ ని తిరిగి పొందేందుకు హార్వర్డ్ లా స్కూల్లో జాయినవుతుంది. కానీ ఇంటర్వెల్లో, ఇతనెప్పుడూ తనని తక్కువే అంచనా వేస్తాడని తెలుసుకుని, అతణ్ణి తిరిగి పొందే ఒరిజినల్ గోల్ ని వదిలేసుకుంటుంది. 

          రోమాంటిక్ రిలేషన్ షిప్ ద్వారా తన విలువని తెలుసుకునేలా చేసే బదులు, చదువులో ప్రూవ్ చేసుకుని చూపించాలని నిర్ణయించుకుంటుంది. ఈ కొత్త గోల్ కూడా నిర్దుష్టంగా (S) వుంటుంది. చదువులో ప్రూవ్ చేసుకునేందుకు గాను ఒక ప్రొఫెసర్ దగ్గర ఇంటర్న్ గా చేరుతుంది. తద్వారా హత్య కేసులో ఇరుక్కున్న సహ విద్యార్థినిని విడిపించ వచ్చని. 

          ఇలా సెకండాఫ్ ని డామినేట్ చేసే ఈ కొత్త గోల్ కూడా SMART గోల్ అయింది. ఇది S
pecific గా వుంది : ఆమె మానసిక స్థితిని తెలుపుతూ. ఇది Measurable గా వుంది : హత్య కేసులో దోషియా నిర్దోషియా అని నిందితురాలిపై జ్యూరీ ఇచ్చే తీర్పు – రీస్ విథర్ స్పూన్ కి జయమో అపజయమో తేల్చేసే స్పష్టమైన సూచికగా. Actionable గా వుంది : నిందితురాలిని ఇంటర్వ్యూ చేయడం, అనుకూల సాక్ష్యాల్ని కనుగొనడం, కేసులో ఎలా ప్రొసీడవాలో ప్రొఫెసర్ తో చర్చించడం వగైరా. Realistic గా వుంది : అలవాటుగా ఇతరులు తనని తక్కువ అంచనా వేసినా, తన తెలివిని, తన ఉత్సాహాన్నీతను ప్రదర్శించుకుంటూ, ఇంకో పాత్ర సాయం తీసుకుని, కిందా మీదా పడి మొత్తానికి సాధించడం. ఇది కామెడీ కాబట్టి ఆమె సామర్ధ్యం పట్ల విశ్వసనీయతని నమ్మించే అవసరం లేకుండా. Time-bound గా కూడా వుంది : కోర్టు విచారణకి దానికదే డెడ్ లైన్ ఏర్పాటయి వుంది. 

             ఇక్కడొక తేడా గమనించాలి. ఇక్కడ విథర్ స్పూన్ గోల్ మార్పు, ‘సిల్వర్ లైనింగ్స్’ లో హీరో గోల్ మార్పులా లేదు. ఇంటర్వెల్లో విథర్ స్పూన్ వ్యూహాత్మకంగా ఇంకో గోల్ కి మారింది. ‘సిల్వర్ లైనింగ్స్’ హీరో తన ఆంతరంగిక అభిలాష కోసం బాహ్య కోరికని విడనాడాడు. ఇది క్లయిమాక్స్ లో వస్తుంది.  


          చివరగా ఒక టిప్ : మీ ప్రధాన పాత్ర గోల్ ని SMART పరిధిలోకి తీసుకు రావడం కష్టమనిపిస్తే, ఈ టెక్నిక్ ని వాడండి...ప్రొఫెసర్ మైకేల్ హాగ్ దీని గురించి చెప్పారు. అసంఖ్యాక కమర్షియల్ సినిమాల ప్రపంచంలో ఈ ఐదింటిలో ఒక గోల్ వుంటుందని ఆయన చెప్పారు : 1. గెలవడం, 2. ఆపడం, 3. తప్పించుకోవడం, 4. అప్పజెప్పడం, 5. తిరిగి పొందడం. 

          ముందుగా వీటిలో మీ కథకి తగ్గట్టుగా ఒకదాన్ని తీసుకోండి. దీంతో గోల్ కి నిర్డుష్టత్వం దాని కదే వస్తుంది. ఆ తర్వాత SMART లోని ఒక్కో ఎలిమెంటునీ అప్లయి చేస్తూ పోండి. గోల్ చర్యలు మీరు సృష్టించే ప్రధాన పాత్రలకే కాదు, రచయితగా మీకూ వర్తిస్తాయి. బలమైన కథనంతో కూడిన కథల్ని సృష్టించే క్లబ్బులో మీకూ చేరాలని గోల్ గా వుంటే, ఈ కింది చర్యలు చేపట్టడం గురించి ఆలోచించండి. 

      మీ కథని పోలిన సినిమాలుంటే ఓ ఐదూ పదీ పోగేసుకోండి. వాటిలో ప్రతీ ప్రధాన పాత్ర గోల్ నీ SMART ఫ్రేమ్ వర్క్ లో పెట్టి పరిశీలించండి. అప్పుడు రాయడానికి లొంగని మీ కథ గురించి ఆలోచించండి. మీ ప్రధాన పాత్రకి SMART గోల్ అంటూ వుందా? లేకపోతే  కల్పించండి. ఇప్పుడు వర్కౌట్ అవుతోందా? ఇంకా వర్కౌట్ కాకపోతే, ప్రత్యర్ధి పాత్ర వైపు చూడండి, తీసుకుంటున్న రిస్కులవైపు చూడండి. ఇవి పకడ్బందీ స్క్రీన్ ప్లేకి పనికొచ్చేంత బలీయంగా వున్నాయా?

          రచయితగా మీరేం సాధించాలనుకుంటున్నారు? మీ కలల్ని కూడా మీరు 
SMARTly గా నిర్వచించుకుంటే, మీరేం  సాధించాలనుకుంటున్నారో అది మీరెన్నడూ వూహించనంత సులభతరమై పోతుంది. గుడ్ లక్, మీ గోల్స్ తో మీకూ  మీ రైటింగ్ కీ!  

హెచ్ ఆర్ డికొస్టా
(అయిపోయింది)