రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, January 15, 2020

909 : రైటర్స్ కార్నర్



                          క్లిఫ్ డార్ఫ్ మాన్ - హాలీవుడ్ హిట్  ‘వారియర్’  స్క్రీన్ ప్లే రచయిత...ఈ మూవీ హిందీలో ‘బ్రదర్స్’ గా అధికారిక రీమేక్ అయింది. ఈ రిమేక్ తో క్లిఫ్ కి రచనాపరంగా ఏ సంబంధం లేకపోయినా, ‘వారియర్’ రచయితగా ఆయన క్రిస్ నిటెల్ కిచ్చిన ఇంటర్వ్యూని ఈ సందర్భంగా ప్రచురిస్తున్నాం...
వారియర్’ తో మీ అనుభవం చెప్పండి?
          ‘వారియర్’ 2011 లో విడుదలయ్యింది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రపంచాన్ని ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ చేసి చూపించాం. ఈ స్క్రిప్టు పని పూర్తయి షూటింగ్ కూడా పూర్తయ్యాకా విడుదల తేదీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఈ లోగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మె కారణంగా నా మరో స్క్రిప్ట్ అమ్ముడుపోక ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డాను. నా సేవింగ్స్ అన్నీ ఖర్చయిపోయాయి. కారూ ఇల్లూ కూడా పోయి పూర్తిగా దివాళా తీశాను. ఇంకో ఆరు నెలలకి గానీ ‘వారియర్’  విడుదల కాలేదు. అది విడుదలయ్యాక తిరిగి నా ఆర్ధిక పరిస్థితి మెరుగు పడింది.
మీరు రాసిన మొట్టమొదటి కథ?
          నవల. అప్పుడు నాకు పదకొండేళ్ళు. పెన్నుతో కాగితాల మీద రాసుకుని ఆ 50 పేజీలనీ ఫైల్ చేసి పెట్టుకున్నాను. అది తర్వాత చెదలు పట్టిపోయింది.
మీ కళాతృష్ణకి ఎలాటి సినిమాలు, లేదా కథలు మీకు స్ఫూర్తి నిచ్చేవి?
          మొదట్నించీ గ్రీకు పురాణాలంటే ఇష్టం. ఇప్పటికీ వాటికి ప్రభావితుణ్ణి అవుతూనే వుంటాను. ఆ తర్వాత క్లాసిక్ లిటరేచర్ వైపు, క్లాసిక్ సినిమాలవైపూ ఆసక్తి పెరిగింది. నా జీవితంలో నేనేం కావాలో నిర్ణయించుకోవడానికి ఒకే ఒక్క సినిమా చూశాక తెలిసి వచ్చింది. ఆ సినిమా ‘బ్లడ్ సింపుల్’. ఈ సినిమా చూశాక ఇలా రాస్తే సినిమా ఫీల్డులో అగ్ర స్థానానికి చేరుకోవడం సాధ్యమేనని అన్పించింది. ‘ఫౌంటెన్ హెడ్’ నవల చదివినప్పుడు కూడా నాకిలాటి ఫీలింగే కలిగింది.
ఒక అనామక రచయిత తన స్క్రిప్టు  వెలుగు చూడాలంటే ఏం చేయాలంటారు?
          ఇలా చెప్తే సిల్లీగా ఉండొచ్చు- కానీ ఏదైనా బ్రహ్మాండమైన స్క్రిప్టు  రాస్తే అది తప్పకుండా వెలుగు చూస్తుంది. ఎలా వెలుగు చూస్తుందో వివరించలేను గానీ, వెలుగు మాత్రం చూస్తుంది. ఐతే ముందుగా తను ఏ బ్రాండో తెలుసుకోవాలి. ఆ బ్రాండ్ తో తను రాసిన దానికి దగ్గరగా వుండే అలాటి రచయితల్నిగానీ, దర్శకుల్ని గానీ, నిర్మాతల్ని గానీ ఫాలో అవుతూ వుండాలి.  వీళ్ళకి దగ్గరయ్యే  మార్గాలని అన్వేషించాలి. నేటి డిజిటల్ యుగంలో ఇదేం కష్టం కాదు. నేను స్ట్రగుల్ చేస్తున్న కాలంలో ప్రీమియర్ షోలలో చొరబడి సినీ ప్రముఖుల్ని పలకరించే అవకాశం తీసుకునే వాణ్ణి. రైటర్ గా ఇతరులకంటే తనెలా ప్రత్యేకమైన వాడో, ఏ నిర్మాతయినా తన స్క్రిప్టుని ఎందుకు ఓకే చేయాలో చెప్పగలిగి వుండాలి. వాణిజ్య రంగంలో యూ ఎస్ పీ(యూనిక్ సెల్లింగ్ పాయింట్) అని వస్తువులకి వాటిదైన ప్రత్యేకత ఒకటి వుంటుంది. అలాటి యూ ఎస్ పీ తన కేమిటో రైటర్ తెలుసుకోవాలి. అది తనదైన ఒక వాయిస్ అవుతుంది - లేదా శైలి అయి వుంటుంది. సొంత వాయిస్. మరొకరికి అనుకరణ కానిది.
ఏ జీవితానుభవాలు మీ పాత్రలపై ప్రభావం చూపుతాయి?
         
ప్రతీ అనుభవం కూడా. ప్రతీ వ్యక్తితో అనుభవం కూడా. ఒక్కక్షణం అలా కలిసి వెళ్ళిపోయినా సరే, అది కూడా పనికొచ్చే అనుభవమే. నా కుటుంబ సభ్యులతో, మిత్రులతో, బయట ఇతరులతో అన్నీ పనికొచ్చే అనుభవాలే. నేను రాస్తున్నప్పుడు ఏదీ నాకు వ్యర్ధ పదార్ధం కాదు. బహిరంగ ప్రదేశాల్లో కూర్చుని ఇతరులు అనుకునే మాటల్ని వింటాను. అవి ఆసక్తి కరంగా వుంటే రికార్డు చేసుకుంటాను. లేదా నోట్ చేసుకుంటాను. సహజంగా దొర్లే జనం భాష ఇంటలెక్చువల్ గా ఏమీ వుండదు గానీ, ఆ మాటలు లోతుగా ఎక్కడో తాకుతాయి. నేనేం విన్నా, చదివినా నేను రాస్తున్న పాత్రలకి ఎలా అన్వయించాలా అని ఆలోచిస్తాను.
మీ క్యారక్టర్ డెవలప్ మెంట్ ప్రాసెస్ ని వివరించండి?
         
నేనెప్పుడు రాయడానికి కూర్చున్నా దేవుడు నాకు మార్గం చూపించాలని ప్రార్ధిస్తాను. నా అనుభవాల భాండాగారంలో కెళ్ళి క్యారక్టర్స్ ని చూపించమని అడుగుతాను.
.క్యారక్టర్  బయోగ్రఫీలు రాసుకుంటారా?
          రాయను, క్రియేట్ చేసుకుంటాను
మీరు క్రియేట్ చేసే క్యారక్టర్ లతో మీరు ఎమోషనల్ గా ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు?
          ప్రాసెస్ లో ఇది చాలా కఠినాతి కఠినమైన పని. టార్చర్ కూడా. నేను రాస్తున్నంత కాలమూ ఎన్ని క్యారక్టర్స్ వుంటే వాటన్నిటి  ప్రపంచాల్లో జీవిస్తూ వుండాల్సిందే.


 గొప్ప క్యారక్టర్ ని సృష్టించాలంటే దేన్ని  ప్రాతిపదికగా తీసుకోవాలంటారు?
          జీవితానుభవాన్ని. మనుషుల అసంకల్పిత చర్యల్ని. ఆహారపు టలవాట్లని. ఫిజికల్ బిజినెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనమెప్పుడూ చేసే పనుల ద్వారా మన మనసేమిటో బయట పెట్టేస్తూంటాం. ఈ డైకాటమీ- ఆలోచనకీ  చేతకూ మధ్యన వుండే సంబంధాన్ని పరిశీ లిస్తూంటాను- దాన్ని ఎక్స్ ప్లాయిట్ చేస్తాను. నేను సృష్టించిన ఒక స్త్రీ పాత్ర ఆందోళనకి గురయినప్పుడు బొటన వేలుని గట్టిగా పట్టుకుని మెలి తిప్పడమనే డైకాటమీని రాశాను.

రాసే ముందు అవుట్ లైన్ వేసుకుంటారా?
          కొన్నిసార్లు వేస్తూంటాను. కానీ అది నా కిష్టముండదు. అయితే కొన్ని రకాల కథలకి అవుట్ లైన్ అవసరమే.

స్ట్రక్చర్ గురించి మీ అభిప్రాయం?
          అది టెక్నికల్. కొంతవరకూ తప్పనిసరిగా అవసరమే. ఐతే దాన్ని ఎగేసే మార్గాలు ఎప్పుడూ వుంటాయి. నా మైండ్ లో కథకి ఓ బిగినింగ్, మిడిల్, ఎండ్ లేమిటో ముద్రపడి పోయాక, ఆకథని నేనెలాగైనా చెప్పగలను. అది వర్కౌట్ అయితే అది చెప్పడానికి నేనేంచుకున్న స్ట్రక్చర్ ప్రధానమే కాదు. ఇందుకే నేను నవలల్ని నేనెక్కువ ఇష్టపడతాను. అవి స్ట్రక్చర్ లో ఇరుక్కుని వుండవు.

మీరు అభిమానించే సినిమాలు ఏ  స్ట్రక్చర్స్ లో ఉన్నాయంటారు?
          దేనికవే ..అయితే ’గుడ్ ఫెల్లాస్’  స్ట్రక్చర్ ని నేనిష్ట పడతాను. థర్డ్ యాక్ట్ ప్రారంభం దగ్గర  లేదా, సెకండ్ యాక్ట్ ముగింపు దగ్గర్నుంచి ఆ సినిమా ప్రారంభమవుతుంది. అక్కడ్నించీ బయల్దిరిన చోటుకి తిరిగి వస్తుంది. అక్కడి నించీ ఎండ్ వరకూ కంటిన్యూ అవుతుంది. ఎన్నిరకాల స్ట్రక్చర్స్ వున్నా నేను బాగాలవ్ చేసేది  ‘పల్ప్ ఫిక్షన్’  స్ట్రక్చర్ని. అది చాలా బ్రిలియెంట్ స్ట్రక్చర్.

మీ క్యారక్టర్ లు ఎప్పుడైనా వాటి గురించి అవి మాట్లాడుకోవడం జరుగుతుందా?
          అవి తమలో తాము మాట్లాడుకుంటాయి- లేకపోతే వాటికి నేను అన్యాయం చేసినట్టే.
మీకు డైలాగులు ఈజీ గా వచ్చేస్తాయా- లేక బాగా కష్ట పెడతాయా?
          ఏ డైలాగూ అంత ఈజీగా రాదు. బాధాకరమైన ప్రాసెస్ అది.

పాత్రలు వివరణలు ఇచ్చుకోవడాన్ని మీరెలా నివారిస్తారు?
          నివారించలేం. పోలీసులాగా నిఘా పెట్టగలం. పాత్ర ఇచ్చిన ఓ వివరణకి నేను మళ్ళీ మళ్ళీ వెనక్కెళ్ళి చదువుకుంటూ ఆ వివరణ అవసరమా అని ఆలోచిస్తాను. అవసరమే అనుకుంటే, అది మాటల్లో కాకుండా విజువల్ గా - సింబాలిక్ గా చెప్పొచ్చా అని కూడా ఆలోచిస్తాను.

మీ డైలీ రైటింగ్ రొటీన్ గురించి చెప్పండి?
          వ్యాయామం చాలా చేస్తాను. వాటిలో బాక్సింగ్, యోగా వుంటాయి. జిమ్, రన్నింగ్ వుంటాయి.  అప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్ బాడీకీ  మైండ్ కీ  చాలా హెల్ప్ చేస్తుంది. రాసేటప్పుడు ఫోన్ ని స్విచాఫ్ చేసి వేరే రూమ్ లో పెట్టేస్తాను.

స్క్రీన్ రైటర్ల గురించి వుండే అపోహ లేమిటో చెప్పగలరా?
          ఈ వృత్తిని ఇతరులు ఫన్ అనుకుంటారేమో- నిజమే, చాలా ఫన్. రాసిన సినిమాని తెర కెక్కితే దాన్ని చూసుకోవడం ఫన్నే కదా? దాన్ని మించిన ఫన్ ఏముంటుంది. కానీ అదే చూస్తున్న సినిమాని ముందుగా కాగితాల మీదికి ఎక్కించడానికి వుంటుందే- అది నావరకూ ఒక నరకం.

మీ కెరీర్ లో బాగా హైలైటయిన అంశం ఏమిటి?
          ఏమీ లేదు. హైలైట్స్ గురించి ఆలోచించను..నాకో ఫిలాసఫీ వుంది. కోరుకున్న గమ్యానికి ఎప్పుడూ చేరుకుంటూ వుండాలే గాని చేరుకోకూడదని. చేరుకున్నామంటే ఇక అక్కడ చేయడాని కేమీ వుండదు. అక్కడ్నించి బయల్దేరి  వెనక్కి రావడమే.      

మీ రీ - రైటింగ్ ప్రాసెస్ ని వివరిస్తారా?
          అదెప్పుడూ వుండే ప్రాసెస్సే. స్క్రిప్టు ఏ కొద్ది అమ్ముడుపోవాలన్నా అది చాలా  అవసరం. చాలా  సింపుల్ గా నేను దీన్ని డీల్ చేస్తాను. నేను రాస్తున్న సీన్లలో ఒకదాన్ని బాగా ఇష్టపడి పదేపదే రీరైట్ చేసి మెరుగు పరుస్తున్నా ననుకోండి- అప్పుడు ఓ వైపు నుంచి నా మైండ్ చెప్తూనే వుంటుంది- ఫస్ట్ కట్ చేయాల్సింది ఆ సీన్నే అని. సీన్లమీద మమకారాలే అలాటివి. ఆ మమకారాలు లాజిక్ ని చంపేస్తాయి. ఇలా నన్ను నేను ఎడిట్ చేసుకునే సౌమనస్యం నాకుంటే- అప్పుడు ఆ స్క్రిప్ట్ గురించి ఏ స్టూడియో నుంచో, ఏ ప్రొడ్యూసర్ నుంచో బెటర్ మెంట్ నోట్స్ నాకందితే, నేను బాధపడే ప్రసక్తే వుండదు.
***

.