రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, September 9, 2016

 



రచన- దర్శకత్వం : శ్రీనివాస్ అవసరాల

తారాగణం : నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా, పావని గంగిరెడ్డి, సీత,
రాజేశ్వరి, హేమంత్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, నాని (గెస్ట్ రోల్ లో) తదితరులు
సంగీతం : శ్రీ కళ్యాణ్ రమణ,  ఛాయాగ్రహణం : వెంకట్ సి. దిలీప్
బ్యానర్ : వారాహి చలన చిత్ర,  నిర్మాత: రజనీ కొర్రపాటి
సమర్పణ: సాయి కొర్రపాటి
విడుదల : సెప్టెంబర్ 9, 2016
***
చాలా కాలంగా హిట్స్ లేక సతమతమవుతున్న నారా రోహిత్, నాగశౌర్యలు ఒకటై దర్శకుడుగా ఒక హిట్ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ తో కలిసి ఒక రోమాంటిక్ కామెడీతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వీళ్ళకి దన్నుగా నిలబడింది. హీరోయిన్ గా రేజీనా కాసాండ్రా దొరికింది. తెలుగులో రోమాంటిక్ కామేడీలకి కొరత లేదు. అదే సమయంలో జాడించి రెండు వారాలాడినవీ పెద్దగా లేవు. ప్రేమకథల్లో ఏదో వైవిధ్యం, ప్రత్యేకత వుంటే తప్ప నిలబడే అవకాశం లేదు. ఈ నేపధ్యంలో ప్రస్తుత రోమాంటిక్ కామెడీ ఏ ప్రత్యేకతలతో వచ్చింది, మిగతా రోమాంటిక్ కామెడీలకి తను తేడా గల కామెడీ అని నిరూపించుకుందా, లేకపోతే  మరో సగటు ప్రేమ సినిమా అన్పించుకుందా ఈ కింద చూద్దాం

కథ
        అచ్యుత్ (నారా రోహిత్), ఆనంద్ (నాగ శౌర్య) అన్నదమ్ములు. మధ్యతరగతి కుటుంబం. ఇద్దరికీ పెళ్ళిళ్ళయి తల్లి (సీత) తో కలిసి వుంటారు. ఓ పెళ్లి రోజున పార్టీలో అన్నదమ్ముల మధ్య జ్యోత్స్న (రేజీనా) అనే అమ్మాయి ప్రస్తావన వస్తుంది. దీంతో వాళ్ళ భార్యలు ఆ మాట పట్టుకుని నిలదీస్తారు. ఇద్దరూ కట్టుకథలు చెప్తారు. తమ పెళ్లి కాక ముందు ఈ ఇంట్లో అద్దెకున్న జ్యోత్స్న కి తమ్ముడితో లింకు పెట్టి అన్న చెప్తే, అన్నకి లింకు పెట్టి తమ్ముడు చెప్పి భార్యల్ని శాంతింపజేసుకుంటారు. కానీ జరింగింది వేరు. ఇంట్లో అద్దెకి దిగిన జ్యోత్స్న తో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఒకళ్ళనొకళ్ళు దెబ్బకి దెబ్బ తీసుకుంటూ పోటీలు పడతారు. ఆమె ఇద్దరితోనూ  సరదాగా వుంటుంది.  ఆమె కొద్ది రోజుల్లో యూఎస్ కి వెళ్లిపోవాలి. వెళ్లి పోతూ, తను ఎవర్నీ ప్రేమించ లేదనీ, తనకి భరద్వాజ్ (సుశాంత్) అనే బాయ్ ఫ్రెండ్  వున్నాడనీ చెప్తుంది. దీంతో అచ్యుత్ కి ఒళ్ళు మండి  ఆమె పాస్ పోర్ట్ తగులబెడతాడు. అదే సమయంలో ఇంట్లో ఇంకో విషాద సంఘటన జరుగుతుంది. దీనికి జ్యోత్స్నయే కారమని అన్న దమ్ములు నమ్ముతారు. జ్యోత్స్న వాళ్ళని తిట్టేసి వెళ్లిపోతుంది. ఇదీ జరిగిన విషయం. 

        మూడేళ్ళు గడిచిపోయాక, ఇప్పుడు తాజాగా యూఎస్ నుంచి వస్తుంది జ్యోత్స్న . వచ్చి అదే ఇంట్లో అద్దెకి దిగుతుంది. పెళ్ళయిన అన్నదమ్ములకి హుషారొస్తుంది. ఆమె ఒకరికి తెలీకుండా ఒకరికి ప్రేమిస్తున్నానని చెప్పి కంగారు పుట్టిస్తుంది. ఇప్పుడిలా వచ్చిన జ్యోత్స్న ఉద్దేశమేమిటి? ఆమె మనసులో ఏం పెట్టుకుని వచ్చింది, ప్రతీకారమా?  ప్రత్యుపకారమా? ఇంకేదైనా సహాయం కోరి వచ్చిందా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే సెకండాఫ్ చూడాల్సిందే.

ఎలావుంది కథ
        సగటు ప్రేమ కథే. ఇలాటి ముక్కోణ ప్రేమ కథలో, అందునా పెళ్ళయిన హీరోల కథలో కొత్తగా ఆశించడానికేమీ వుండదు. సరే, వున్న రొటీన్ కథనైనా సస్పెన్స్ లేకుండా మొదట్నించీ మొత్తం విప్పి చెప్పుకుపోయారు. ఇది ఇంటర్వెల్ వరకే పనికొచ్చింది. ఆతర్వాత విషయం లేక శూన్య స్థితికి చేరింది. 1976 లో సి. ఆనందరామం రాసిన ‘మమతల కోవెల’ నవల ఆధారంగా కె రాఘవేంద్ర రావు జయసుధతో తీసిన ‘జ్యోతి’ లో జయసుధ వచ్చి గుమ్మడిని పెళ్లి చేసుకుంటాననే షాకింగ్ మాటలతో సస్పెన్సుతో ప్రారంభమవుతుంది కథ. అలాగే ప్రస్తుత కథలో రేజీనా పెళ్ళయిన హీరోల ఇంటికి వచ్చి- ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని దుమారం రేపుతూ ప్రారంభించివుంటే కథకి చివరంటా ప్రాణవాయువు లభించేది. సస్పెన్స్, థ్రిల్  లేకుండా రామాయణం కూడా లేదు. సస్పెన్స్, థ్రిల్ అనేవి ఏవో క్రైం సినిమాల ఎలిమెంట్స్  మనకెందుకని ప్రేమసినిమాల కర్తలు పక్కన బెడితే గాలి తీసిన బెలూన్లా వుంటాయి. 

ఎవరెలా చేశారు
        ఈ మధ్యకాలంలో నవ్వొచ్చే విధంగా ఎంతో లావెక్కి నటిస్తున్న నవ హీరో నారా రొహిత్, ఈసారి ఆ ఒబెసిటీ నుంచీ, వీర లెవెల్ మాస్ పాత్రల నుంచీ రక్షిస్తూ చాలా బాక్సాఫీస్ ఫ్రెండ్లీ పొజిషన్ లోకొచ్చాడు. ఇలా సింపుల్ గా నటిస్తే, నవ్విస్తే, కాస్త ఏడిపిస్తే కూడా తనకి సూటవుతుంది. అంతేగానీ శరీరం వేసుకుని లేనిపోని విన్యాసాలే చేస్తే వినాశాకాలే. సిబ్లింగ్ రైవల్రీ తో, అదే సమయంలో బ్రోమాన్స్ తో అచ్యుత్ క్యారెక్టర్ తనకి దక్కిన ఒక వరం. 

        తమ్ముడి పాత్రలో నాగశౌర్య కూడా డీసెంట్ గా నటించాడు. ఇంతకాలం డైమెన్షన్ లేని రొటీన్  బాయ్ ఫ్రెండ్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడేమో, ఈసారి  డైమెన్షన్ తో ఫుల్ లెన్త్ అన్నకి తమ్ముడిగా కూడా నటించడంతో- కొత్తగా కన్పిస్తాడు. రోహిత్, శౌర్య లిద్దరూ ఇలా నవ్యంగా కన్పించడానికి కారకుడు దర్శకుడు అవసరాల శ్రీనివాసే. తన విజన్ లో సృష్టించి, రచించి, నటింపజేసిన ఈ పాత్రలతో ఇద్దరూ ప్రేక్షకులకి దగ్గరయ్యే అదృష్టానికి నోచుకున్నట్టయ్యింది. 

        రేజీనా కీలక పాత్ర పోషిస్తూ ఫస్టాఫ్ లో అలరించినా ఆ తర్వాత ఏమైందో మూస ఫార్ములా హీరోయిన్ లా కథలోంచి దాదాపు మాయమయిపోయింది. తన పాత్ర లేకపోతే కథే లేనప్పటికీ,  రాంగ్ వే లో కథ చెప్పడం వల్ల తన పాత్ర గాలి సగంవరకే సరిపోయింది. ఆ తర్వాత ఎంత గాలి కొట్టినా లాభం లేకపోయింది.
        సంగీతం, ఛాయాగ్రహణం, ఇతర సాంకేతికాలు ఈ రోమాంటిక్ ఫీల్ కి తగ్గట్టే వుండి- దర్శకుడి అభిరుచిని చాటుతాయి.  

చివరికేమిటి?
        ఇది దర్శకుడి సినిమా. అయితే స్క్రీన్ ప్లే దగ్గర ఈ సాదా రొటీన్ కథనే సాంతం పకడ్బందీగా చెప్పడం కుదరలేదు. ఫస్టాఫ్ ముగిశాక, సెకండాఫ్ అతికించిన వేరే కథ అయిపోయి సెకండాఫ్ సిండ్రోమ్  బారినపడింది. ప్రారంభ దృశ్యమే హీరోలకి పెళ్ళిళ్ళయినట్టు చూపించేయడం కథని ఫైనల్ చేసినట్టయ్యింది. అంటే హీరోయిన్ వున్నా కథకి ముగింపు ఈ పెళ్ళిళ్ళకి లోబడే ఉంటుందని ముందే తెలిసిపోతోంది. రెండోది, ఇద్దరు హీరోలతో హీరోయిన్ ముక్కోణ ప్రేమ కథ అన్నాక కూడా వీళ్లిద్దరితో ఆమె ఎలా విడిపోయిందనే పాయింటే ప్రధానమై ఈ దృష్టితోనే సినిమా చూడాల్సి వస్తుంది. ఇలా ఫలితాలు ముందే తెలిసిపోవడంతో సస్పెన్స్ లేకుండా పోయింది. పైన చెప్పుకున్న ‘జ్యోతి’ మార్కు నేరేషన్ పెట్టుకుని వుంటే ఈ బాధ తప్పేది. అన్నదమ్ములతో అమ్మాయి కథ కాస్తా అన్నదమ్ముల వేరే కథగా మారక తప్పని పరిస్థితి ఏర్పడేది కాదు. చివరి అరగంట అన్నదమ్ములతో విషాదభారం ఎక్కువయ్యే బాధ కూడా తప్పేది. హీరోయిన్ మళ్ళీ వచ్చిన కారణం- తన బాయ్ ఫ్రెండ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కాబట్టి,  వాడి సంగతి చూడాలనడం- సరుకు లేని ప్లాట్ పాయింట్. ఇలాటి తప్పులు దొర్లకుండా చూసుకుందుకే కొన్ని పాత  సినిమాలు మార్గదర్శకాలుగా వున్నాయి. 

        సినిమా ఫస్టాఫ్ చాలా ఫన్నీగా వుండి, సెకండాఫ్ లేకపోవడం ఏకసూత్రతని పాటించక పోవడమే. మాటలు, దర్శకత్వం ఈ రెండిట్లో ప్రతిభ కనబరచిన అవసరాల, మిగతా రచన కూడా కమర్షియల్ సినిమాకి దగ్గరగా చేసుకుని వుంటే బావుండేది.  సిగరెట్ జోకులు పేల్చినంత కామెడీతో,  కథని కూడా దారిలో పెట్టుకుని ఆద్యంతం పేల్చి వుండాల్సింది.



-సికిందర్
http://www.cinemabazaar.in