రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, December 1, 2016

రివ్యూ!



దర్శకత్వం : ప్రదీప్ కృష్ణ మూర్తి
తారాగణం : విజయ్ ఆంథోనీ, అరుంధతీ నాయర్, చారు హాసన్, వైజి మహేంద్ర, సిద్ధార్థ్ శంకర్, మీరా కృష్ణన్ తదితరులు
రచన : ప్రదీప్ కృష్ణ మూర్తి- జో డీ క్రజ్, కార్తీక్ కృష్ణ, సంగీతం : విజయ్ ఆంథోనీ, ఛాయాగ్రహణం : ప్రదీప్ కలిపురయత్
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంథోనీ
విడుదల : డిసెంబర్ 1, 2016
***
         ‘బిచ్చగాడు’ తో బాగా పాపులర్ అయిన తమిళ హీరో – సంగీత దర్శకుడు విజయ్ ఆంథోనీ ఈసారి బేతాళుడుగా మారి సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ని ప్రయత్నించాడు. రొటీన్ ఫార్ములా సినిమాలకి భిన్నమైన సబ్జెక్టులు చేస్తున్న ఆంథోనీ ‘బిచ్చగాడు’ తో ప్రేక్షకుల హృదయాల్లో బాగా నాటుకుపోయాడు. ‘బిచ్చగాడు’ పూర్తిగా మానవ విలువలకి సంబంధించిన సార్వజనీన ఎమోషనల్ డ్రామా కావడంతో దాన్ని ప్రాంతాలకతీతంగా ఆదరించారు. ఐతే ‘బేతాళుడు’ లో సార్వజనీనతని  కాసేపు పక్కన పెట్టి,  తన పాత్రవరకే పరిమితమయ్యే ఎమోషన్స్ తో, సైకలాజికల్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకులకోసం తీశాడు.

         ఈ ప్రోత్సాహంతో అన్నట్టు దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి కూడా ఎలాటి కమర్షియల్ అంశాల జోలికీ వెళ్ళకుండా ‘ బేతాళుడు’ని ఒక సీరియస్ కేస్ స్టడీ లాగా తీశాడు. ఐతే ఈ కేస్ స్టడీ కూడా ఎంతవరకు నిలబడిందన్నది ప్రశ్న. వివరాల్లోకి వెళ్తే గానీ ఇది తేలదు...

కథ 
     ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే దినేష్  చిత్తభ్రాంతులకి  లోనవుతూంటాడు. తనలో ఇంకో వాయిస్ ఎవరిదో విన్పిస్తూంటుంది. అమాంతం పనిచేస్తున్న సిస్టం లోంచి చెయ్యి వచ్చి దాడి చేస్తుంది. ఆ వాయిస్ ఇంకా రకరకాల సమస్యలు సృష్టిస్తూంటుంది. ఇదంతా ఐశ్వర్య ( అరుంధతీ నాయర్) ని పెళ్లి చేసుకున్నప్పట్నించే జరుగుతూంటుంది. మిత్రుడి సలహాతో సైకియాట్రిస్టుని సంప్రదిస్తాడు. ఆ సైకియాట్రిస్టు హిప్నటైజ్ చేసి దినేష్ తల్లి గర్భంలో వున్నంత వరకూ తీసికెళ్తాడు. అయినా అతడి మానసిక సమస్యకి మూలం దొరకదు. ఇక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ తో గత జన్మలోకి తీసికెళ్తాడు. అప్పుడు గతజన్మలో మాచర్లలో శర్మగా పుట్టి టీచర్ గా పనిచేసిన దినేష్ కి,  భార్య జయలక్ష్మి వల్ల మరణం సంభవించిందని తెలుస్తుంది. ఆ జయలక్ష్మి మీద ఇప్పుడు పగదీర్చుకోవడం కోసమే శర్మ వాయిస్, దినేష్ లోపల చేరి ఇబ్బంది పెడుతోందని అర్ధమవుతుంది. ఆ జయలక్ష్మి ఎవరు?  ఆమెతో శర్మకి అసలేం జరిగింది? పెళ్ళికి ముందే శర్మతో వున్న పిల్ల వాడెవడు? పెళ్లి తర్వాత శర్మకి పుట్టిన పిల్లాడికి ఏమైంది?...ఈ ప్రశ్నలకి సమాధానాల కోసం దినేష్ మాచర్లకి ప్రయాణం కడతాడు...

ఎలావుంది కథ 
       మొదటే చెప్పుకున్నట్టు ఇదొక సైకలాజికల్ కేస్ స్టడీ. అయితే గతజన్మలు వున్నాయో లేదో, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే ప్రక్రియ విశ్వసనీయ
మైనదో కాదో, అలాగే  గత జన్మలో మనిషి ఈ జన్మలో ఆవహిస్తాడనడానికి శాస్త్రీయ నిరూపణలున్నాయో లేదో,  అలాగే అసలిదంతా కేవలం మనుషులు హిస్టీరియాకి లోనై  ప్రవర్తిస్తారేమో ...అన్నవి తేల్చే జోలికి  పోలేదు సరికదా, పరస్పర విరుద్ధ వాదనలు చేసిందీ కథ. ఎలాగంటే  హీరోకి ఎవరో క్లినికల్ పరిశోధనల్లో భాగంగా ఓ మందు ప్రయోగించడం వల్ల అది బ్రెయిన్ ని స్నాప్ చేసి పూర్వజన్మలోకి తీసికెళ్ళిందని చెప్తారు. అది పూర్వ జన్మలోకి తీసికెళ్ళిందో, అలా ఫీలయ్యే చిత్తభ్రాంతులకి (హేల్యూసినేషన్స్) కి లోను చేసిందో ఎవరికి  తెలుసు? శాస్త్రీయంగా ఏదీ తేల్చకపోయినా,  పూర్వజన్మల కథ అనే తలపండిన బాక్సాఫీసు ఫార్ములాకి పరిమితం చేసి ఈ కథ చెప్పివున్నా అదో అందం.  బాక్సాఫీసు ఫార్ములానే మందు ప్రయోగంతో అభాసు చేసుకుంటే ఇదే కథో అర్ధంగాకుండా పోతుంది. అర్ధమై నమ్మాలన్నా ఏ కథని నమ్మాలో అర్ధంగాని పరిస్థితి  : శర్మ ఆత్మ తానుగా పగదీర్చుకోవడానికి సహజంగా దినేష్ లో తిష్ట వేసిన పారానార్మల్ థ్రిల్లర్ కథానా, లేకపోతే మందువల్ల బ్రెయిన్ లో తేడా వచ్చి  పూర్వజన్మ ని చూసిన సైకలాజికల్ కథానా? కథకి ఉండాల్సిన ఏకసూత్రత పాటింపు ఇక్కడ జరగలేదు. 

ఎవరెలా చేశారు
      పాత్రమేరకు విజయ్ ఆంథోనీ  చక్కగా నటించాడు, నీటుగా కూడా నటించాడు. ఈ కాలపు దినేష్ గా, పాత కాలపు శర్మగా నటుణ్ణి నిలబెట్టుకున్నాడు. క్లయిమాక్స్ లో ఒక యాక్షన్ సీన్లో మాత్రం బేతాళ ప్రతాపం చూపించలేదు. మామూలు హీరోలాగానే ఫైట్ చేశాడు. ఆ ఇంజెక్షన్ చేసింతర్వాత ఎలా ప్రవర్తిస్తాడో చూద్దామని అంటాడు విలన్. ఆ ఇంజెక్షన్ తో అతను బేతాళుడిగా మారిపోయి ప్రళయ బీభత్సాన్ని  సృష్టిస్తాడని మనమాశిస్తే అడియాసే అవుతుంది. విజయ్ ఆంథోనీ ఒక వెరైటీ పాత్రనైతే చేశాడన్పించుకున్నాడుగానీ, వెరైటీ అంతగా దమ్ము లేకుండాపోయింది. 

     హీరోయిన్ అరుంధతీ నాయర్ కూడా ఐశ్వర్యగా ఈ జన్మ పాత్రలో,  జయలక్ష్మిగా గత జన్మ పాత్రలో నటించింది. ఆధునికత్వం, గ్లామర్ అనే వాటికి  దూరంగా సంసారపక్షంగా వుండే రూపు రేఖలామెవి. లావు కూడా ఆ వయస్సుకి ఎక్కువే. ఐశ్వర్య పాత్రలో సస్పెన్స్ వుంది. ఈ సస్పెన్స్  పాత్ర ఫీలయ్యేది కాదు, మనం ఫీలయ్యేది. చివరికి ఈ పాత్రని జస్టిఫై చేయడం కష్టమే. ఈ పాత్రే కాదు, పూర్వ జన్మలో జయలక్ష్మి పాత్ర ప్రవర్తన కూడా జస్టిఫికేషన్ కి, సెంటిమెంట్స్ కి, నేటివిటీకీ దూరమే. 

     ఇతరపాత్రల్లో పాత్రధారులందరూ పకడ్బందీగానే నటించారు. విజయ్ ఆంథోనీ సమకూర్చిన పాటలూ బాగానే వున్నాయి సింపుల్ గా- చక్కగా అర్ధమయ్యే భాషతో.  ప్రదీప్ కెమెరా వర్క్ మరో ఎస్సెట్ ఈ సినిమాకి. టెక్నికల్ విలువలు ఉన్నతంగా వున్నాయి. లొకేషన్స్ కూడా కొత్తగా బావున్నాయి . అన్నీ బావున్నాయి- ఒక్క దర్శకుడితో మాత్రమే ఏమంత బాగా లేదు.

 చివరికేమిటి 
       ఈ పర్సనల్ సైకలాజికల్ కేస్ స్టడీలో రెండు అంశాలు పొసగకుండా వున్నాయి. పూర్వ జన్మలో చూపించిన కథ, సెకండాఫ్ లో మెడికల్ మాఫియా కథ. సెకండాఫ్ లో ఎప్పుడైతే హీరోయిన్ అపహరణకి గురై మెడికల్ మాఫియా లాబ్ కి చేరుతుందో,  అప్పుడు కథ దారి తప్పిపోయింది. హీరో సైకలాజికల్ సమస్య ఎలా తీరుతుందా అని ఎదురు చూస్తూంటే, మందుల కోసం మనుషుల మీద ప్రయోగాలూ చేసే వేరే కథగా మారిపోవడం- అసలు హీరో సమస్యకి ఈ మందులే కారణమన్నట్టుగా  చిత్రించండం కాన్సెప్ట్ పట్ల కన్ఫ్యూజన్ ని బయటపెడుతుంది. ఇది ముగింపుని కూడా సహేతుకంగా లేకుండా చేసింది. హీరో బావున్నప్పుడు సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఒక చోట అంటాడు- నేను క్లిష్టంగా వున్న దాన్ని సులువు చేస్తాను, సులువుగా వున్న దాన్ని క్లిష్టంగా మార్చేస్తానని. హీరో మాటేమో గానీ దర్శకుడు మాత్రం సులువుగా కన్పిస్తున్న  కథని నానా క్లిష్టతరంగా  మార్చేసి  అతి క్రియేటివిటీ చూపించబోయాడు. పూర్వజన్మ కథలో  జయలక్ష్మితో శర్మకి ఏవో అపార్ధాలేర్పడి వుంటాయని వూహిస్తాం –కట్టుకున్న భార్య మంచిదే అయివుండాలన్న బాక్సీఫీసు నమ్మకాల ప్రకారం. భర్తే అపార్ధం జేసుకుని పగపెంచుకున్నాడని అనుకుంటాం. దీనికి విరుద్ధంగా నేరాలు ఘోరాలు కథలాగా, భార్యతో ఒక చవకబారు క్షుద్రకథని చూపించినప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ కి లేదా- పూర్వజన్మ కథకి విలువే  లేకుండా పోయింది.

     సినిమాలో వినోదం అస్సలు లేదు, ఉన్న కథ ప్రకారమైనా భావోద్వేగాలు పండిస్తాయనుకుంటే అదీ కుదరకుండా కథ పక్క దార్లు పట్టిపోయింది. తప్పుల్ని కవర్ చేయడం కోసం చివరి షాట్ లో కూడా ప్రయత్నించి విఫలమయ్యారు- ఎవరో ముసలావిడ ఇప్పుడు జయలక్ష్మిని నేనే నంటూ చనిపోతే,  ఇప్పుడున్న ఐశ్వర్య ఎవరు? జయలక్ష్మి కాదా? మరి జయలక్ష్మి లాగే భావించుకుని సినిమా సాంతం చూశారే ప్రేక్షకులు?  చూసిందంతా హుష్ కాకీయేనా?


-సికిందర్ 
http://www.cinemabazaar.in