రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, September 5, 2014

సాంకేతికం/ఆనాటి ఇంటర్వ్యూ

ఆకాశమూ హద్దుకాదు!
ఎస్. బాలచంద్ర - 'జెమిని విఎఫ్ఎక్స్'  హైదరాబాద్ హెడ్ 
సినిమా ఫీల్డులో నిర్మాతల్ని దోచేస్తారన్న పాపులర్ టాక్‌కి వీళ్లు భిన్నం. తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యతని అందించడానికి ప్రయత్నిస్తూంటారు వీళ్లు. అంతేకాదు, బ్రహ్మాస్త్రంలా అందివచ్చిన గ్రాఫిక్స్ నుపయోగించుకుని, షూటింగ్స్ లో కొన్ని ప్రయోగాలూ చేసి చిన్న నిర్మాతలకి పొదుపు చేస్తుంటారు. తర్వాత ఆ సినిమాల్ని ప్రేక్షకుల మధ్యకి తీసుకెళ్లి సక్సెస్ చేసుకోవడం ఆ ప్రయోజనాలు పొందిన చిన్న నిర్మాతల బాధ్యతే. నిర్లక్ష్యం చేస్తే ఆ గ్రాఫిక్స్ నిపుణులు చూపిన ఔదార్యమంతా వృధాపోయినట్టే.
***
'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' ఇటీవల విడుదలైన సోషియో ఫాంటసీ. వెబ్‌సైట్ల రివ్యూల్లో ఈ సినిమాకు కూర్చిన గ్రాఫిక్స్ అద్భుతాల గురించే ఎక్కువ రాసి హైలైట్ చేశారు- "కానీ నిర్మాత అస్సలు పబ్లిసిటీ ఇవ్వకపోవడం వల్ల రెండు వారాల్లో ఆ సినిమా కనుమరుగైంది'' అని బాధపడ్డారు ఎస్. బాలచంద్ర. ఈయన ఆ సినిమా గ్రాఫిక్స్ టీముకి సారథ్యం వహించిన వీఎఫ్ఎక్స్ నిపుణుడు. ‘జెమినీ ల్యాబ్స్’ గ్రాఫిక్స్ విభాగం హైదరాబాద్ హెడ్‌గా ఉంటున్న ఈయన వినూత్నంగా ఆలోచించి నిర్మాతల ఖర్చు తగ్గిస్తూంటారు.
ఉదాహరణకి పై సినిమాలో చతుర్ముఖాలు గల బ్రహ్మ పాత్రలో రాజేంద్రప్రసాద్‌ని చూపేందుకు అసలుకైతే ఖరీదైన వ్యవహారం గల మోషన్ క్యాప్చర్ కెమెరా వాడాలి. కానీ బాలచంద్ర దీనికి చవకైన ప్రత్యామ్నాయాన్ని ఆలోచించారు. ఒక మామూలు రౌండ్ ట్రాలీ, మరింకో మామూలు 435 ఆరీ కెమెరా, అంతే. కాకపోతే నటుడు కాస్త కష్టాన్ని ఓర్చుకోవాలి. రాజేంద్రప్రసాద్ నాలుగు గంటల పాటు సెట్‌లో నిలబడే ఉండే కష్టానోర్చుకున్నారు. కెమెరామాన్ వాసు రంగంలోకి దిగారు. ఒక దిక్కుకేసి తిరిగి నిలబడ్డ రాజేంద్రప్రసాద్ చుట్టూ 360 డిగ్రీలు వర్తులాకారంలో రౌండ్ ట్రాలీ మీద కెమెరాని ఆపరేట్ చేసి, సరిగ్గా బయలుదేరిన చోటుకి మిల్లీమీటర్ తేడా రాకుండా తెచ్చి ఆపారు. 
తర్వాత రాజేంద్రప్రసాద్ ఇంకో దిక్కుకి తిరిగినప్పుడు మరో రౌండ్ కెమెరా తిప్పారు. మిగతా రెండు దిక్కుల్లో కూడా ఇదే రిపీట్ చేశారు. ఈ మొత్తం నాలుగు దిక్కుల తలకాయల్నీ తీసుకుని గ్రాఫిక్స్ కి పని చెప్పారు. ఏక కాలంలో బ్రహ్మ దేవుడి  ఏ ముఖానికా ముఖం దానికైన భావ ప్రకటనలతో జీవకళ ఉట్టిపడుతూండేసరికి ప్రేక్షకుల నుంచి ఒకటే చప్పట్లు. ఈ సీనుకి ట్రాలీబాయ్స్ అందించిన సహకారం మరువలేనిదన్నారు బాలచంద్ర. ఇది చూసి దర్శకుడు కోడి రామకృష్ణ నిర్మాణంలో ఉన్న తన కొత్త సినిమా గ్రాఫిక్స్ బాధ్యతని తనకొప్పజెప్పారన్నారు.


కడప జిల్లా మైదుకూరుకు చెందిన బాలచంద్ర సినిమాల మీద ఆసక్తితో చెన్నయ్ వెళ్లిపోయి, ప్రముఖ దర్శకుడు సాగర్ దగ్గర సహాయకుడిగా చేరారు. సినిమాలకి పనిచేస్తూనే 1999లో లయోలా కాలేజీలో వీఎఫ్ఎక్స్ కోర్సు పూర్తి చేశారు. ఆ వెంటనే అక్కడి ‘ప్రసాద్ ల్యాబ్స్’ గ్రాఫిక్స్ విభాగంలో చేరిపోయారు. కానీ బయట సినిమాలు మానుకోలేదు. 'స్టాలిన్'కి మురుగదాస్ దగ్గర అసిస్టెంట్‌గా చేశారు. 2005లో 'జెమిని ఈఎక్స్' హైదరాబాద్ హెడ్‌గా చేరాక- స్టాలిన్, శంకర్‌దాదా ఎంబీబీఎస్, అరుంధతి మొదలైన 70 వరకూ సినిమాలకి గ్రాఫిక్స్ సారథ్యం వహించారు. "కథలోంచి తన్నుకొస్తూ గ్రాఫిక్స్ కళ కన్పించకూడదు. కథలో కలిసిపోయి అదృశ్యంగా ఉంటేనే అది సక్సెస్ అవుతుంది'' అనేది ఈయన థియరీ కూడా.
 శ్రీకాంత్ నటించిన యాక్షన్ మూవీ 'నగరం' లో ఒక వినూత్న ప్రయోగం చేసి నిర్మాతకి ఆదా చేశారు. ఇదివరకు సినిమా రచయిత 'ఎగిసిపడ్డ నీళ్లు జగ్-జగ్-జగ్ మని మల్టిపుల్ యాంగిల్స్ లో ఫ్రీజయ్యాయి' అని సౌండ్ ఎఫెక్ట్సుతో సహా స్క్రిప్టులో కవిత్వీకరిస్తే - 'నువ్విలా ఇష్టమొచ్చినట్టు కవిత్వాలు రాస్తే ఎలా తియ్యాల్రా?' అని కొట్టినంత పని చేసేవారు. ఇప్పుడా బాధలేదు. రచయిత ఏం రాసేసినా అదంతా చక్కగా వెండితెర మీదికి తీసుకురావచ్చు. (కర్టెసీ: ది ఎవర్ ఇన్నోవేటింగ్ గ్రాఫిక్స్ టెక్నాలజీ.)

ఎగిసిపడ్డ నీళ్లలాంటి దృశ్యాల్ని వివిధ కోణాల్లో ఫ్రీజ్ చేసి చూపేందుకు ‘ఫ్రీజ్ ఫ్రేం టెక్నాలజీ’ అని ఉంది. దీనికి అక్షరాలా వంద కెమెరాలు అవసరం. దృశ్యం చుట్టూ అడుగుకో కెమెరా అమర్చి, అన్నిటినీ ఒకేసారి ఎక్స్ పోజ్ చేస్తారు. అప్పుడా వంద కెమెరాల్లో ఒక్కో కోణం లోంచి వచ్చే ఎక్స్ పోజర్స్ లోంచి ఒక్కొక్కటి చొప్పున వంద స్టిల్స్ తీసుకుని, వాటిని జోడిస్తూ పోతే అనుకున్న ఎఫెక్ట్ వచ్చేస్తుంది. దీనికి 18-20 లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుంది. 
'నగరం'లో ఒక యాక్షన్ సీనుకి ( పై ఫోటోలు చూడండి) ఈ ఫలితాన్ని రాబట్టేందుకు చవకలో చురుకైన ఆలోచన చేశారు బాలచంద్ర. ఒక రౌండ్ ట్రాలీ, ఒక నార్మల్ కెమెరా అంతే. ట్రాక్ మీద కెమెరామాన్ శరత్ యాక్షన్ చుట్టూ తిరిగి ఫ్రీజ్ షాట్స్ తీశాక రివర్స్ యాంగిల్‌లో అదే యాక్షన్ కొనసాగుతున్న సెట్‌ని తిప్పితే, అనుకున్న ఎఫెక్ట్ కి దగ్గరైనట్టే. ఇక గ్రాఫిక్స్ తో ఫినిషింగ్ టచ్చే మిగిలింది.
ఇలాటి ఐడియాలు మీకెలా వస్తాయంటే-  'జస్ట్ థాట్' అనేశారాయన. కాబట్టి గ్రాఫిక్స్ కేవలం కంప్యూటర్ ఉత్పాదన అనుకుంటే చాలదు. కంప్యూటర్లు, ఎసీ గదుల బయట ఇంకా  విశాలమైన రంగస్థలముంది. అక్కడ కెమెరాలతో కొత్త కొత్త భంగిమల్లో కుస్తీపట్లు పడితే గానీ- ఈ కళాసృష్టి సాగదు!


-సికిందర్
(ఏప్రెల్ 2011 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)