రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, October 16, 2022

1233 : సండే స్పెషల్ రివ్యూ!


 

    1813 లో సుప్రసిద్ధ రచయిత్రి జేన్ ఆస్టిన్ రాసిన క్లాసిక్ నవల ఫ్రైడ్ అండ్ ప్రిజుడిస్ 2005 లో బ్రిటన్ మూవీగా తెరకెక్కింది. 1938 నుంచీ ఈ నవల 17 సార్లు తెరకెక్కింది, సీక్వెల్స్ కాక. 2005 లో తీసిన లేటెస్ట్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో హిందీ ఆడియోతో అందుబాటులో వుంది. ఇందులో కొన్ని ముఖ్య పాత్రల్లో కైరా నైట్లీ (ఎలిజబెత్ బెన్నెట్ పాత్ర), మాథ్యూ మెక్‌ఫాడియన్ (మిస్టర్ డార్సీ పాత్ర), బ్రెండా బ్లెథిన్ (మిసెస్ బెన్నెట్ తల్లి పాత్ర) నటించారు. ఎలిజబెత్ అలియాస్ లిజ్జీగా నటించిన కైరా నైట్లీది ప్రధాన పాత్ర. 20 ఏళ్ళ వయస్సులో ఈమె నటించిన ఈ పాత్రతో ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయింది. ఇంకా సంగీతం, కళా దర్శకత్వం, వస్త్రాలంకరణ  విభాగాల్లో కూడా ఆస్కార్స్ కి నామినేట్ అయింది ఈ క్లాసిక్ రోమాంటిక్ డ్రామా.

        దుగురు కూతుళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఓ కుటుంబం పడే తిప్పలు హాస్యంగా, చమత్కారంగా, వినోదాత్మకంగా దృశ్యీకరణ చేశాడు కొత్త దర్శకుడు జో రైట్. ఇంగ్లాండులోని గ్రామీణ లాంగ్ బర్న్ ఎస్టేట్ లో నివాసముండే మిస్టర్ అండ్ మిసెస్ బెన్నెట్ లకి జేన్, లిజ్జీ, మేరీ, కిట్టీ, లీడా అనే ఐదుగురు కూతుళ్ళు. వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా అవుతాయన్న ఆందోళనతో వుంటుందెప్పుడూ మిసెస్ బెన్నెట్. ఆస్తి సమస్య కూడా వుంది. తమకి మగ సంతానం లేకపోవడంతో ఆస్తికి వారసుల్లేకుండా పోయారు. ఆస్తి వుండాలంటే  ఓ అల్లుడైనా రావాలి.

        ఆ అల్లుడు మిస్టర్ బింగ్లే రూపంలో వచ్చి వూళ్ళోనే ఒక ఎస్టేట్ లో మిత్రుడు మిస్టర్ డార్సీతో కొత్తగా దిగాడు. బాగా ధనవంతుడు. పార్టీ కూడా ఇస్తున్నాడు. అయితే పదండి పదండి రిచ్ అల్లుడు దొరికాడు, మీ అయిదుగుర్లో ఎవరు నచ్చుతారో రోమాంటిక్ గా బిహేవ్ చేయండని కూతుళ్ళని వేసుకుని  పార్టీకి చేరుకుంటుంది మిసెస్ బెన్నెట్. 

ఇద్దరు అల్లుళ్ళ వైభవం

ఒకరు కాదు, ఇద్దరు అల్లుళ్ళు దొరుకుతారు. మిస్టర్ బింగ్లే పెద్ద కూతురు జేన్ తో కనెక్ట్ అయిపోతే, బింగ్లేకి పక్క వాద్యంగా వచ్చిన మిస్టర్ డార్సీ రెండో కూతురు లిజ్జీని సెట్ చేసుకుంటాడు. ఇంతలో దూరపు బంధువు మిస్టర్ కొలీన్స్ వచ్చి, అల్లుడుగా మారి ఆస్తిని స్వీకరించడానికి తనకేం అభ్యంతరం లేదని లిజ్జీకి ప్రపోజ్ చేస్తాడు. లిజ్జీ వెళ్ళిపొమ్మంటుంది. మిస్టర్ డార్సీ బంధువు లేడీ కేథరిన్ వచ్చేసి, డార్సీకి నా కూతుర్ని ఇస్తున్నాను, నువ్వు డార్సీకి దూరంగా వుండకపోతే మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చి పోతుంది. ఇవన్నీ వుండగా చిట్ట చివరి కూతురు పదిహేనేళ్ళ లీడా, మిస్టర్ డార్సీ పరిచయం చేసిన  సైనికుడితో చెప్పా పెట్టకుండా లేచిపోతుంది!

        ఇలా ఇదొక చిక్కులమారి వ్యవహారంగా మారిపోతుంది. లీడా లేచిపోవడంతో ఆ అప్రదిష్ట మిగతా కూతుళ్ళ పెళ్ళిళ్ళకి అడ్డంకిగా మారుతుంది. లిజ్జీకి ఇంకో షాక్ తగుల్తుంది. తను రిజెక్ట్ చేసిన కొలీన్స్ తో ఫ్రెండ్ చార్లొట్ పెళ్ళికి సిద్ధపడుతుంది. పేదరికం వల్ల తనకి పెళ్ళయ్యే అవకాశం లేదని, వయస్సు మీద పడుతూ కుటుంబానికి భారంగా వున్నాననీ  చెప్పుకుంటుంది. కొలీన్స్ ఎలాటి వాడనేది అనవసరమని అంటుంది.

        కథ ప్రధానంగా లిజ్జీ- డార్సీల మధ్య ఒడిదుడుకుల ప్రేమ సంబంధంతో వుంటుంది. దీనికి సమాంతరంగాలిజ్జీ అక్క జేన్ - బింగ్లీ మధ్య ప్రేమ కథ వుంటుంది. డార్సీ తో లిజ్జీ సంబంధం ఎలా మారుతుందంటే, బెన్నెట్స్ చాలా ధనవంతులు కానందున, సమాజంలో తన స్థాయి లేని వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోలేనని దూరమవుతాడు. లీడా లేచిపోయిన అప్రదిష్ట ఇలా వెన్నాడుతూంటే, తెర వెనుక డార్సీయే లండన్లో లీడాని పట్టుకుని సైనికుడితో పెళ్ళి జరిపించి ఇంటికి తీసుకొస్తాడు. అయినా పెద్దకూతుళ్ళకి పెళ్ళిళ్ళు లేకుండా చిన్న దానికి పెళ్ళేమిటని ఎత్తుపొడుపులు తప్పని పరిస్థితి వుంటుంది. మిస్టర్ అండ్ మిసెస్ బెన్నెట్ ల సమస్యలు జటిలమవుతూ పోతాయి. ఇవన్నీ ఎలా చక్కబడ్డాయో సినిమా చూడాల్సిందే.

నవల సంక్షిప్త రూపం

సాహిత్య రచనల్ని సినిమాలుగా మార్చినప్పుడు చాలా మార్పులు అనివార్యంగా జరుగుతాయి. దీనికి ప్రైడ్ అండ్  ప్రిజుడీస్ మినహాయింపు కాదు. నవలని బాగా తగ్గించి, అమ్మాయిల పెళ్ళిళ్ళు అనే ప్రధాన కథని మాత్రమే పట్టుకుని, త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో కూర్చినట్టు స్క్రీన్ ప్లే రచయిత్రి డెబోరా మొగాచ్ చెప్పింది. సినిమా నిడివి రెండు గంటలా ఎనిమిది నిమిషాలు వచ్చింది. నవల్లోని చాలా పాత్రల్నీ, సన్నివేశాల్ని తొలగించి, కేవలం అమ్మాయిల పెళ్ళిళ్ళ గురించిన పాయింటు మీదే దృష్టి పెట్టి, ఏక సూత్రతతో కథ నడిపినట్టు సమాచారం. నవల్లోని కథని సినిమా కథ గా మార్చారు.

        ఐదుగురు కూతుళ్ళ పెళ్ళిసమస్య బరువైన కథే. అయితే జేన్ ఆస్టిన్ కూడా దీన్ని భారంగా, దుఖపూరితంగా ఎక్కడా రాయలేదు. దీన్ని సినిమాకి కూడా పాటించారు. లిజ్జీతో రెండు సన్నివేశాలు కాస్త విషాదంగా వుంటాయే తప్ప మిగిలినదంతా వినోదాత్మకమే. ప్రధాన పాత్ర లిజ్జీగా నటించిన కైరా నైట్లీ కోసం ఈ సినిమా ఎన్ని సార్లయినా చూడొచ్చు.

        19వ శతాబ్దపు ఇంకా విద్యుచ్ఛక్తి, మోటారు వాహనాలు లేని కాలపు జీవితం  మనకి జనరల్ నాలెడ్జిని ప్రసాదిస్తాయి. ఆనాటి పురాతన కట్టడాలు, భవనాలు, గ్రామీణ పరిసరాలు, వ్యాపారాలు, గుర్రబ్బగ్గీలు, కాలినడక ప్రయాణాలు... ప్రతీదీ ఆ కాలంలోకి తీసికెళ్ళి పోతాయి. ఆ నాటి బ్రిటిష్ సమాజం, కట్టుబాట్లు, నమ్మకాలు, వెనుక బాటు తనం...ఇవి కూడా ఒక అవగాహన కల్గిస్తాయి. సౌజన్యం జేన్ ఆస్టిన్. ఈ నవల రాసిన నాల్గేళ్ళకే 41 వ యేట ఆమె మరణించింది. ఆమెకి నివాళిగా మాత్రం సినిమాల పరంపర కొనసాగుతూనే వుంది...

—సికిందర్